Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఓ మనస్తత్వ శాస్త్రవేత్త రిపోర్టు -
"హృదయాలలో శూన్యం ఎక్కువైనకొలదీ థియేటర్లు నిండిపోతాయి. అందుకోసం థియేటర్ యజమానులకు నా సలహా ఏమిటంటే ధనికవాదాన్నే ఎప్పుడూ బలపరచండి."
ఒక అల్ట్రా -మోడరన్ కవీంద్రుడు -
"నియోన్ లైట్లకింద పేరుకున్న చీకట్లో పట్టణ కన్య పరాభవం. అర్ధమయిందా సోదరా యీ చిత్రం!"
సరికొత్త మోడల్ కారులో వెనుకసీటులో కూర్చున్న భర్త భార్యతో -
"నీ మెడలో నెక్లెస్ ఎలా మెరుస్తోందో."
(భార్య) "బ్లాక్ మార్కెట్ సంపాదన రాత్రుళ్ళే మెరుస్తుందిటగా?"
కృష్ణా బ్యారేజి మీద నుంచున్న ఓ కృష్ణమూర్తి స్వగతం -
"ఇక్కడ నుంచి దుమికితే చచ్చిపోతానని గ్యారంటీ వుందా? నేను దూకి చావనా లేకపోతే నా అప్పులవాణ్ని ఇక్కడకు తీసుకొచ్చి తోసెయ్యనా? ఏది కర్తవ్యం?"
విదేశాలనుండి కొత్తగా తిరిగి వచ్చిన ఒక ఆఫీసరు -
"స్కౌండ్రల్. దూరంగా ఉండు. మరీ మీదకు వస్తున్నాడు చూడండి ముష్టి వెధవ. అబ్బ కంపు, మాసినబట్టలూ, ఒళ్ళంతా దుమ్మూ వీడూ.... పోనీ ఇస్త్రీ చేసిన శుభ్రమైన చొక్కా, పాంటూ తొడుక్కుని అడుక్కోకూడదూ.... బ్లడీ బెగ్గర్, సభ్యత తెలియని దేశం"
ఒక వేశ్యం మరొకతెతో -
"చూడవే ఆ ప్లీడరుగారు మన్ని చూసి మొహం చిట్లించుకుని ఎలా వెళ్ళుతున్నాడో -వొట్టి నీతివాసన కొడుతూ! మొగుడు పోగానే చెల్లెల్ని చేరదీసి ఆస్తి అంతా కాజేసి తగిలేశాడు పెద్దమనిషి!"
ఒక అరవై యేళ్ళ వృద్ధనారి సగర్వంగా చూడవచ్చిన చుట్టంతో -
"నాకు పదముగ్గురు సంతానం నాయనా! ఆరుగురు మగపిల్లలు అందరూ అనేవారు నువ్వెంత అదృష్టం చేసుకున్నావే అని. మా ఆయన గుమాస్తా పనిచేసి రిటైరయారు. మా పెద్దబ్బాయి కోర్టులో గుమాస్తా. రెండోవాడు మున్సిపల్ ఆఫీసులో గుమాస్తా. మూడోవాడు కో-ఆపరేటివ్ సొసైటిలో గుమాస్తా. నాలుగోవాడు బియ్యం మిల్లులో గుమాస్తా, అయిదోవాడు ఎక్సయిజ్ ఆఫీసులో గుమాస్తా, ఆరోవాడు కిరాణాకొట్టులో గుమాస్తా, అందరూ అరవై డెబ్బై కరకులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళకీ తామర తంపరలా పిల్లా జెల్లా... ఇంక పెద్దమ్మాయి మొగుడు రైల్వేలో గుమాస్తా, రెండో అల్లుడు..... (చుట్టం చెవులు మూసుకొన్నట్టు ఆవిడకు తెలియదు)
వివిధ శబ్దాలు -
సోడా సోడా...'కాయ్ రాజా కాయ్ చూస్తే లేదు కాస్తే వుంది..... అర్జంటుగా యివ్వండి కొంచెం సైనేడ్..... మీ కొట్లో కాంట్రాసెప్టివ్ లు దొరుకుతాయాండీ.... యన్.టి.రామారావు ఎంత బాగున్నాడే శ్రీకృష్ణుడి లాగ... ఏయ్ బుద్దిలేదూ లారీకిందపడి చావాలని ఉందా? హలో హలో స్టాక్ ఎక్స్చేంజీకి.... షేర్లు ఎలా ఉన్నాయి?..... వంతెనకింద ఎవర్నో పొడిచి చంపారట ఘోరం..... ఢిల్లి ఎక్స్ ప్రెస్ రెండుగంటలు లేటు....... సోజా రాజకుమారీ సోజా......
భరత వాక్యం. -
రాత్రి 9 గంటలకు రమ్మంటుంది పట్టణం. రంగు వేసుకున్న మొహం రాకాసివంటి అహం మిరుమిట్లు కొలిపే నవ్వుతో మెత్తగా కౌగలిస్తుంది నిన్ను.
అభిరుచీ వ్యక్తిత్వం చచ్చి అమాంతం మూస్తావు కన్ను.
(ఆంధ్రప్రభ వీక్లీ 1961)
************************



