Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    ఆంగ్లో యిండియన్ యువతి గబుక్కునలేచి కీచుగా ఇంగ్లీషులో అడిగింది. ఎవరినుద్దేశించో తెలియదు."చాక్లెట్స్ ఎవైలబుల్ హియర్!"

    ఆమె పిక్కలకేసి చూస్తున్న విద్యార్ధి ముందుకు గంతువేసి  "వాట్ మేడమ్?" అన్నాడు.

    మరొక విద్యార్ధి శుభ్రమైన తెలుగులో "దీన్ని తగలెయ్యా, పెట్టెడు చాక్లెట్లూ తినేసి ఇంకా కవాలంటోంది. దీనిది కడుపా ఖండవిల్లి మడుగా" అన్నాడు.

    పిక్కల విద్యార్ధి సవినయ సవిషాదంగా "ఇక్కడ దొరుకవండి" అన్నాడు. అతడు గబుక్కున అలా అంటూ యేడుస్తున్నాడేమో అని నాకు భయంవేసింది.

    గార్డు విజిల్ ఊదాడు. రైలు కదిలింది. వర్తకుడువచ్చి యథాస్థానంలో కూర్చున్నాడు. పిచ్చివాడు వాగుతున్నాడు.  "నా పెళ్ళాం సాయేబుతో లేచిపోయింది. నాకొడుకు పారిపోయాడు. హహ్హహ్హ యెందుకో చెప్పుకోండి. మొదటి బహుమతి లక్ష రూపాయలు. రెండవ బహుమతి పది లక్షలు....."

    "ఏమయ్యోయ్ సెట్టీ రేపు వైశాఖలో నీ తండ్రి తద్దినం -మరచిపోకూడదు. ఆరోజుకి నేను వస్తాను" అన్నాడు శాస్త్రులు. "ఓరి తద్దినం తగలడా. అప్పుడే ఏడాది తిరిగిపోయిందా?" వర్తకుడు కాలవేగానికి ఆశ్చర్యపోతున్నాడు.

    బెంగాలీవాడు అంటున్నాడు "మా మిడ్నపూర్ లో ప్రతివాడూ విప్లవవాది. ప్రతివాడూ కొన్ని వందల బాంబులు తయారు చేశాడు. చంపేందుకు ఇంగ్లీషువాడు కనపడకపోతే వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళ నొకళ్ళు చంపేసుకున్నారు."

    "మహా వీరులండి" అన్నాడొక విద్యార్ధి.

    గ్లాస్కో చొక్కావాడు ముందుకువంగి "రాత్రికి రానా" అంటున్నాడు. యువతి కళ్ళు కుంచించి చిత్రంగా కొంటెగా చూచి చిన్న నవ్వు నవ్వి మొహం పక్కకు తిప్పింది.

    నేను పేపర్లో చదువుతున్నాను. "ఇండియాలో మనిషి సగటు ఆదాయం చాలా తక్కువ. అమెరికాతో బ్రిటన్ తో పోలిస్తే వీళ్ళు ఏం తిని బ్రతుకుతున్నారా అనిపిస్తుంది. ఇక్కడ సగటు జీవిత పరిమాణం యిరవై మూడు ఏళ్ళు......."

    మెయిలు వేగం హెచ్చింది. చిన్న చిన్న స్టేషన్లని ఖాతరుచెయ్యకుండా రైలు వెళ్ళిపోతోంది. వడగాలికి రైల్లో వాళ్ళ మొహాలన్నీ మాడినట్టుగా కనిపిస్తున్నాయి. శాస్త్రులు సంచిలోంచి మామిడిపండు తీసి తింటున్నాడు. విధవ మళ్లీ కళ్ళు తెరిచి  "స్టేషనొచ్చిందా నాయనా?" అంది. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. వెలుగు తగ్గిపోతోంది. మసకగా చీకటి కమ్ముకుంటోంది.
 
    హఠాత్తుగా రైలు ఆగింది. కారణం ఏమిటా అని అందరూ కిటికీలలోంచి తొంగి చూశారు. గార్డు కంగారుగా ముందుకి వెడుతున్నాడు. జనం గుంపులుగా వెనకాలే వెళుతున్నారు. రైలు ముందు పెట్టెలవైపు కలకలం. ఏవో మాటలు ఆశ్చర్యార్ధకాలు, విహ్వలాక్రోశాలు. వర్తకుడు భయంతో పెట్టెతాళం లాగి చూసుకున్నాడు. ఎవరో కొందరు వెనక్కి వచ్చేస్తున్నారు.
 
    "ఏం జరిగింది? ఏం జరిగింది?" అన్నాడు బెంగాలీ.

    "న్యూసైడ్, న్యూసైడ్" -జనంలోంచి ఎవరో కేక.

    గబగబా కొందరు పెట్టెలోంచి దూకి యింజనువైపుకి పరుగెత్తారు. "రామ రామ"  "ఎవడో అభాగ్యుడు" వాంటి మాటలు. శాస్త్రులు 'ఆత్మహత్యే' అని భయంగా కిటికీలోంచి చూస్తున్నాడు. ఇటూ అటూ పంట చేలు, చెట్లు. దిగిన ఒక ప్రయాణీకుడు మా పెట్టెలోకి వచ్చాడు. వాడి వొళ్లు వణుకుతోంది. తడబడుతూ "ఘోరం కళ్ళు బైర్లు కమ్మాయి. రామ రామ" అని చతికిలబడ్డాడు.

    విధవ ముసుగు సవరించుకుంటూ సగం తెలిసీ, సగం మైకంలో అంది. "ఏం పోయ్యేకాలం? ఘోరకలి ఉన్నట్టుండి వాడికి ఎంత ధైర్యమో యీ అఘాయిత్యం చెయ్యడానికి."

    "కాలమే అంతలెండి బొత్తిగా దిగజారిపోయింది. ఎందుకు చెప్పండి, ఈ వెధవ ఆత్మహత్యలూ,
ఆత్మస్తుతులూన్నూ? తెగతిని ఏ పెళ్ళాంతోనో ముండతోనో దెబ్బలాడి ఉక్రోషంతో ఇలా చస్తారు" అన్నాడు శాస్త్రులు.

    వర్తకుడు అంటున్నాడు - "ఇటువంటివాళ్ళు చచ్చిపోవడమో, చంపడమో చేస్తారు శాస్త్రులూ. మా తమ్ముడి బామ్మరిదికి బాకీ ఉండి రొక్కించి అడిగాడని గొడ్డలి తీసుకొచ్చి చంపబోయాడు రౌడీ ఎదవ. తప్పిందికానీ ఈపాటికి పరలోకంలో ఉండేవాడు మా తమ్ముడి బామ్మరిది. అయితే మావాడు దద్దమ్మలా వూరుకున్నాడనుకునేవ్. అబ్బే కోర్టుల్లో దావా పడేసి, నిముషాలమీద జైల్లో పడేయించాడు. వాడు జైల్లో ఉన్నట్టుండి ఒక రోజున విషం తాగి చచ్చాడు. పీడా వదిలింది" యువతి మాత్రం ఏదో కంగారుగా బిక్కు బిక్కున చూస్తోంది. ఈ వార్త ఆమెను చాలా భయపెట్టినట్లుంది. అంతకుముందు విలాసాలు, ఒయ్యారాలు చిలికే ఆవిడ బిగుసుకుపోయింది. మొహంలో నెత్తురులేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాను. గ్లాస్కో చొక్కావాడేదో చెప్పబోతున్నాడు. ఆమె వినలేదు.

    "భయంగా ఉందా?" గ్లాస్కో చొక్కా ఉవాచ.

    "పాపం" -అందామె శూన్యంలోకి చూస్తూ.

    అందరూ పెట్టెలోకి తిరిగివచ్చారు. అందరూ కంగారుగా ఒకర్నిమించి మరొకరు మాట్లాడుతున్నారు గార్డు చాలా ప్రముఖంగా తల పంకిస్తూ పక్కనున్న కుతూహలపరులకి జవాబులు చెప్తూ వస్తున్నాడు.

    "ఏమయింది" అన్నాడు ఒకడు మరో పెట్టెలోంచి.

    "పోయాడు" ఒక గొంతు
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.