Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "బాగుంది, రాత్రి సమయంలో లేపేవాళ్ళదే ,కాని పడుకునే వాళ్ళది తప్పు కాదు...." అన్నాడు జనార్దనం.
    'సరేలే, ఇప్పుడు నేను తప్పొప్పుల విచారించడానికి రాలేదు. ఆ గదిలో ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు లేవు. ఇప్పుడే ఒక కస్టమర్నీ తీసుకువచ్చాను. అతను మాటలు మొదలు కాకుండానే దాహమన్నాడు. తీసి చూస్తె కూజా ఖాళీ! నా గదిలో ఏర్పాట్లన్నీ పక్కా వుండాలని వచ్చిన రోజునే చెప్పాను...." అన్నాడు హంతకుడు.
    "సరేలే -- ఏదో పొరపాటు జరిగినట్లుంది. వచ్చి కూజా తీసుకెళ్ళి నింపి యిస్తాను" అన్నాడు జనార్దనం.
    "నువ్వు రానవసరం లేదు. నా కస్టమర్స్ మరొకరి కళ్ళపడ్డం నా కిష్టముండదు. ఏదో, బావా అని పిలుస్తున్నాను నిన్ను, అలాంటిది నిన్ను చంపాల్సి వస్తే కెంత బాధగా వుంటుందో ఆలోచించు. అందుకే చెంబేడు నీళ్ళియ్యి , ఈ రాత్రికి సర్దుకుంటాను. రేపు మాత్రమూ నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని అదే!" అన్నాడు హంతకుడు.
    జనార్దనం మనసులో మాత్రమే విసుక్కున్నాడు. గదిలో మరచెంబు నిండా నీళ్ళున్నాయి. ఆ చెంబు తీసుకు వెళ్ళి హంతకుడికిచ్చి గది తలుపులు వేసిసి లైటు అర్పేశాడు.
    "మళ్ళీ హంతకుడేవరో మనిషిని తీసుకువచ్చాడు. ఇంకో హత్య జరుగుతుందేమో !" అన్నాడు జనార్దనం సీత దగ్గరకు వెళ్ళి.
    "ఏమో యేమిటి -- జరిగి తీర్తుంది, ఏ జన్మలో ఏం పాపం చేశామో , ఇలాంటి హంతకుడి కి ఆతిధ్య మివ్వాల్సి వచ్చింది." అంది బాధగా సీత.
    "సీతా - నువ్వు మాట్లాడకుండా పడుకుని వుండు. బయటకు వెళ్ళి ఏం జరుగుతుందో చూసి వస్తాను" అన్నాడు జనార్దనం.
    "వద్దండీ - వాడసలే మిమ్మల్ని హెచ్చరించి వున్నాడు కూడా , ఏం చేస్తాడో ఏమిటో ."
    "వాడికి తెలియనివ్వనుగా , రహస్యంగా చూసేసి వస్తాను. హంతకుడన్నవాడెప్పుడో అప్పుడు చట్టానికి దొరక్క తప్పదు. అలాంటి సమయం వచ్చినపుడు తిరుగులేని దెబ్బలు తీయడానికి, వీడి బండారం కొంతవరకూ తెలుసుకుని వుండడం మంచిది. నువ్వు మాత్రం రావద్దు, ఎందుకంటె నీకు మళ్ళీ జ్వరం లాంటిది వస్తే హంతకుడి అనుమానాలు బలపడతాయి" అని జనార్దనం పిల్లిలా అడుగులు వేసుకుంటూ గదిలోంచి బయటపడి, గది తలుపులు చప్పుడు కాకుండా జారగిలవేశాడు.
    హంతకుడి గదిలో దీపం వెలుగుతోంది. గదిలో కూర్చున్న మనిషి వీపు కనబడుతోంది. హంతకుడి ముఖం గుమ్మం వైపే వుంది. జనార్దనం గోడ వార నక్కాడు. ఒక వేళ ఎవరైనా గదిలోంచి బయటకు వస్తే , పక్కన జారుకునేందుకు వీలుంది. అతను శ్రద్దగా వాళ్ళ మాటలు వినసాగాడు. వాళ్ళు నిర్భయంగా గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
    "ఈస్థలం నాకు చాలా అనువుగా వుంది. అందువల్ల హత్య చేయడం నాకిప్పుడు చాలా సులువు. నీ పనేమిటో  త్వరగా చెప్పు ...." అన్నాడు హంతకుడు.
    "కాస్త నెమ్మదిగా మాట్లాడవయ్యా -- ఎవరైనా వినగలరు?" అన్నాడు కొత్త వ్యక్తీ.
    "వినడమా - ఈ ఇంట్లో మనం కాక ఇంక ఇద్దరే ఇద్దరు మనుషులున్నారు. ఇద్దరికీ కూడా నేనంటే చచ్చేటంత భయం" అన్నాడు హంతకుడు నిబ్బరంగా.
    'సరే - విషయానికి వద్దాం. ఎలా చంపుతావో అది నీ ఇష్టం. నా మీదకు ఎవరి అనుమానమూ రాకూడదు. లక్ష్మీ నారాయణ ఈ లోకంలో వుండకూడదు. ఎంత కావాలో చెప్పు!"
    "మీ శక్తి ని బట్టి నా రేటుంటుంది. అందరికీ ఒకే రేటు కాదు నాది" అన్నాడు హంతకుడు దర్పంగా.
    'సరే- అయితే చెబుతున్నాను. పాతిక వేలిస్తాను" అన్నాడా కొత్త వ్యక్తీ.
    హంతకుడు క్షణం అలోచించి , "ఒకే - బాగానే చెప్పారు - మీరిక వెళ్ళవచ్చు" అన్నాడు.
    కొత్త వ్యక్తీ లేవలేదు, "ఎప్పుడు ?"
    "రేపు రాత్రికి లక్ష్మీ నారాయణ ఈ లోకంలో వుండడు. మీకు వాటాదారుడుగా ఉంటూ, మిమ్మల్ని మోసం చేసి మీ వ్యాపారంలో ఎక్కువ లాభాలు కొట్టేసిన పాపానికి, అయన రేపు రాత్రి శిక్ష అనుభవిస్తాడు. మీ ఇష్టం వచ్చినట్లు మీరు పగ తీర్చుకోవచ్చు. ఆయన కుటుంబానికి మీరన్యాయం తలపెట్టవచ్చు...."
    "ఛా- అలా గెందుకు చేస్తాను! వాళ్ళ జీవితానికి లోటు లేకుండా ఏర్పాటు చేస్తాను...."
    'అది మీ ఇష్టం - మీకు సంబంధించిన పని " అన్నాడు హంతకుడు.
    కొత్త వ్యక్తీ లేచాడు. జనార్దనం చీకట్లోకి వెళ్ళి పోయాడు. హంతకుడు, కొత్త వ్యక్తిని దొడ్డి గుమ్మం ద్వారా సాగనంపుతుంటే జనార్దనం తన పడకగదిలోకి వెళ్ళిపోయాడు.

                                    10
    "బావా! మళ్ళీ రిక్షా కావాలి -- మీ ఇంటి నుంచి నది ఒడ్డుకు. నేనూ, ఒక ట్రంకు పెట్టె వుంటాయని చెప్పు...' అన్నాడు హంతకుడు.
    జనార్దనం గుండె లదిరాయి. లక్ష్మీనారాయణ కధ ముగిసిందని అర్ధమయిందతనికి. ఎవడో ఆ లక్ష్మీ నారాయణ - అనుకున్నాడతను.
    జనార్దనం వెళ్ళి రిక్షా పిల్చుకువచ్చాడు. అతనూ, హంతకుడు కలిసి బరువైన అ ట్రంకు పెట్టెని మోసి రిక్షాలో పెట్టారు. రిక్షా కదిలి వెళ్ళిపోయేక , "ఇంకా యిలాంటి ట్రంకు లెన్ని మోయాల్సుందో నేను...." అన్నాడు జనార్దనం.
    సీత తలుపులు వేసి , "ఒకసారి హంతకుడి గదిలోకి వెళ్ళి చూద్దాం పదండి" అంది.
    ఇద్దరూ హంతకుడి గదిలోకి వెళ్ళారు. గదంతా శుభ్రంగా తుడిచినట్లుంది. ఒకటి రెండు ప్రాంతాల నీళ్ళతో కదిగినట్లుంది. మంచం మీద దుప్పటీ నలగకుండా వేసి వుంది.
    "హంతకుడీ పర్యాయం మంచం మీద హత్యకు మన దుప్పటీ వాడినట్లు లేడు" అన్నాడు జనార్దనం.
    "వాడితే చెల్లాయ్ - దుప్పటీ మార్చాలమ్మా" అంటూ అడిగుండే వాడుగా అంది సీత .ఆమె ఒక్క క్షణం ఆలోచించి "ఈ రాత్రి మనకేమీ కేక వినపడలేదు కదా - మనం అంత మొద్దు నిద్ర పోయామంటారా?" అంది మళ్ళీ.    
    "హంతకుడు చాలా తెలివైనవాడు. క్రితం పర్యాయం చచ్చినవాడంత పెద్దకేక పెడతాడని అతని ఊహకు తట్టలే దెందువల్లనో , అందుకే ఈ పర్యాయం హతుడికి నోట్లో గుడ్డలు కుక్కి చంపేసి వుంటాడు. కిక్కురుమన కుండా చచ్చుంటాడు పాపం."
    సీత మరో పర్యాయం మంచం మీద దుప్పటి వేసి తలగడాలు సర్ధబోతుండగా వాటి కింద ఒక చిన్న నోట్ బుక్ కనబడింది. జనార్దనం చటుక్కున సీత చేతిలోంచి ఆ పుస్తకం లాక్కున్నాడు. అందులో మొదటి పేజీ చూసి గతుక్కుమన్నాడతను.
    అ పేజీలో కొన్ని పేర్లు రాసివున్నాయి. ఒకటి అంకె వేసి అనంతం పేరు రాసి వుంది. రెండంకె వేసి లక్ష్మీ నారాయణ పేరు రాసి వుంది. రెండు పేర్లకూ పక్కన ఇంటూ మార్కులు పెట్టి వున్నాయి. మూడో అంకె వేసుంది కానీ, అక్కడింకా పేరేది వ్రాయబడలేదు. జనార్దనం ఆ పేజీని సీతకు చూపించాడు. సీత కది చూస్తూనే ముచ్చేమటలూ పోశాయి.
    "ఇదెక్కడి తంటసం వచ్చి పడిందండీ మనకి! హాయిగా సుఖంగా వున్నామనుకుంటే " అంది సీత భయంగా.
    జనార్దనం నోట్ బుక్ లో పేజీలు  తిరగేశాడు. ఒక పేజీలో రెండు చిరునామా లున్నాయి. ఒకటి అనంతానిది. రెండు లక్ష్మీ నారాయణది. ఆతృతగా అతనా చితునామా చూశాడు. హోటల్ గ్రీమ్ లాండ్సు లో పదిహేడో నంబరు గదిలో ఉంటున్నాడు లక్ష్మీనారాయణ. అంటే ఈ ఊరి వాడై వుండడు. లక్ష్మీ నారాయాణ, అతనెవరో , అతని కధేమిటో తెలుసుకోవాలనిపించింది జనర్ధనానికి. సీతకు కూడా అదేమాట చెబితే, "చూడండి, అనవసర వ్యవహారాల్లో తలదూర్చకండి మీరు. అనవసరంగా హత్యకేసులో ఇరుక్కోగలరు " అందామె.
    కానీ, జనార్ధనానికి కుతూహలం చావలేదు. అతనా ఫీసుకు వెళ్ళేముందు హోటల్ గ్రీమ్ లాండ్సు కి వెళ్ళాడు.
    లక్ష్మీనారాయణ ఇంకా హోటల్ ఖాళీ చేయలేదు. అతనక్కడ భార్యతో సహా మకాం పెట్టాడు. గదిలో అతని భార్య వుంది. తన భర్త కోసం ఎవరో వచ్చారని తెలియగానే ఆతృతగా చూడబోయిందామే . జనార్ధనాన్ని చూస్తూనే ఆమె ముఖంలో నిరుత్సాహం కనబడింది.
    "నిన్నరాత్రి వారు - ఒక నూతన వ్యక్తితో వెళ్ళారు. అవసరమైన పక్షంలో పొరుగూరు వెళ్ళాల్సుంటుందని అలా జరిగే పక్షంలో కబురు పంపిస్తాననీ అన్నారు. నాకు కబురు వస్తే, గది ఖాళీ చేసేసి రాత్రి ట్రయిన్ కి వెళ్ళి పోతారు" అందామె.
    "సరే - అయితే నాకాయన్ను కలుసుకునే అదృష్టం లేదు. నా స్నేహితుడోకడు కూడా ఆయన్ని కలుసుకోవాలనుకున్నాడు. నిన్న రాత్రి మీ భర్త వెళ్ళిన నూతన వ్యక్తీ ఎలాగుంటాడో చెప్పగలరా? అతనే నా స్నేహితుడైతే, నేనింక వేరే మీ భర్తను కలుసుకోవాల్సిన అవసరముండదు" అన్నాడు జనార్దనం.
    ఆమె వర్ణించి చెప్పింది. అవి సరిగ్గా హంతకుడికి సరిపోయాయి. జనార్దనం అక్కణ్ణించి బయట పడ్డాడు. అతని మనస్సు నిండా లక్ష్మీ నారాయణ భార్య పట్ల కాలి నిండి వుంది. ఆమెకు ముప్పై అయిదేళ్లుంటాయి. మనిషి చాలా అందంగా వుంది. పదేళ్ళు దాటిన పిల్లలిద్దరున్నారు. ఇంత వరకూ ఖరీదైన జీవితం అనుభవించిందామె!




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.