Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "ఏం?"

    "వాడి ఖర్మ"

    రైలు కూత వేసింది. శవందగ్గర సెలవు అడిగినట్టు వడగాలి కొంచెం తగ్గింది. రైలు కదిలింది.
 
    "సచ్చినాడు సల్లగా ఉన్నాడు. ఉంగ్రాల జుట్టుంటే మావోడేమో అని హడలి పోయాను. మావోడు ఈడెక్కడో కూలిపనికనొచ్చాడు" అంది ఒక పడుచు రొప్పుతూ.

    "నీవోడు కాదా?" ఒక పేరయ్య.

    "అబ్బే, ఆడెవడో..... యెర్రిముండాకొడుకు"

    "పాపం" అన్నాడు పేరయ్య ఆశాభంగంతో. 

    బెంగాలీతో విద్యార్ధులు ఉద్రేకంగా చర్చిస్తున్నారు.

    "ఆత్మహత్యేనంటారా?" అన్నాడొక విద్యార్ధి.

    "ఇన్ టెన్షన్ తో చచ్చిపోతే ఆత్మహత్యే. లేనిదే యాక్సిడెంట్" బెంగాలీ.

    "రైలు గుండెలమీదనుండి పోయింది" మరొకడు.

    "జఠరికలు పూర్తిగా నలిగిపోయాయి"

    "ప్లీహం పిప్పి అయిపోయింది" వీళ్ళిద్దరూ ఫిజియాలజీ యింకా మరచిపోని విద్యార్ధులు.

    "కలకత్తాలో ఆత్మహత్యలు ఎక్కువ" -సగర్వంగా అన్నాడు బెంగాలీ కలకత్తా ప్రాముఖ్యత కదే కారణమన్నట్లు.

    "ఎందుకు చచ్చిపోయాడంటారు?" జిజ్ఞాసుడైన ఒకాయన బెంగాలీని ప్రశ్నించాడు.

    "ఆఁ ఆయుర్దాయం మూడింది. చచ్చాడు. ఏం వుందీ" అన్నాడు చుట్ట ఆసామీ.

    "నిరాశావాదం ఎక్కువయింది దేశంలో. విదేశ నాగరికత దీనికి కారణం" అన్నాడు బెంగాలీ.

    "జపాన్ దేశంలో హరకిరి చేసికొని రోజుకి కొన్నివందల మంది సుఖంగా, ధైర్యంగా చచ్చిపోతారుట" ఒక మిడిల్ స్కూలు మేష్టారు.

    "ప్రతీ సంఘటనకీ స్త్రీ పురుష సంబంధం ఉంటుందని అన్నాడు ఫ్రాయిడ్, ఎవతో మోసగించివుంటుంది. తట్టుకోలేక చచ్చిపోయాడు" అన్నాడు బెంగాలీ.

    "విఫల ప్రేమ అయివుంటుంది" అన్నాడు రొమాంటిక్ వూహలున్న పిక్కల విద్యార్ధి.

    విధవ మళ్ళీ సగం కళ్లు తెరచి అంది.  "ఈ ప్రాణం ఎంతసేపమ్మా- బుద్బుదప్రాయం. అయినా రైలుకిందపడి ఎవణ్ని ఉద్దరించనూ."

    గ్లాస్కో చొక్కావాడు యువతికేసి చూసి ఆశ్చర్యపోతున్నాడు. యువతి పెదాలు వణుకుతున్నాయి. బలవంతంగా ఏడుపు నాపుతున్నట్లుంది.

    "అట్లాగున్నావేం -ఒంట్లో బాగోలేదా?" అన్నాడు గ్లాస్కో చొక్కా. యువతి తలూపింది. నే నామెను పరీక్షగా చూడడం చూసి తలదింపేసింది.

    ఆంగ్లో ఇండియన్ యువతి బొమ్మల పత్రిక చదువుతోంది తలపైకెత్తి  "హూ యీజ్ది డెడ్ మాన్?" అంది మొత్తం పెట్టెలోని అందర్నీ ప్రశ్నిస్తూ.

    రైలు స్టేషన్ లో ఆగింది. ఆంగ్లో ఇండియన్ యువతి "కూలీ కూలీ" అని పిలుస్తోంది. ఎవ్వరూ రాలేదు. పిక్కల విద్యార్ధి లేచి.  "మే ఐ హెల్ప్ యు మేడమ్" అంటూ ఆమె సూట్ కేస్ సవినయంగా ఆమెకు అందించాడు. ఇంతలో, ఆమెని ఆహ్వానించే ఇంకొక స్వజాతి యువకునితో కరచాలనం చేస్తూ చేత్తో సూటుకేసూ, సంచీ పుచ్చుకుని కృతజ్ఞత అయినా చెప్పకుండా ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే పిక్కలవైపు వెర్రిగా విరహంగా చూసి విద్యార్ధి వెనక్కి తిరిగాడు.

    బొత్తాలులేని లాల్చీ, ముక్కునుంచి జారిపడిపోతుందేమో అన్న కళ్ళజోడుతో ఒక సన్నని, ఎర్రని మనిషి పెట్టెలోకి వచ్చాడు. జుట్టు చెంపలదగ్గర నెరసింది. గాడుపులో తిరిగినట్టు మొహం వడలిపోయింది.

    "నమస్కారం. మీలో ఎవరైనా శవాన్ని దగ్గిరనుండి చూశారా?" అన్నాడు పెద్దగా.

    "మేం మేం" అన్నారు విద్యార్ధులు హుషారుగా.

    లాల్చీ ఆయన చిరునవ్వు నవ్వాడు. చెవిలో పెన్సిలు తీసి అరచేతితో కొట్టుతూ "దయచేసి వివరాలు - శవాన్ని గురించి రూపం, రంగూ, చూసినవీ, విన్నవీ తెలియచేస్తారా?" అన్నాడు.

    "మీ రెవరు?"

    "నేను పత్రికా విలేఖరిని."

    "అక్కడికిపోయి చూసుకోవయ్యా" అన్నారు విద్యార్ధులు. "చూడండి బాబూ మా గ్రామానికి పది సంవత్సరాలనుండీ నేనే విలేఖర్ని. నెలకి పదిహేను రూపాయలు పంపిస్తారు. ఇప్పటికి రెండేళ్ళనుండీ, యీ ప్రాంతాలనుండి ఒక వార్త పంపలేకపోయాను. యీ పోస్టు రద్దుచేస్తామంటున్నారు"

    "మరి యీ గ్రామానికి విలేఖరి ఏమిటయ్యా!"

    "ఇదివరలో ఇక్కడ రెండుమూడు కాంగ్రెసువాళ్ళు ఆశ్రమాలు, ఖాదీ ఉత్పత్తి కేంద్రం అన్నీ ఉండేవి. ఎవరో నాయకులు వస్తూండేవారు. అందుకోసం నన్ను నియమించారు. ఇప్పుడా సంపదలు లేవు. పైగా వూళ్ళో రెండు పార్టీలు . ప్రతిగొడవా ఏదో ఒక పార్టీకి చెంది ఉంటుంది. వీళ్ళ వార్త పంపితే అవతలవాళ్ళకి కోపంవచ్చి తంతామంటున్నారు. ఇన్నాళ్ళకి ఈ నాన్ పార్టీ వార్త తగిలింది. బాబ్బాబు, అంతదూరం పోలేను. గార్డు నడిగితే చెప్పడం లేదు. దయయుంచి....." కళ్ళజోడు పైకి తీశాడు విలేఖరి. విద్యార్ధులూ, ఇంకా చూసినవాళ్ళూ ఏవేవో చెప్పారు. కదలబోతూన్న రైలులోంచి దుమికి కంగారుగా వెళ్ళిపోయాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.