Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 1



                                   రిస్టువాచీ
                    

    మూసిన కన్నెరవకుండా పడివున్నాడు ఏన్నర్ధం బాబు.
    బాబు తల్లి అరుణ దిగుకుగా కూర్చుని వుంది. పైకి గంభీరంగా కనబడుతున్నా బాబు తండ్రి రామారావు ముఖంలో దిగులు లేకపోలేదు. బాబు తాత రంగనాధం ఏదో తీవ్రంగా అలోచిస్తున్నాడు.
    "ఈపాటికి జ్వరం తగ్గి తీరాలన్నారు డాక్టరుగారు" అన్నాడు రామారావు దిగులుగా.
    "మనవల్ల ఒక తప్పు జరిగింది. అందుకే జ్వరం తగ్గలేదు. ఇప్పుడు డాక్టరు చేయగలిగినదేదీ లేదు" అన్నాడు రంగనాధం.
    "ఏమిటా తప్పు?" అంది అరుణ కంగారుగా.
    "రిస్టువాచీ తాకట్టు పెట్టడం!" అన్నాడు రంగనాధం.
    రామారావు మాట్లాడలేదు. అతని కేమనాలో కూడా తోచలేదు. నూటయాభై రూపాయలకోసం రిస్టువాచీ తాకట్టు పెట్టాడు ఆ డబ్బు ఎందుకోకాదు-బాబు జబ్బుగురించే అది తాకట్టు పెట్టకపోతే తనకు డబ్బు దొరకదు. డబ్బు దొరక్కపోతే బాబుకు వైద్యం జరుగదు. వైద్యం జరక్కపోతే.....
    తనమాట కొడుకు తలలోకి ఎక్కలేదని రంగనాధానికి అర్ధమైంది. "మీరు నావి చాదస్తం మాటలుగా కొట్టిపారేస్తారని నాకు తెలుసును కానీ అనుభవంమీద చెబుతున్న నా మాటల్లోని ఆవేదన మీకెలా అర్ధమవుతుందో తెలియక నేను చాలా బాధపడుతున్నాను. ఆ రిస్టువాచీని మా నాన్న నా ఇరవయ్యో ఏట కొన్నాడు. నాకు మూఢ నమ్మకాలు లేవు. పైగా వాటిని వ్యతిరేకించేవాడిని కూడా.
    నా ఇరవయ్యోఏట పెద్ద జబ్బుచేసింది నాకు. బ్రతుకుతాననుకోలేదు. పెద్ద పెద్ద డాక్టర్లే పెదాలువిరిచి ఊరుకున్నారు. ఆ సమయంలో మనూళ్ళోనే ఉండే ఒక దాసు నాది గాలిదోషమనీ ఒక తాయెత్తు కడితే జబ్బు ఎక్కడిదక్కడ ఎగిరిపోతుందనీ చెప్పాడు. ఆఖరి ప్రయత్నంగా నాన్న నాకు తాయెత్తు కట్టించాడు. తాయెత్తు కట్టినందుకు దాసు ఒక్క రాగిపైసా కూడా తీసుకోలేదు. అది తన కర్తవ్య మని చెప్పి వెళ్ళిపోయాడు.
    అది కాకతాళీయమో, తాయెత్తు మహాత్మ్యమో తెలియదు కానీ నేను బ్రతికాను. కాస్త స్థిమితపడ్డాక జరిగినదంతా తెలుసుకుని నాన్నమీద ఎగిరిపడి-తాయెత్తు విప్పి అవతల పారేశాను. నాన్న ఎంత ప్రయత్నించినా పని జరగలేదు.
    నా మొండితనం తెలిసిన నాన్న ఉపాయం పన్ని ఈ రిస్టువాచీ చేయించాడు. దానికి అసలు ఫ్రేము తీయించి బంగారం ఫ్రేము వేయించాడు. ఆ ఫ్రేములో తమాషాగా తాయెత్తు ఇరికించాడు.
    రిస్టువాచీ చూచి ముచ్చటపడ్డాను నేను కానీ అసలు విషయం తెలియదు నాకు. ఆ తాయెత్తు తరతరాల యింటి పెద్దకొడుకు ధరించాలని దాసు ఆదేశించాడుట. ఆ ఆదేశాన్ని నేను పాటించనని తెలిసి మా నాన్న ఈ రిస్టువాచీ చేయించాడు.
    ఆ తర్వాత అంతా బాగానే వుంది కానీ ఓ పదేళ్ళలో సంపద తరిగింది. వ్యాపారంలో నష్టం వచ్చింది. నేను వేరే చిన్న వుద్యోగంలో ప్రవేశించాను. నాన్న చాలా బాధపడుతూండేవాడు. అలవాటుపడ్డమీదట ఖర్చులు తగ్గించు కోవడం కాస్త కష్టమేననిపించింది. ఆ పరిస్థితుల్లో మీ అమ్మకు జబ్బు చేసింది. డబ్బు అవసరమై రిస్టువాచీ తాకట్టుపెట్టాను. మందు వాడినా అమ్మజబ్బు ఉదృతమైంది నాన్న పరిస్థితి తెలుసుకుని ఎక్కడో తల తాకట్టుపెట్టి ఆ రిస్టువాచీ విడిపించి తెచ్చాడు. మీ అమ్మకు చేత్తో తీసినట్లుగా రోగం మాయమైంది.
    అప్పుడు నాన్న నాకు రిస్టువాచీ రహస్యం చెప్పాడు. నేను మండిపడ్డాను. వెంటనే రిస్టువాచీని అమ్మిపారేశాను. నాన్న ఎంతగానో ప్రాధేయపడ్డాడు. నేను వినలేదు.
    సరిగ్గా ఆరునెలలు తిరక్కుండా నెలరోజులు తేడాలో అమ్మ, నాన్న, మీ అమ్మ చనిపోయారు, అది కాకతాళీయం కావచ్చు. లేదా తాయెత్తు ప్రభావం కావచ్చు. కానీ నా మనసు చలించిపోయింది. ఆ వాచీ ఆరాలుతీసి మళ్ళీ కొని తెచ్చుకున్నాను. లేకపోతే నువ్వుకూడా నాకు దక్కవని భయం వేసింది.
    నమ్మకాల సంగతేలాగున్నా జీవితాలతో ఆటలాడ్డం నా కిష్టంలేదు. చేజేతులా అయినవాళ్ళందర్నీ పోగొట్టుకొన్నానని నా అనుమానమూ, భయమూను. మళ్ళీ అటువంటి పొరపాటు జరగడం నా కిష్టంలేదు. అందుకే ఇంతలా చెబుతున్నాను.
    ఆ మాటలు రామారావులో ఎటువంటి సంచలనాన్ని కలిగించాయో తెలియదు కానీ అరుణ మాత్రం వణికిపోయింది.
    "ఏమండీ ఎలాగో అలా వెళ్ళి ఆ గడియారం విడిపించుకురండి" అంది భర్తతో.
    రామారావుకు అ వాచీమీద ఇంకోరకంగా అభిమానం వుంది. అది ఇంతవరకూ ఒక్కసారికూడా రిపేరుకు వెళ్ళలేదు. ఎంత పాతధైనా చూడ్డానికలా కనిపించదు టైము కరెక్టుగా చూపిస్తుంది. అలాంటి వాచీ కొందామన్నా ఇప్పుడు బజార్లో దొరకదు. దాన్ని తాకట్టు పెట్టడం అతని కిష్టంలేదు. కానీ డబ్బు దొరికేమార్గం ఇంకోటి కనబడక ఆ పని చేశాడు.
    "ఇలాంటి నమ్మకాలు నాకు లేకపోయినప్పటికీ ఆ వాచీని తాకట్టులో వుంచాలని నాకూలేదు. కానీ మనకు అవసరానికి డబ్బుపుట్టే మార్గం ఇంకోటిలేదు. ఒకటి రెండు నెలలవరకూ దాన్ని విడిపించాలన్నా కష్టమే!" అన్నాడు రాజారావు.
    "చూడొరేయ్ నేనిలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఆ వాచీమీద తప్పితే నాకింకే రకమైన సెంటిమెంట్లూ లేవు. ఆ వాచీకోసం అవసరమైతే ఏమైనా తాకట్టు పెట్టవచ్చు...." అన్నాడు రంగనాధం-ఏమైనా అన్న మాటను నొక్కి పలుకుతూ.




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.