Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
రాత్రి 9 గంటలకు
(ఒక పట్టణంలో మనుష్యుల మనస్సుల ఊహల మాటల కోలాహల హాలాహలం)
ఒక సందులో ఒక చిన్న ఇంట్లోంచి - "అమ్మా భయం వేస్తోంది. ఈ రోగం యింక తగ్గదే. అమ్మా కావిలించుకోవే చచ్చిపోకుండా. బాబోయ్ డాక్టరు దున్నపోతు ఎక్కివస్తున్నాడు. స్టెతస్కోపు పాశంలా విసురుతున్నాడమ్మా."
ఒక రోడ్డు మొగని ఆదునిక కవి.
"గంటల కారు చప్పుడు పక్క ఊరు అంటుకుందని విన్నప్పుడు అరెరె పాపం! అరెరె ఏమిటీ ఉపద్రవం! టాక్సీ చేయించుకువెళ్లి చూసి వద్దామా భాయి? ఆ జ్వాలా మహోత్సవాన్ని. చూస్తే వండ్రఫుల్ వచన పద్యం ఒకటి వస్తుంది. హుతాశన గృహ గృహ కర్పూర భస్మం నా పద్యం...."
ఒక యింటి అరుగుమీదనుంచి లోపల వంటింట్లోకి కేక -
"ఒసేవ్, నాకు కందిపచ్చడి అంటే యిష్టం."
ఒక రసపిపాసువు మరొకడితో -
"బలే బలే! పద్మిని ఎంత మజాగా వుందిరా జిస్ జిస్ .... ఏమిటో దాని పేరు..... జలాంతర క్రీడా సమయ బహిర్గతజంఝాది సురమ్యా పద్మినీ పద్మినీ.... పిక్చరు ఏదో దొంగల్ని గురించిట! అయినా వెధవ కథా కమామీషు ఎవడిక్కావాలి?"
పక్కనున్న పాతిక వోల్టు విద్యుద్దీపకాంతిని కమ్మేస్తూ ఒక షావుకారు దోవనపోయ్యే చలమయ్యతో -
"రేపు మా బామ్మర్ది చెల్లెలు కొడుకు పెళ్ళి, గొప్ప విట్టేశాను. అంటే మా అబ్బిగాడిదే. కట్నం పందొమ్మిదివేల ఎనభై ఒక్క రూపాయి నాలుగు పైసలు. పై రూపాయి నాలుగు పైసలూ బామ్మర్దికి సంభావన యిచ్చేస్తాను. ఏది శాశ్వతం లెద్దూ! అయినా ఆ మాత్రం దానం సెయ్యకపోతే బెడిసికొడుద్ది సెలమయ్యా."
ఆశావాది అయిన ఓ గుమాస్తా తన మిత్రుడితో -
"చస్తే రోల్సు రాయిస్ కిందపడి చావాలి. ప్రాణం ఎంత మెత్తగా హాయిగా పోతుంది. ఎంత గొప్ప! అబ్బ తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది."
ఒక క్లబ్బులోంచి -
"మూడు జోకర్లు కల్సినా డిక్ అవలేదు. బాడ్ లక్, ఇంకొక బ్రాందీ సోడా.... బోయ్!"
ఒక డాబా పిట్టగోడ నానుకు నించున్న ఒకావిడ పక్క డాబా మీదున్న మరో ఆవిడతో -
"ఏమోయ్, చంద్రుడెంత బాగున్నాడో ఆకాశంమీద, మన వీధి మొగని కిళ్ళీకొట్లో ఉన్న గిరజాల అబ్బాయిలాగ."
ఒక మధ్యతరగతి యింట్లోంచి -
"ఏమండీ నామాట వినండీ. సానికొంప కెళ్ళకండీ, మీ పాదాలట్టుకుంటాను. మీ పిల్లల్ని చూడండి. వీళ్ళగతేం కాను? అూ్ూ కొడతారేవండీ, పోనీ కొట్టండి, చంపండి. నా రక్తాన్ని మీ చేతులకు రాసుకుని మీ ప్రియురాలి పెదాలకు రాయండి. ఎర్రగా ఉంటాయి చప్పరించేందుకు హారి భగవంతుడా స్త్రీకి మొగుడువెధవే గతికదా....?"
ఓ రిక్షావాడు -
"సైడు సైడూ, తప్పుకోవయ్యా బాబూ, ఈ రిక్షా అంటే ఏంటనుకున్నావ్. అమానంలాగ ఎగుర్ది. దీనితస్సా మందూ గబుక్కున యాక్షన్ డౌనయిపోయిందిగాని, లేందే డబుల్ టూకీ రెండొందలు కొట్టి వుండేవాణ్ణి బాబయ్యా. రిక్షాలాగే యోగంవుంటే అంకె ఎందుకు తగుల్తది. దొంగనాయెదవ మార్కెట్టు!"
ఒక కాలేజీ విద్యార్ధిని స్నేహితురాలితో -
"అవిగో గుళ్ళో గంటలు కార్తీకమాసం వెన్నెల. దేవుడి ప్రసాదం పెడతారు రావే సుజాతా. (మెల్లగా) మన క్లాస్ మెట్ మురళీధరరావు.... అబ్బ వాడే పొడుగ్గా, ఎర్రగా టక్ అప్ చేసుకునీ.....ఆ మధ్య రిబ్బన్లు పంపాడూ... వాడూ. ప్రతిరోజూ వస్తాడే వాడికి మనలాగే ఎంతో భక్తి పాపం!"
ఒక కోతలరాయుడు -
"నాకు స్పోర్ట్సు అంటే చాలా ఇష్టమండీ. క్రికెట్, బేస్ బాల్ , పోలియో తెగ ఆడేసేవాణ్ని నా చిన్నప్పుడు."
ఒక లౌడ్ స్పీకరులోంచి -
"అఖిలాంధ్ర సాహితీ సమావేశం.... మంత్రిగారు అధ్యక్షులు -మున్సిపల్ ఛైర్మన్ గారు ప్రారంభకులు... చాంబర్ ఆఫ్ కామర్సు ఉపాధ్యక్షుల ఉపన్యాసం 'సాహిత్య వ్యాపారమూ లాభనష్టాల పరీక్ష..... ' మహాకవి 'శాతకర్ణి' 'తాజా రచన' కీర్తిపథంలో పరుగెత్తే స్తోత్రరథం నుండి రసవత్తర ఘట్టాల కావ్య పఠనం"
ఒక పాత్రికేయుడు తన గదిలో వ్రాసుకుంటూ -
"ఊరికి కరణమూ, భాషకి వ్యాకరణమూ ప్రబల శత్రువులు"
ఒక ఖైదీ -
"ఈ పాటికి వంతెన క్రింద ఓ చుక్కేసి మనోళ్ళతో మాంచి సరదాగా వుండేవాణ్ని. కొండమీద సెంద్రుడు గిర్రున తిరుగుతూండేవాడు రంగులరాటంలాగ! ఇప్పుడెదవ బ్రతుకు కటకటాల యెనక్కి తోసేసారు....... అయినా వూరికినే...... దేవుడి తోడు..... వూరికినే కొడవలితో ఇలా అన్నానో లేదో యెదవ అర్బకం ముండ అదేరా నా పెళ్ళాం - కళ్ళు తేలేసి టపీమని చచ్చిపోయింది. పీకతెగి పిట్టలా కొట్టుకుంది. ఏంటోగాని నా కప్పుడు మాత్రం శానా కట్టమనిపించిందిరా. ఆ యెర్రిబాగుల్ది యేపుగా సాపుగా ఉండేది పికిలిపిట్టలాగు. ఏమైతేనేం యిప్పుడిక్కడ జైల్లోపడి సత్తున్నా ఓ సుక్కైనా లేక....."



