Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"మీరేనా - నీవేనా"
మా ఫాదరు నాకెప్పుడు సంబంధం చూసినా ఏదో పల్లెటూరి పిల్లనే చూసేవాడు. నవనాగరికత అంతా నెత్తిమీద పెట్టుకొన్న నాకు నచ్చుతారా ఆ పల్లెటూరిపిల్లలు. ఎదురుకుండా సానివచ్చి నాట్యమాడుతున్నా, ఎల్లామెలగాలో తెలియక, రుద్రాక్షమాల త్రిప్పుకుంటూ జపంచేసే రకం వాళ్ళలో మానాన్న ఒకడు అంటే విలేజిబ్రూట్ అన్నమాట. ఎట్లా అయితేం, "విశాఖపట్నంలో ఒకపిల్ల ఉన్నదట...... నవనాగరికత అంతా ఆమెలోనే మూర్తీభవించిందిట....... నచ్చుతుందేమో చూసుకో" అన్నాడు మానాన్న. తరువాత రోజునే బయల్దేర నిశ్చయించుకొన్నా.
మరునాడుదయాన్నే కాఫీ దేవాలయంలోకి వెళ్ళి, పూజారి అయ్యరుగార్కి ఒక కొబ్బరికాయ (డబ్బు) యిచ్చి కాఫీ దేవుడికి ఒక్క నమస్కారం వదలి (అంటే త్రాగి) ఇంటికివచ్చా. ఇంతట్లోకి జట్కావాలా తయారు గుమ్మంలో. మెల్లగా డ్రస్సు వేసుకుని జట్కాలో ఎక్కాను. "వెళ్ళేదా, క్రొత్తగా మామగారింటికి. పిల్ల ఎలావుంటుంది. నే నెల్లా మెలగాలి" అనే భావతరంగాలు నాలో పొర్లిపోతున్నాయి. ఇంతట్లోకి స్టేషను చేరుకున్నా, జట్కాలోంచి క్రిందికి దిగాను.
ఎదురుకుండా...... దివ్యసుందర విగ్రహం..... ఆ నల్లని కురులు..... పద్మపత్రాలవంటి నేత్రాలు..... ఆ కులుకు, తళుకు, బెళుకు....... ఏంచెప్పను పుష్పబాణాలు వేసేస్తున్నాడు మన్మధుడు. ఈ రైల్వే ప్లాటుఫారంమీద, అటువంటి అప్ టుడేటు ఫేషనుపిల్లని నిలబెట్టి నన్నిలా యేడ్పిస్తాడా.... ఆ బ్రహ్మదేవుడు. అందుకే "గాడ్ ఈజ్ నాట్ పూజబుల్" అన్నారు పెద్దలు. ఆ పిల్ల దగ్గరనే తండ్రికాబోలు ఉన్నాడు. ఇంతలోకి రైలువచ్చింది. నేను కూడా వాళ్ళెక్కిన పెట్టెలోనే యెక్కాను. వాళ్ళదగ్గర మనం కొద్దిగా చూపెట్టాలికదండీ అతితెలివి. చదివేది లేకపోయినా, అణాపెట్టి "హిందూ" కొని, నోట్లో సిగరెట్ పెట్టుకొని కూర్చున్నా. నా డబాయింపుచూసి డంగయాడో, యేమిటో ఆ పిల్లతండ్రి "ఏమండోయ్" అన్నాడు.
ఈ కాలాన్ని అనుసరించి, చదువులో నిమగ్నుడయినట్లు మాట్లాడలేదు "మిమ్మల్నే, ఏం చదువుతున్నారు" అన్నాడాయన.
"బి.ఏ" అన్నాను కాకపోయినా.
"మీకు వివాహమయిందా?" అన్నాడా పిల్లతండ్రి.
సరియైన త్రోవలోకే వచ్చాడురా అనుకొని, ఎక్కడలేని సంతసం తెచ్చుకొని మొహం చేటంతయేట్టు చేసుకొని "ఇంతవరకూ లేదండీ. విశాఖపట్నంలో ఏదో సంబంధం మా ఫాదరు చూశాడు. ఆ పిల్ల మాకు నచ్చలేదు. ఐనా వాళ్ళొక యంబ్రహ్మలు. పిల్లనిచూస్తే మహ అసహ్యం....." అంటూ ఆయన ప్రక్కనున్న పిల్లని చూస్తూ ఏదో, నాకు తెలియకుండానే వాగేశాను.
"అల్లాగా! చూశారూ! ఈ పిల్ల మాపిల్ల. ఇంతవరకూ పెళ్ళవలేదు. ఎవరో చేనులుగారట..... చూసుకెళ్ళారు. ఆయనొక చేదస్తపు బ్రాహ్మణుడు. ఆయన కొడుకూ, ఏదో నాల్గు శాస్త్రాలు నేర్చుకున్నాడట. అటువంటి పూర్వపువాళ్ళ కివ్వటానికి...... ఏదో మీవంటి......." అంటూ ఆయన Lecture కొట్టడం మొదలెట్టాడు.
"మా ఫాదరు పేరు చేనులే. పోనీ, నేనేమో అనుకుంటే, నాకు శాస్త్రాలురావే. అమ్మయ్య" అనుకుని "మీదేవూరు" అన్నాను.
"విశాఖపట్నం" అన్నాడాయన. "మీ రెక్కడికి" అని తిరిగి ప్రశ్నించాడాయన.
"నేనూ అక్కడికేనండీ. మా ఫాదరు చూసిన సంబంధం నచ్చకపోయినా....... ఒక్కమారు చూద్దామని వెళుతున్నా"నన్నాను
ఈ విధంగా ఆయన తన కూతురికి వచ్చిన సంబంధాల నన్నింటినీ ఏమీ బాగాలేవంటూ మొదలెట్టాడు. నేను విశాఖపట్నంలో చూసిన సంబంధం ఏడ్చి మంచినీళ్ళు త్రాగినట్టుందనీ అన్నాను. ఇంతలోకి రైలు విశాఖపట్నం జేరింది.
ఇక రైలునుంచి దిగాలి. ఆ పిల్లని చూసేందుకు మళ్లా వీలుండదు. అబ్బ! ఏంచెయ్యను. వాళ్ళూ దిగారు. నేను మెల్లగా వాళ్ళకి వందనంచేసి ఒక జట్కాని కేకేసి "రిటైర్డు తహశీల్దారుగారింటికి" తీసుకెళ్ళమన్నాను. ఆయన చూడబోయే మామగారులెండి. జట్కావాలా ఆయనింటిదగ్గర దింపాడు. లోపలినుంచి ఆయన భార్య కాబోలు వచ్చి నా సంగతి సందర్భాలు తెలుసుకొంది. "అల్లుడొచ్చాడు పిల్లని చూసేందుకని" అందరితోటి చెప్పేసింది. తహశీల్ దారుగారి భార్య ఉప్మా, కాఫీ తీసుకొచ్చి నా ముందర పెడ్తూ "ఏమోయ్! పిల్ల, తండ్రీ కలిసి వూరు వెళ్ళారు. ఈ బండిలోనే వస్తారు కూర్చో" అన్నది. ఇంతట్లోకి వీధిలోంచి "బాబుగారొచ్చారండీ" అన్నాడు సేవకుడు.
"ఏమండోయ్! పిల్లేదీ! అల్లుడొచ్చా" డంటూ సంగతి మనవి చెయ్యటానికి వెళ్ళిందావిడ.
నారాయణ, తీరాచూస్తే, రైలులో కనబడిన ఆ పిల్ల, ఆయనే. అంతకుముందే, మా నాన్న చూసిన సంబంధం బాగూలేదు. వాళ్ళు వట్టి ఫూల్స్ అని అన్నాను. పూర్తిగా డంగైపోయా. "మీరేనా" అన్నా. అప్రయత్నంగా "నీవేనా" అన్నాడాయన మొహం వేలవేసుకొని. అంతకుముందే రైలులో ఆక్షేపించాకూడాను. ఆయన మాత్రం ఆక్షేపించలేదూ. నా మొహంలో నెత్తురుచుక్క లేకుండాపోయింది. అందుకే బాబూ యక్షుడు ధర్మరాజుని దానాలలోకి గొప్పదేమిటంటే నిదానమన్నాడు ధర్మరాజు. బాబూ! సెలవు- "నిదానం" మరిచిపోనులెండి.
(మాధురి సంపుటి 1 సంచిక 12 ఏప్రియల్, 1935)
************
THE END


