Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12


 

    "ఇద్దరా ?" అంది మంగాయమ్మ.
    "అవును , అడ్వాన్సెంతో చెప్పు...." అన్నాడాయన .
    "ఇద్దరికీ యాభై అవుతుంది...."
    ఆమె నోటిమాట బయటకు రాకుండానే అయన వందరూపాయాల నోటొకటి ఆమె కందించి --" నా మనసుకు తృప్తి కలిగితే -- వందలు కాదు ..... వేలిస్తాను..... " అన్నాడాయన.
    ఆయనకు తృప్తి కలగాలని మంగాయమ్మ దేవుణ్ణి ప్రార్ధించుకుంది.

                                   4

    గదిలో అయన వాళ్ళిద్దర్నీ ఎన్నో ప్రశ్నలు వేశాడు. కంపెనీలో యితర స్త్రీల గురించి అడిగాడు, వారి అందాన్ని సున్నితంగా మెచ్చుకున్నాడు.
    ఆ యిద్దరమ్మాయిలకూ తమ గతం తిన్నగా తెలియదు, జ్ఞానం తెలిసినప్పట్నించి మంగాయమ్మ సంరక్షణ లోనే పెరిగాయి. చిన్నతనం నుంచీ ఆమె వాళ్ళలో వ్యభిచార భావాలు నాటింది. అదే ప్రపంచమని వాళ్ళనుకున్నారు.
    "ఈ జీవితం మీకు బాగుందా ?" అనడిగాడాయన.
    "ఆరంభంలో బాగుండేది. ఇప్పుడు నచ్చడం లేదు...."
    "ఎందుకని ?"
    "బయట ప్రపంచం ఎలాగుంటుందో చూడాలనుంది."
    "చూడోచ్చుగా...."
    "ఈ వీధి దాటి మేము బయటకు వెళ్ళలేము...."
    వాళ్ళ కదలికలపై ఎన్నో ఆంక్షలున్నాయి. తప్పించుకునే ప్రయత్నం చేస్తే క్రూరంగా శిక్షించబడతారు ."
    "మిమ్మల్నేవరు శిక్షిస్తారు?"
    "శ్రీరామ్!"
    "అతడెవరు ?"
    "కండలు తిరిగిన వస్తాదు. వాడు చేత్తో కొడితేనే కొరడాతో కొట్టినట్లుంది. కానీ వాడెప్పుడూ కొరడా తోనే కొడతాడు...."
    "ఎప్పుడూ కోరడాతోనే కొడితే చేతి దెబ్బ గురించి యెలా తెలిసింది?"
    "రోజూ ఏదో సమయంలో వాడందర్నీ అభిమానంగా పలకరించి నడ్డి మీద చరుస్తాడు. ఆ దెబ్బకే కళ్ళు తిరుగుతాయి...."
    ప్రేమతో చేతితో చరిస్తే కళ్ళు తిరగాయంటే.... వాడి కొరడా దెబ్బ ఎలా ఉంటుంది?
    అయన ముఖం అదోలాగైపోయింది -- "మిమ్మల్నేప్పుడైనా కొట్టాడా?" అన్నాడాత్రంగా.
    "లేదు, మేము తప్పించుకునే ప్రయత్నమెప్పుడూ చేయలేదుగా!"
    'అయితే వాడి కొరడా దెబ్బల గురించి మీకెలా తెలుసు?"
    "తప్పు చేసిన వాళ్ళను మా ఎదురుగానే శిక్షిస్తారు. ఆ శిక్ష చూసి మేము మళ్ళీ తప్పులు చేయకూడదని.."
    "తప్పంటే ఏమిటి?"
    "మంగాయమ్మ చెప్పినట్లు వినకపోవడం, తప్పించుకోవాలని ప్రయత్నించడం...."
    "స్త్రీ పురుషులొకరికోసం ఒకరు పుట్టారు, ఒకరి సాంగత్వంలో ఒకరానందం పొందుతారు. అలాంటి అనుభవం నిత్యం పొందే మీరు మీ అదృష్టానికి సంతోషించాలి కానీ - తప్పించుకుని పారిపోవడమెందుకు?"
    "మొదట్లో మేమూ అలాగే అనుకున్నాం. కానీ క్రమంగా మా అభిప్రాయాలు మారాయి. అందరి మగాళ్ళూ, మాకు నచ్చరు. అయినా మేము ఒప్పుకోవాలి. కొందరి దగ్గర బ్రాందీ వాసన, మరి కొందరి దగ్గర సిగరెట్ వాసన , కొందరివి ఎత్తు పళ్ళు, కొందరు కురూపి ముఖాలు, మా యిష్ట ప్రకారం -- మాకిష్టమైన వాళ్ళతో అయితే సంతోషంగా వుండేదేమో! అదీకాక మాకు విశ్రాంతి కావాలనుకున్నప్పుడది లభించదు, ఒకోసారి మగాడి పేరు చెబితే అసహ్యం వేస్తుంది. అయినా మే మప్పుకోవాలి. మాలో అందరికీ యిక్కడ్నించి తప్పించుకొని పారిపోవాలనే ఉంటుంది...."
    "నిజానికి శిక్ష మీరనుకున్నంత క్రూరంగా ఉండదు. కొరడాతో కొట్టినప్పుడు దెబ్బలు గట్టిగా తగలకుండా బట్టాలడుగున మెత్తటి వస్తువు నుంచుతారు. శిక్ష చూసి మీరు భయపడుతారు. శిక్షించబడిన వాళ్ళకు బాధ ఉండదు...."
    "అలాంటి అవకాశం లేదు. శిక్ష పొందేవాళ్ళకు వంటి మీద బట్టలుండవు. కదలడానికి వీల్లేకుండా కాళ్ళు, చేతులు కట్టి, అరవడానికి వీల్లేకుండా నోట్లో గుడ్డలు కుక్కి -- శ్రీరామ్ తన వలమంతా ఉపయోగించి అయిదంటే అయిదు కొరడా దెబ్బలు -- ఆ దెబ్బలకే -- స్పృహ తప్పిపోతుంది. ఒకసారి తప్పించుకుందుకు ప్రయత్నించిన వాళ్ళింకో ప్రయత్నం చేస్తే -- వాళ్ళకు పది కొరడా దెబ్బలు......అంతేకాదు .....పారిపోదల్చుకున్న వాళ్ళకు సాయం చేసిన వాళ్ళందరికీ ఒకో కొరడా దెబ్బ . అందుకే మేము ఒకరితో ఒకరం మాట్లాడుకోము- లేనిపోనీ అనుమానాలు వస్తాయని ఏవరి ప్రపంచం వారిదిగా జీవిస్తాం...."
    అయన నిట్టూర్చి -- "మీ జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలియదు. మీ దగ్గర సుఖం దొరుకుతుందని, మీరూ సుఖ పడతారని వాళ్ళనుకుంటారు...." అన్నాడు.
    "మీరు వచ్చింది బయటి ప్రపంచం నించే కదా!"
    ఆయన తడబడి -- 'అవును, మీ కధలతో, మీ యిబ్బందులతో నాకు నిమిత్తం లేదు. నా అవసరం కోసం నేను వచ్చాను. మీరిద్దరూ బట్టలు విప్పి అక్కడ పెట్టి -- ఒకరి పక్క ఒకరు నిలబడండి ...." అన్నాడు.
    వాళ్ళిద్దరూ అయన మాట పాటించారు.
    వారి నగ్న శరీరాల వంక దృష్టి సారించిన అయన కనులలో సంతోషం, సంతృప్తి లేదు. ఆ స్థానంలో దిగులు, నిరాశ, విచారం కనబడ్డాయి.
    వారి శరీరాల నిండా రక్కులు, పంటి గాట్లు ....
    వారేటు వంటి క్రూరహింసకు గురవుతున్నారో అయన కర్ధమయింది.
    "బట్టలు వేసుకోండి ...." అన్నాడాయన మళ్ళీ.
        వాళ్ళిద్దరూ ఆశ్చర్యపడుతూ బట్టలు వేసుకున్నారు.
    "థాంక్స్!" అన్నాడాయన.
    "మీరెవరు?" అన్నారిద్దరూ ఏక కంఠం తో ఆశ్చర్యంగా.
    "నా వివరాలు మీకెందుకు?" అన్నాడాయన.
    "మీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉంది...."
    అయన నిట్టూర్చి --"నన్నే ఆశ్చర్యపరుస్తుంది నా ప్రవర్తన ...." అని -- "మీరిక వెళ్ళవచ్చు .." అన్నాడు.
    ఒకామె ఆశగా అతడి వంక చూసి -- "మీరు నన్నిక్కడి నించి తప్పించగలరా? జీవితాంతం మీ యింట్లో బానిసలా పడి వుంటాను ...." అంది.
    "నేను కూడా...." అంది రెండో ఆమె.
    "నేను మిమ్మల్ని తప్పిస్తానని ఎందు కనుకుంటూన్నారు ?" అన్నాడాయన.
    "బయటి ప్రపంచంలో కొందరు సంఘసేవకులున్నారనీ ----వాళ్ళు మా బోంట్లకు విముక్తి కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాం. మిమ్మల్ని చూస్తె మీరూ అలాంటివారేననిపించింది...."
    "మీరు పొరబడ్డారు. నేనలాంటి వాడ్ని కాదు, ఇది నేను ఆనందించే పద్దతి. ఇప్పుడు నేను పంకజం కంపెనీకి వెడుతున్నాను. అక్కడా యిలాగే మీవంటి వాళ్ళను వెతుక్కుని వీరామణి కంపెనీకి వెడతాను....మీ వయసు పిల్లలిక్కడ ఇంకా ఏ యిళ్ళలో దొరుకుతారో చెప్పగలరా?" అన్నాడాయన.
    "ఈ మూడు కంపెనీలే ఈ వీధికి పెద్దవి. ఈ మిగతావన్నీ చిన్న కంపెనీలు. అక్కడ మీకు పాతికేళ్ళ పిల్లలు తప్ప దొరకరు. పెద్ద కంపెనీల వాళ్ళు - ఓ వయస్సు దాటిన వాళ్ళను చిన్న కంపెనీలకు అమ్మేస్తారు. కొన్నేళ్ళు పోయేక వస్తే బహుశా నేనూ మీకూ ఏదో ఒక చిన్న కంపెనీలో ఈ వీధిలో కనబడవచ్చు --" అందోకామే.
    "నేను కూడా...." అంది రెండో యువతి.
    అయన వాళ్ళిద్దరి ముఖాలూ మరోసారి చూశాడు.
    "మమ్మల్నీ రక్షించరూ!" అంటున్నాయి వారి కళ్ళు .
    అయన నిట్టూర్చి -- "నేను వెడుతున్నాను ---" అన్నాడు.
    "వందరూపాయలిచ్చారు, మరి కాసేపుండలేరా?" అన్నదామె.
    "ఎందుకు ?"
    "మాకు కనీసం కాసేపు విశ్రాంతి ...."
    ఆయనకు వాళ్ళ పరిస్థితి అర్ధమయింది.
    కానీ ఆగలేదు.


                                    5

    హోటల్లో తన గదిలో కూర్చున్నాడాయన.
    అయన యెదురుగా ఓ నోట్ బుక్కుంది. అందులో పెన్సిలుతో రాస్తున్నాడాయన.
     శ్రీరామ్ ------మంగాయమ్మ యిల్లు.....
    మహమ్మద్ ---పంకజం యిల్లు....
    జీసస్....వీరామణి యిల్లు....
    అంతే రాశాడాయన నోట్ బుక్ లో!
    ముఖంలో ఏదో తెలియని బాధ, కళ్ళలో కోపం ....
    ఆయన అక్కణ్ణించి లేచి ఒక మూలకు వెళ్ళాడు. అక్కడ టెలిఫోనుంది. ఓ నంబరు తిప్పాడాయన.
    "హలో ! డీయిస్పీ ఇందుభూషణ్ స్మీకింగ్! " అంది అవతలి గొంతు.
    "ఇందుభూషణ్ నేనా --- నేను మాట్లాడుతున్నాను ...."
    "నేనంటే?"
    "గుర్తుపట్టలేదా ?"
    "పేరు చెప్పందే ఎలా తెలుస్తుంది? విసుగ్గా ధ్వనించిందవతలి గొంతు.
    "ఫోన్ లో గొంతు విని నన్ను గుర్తుపట్టక పొతే --- నువ్వు డిపార్ట్ మెంటు కేం పనికొస్తావు?" ఫూల్ ప్లస్ రాస్కెల్ ...." అన్నాడాయన.
    "ఏమన్నావ్ ?"
    "ఫూల్ ప్లస్ రాస్కెల్...."




Related Novels


Vasundhara Kadhalu - 15

Vasundhara Kadhalu - 14

Vasundhara Kadhalu - 13

Vasundhara Kadhalu - 12

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.