Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఏమీలేదు
రైలు జోరుగా వెడుతోంది -మెయిలు అవడంవల్ల. దూరంగా కొండలూ చెట్లూ అక్కడక్కడ గుడిసెలూ, భూమికి పైత్యం కలిగి గుండ్రంగా తిరుగుతున్నట్లున్నాయి. రైలు పెట్టెలో వేడిగాడ్పు -సాయంత్రం ఆరు గంటలయినా చీకాకుగా వీస్తోంది. ఇంజను నిట్టూర్పులలోని బొగ్గుమసి బట్టల్ని ఖరాబు చేస్తోంది. అసలా సాయంత్రమే ఎంతో కష్టంగా చైతన్యరహితంగా వుంది. సంధ్యవేళ దూరంగా కనపడీ, కనపడని కొండలు ముసుగులు కప్పుకుని రాత్రి సంచారానికి తయారౌతున్న దయ్యాలలాగ ఉన్నాయి. మూడవక్లాసు పెట్టె ఎప్పటిలాగే దేశసౌభాగ్యాన్ని ప్రతిఫలిస్తోంది. నా పక్కనే కూర్చున్న ఆసామీ కాండ్రించి చుట్టరసాన్ని ఉమ్మేస్తున్నాడు. అంగవస్త్రపు గుడ్డా, రాగి చెంబూ ఆభరణాలుగా గల ఒక శాస్త్రులుగారు పెట్టెలో మూలగా బిక్కమొహం పెట్టుకుని కూర్చున్నాడు - వర్ణాశ్రమ సంకరానికి బాధపడుతున్నాడేమో! ఒక వర్తకుడు ఆ చివరా, ఈ చివరా కాళీవున్నా, మధ్యగా కూర్చుని సీటు అంచుల్ని గట్టిగా పట్టుకున్నాడు. విసురుకి సీటుమీద నుంచి జారి రైలు లోంచి కిందికి పడిపోతానని భయం కాబోలు. చీటికీ మాటికీ పక్కనున్న ట్రంకుపెట్టెకేసి చూస్తున్నాడు. ఆ చూపులో ఏదో కొంచెం ప్రేమలాంటి అనురాగం ఉట్టిపడుతోంది! కాలేజీ విద్యార్ధులు సెలవులకి కాబోలు యిళ్ళకివెళ్ళే హడావుడిలో ఉన్నారు. ఇంకా రకరకాల మనుష్యులూ ముసుగున్న ఒక హీనరకం ఆంగ్లో ఇండియన్ యువతీ కూడా పెట్టెలో ఉన్నారు. కాలేజీ విద్యార్దులు కళ్ళజోడు పెట్టుకుని కూర్చున్న ఒక బెంగాలీతో కబుర్లు చెబుతున్నారు.
ఒక పిచ్చివాడు రైలువేగాన్నీ చప్పుడునీ మించేటట్టుగా కంఠమెత్తి పాడుతున్నాడు - త్యాగరాజ కృతికీ, సినిమా పాటకీ, చాలా అసందర్భంగా వివాహం చేయించేశాడు. అందరూ నవ్వుతున్నారు. నేను మధ్య మధ్య దినపత్రికనీ, నా పక్క కాస్త దూరంలో కూర్చున్న యువతినీ చూస్తున్నాను. పత్రికలోకన్నా యీవిడలో నాకు వార్త లెక్కువ కనిపిస్తున్నట్లు అనుమానం వేసింది. ఆవిడ తనకెదురుగా కూర్చున్న ఒక గ్లాస్కో చొక్కాకేసి చూసి అర్ధవంతంగా నవ్వుతోంది. చీటికీ మాటికీ చెయ్యెత్తి సిగలో పువ్వులు సర్దుకుంటోంది. జెరదా కిల్లీ వేసిన గ్లాస్కో చొక్కా వాడి నల్లని మొహంలో ఎర్రని పెదవులు నెత్తురుబికిన గాయంలా ఉన్నాయి. అతని జేబులో జేబుకన్నా పెద్దదయిన పర్సూ, ఒక సిల్కు రుమాలూ ఉన్నాయి. తలకి రాసిన అత్తరు కొంచెం చెంపలమీదికి స్రవిస్తోంది. చిన్నప్పట్నుంచీ సరసం తెలిసిన మెరకవీధి రసజ్ఞుడిలా ఉన్నాడు. కాస్సేపటికి అన్నాడు యువతితో "ఏవూరు?" అని.
యువతి యిటూ, అటూ చూసి "బిక్కవోలు" అంది. సరసుడు మెల్లగా "యింకేం" అన్నాడు. యువతి ఫక్కున నవ్వింది. అకారణంగా పైట సవరించుకుంది.
పిచ్చివాడు గట్టిగా, పిచ్చిగా మాట్లాడుతున్నాడు. "నాకు మాటలు రావు. మాటలు తిరగబడిపోతున్నై. నాకు ఆకలి. నేను మాటల్ని తినేస్తున్నాను."
శాస్త్రులు కళ్ళుమూసుకుని పాడుకుంటున్నాడు. "నహి నహి రక్షతిడుకృఞ్ కరణే భజగోవిందం భజగోవిందం మూఢమతే....." "పసుపుధర ఎలా వుంది శాస్త్రులూ మీ వూళ్ళో?" అంటున్నాడు వర్తకుడు. బెంగాలీ వాడు చచ్చు ఇంగ్లీషులో విద్యార్ధులతో ఏవో గొప్పలు చెపుతున్నాడు. ఒక్క విద్యార్ధిమాత్రం చాకలెట్లు ఒకటి తర్వాత ఒకటి తింటూ కిటికీలోంచి అవతలకి చూస్తున్న ఆంగ్లో ఇండియన్ యువతి గుండ్రని పిక్కలవేపే చూస్తున్నాడు.
పిచ్చివాడు తన పిరుదులమీద చేత్తో తాళంవేస్తూ పాడుతున్నాడు.
"ఎంతగతి పట్టెరా నీకు రామచంద్రా
ఎంతమతి పోయెరా నీకు రామచంద్రా"
"అయ్యో నా పేరు రామచంద్రమూర్తి. నాకు పిచ్చని మావాళ్ళందరూ అన్నారు. పిచ్చివెధవ ఎవడేనా యింత గొప్పగా పాడతాడా సవాల్" అంటూ తొడ చరిచాడు.
"ఈసారి ఎన్నికలలో కాంగిరేసు నెగ్గుద్దా?" చుట్ట ఆసామీ అంటున్నాడు.
"యాడు నెగ్గితే ఎంలే, మనూరికి మాత్రం ఒంతెన పడదు" మరొహడు.
"నా వోటు మాత్రం ఎవడు నెగ్గితే వాడికే" అన్నాడు వర్తకుడు పెట్టెతాలం లాగి చూసుకుని.
"నీ కెలా తెలుస్తదీ యాడు నెగ్గేది?" చుట్ట ఆసామీ ప్రశ్న.
"నెగ్గింతర్వాతే నేను నావోటు వేస్తాను. లేందే వెయ్యనేవెయ్యను"
ఇద్దరు ముగ్గురు పగలబడి నవ్వారు. ఈసారి విశ్వస్త అవగుంఠనం కాస్త సరిచేసుకుని "స్టేషను వచ్చిందా నాయనా?" అంది కళ్ళు మూసుకునే.
"ఏ స్టేషనండీ?" అన్నాడు విద్యార్ధి.
విశ్వస్త సమాధానం చెప్పలేదు. మళ్ళీ చటుక్కున సమాధిలోకి వెళ్ళిపోయింది.
ఏదో స్టేషన్ వచ్చింది. చుట్టా, బీడీ, సోడా -కేకలు, విద్యార్ధులు రైలు దిగి ప్లాట్ ఫారం మీద అటూ ఇటూ తిరుగుతున్నారు. కొత్తవాళ్లెవరూ ఈ పెట్టెలో ఎక్కలేదు. గ్లాస్కో చొక్కావాడు రెండు డ్రింకులు కొన్నాడు. ఒక డ్రింకు యువతికి అందించాడు. ఆమె ఆశగా డ్రింకుకేసి చూస్తూ "వద్దండీ" అంది.
"తీసుకో చల్లగా ఉంటుంది. గాడుపుదెబ్బ కూడా" ఎంతో ఆప్యాయంగా గ్లాస్కోవాడు అన్నాడు. ఆమె తీసుకుంది. వర్తకుడు లేచి శాస్త్రులుతో, "పెట్టె సూత్తూవుండు శాస్త్రులూ ఇప్పుడేవస్తా" అన్నాడు.
"ఎక్కడికీ?" శాస్త్రులు.
"ఒంటేలుకి" -వర్తకుడు.



