Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
రైలు మళ్ళీ కదిలింది. విద్యుద్దీపాలు వెలిగాయి. ఇంతవరకూ యేమీ ఎరగనట్టు ఒక మూల కూర్చున్న పిచ్చివాడు. అమాంతం లేచాడు "చచ్చాడా చ్చినాడా. చచ్చిపోయినాడా?" అన్నాడు వెర్రిగా నవ్వుతూ.
"కలి ఘోరకలి" అన్నాడు శాస్త్రులు జారీ చెంబులోని నీళ్ళు కాసిని దాహం పుచ్చుకుంటూ.
"కలి కాదు శాస్త్రులూ, ఆకలి, రోకలి" అంటూ పిచ్చివాడు శాస్త్రులమీద ఒరిగాడు. శాస్త్రులు పిచ్చివాణ్ని 'ఫో ఫో' అని తోశాడు. పిచ్చివాడు ఆ తోపుకి బెంగాలీమీద పడ్డాడు. బెంగాలీ 'గెట్ అవుట్' అని మళ్ళీ తోశాడు. పిచ్చివాడి తలకి రైలుపెట్టె గోడ తగిలింది. 'అబ్బా' అన్నాడు. అందరికేసి చూశాడు. నోరు మూసుకున్నాడు. "మాట్లాడను. ఇంక మాట్లాడను" అన్నాడు జాలిగా.
"పిచ్చిముండాకొడుకు పాపం" అన్నాడు చుట్ట ఆసామి. "మీరందరూ మనుషులు, మనుషులంతా ప్రపంచం ప్రపంచమనే రైలుబండి ఇప్పుడు నామీదనుంచి పోయింది. చూడండి, ఎంత దెబ్బ తగిలిందో. మాట్లాడను. నేను చచ్చిపోయాను. రైలు కిందపడి చచ్చిపోయింది నేనే. హరోం హరహర" అంటూ గోడకి చేర్లబడి కళ్ళు మూసేసుకున్నాడు పిచ్చివాడు.
అందరూ నవ్వారు.
"శాంతారాం పిక్చరాడుతోంది మా వూళ్ళో" అన్నాడు విద్యార్ధి. వాళ్ళ టాపిక్ సినిమాలోకి వెళ్ళిపోయింది. చుట్ట ఆసామీ వ్యవసాయాన్ని గురించి శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. విధవ మగతగా తూగుతూ మధ్య మధ్య కళ్ళు తెరుస్తూ నిద్రపోతోంది. బెంగాలీవాడు ఒక సీసా తీసి రసగుల్లాలు తీసుకుని తింటున్నాడు.
నేను పేపరు నుంచి నా దృష్టిని పక్కకు మరల్చాను. యువతి చెక్కిళ్ళమీద సన్నని నీటిచార, గ్లాస్కో చొక్కావాడు జేబులో పర్సు తీసి -మరి యువతిని ఆకర్షించడానికో ఏమో - నోట్లు లెక్క పెట్టుకుంటున్నాడు. కాని యువతి దిగుులగా ఉంది. నాకు చాలా వింతగా అనిపించింది. ఈమెలో యీ మార్పుకి కారణం?
విధవ కళ్లు తెరిచి "ఏ స్టేషనూ వచ్చేదీ"
యీసారి శాస్త్రులు అన్నాడు "బిక్కవోలు"
"ఊహూఁ- చోడారం రాగానే చెప్పు నాయనా" మళ్ళీ పడుకుంది విధవ.
"ఇక్కడెక్కడ చోడారం. శానారాత్రి పడుద్ది" అన్నాడు చుట్ట ఆసామి.
బిక్కవోలు స్టేషను వచ్చింది. రైలు ఆగింది. యువతి చప్పున కన్నీళ్ళు తుడుచుకుని చేతిసంచీ పుచ్చుకొని లేచింది. గ్లాస్కో చొక్కా మెల్లగా "ఏమంటావ్ నేను కూడా దిగనా!" అన్నాడు.
యువతి తీవ్రంగా చూసింది. కళ్ళల్లో అసహ్యం, బాధ సూదుల్లా గుచ్చుకున్నాయి. నిరసనగా తలపంకించి గబగబా దిగి వెళ్ళిపోయింది. గ్లాస్కో లాల్చీవాడు ఎర్ర గాయాల్లాంటి రెండు పెదవుల్నీ ఆవులించి తెల్లబోయి చూశాడు.
మళ్ళీ రైలు కదిలింది. చీకట్లో చూసుకుంటూ వెళ్ళిపోతోంది. నేను పేపరు చదువుకుంటున్నాను. రైలు చప్పుడు అదేపనిగా వినడం వలన మనసులో ఒక స్వభావంలాగ అయిపోయింది. ఇంతకీ ఏమీలేదు....... సంగతి చెబుతున్నాను.
(1961)
**************



