Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 1



    ప్రతాప్ కళ్ళు చెమర్చగా అన్నాడు-"మీరు మంజుల కోసం అనవసరంగా కలవరపడుతున్నారు. ఆమె కొత్తగా మానాన్ని కోల్పోయినదేమీలేదు. ఆమె ఎన్నడూ శీలవతి కాదు....."
    మోహనరావు తెల్లబోయాడు. అంతలోనే అతనికి కోపం వచ్చింది. "ఏమిటి మీరనేది?" అన్నాడు.
    "నిన్న నేను మీ గదికి వచ్చాను. నీవు ఎక్కిన రిక్షా అప్పుడే వెళ్ళిపోతూండడమూ-మీ గదిలోకి ఒక పురుషుడూ, స్త్రీ వెళ్ళి తలుపులు వేసుకోవడమూ చూశాను. వాళ్ళెవరో తెలుసుకుందామనిపించి గదిదాకా వెళ్ళాను. తలుపు తట్టేలోగా లోపల్నుంచి మాటలు వినబడ్డాయి.
    వాటినిబట్టి, లోపల వున్న స్త్రీ మంజుల అనీ-ఆ పురుషుడామె ప్రియుడనీ అర్ధమైంది. అతనామెను శృంగారానికి తొందరపెడుతున్నాడు. మోహనరావు వెనక్కి వచ్చే అవకాశమున్నదనీ, తొందరపడవద్దనీ ఆమె అతణ్ణి వారిస్తోంది."
    మోహనరావు తలను మోకాళ్ళమధ్యకు దూర్చేసుకుని "ప్రతాప్ గారూ! నా జీవితం అన్యాయమైపోయింది....." అన్నాడు.
    ప్రతాప్ అతన్ని ఓదార్చి, "రండి మీ గదిలో దిగవిడుస్తాను" అన్నాడు.
    చంటిపిల్లాడిలా అతన్ననుసరించాడు మోహనరావు.
    ఇద్దరూ మోహనరావు గదికి వెళ్ళిన అయిదు నిమిషాలకు కార్లో రమేష్ వచ్చాడు. వస్తూనే మోహనరావుని చూసి "నన్ను క్షమించాలి గురూ!" అన్నాడు రమేష్. పవిత్ర ప్రేమకూ మంజులకూ నువ్వు ముడిపెట్టేసరికి ఏం చేయాలో తోచక, నిన్నెలా రక్షించాలో తెలియక ఓ చిన్న సైజు త్యాగం చేశాను. ఫలితంగా వీడీవార్డుకెళ్ళి ఇంజక్షన్ చేయించుకు వస్తున్నాను. మంజుల కులట మాత్రమే కాదు. ఆరోగ్యరీత్యా ప్రమాదకరమైనది కూడా. ఇంకా నీ పవిత్ర ప్రేమ మిగిలి ఉంటే దాన్ని ఏ హాస్పిటల్లోనైనా జాయిన్ చేయించి ఆ తర్వాత.... ...."
    "థాంక్స్" అన్నాడు ముభావంగా మోహనరావు.
    "మోహనరావ్! మీరు నాకిప్పుడు వంద రూపాయలు బాకీ" అన్నాడు ప్రతాప్.
    ఆశ్చర్యంగా చూసిన రమేష్ కి అతను పందెం గురించి వివరించాడు.
    "సమయా సమయాలు తెలియవు నీవు" అంటూ మరోసారి విసుక్కున్నాడు మోహనరావు.
    "పందేలకు సమయా సమయాలంటూ వేరే వుండవు. ఎప్పుడు నెగ్గితే అప్పుడే సమయం...." అన్నాడు ప్రతాప్ అదోలా.
    "ఎలా నేగ్గారో రుజువు చేయండి."
    "అటుమొన్న నీవు నా గదికి వచ్చి వెళ్ళాక నాకు టెలిగ్రాం వచ్చింది-నా శ్రీమతి పోయిందని. రాత్రికి రాత్రి బయల్దేరి వెళ్ళాను. మొన్న నా చేతుల్తో స్వయంగా ఆమె చితికి నిప్పంటించి వెంటనే తిరుగు ప్రయాణం కట్టాను. నిన్న ఈ సంగతే చెబుదామని మీ గదికివచ్చాను. నా దుఃఖాన్ని మీతో పంచుకుందామనుకున్నాను కానీ సాధ్యపడలేదు....." ప్రతాప్ మాటలు రాక ఆగిపోయాడు.
    తెల్లబోయాడు మోహనరావు "అక్కయ్యగారూ....." అన్నాడు.
    "ఇక లేదు. నన్ను పందెం నెగ్గించడం కోసమని వెళ్ళిపోయింది. జీవితంలో ఎందరి కష్టాలకో చలించి పోయి కన్నీళ్ళు పెట్టుకునేవాడ్ని. ఇప్పుడు నాకింత కష్టం కలిగితే-కన్నీళ్ళు కూడా మిగలలేదు...."
    మోహనరావు అప్రయత్నంగా జేబులోంచి వంద రూపాయలు తీసి "కాబోయే భార్య కులట అని తెలియడం నా అదృష్టం. దాన్నో కష్టంగా భావించి విలవిల్లాడి పోయాను. కట్టుకున్న అనుకూలవతియైన భార్యను పోగొట్టుకున్న మీరు నా దుఃఖాన్ని అణచడానికి ప్రయత్నించాను. మీరే నెగ్గారు ప్రతాప్!" అన్నాడు.
    "ఈ వందరూపాయలూ వద్దంటే నా కమల నాకు తిరిగి వస్తుందా....." అన్నాడు ప్రతాప్ డబ్బు అందుకుంటూ. ఆ తర్వాత అతనక్కడ క్షణం నిలవలేదు.
    మర్నాటికిగానీ అర్ధం కాలేదు మోహనరావుకి ప్రతాప్ పందెం విషయం గుర్తు చేయడంలో స్వార్ధం లేదు. తను విలపిస్తున్నదెంత చిన్న కారణానికో తెలిసిరావడంకోసమే అతనది గుర్తు చేశాడు.
    మోహనరావు జీవితంలో మరచిపోలేని పందెమది.

            
                                      * * *




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.