Home » Muppala Ranganayakamma » Stree


 

    పద్మజ ఉన్న రెండు నెలలూ రెండు రోజుల్లా గడిసిపోయాయి. దాదాపు నెల్లాళ్ళ కు పైగా రాత్రుళ్ళు పద్మజ తోనే గడిపింది. ",మన స్నేహం లో ఇంత చక్కటి రోజులు ఎప్పుడూ రాలేదు, పారూ!" అంది పద్మజ విడిపోయే ముందు.
    "ఇక ముందు రావేమో కూడా?"
    "అవును లే. మీ శ్రీవారు వస్తే నాకోసం నిన్ను త్యాగం చెయ్య లేరుగా?"
    "అబ్బ! ఊరుకో , పద్మా! నువ్వు బాగా చిలిపి దాని వయ్యావు." పద్మజ కు  వీడ్కొలిస్తుంటే తన శరీరంలో ఏదో భాగాన్ని ఎవరో బలవంతంగా లాక్కు పోతున్నట్టు బాధ కలిగింది.
    "బద్దకించ కుండా ఉత్తరాలు వ్రాస్తుండు. పద్మా!" అంది రుద్ద కంఠం తో.
    "తప్పకుండా. కొడుకు పుడితే వైర్ ఇప్పిస్తాను. వెంటనే వచ్చి తీసికెళ్ళు" అంటూ నవ్వింది పద్మజ గర్వంగా. పదేపదే పద్మజ గుర్తు వస్తుంటే పరధ్యానం తో ఆఫీసులో నిలకడగా కూర్చుని పని చెయ్యలేక పోయింది పార్వతి. రాజ్యలక్ష్మీ నవ్వుతూ వచ్చి పలకరించింది. "బాటసారి బావుందట. క్రిందటి సారి వస్తే నేను చూడలేక పోయాను. వెళ్దాం, వస్తారా, పార్వతీ?' అంది.
    పార్వతి వెంటనే ఒప్పేసుకుంది. "పదండి వెళ్దాం. నాకేమిటో చికాకుగా ఉంది కూడాను."
    ఇంటికి వెళ్ళి గబగబా అన్నం వార్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని రాజ్యలక్ష్మీ ని దియేటరు దగ్గర కలుసుకుంది పార్వతి.
    ఇంటర్ వెల్ లో హాలంతా గోల గా తయారైంది. పిక్చర్ అంతవరకూ బాగా నచ్చింది పార్వతికి. రాజ్యలక్ష్మీ తో మాట్లాడుతూ కూర్చున్నదల్లా అనుకోకుండా వెనక కుర్చీల కేసి చూసింది. సూర్యం, పక్క ఎవరో అమ్మాయీ, ఇద్దరికీ సంబంధం లేదేమో అనుకుంది మొదట. కూల్ డ్రింక్స్ కుర్రవాణ్ణి పిలిచి ఓ గ్లాసు తీసుకుని ఆ పిల్లకు అందించి తన పర్స్ లోంచి డబ్బులు తీసి యిచ్చాడు సూర్యం. మళ్ళా ఆ పిల్ల ఖాళీ చేసిన గ్లాసు అందుకుని కుర్రాడికి అందించి ఏవో కబుర్లు చెప్తూ నవ్వుతూ కూర్చున్నాడు.
    "ఏమిటలా చూస్తున్నారు?"
    "ఆహా! ఏం లేదు. ఊరికేనే!" రాజ్యలక్ష్మీ ని వెనక్కు చూడనివ్వ కుండా లేని ఉత్సాహం తెచ్చుకుని మాట్లాడుతూ కూర్చుంది పార్వతి. మళ్ళా పిక్చర్ ప్రారంభమై నా ఆసక్తిగా చూడలేక పోయింది. "ఇందుకేనా సూర్యం చాలా మారిపోతున్నాడు?' అన్న ప్రశ్న గుర్తు ఒక్కటే వచ్చి వెండి తెర మీద  కొడవలి లా నించుంది. సూర్యం రాత్రుళ్ళు ఆలస్యంగా వస్తున్నా, తన కిచ్చిన డబ్బు గాక, ఐదూ పదీ అడిగి తీసుకొంటున్నా , ఎప్పటి లాగా చనువుగా మాట్లాడకుండా, ముభావంగా మాసలుతున్నా -- ఇంతకాలం తనేమీ గ్రహించలేక పోయింది. అసలు సూర్యం ఎందుకో మారినట్టు ప్రవర్తిస్తున్నాడన్న విషయం కూడా అర్ధం చేసుకోలేక పోయింది. సూర్యం గ్రంధ కర్తే అవుతున్నడన్న ,మాట!
    ఇంటికి వచ్చి అన్నం తినకుండా తమ్ముడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సూర్యం రానే వచ్చాడు. బట్టలు మార్చుకుని పడుకోటానికి సిద్దమౌతుంటే "అదేమిటి? అన్నం తినవు?" అంది.
    "ఆకలి లేదక్కా! ఓ ఫ్రెండు బలవంతం చేసి హోటల్ కి లాక్కేళ్ళాడు. కడుపు నిండుగానే ఉంది."
    'ఇంత సేపైంది. ఎక్కడి కెళ్ళావేమిటి?" మాములుగా అడిగింది.
    "సాయంత్రం ఇంటికి వస్తే నువ్వు సినిమాకి వెళ్ళావని మామ్మగారు చెప్పారు. ఎలాగూ నువ్వు పది గంటల దాకా రావు కదాని ఓ ఫ్రెండు దగ్గరికి వెళ్ళాను."
    "ఊ , పోనీ కొంచెం మజ్జిగన్నం తిందువు గాని, రా! బొత్తిగా వేడి చేస్తుంది."
    మరేమీ అనకుండా లేచాడు సూర్యం.
    "బాటసారి బావుందిరా! నువ్వు చూశావా?" తమ్ముడి మొహం లోకి చూస్తూ అడిగింది పార్వతి.
    "క్రిందటి సారి వచ్చినప్పుడు చూశాను. బాగానే ఉంటుంది."
    నోట పెట్టబోతున్న ముద్ద అలాగే పట్టుకుని విస్మయంగా చూసింది పార్వతి. సూర్యం అదేం గమనించలేదు. గబగబా చెయ్యి కడుక్కుని లేచిపోయాడు. పార్వతికి మరి అన్నం సహించలేదు.  బలవంతంగా కంచంలో ముద్దలు రెండూ మంగి లేచింది. సూర్యం ఏదో డిటెక్టివ్ నవల చదువుకొంటున్నాడు.
    "పదకొండు దాటిందిరా! పడుకోరాదూ?"
    "ఫర్వాలేదక్కా! రేపు ఇచ్చెయ్యాలీ పుస్తకం."
    "ఎవరి దగ్గర తెచ్చేవేమిటి?"
    "ప ఫ్రెండు దగ్గర!"
    'ఫ్రెండు! ఫ్రెండు! ఎవరా ఫ్రెండు?" అని అడిగేయ్యాలన్నంత కోపం వచ్చింది. మాట్లాడకుండా పడుకొంది. చాలాసేపటి వరకూ నిద్ర పట్టలేదు. సూర్యం ఇంకా చదువు కొంటూనే ఉన్నాడు. పోనీ, మనస్సులో ఎందుకీ మదన? వాణ్ణి అడిగేస్తే? ఎందుకిలా చేస్తున్నావని చివాట్లు పెడితే సిగ్గుపడి పోతాడేమో? బొత్తిగా చిన్న పిల్లాణ్ణి కేకలేసినట్టు కేకలేస్తే బాధపడతాడేమో?"
    అయినా తన చాదస్తం గానీ ఈ రోజుల్లో ఓ ఆడపిల్ల తో కలిసి సినిమా చూసినంత మాత్రాన తనిలా శంకించటం ఏమిటి? కలిసి చదువు కున్నదో, కలిసి పని చేసేదో ఎవరైనా కావచ్చు. కలిసి సినిమాకు వెళ్ళాడో? అనుకోకుండా దియేటర్లో తారస పడిందో? ఏం చెప్పగలదు? ఈ నాగరిక ప్రపంచంలో కూల్ డ్రింక్ ఇప్పించి డబ్బు లివ్వక పోతే ఏం సభ్యత?
    చటుక్కున గుర్తు వచ్చింది. మరి అబద్దం ఎందుకు చెప్పాలి వాడు? ఏ భయమూ లేకపోతె జరిగింది జరిగినట్టే చెప్పచ్చుగా?
    బావుంది. తనిప్పుడు అపార్ధం చేసుకోలేదూ? అలాగే సరిగా ఆలోచించకుండా కేక లేస్తుందని జంకాడో ఏమిటో? వాడు మాత్రం బొత్తిగా పాలు తాగే పసివాడా ఏమిటి? వాడి మంచి చెడ్డలు వాడు ఆలోచించుకోలేడూ? బి.ఎ పాసై ఉద్యోగం చేసుకుంటున్నవాడికి అంత మాత్రం వివేకం ఉండదూ?

                                
    ఎప్పుడు నిద్ర పట్టేసిందో పార్వతికి. మర్నాటి కి పార్వతి మనస్సు తేలిగ్గానే ఉంది. సూర్యం మొహం కేసి చూస్తె నిష్కల్మషంగా నే కనిపించింది.
    ఆ నెల జీతం ఎప్పటి లాగే పార్వతి చేతిలో పెట్టాడు సూర్యం. ఇరవై రూపాయలు తీసి ఇవ్వబొయింది పార్వతి.
    "నేను తీసుకున్నాలే."
    మొదట పార్వతికి నమ్మకం కలగలేదు. తమ్ముడు హాస్య మాడుతున్నడెమో అనుకుంటూ డబ్బు లెక్క పెట్టింది. కొంచెం ఆశ్చర్యంగా సూర్యం కేసి చూస్తూ , "ముప్పై రూపాయలు తీసుకున్నావా?' అంది. మొహం అటు తిప్పుకుని ఏమంత పట్టించుకొనివాడి లాగ ముభావంగా "ఊ" అని ఊరుకున్నాడు.
    తమ్ముడూ ఎప్పుడూ అలా చేయలేదు. తన దగ్గర పేచీ పెట్టి దెబ్బలాడి ఎంత తీసుకున్నా సంతోషంగానే ఉండేది. బొత్తిగా ఇలా తనకై తను అట్టే పెట్టుకుని మిగతాది ఇవ్వటం...... అయినా ముప్పై రూపాయ లెందుకూ నెలకు? రోజుకో రూపాయి ఏం చేస్తాడు? వద్దనుకుంటూనే అడిగింది: "ముప్పై రూపాయలూ కావాలా, సూర్యం?"
    సూర్యం అదో రకంగా , నిర్లక్ష్యంగా చూశాడు.  "వెధవది ముప్పై రూపాయలంటే ఎంత సేపు? ఏమో? అంతైనా లేకపోతె నాకు ఇబ్బందిగా ఉంటుంది."
    "పోనీలే. నువ్వలా కావాలంటే నేనెందుకు కాదంటాను? నెలనెలా బ్యాంకులో వేస్తున్నాం కదా? ఈమధ్య ఇన్సూరెన్స్ ఒకటి మొదలు పెట్టాం. కాస్త జాగ్రత్తగా ఉంటె...."
    సూర్యం ఎన్నాళ్ళ నుంచో అడగాలనుకుంటూన్న ముక్క కాస్తా అడిగేశాడు: "ఇంకా రుక్మిణి కి డబ్బు పంపిస్తూ ఉంటావెందుకు? పంపిన కొద్ది వ్రాస్తూనే ఉంటుంది."
    పార్వతి తెల్ల బోయింది. రుక్కుకు డబ్బు పంపించటం సూర్యాని కంత అయిష్టంగా ఉందా? అది కావాలని వ్రాస్తే తనెలా కాదంటుంది? నాలుగైదు రోజుల క్రిందటే రుక్కు దగ్గరి నుంచి డబ్బు కావాలని ఉత్తరం వచ్చింది. ఏవో కొత్త ఫాషన్ల చీరలు వస్తున్నాయట. అందరూ కొనుక్కుంటున్నారట. తనూ కొనుక్కుంటానని వ్రాసింది.
    రుక్కుకు చీరాలంతగా లేకపోలేదు. మంచి మంచివి వచ్చినప్పుడల్లా పార్వతే కొంటూ ఉంటుంది. అయినా అస్తమానూ వీధిలోకి మూటల వాళ్ళు తీసుకొచ్చే గుడ్డలు కొనటం మానదు రుక్మిణి. అప్పులు చేసి మరీ డబ్బు కోసం వ్రాస్తూ ఉంటుంది.
    ప్రస్తుతానికి అడిగిన డబ్బు పంపిస్తూ కాస్త మందలిస్తూ ఉత్తరం వ్రాయాలను కుంటుంది పార్వతి. అయినా తన ఉద్దేశ్యం తమ్ముడికీ తెలీనివ్వకుండా కాస్సేపు ఊరుకుని నెమ్మదిగా అంది:
    "అది కాదురా, సూర్యం! అత్తింట్లో కాపురం చేసుకుంటోంది. చంటి వాడోకడు. ఏవో దాని ఖర్చులు దానికీ ఉంటాయి. మానని కాకపొతే ఎవర్ని అడుగుతుంది? అమ్మా నాన్నా ఉంటె...."
    "ఏం? దాని మొగుడే మయ్యాడు? పెళ్ళి చేసి పంపించేశాక ఎన్నాళ్ళు ఖర్చులకి పంపాలేమిటి?"
    పార్వతెం మాట్లాడ లేకపోయింది. సూర్యం ధోరణి చూస్తె కొత్తగా ఉంది. కయ్యానికి కాలు దువ్వె వాడిలాగ మాట్లాడుతున్నాడు. మాటకు మాట పెంచటం మంచిది కాదని నెమ్మదిగా కుంపటి అంటించటం లో నిమగ్నమైంది.

                               *    *    *    *




Related Novels


Peka Medalu

Stree

Krishnaveni

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.