Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "ఒరేయ్ ------చెంగాల్రావ్ ........" అందవతలి గొంతు .
    'అదేనా ----నన్ను పిలిచే పద్దతి ....?"
    "సారీరా ---ఇడియట్ !"
    "ఇట్స్ గుడ్!" అని మెచ్చుకున్నాడు చెంగాల్రావ్.
    "ఈ ఊరేప్పుడోచ్చావు? ఇప్పుడేక్కడ్నించి ఫోన్ చేస్తున్నావు?"
    "నిన్న వచ్చాను. హోటల్ శ్రీ దుర్గ నుంచి ఫోన్ చేస్తున్నాను...."
    "ఈ ఊరొచ్చి హోటల్లో మకాం పెడతావా --- నిన్ను ఇడియట్టంటే చాలదు, ఇంకా .....ఇంకా...."
    "తర్వాత అలోచించి చెబుదువు గానిలే కానీ -----నాకు నీ సాయం కావాలి . నువ్వు నాకు సాయపదాలంటే మన స్నేహం గురించి ఎవ్వరికీ తెలియకూడదు...."
    "ఏమిటి నీక్కావలసిన సాయం?"
    "ఫోన్ లో చెప్పొచ్చా ---యెవరైనా టాప్ చేస్తారంటావా?"
    'అంత రహస్యమా అది!"
    "అవును...."
    'అయితే నేనే వస్తాను...."
    "పూల్ ప్లస్ రాస్కెల్ ! మన స్నేహం గురించి ఇక్కడందరికీ తెలియకూడదన్నానా?"
    "సరేరా ఇడియట్! ఉత్తరం పంపించు ...."
    "ఇట్స్ గుడ్!" అన్నాడు చెంగల్రావు.
    "మరి మనం కలుసుకునేదెప్పుడు ?"
    "నిన్ను కలుసుకోకుండా , వదిన గారిని పలకరించకుండా యిక్కడ్నించి వెళ్ళను. సరా?" అన్నాడు చెంగల్రావు.
    "థాంక్స్ రా ఇడియట్ !" అంది అవతలి గొంతు.
    చెంగల్రావు ఫోన్ పెట్టేసి కాగితం మీద వ్రాయడం మొదలు పెట్టాడు.
    "మందిరం వీధిలో ముగ్గురు మహనీయులున్నారు. శ్రీరామ్, మహమ్మద్, జీసస్ , వాళ్ళు ముగ్గుర్నీ అరెస్టు చేసి కనీసం నెల రోజుల పాటు జైల్లోంచి బయటకు రాకుండా చూడాలి. వాళ్ళ ముఠాని కొన్నాళ్ళ పాటు ఆ వీధిలో లేకుండా చేయాలి. ఇదే ప్రస్తుతానికి నువ్వు నాకు చేయగల సాయం...."
    చెంగల్రావు ఉత్తరం చివర సంతకం పెట్టలేదు. కాగితం చింపి ఓ కవర్లో పెట్టి - "రేపుదయమే ఇది ఓ పోలీస్ స్టేషన్ లో యిచ్చి డీయస్సీ కందచేయమనాలి --" అనుకున్నాడు.
    
                                    6
    ఎలక్ట్రానిక్ హవుస్ ముందు టాక్సీ దిగాడు చెంగల్రావు గంబీరంగా అందులో ప్రవేశించాడు.
    ముందుగా రిసెప్షన్ హలుంది. అక్కడ  సుమారు పాతికేళ్ళ యువకుడు రిసెప్షనిస్టు గా ఉన్నాడు. చెంగల్రావు అతన్ని సమీపించి -- " నేనీ ఊరికి కొత్త ఈ బిల్డింగ్ గురించి చాలా విని యెంతో ఆశతో వచ్చాను. ఇక్కడి విశేషాలేమిటి ?" అన్నాడు.
    రిసెప్షనిస్టు మృదువుగా నవ్వి -- "గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునిక పరికరాలు , పై ఫ్లోర్లలో ఆధునిక యువతులు " అన్నాడు.
    "యువతులెం చేస్తారు?"
    "మాసేజ్ ...."
    "మీ వద్ద ఆ యువతుల హిస్టరీ వుంటుందా?"
    "ఓ యస్....ఇక్కడెప్పుడూ యాభై మందికి తక్కువ కాకుండా అమ్మాయిలుంటారు. కానీ మా వద్ద రెండు వేలకు తక్కువ కాకుండా యువతుల గురించిన సమాచారముంటుంది...."
    "ఎవరు వాళ్ళు ?"
    "వాళ్ళలో పెద్దింటి వాళ్ళుంటారు . కాలేజీ విద్యార్దులుంటారు. వివాహితులుంటారు ...."
    "వీళ్ళంతా మాసేజ్ నేర్చుకున్నారా ?"
    "అవును, మాసేసింగ్ ఇక్కడైనా చేస్తారు. కావాలంటే ఇంటికీ రప్పించుకోవచ్చు. మాసేసింగ్ అంటే ఇష్టమున్న యువతులు మావద్ద పేర్లు రిజిస్టర్ చేయించుకుంటారు. వారికిక్కడ శిక్షణ యివ్వ బడుతుంది...."
    "వారి వారి చిరునామాలు కూడా దొరుకుతాయా?"
    రిసెప్షనిస్టు నవ్వి -" వారి వారి వయసులు , హోదాలు తెలియపరచబడతాయి. ఎలా పెరిగింది, పెంచబడింది కూడా వివరముంటుంది. చిరునామా వుండదు. ఇక్కడ ఫోటోలో చూసిన యువతిని మీరెక్కడైనా చూస్తె  డైరక్టుగా అప్రోచ్ కాలేరు. ఆమె మాసేజింగ్ అంగీకరించదు. అంతా మా సంస్థ ద్వారానే జరగాలని అన్నాడు.
    చెంగల్రావు రిసెప్షనిస్టిచ్చిన అల్బం తీసుకున్నాడు. ఒకో ఆల్బమ్ లో వంద ఫోటోలు.... ఫోటో కింద వివరాలు ఫోటోలోని యువతులందరూ కళ్ళు చెదిరే అందంతో మిలమిల మెరిసిపోతున్నారు.
    అక్కడ చాలా ఆల్బమ్స్ ఉన్నాయి. చెంగల్రావు మాత్రం మూడు ఆల్బమ్స్ చూశాక నాలుగో ఆల్బమ్  చూస్తూ ఓ ఫోటో వద్ద ఆగిపోయాడు.
    రిసెప్షనిస్టు కాయన ఆ ఫోటో చూపించి -- " నేనీమెను చూడాలి ..." అన్నాడు.
    రిసెప్షనిస్టు ఫోటో కింద నంబరు చూశాడు. 1867 , అప్పుడతడు ఫోన్ లో ఓ నంబరు తిప్పి --- "హలో --- కంప్యూటర్ సెక్షన్ --నెం. - 1367 - వాటీజ్ ది పొజిషన్!" అనడిగాడు. వివరాలన్నీ విని -- "సారీ సార్! ఆమె నాలుగు రోజుల వరకూ బుక్కై పోయింది ...." అన్నాడు.
    "ఆమె ఎక్కడుందో చెప్పగలరా ?"
    "సారీ...."
    "ఆమెను నేనర్జంటుగా కలుసుకోవాలి ...."
    రిసెప్షనిస్టు నెమ్మదిగా ---"సర్! ఇంకా ఎన్నో ఆల్బమ్స్ న్నాయి...." అని ఏదో చెప్పబోయాడు.
    "నాకింకేవ్వరూ వద్దు...."
    "ఆమెలోని ప్రత్యేకత ఏమిటో చెప్పండి ....అలాంటి ప్రత్యేకత వున్న వారిని మరికొందరిని నేను సూచించగలను ...."
    "ఆ ఫోటో కింద వివరాలు చూశారు గదా! అలాంటి యువతులంటే నాకెంతో ఆకర్షణ...."
    "జస్టేమినిట్ ...." అంటూ అతడు మళ్ళీ కంప్యూటర్ సెక్షన్ కి ఫోన్ చేసి ఆ వివరాలు చెప్పి -- "అచ్చం యిలాంటి వివరాలే వున్న నంబర్లు కొన్ని చెప్పాలి " అన్నాడు.
    అవతలి నుంచి వివరాలు లభించేక -- అతడు నంబర్లు నోట్ చేసుకుని -- "సారీ సర్ --- అలాంటి యువతులు మరో నలుగురు మాత్రం వున్నారు. అందరూ వారం రోజులవరకూ బుక్కై పోయారు. అయితే వారిలో ఒక యువతి ఇప్పుడెక్కడున్నదీ చిరునామా యివ్వగలను ...." అన్నాడు.
    "ఆ ఒక్క యువతి విషయంలోనూ మాత్రమే అదెలా సాధ్యం ?"
    "మాకు ఫుల్ మెంబర్స్, హాఫ్ మెంబర్స్ వుంటారు. హాఫ్ మెంబర్స్ ఫోటో లుండవు. వారి విషయంలో రహస్యం దాచే బాధ్యత మాకు లేదు. మీరు స్పెషల్ సర్వీస్ చార్జెస్ కింద వంద రూపాయలు చెల్లిస్తే ఆమె అడ్రసు మికివ్వగలను...."
    చెంగల్రావు అతడికి ఎంట్రీ ఫీజు వందరూపాయలు స్పెషల్ సర్వీస్ చార్జెస్ వందరూపాయలు చెల్లించి --ఆమె చిరునామా తీసుకున్నాడు.
    ఆశ్చర్యమేమిటంటే ఆమె ఆయనున్న హోటల్లోనే ఆయనకు పక్క గదిలోనే వుంటోంది.
    హోటల్లో తన వివరాలు పట్టించుకోనందుకాయన తన్ను తాను నిందించుకున్నాడు-- 'అయినా పట్టించుకుంటే మాత్రం ఏం తెలుస్తుందిలే !" అనుకున్నాడు.
    
                                   7
    
    బెల్ విని పరుగున వచ్చి తలుపు తీసింది అరుణ. ఎదురుగా కనబడిన చెంగల్రావు ఆమెకు అపరిచితుడు.
    "లోపలకు రావచ్చా ?" అన్నాడు చెంగల్రావు.
    "మీరెవరో నాకు తెలియదు...." అందామె.
    చెంగల్రావు చటుక్కున లోపల అడుగు పెట్టి తలుపు వేసి -- "కంగారు పడకు . నేను చెడ్డవాడ్ని కాదు --" అన్నాడు.
    'అయన బయటకు వెళ్ళారు. రావడానికి గంటపైగా పడుతుంది --" అందామె తడబడుతూ.
    అరుణ వంకే చూస్తున్నాడాయన.
    లేత గులాభీ రంగు ఛాయ. ఆమె కట్టుకున్న చీర, బ్లవుజు -- వంటి రంగులో కలిసిపోయాయి. పెద్ద పెద్ద కళ్ళు. కొనదేరిన ముక్కు, ఎక్కడ లేని అమాయకత్వం -- ఆమెకు ప్రత్యేకమైన అందాన్ని తెచ్చి పెట్టాయి.
    అయన చూపులకు భయపడుతూ -- "ఎవరు మీరు?" అందామె.
    "నీ శ్రేయోభిలాషిని...."
    "ఎందుకొచ్చారు?"
    "నీ క్షేమం కోరి...."
    "నాకిప్పుడేమయింది?"
    "అది తెలుసుకోవాలనే వచ్చాను...."
    "రెండు నెలల క్రితం మాకు పెళ్ళయింది. హనీమూన్ కీ ఊరు వచ్చాం. నాదెంతో సుఖమైన జీవితం ..."
    ఆమె అబద్దం చెబుతోందని చెంగాల్రావు గ్రహించాడు. ఆమెకు అర్ధం కావాలనే --- "నాకు నీ గురించిన వివరాలు ఎలక్ట్రానిక్ హౌస్ లో లభించాయి...." అన్నాడు.
    "ఎలక్ట్రానిక్ హవుస్ అంటే ?"
    చెంగల్రావు నవ్వి -- "నేను నీ శ్రేయోభిలాషినని తెలియక బాగా నటిస్తున్నావు కానీ -- ముందు నన్ను నీ శరీరాన్ని పరీక్షించనీ ...." అన్నాడు.
    "పరీక్ష అంటే....?"
    "పరీక్షంటే పరీక్షే....నేను నిన్ను తాకనైనా తాకను...."
    "పరీక్ష ఎందుకు?"




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.