Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


       
    మూర్తికి కోపం వచ్చింది రామచంద్రరావుమీద. అతనంత తాపీగా జవాబు చెప్పినందుకు కాదు, అతని పెదాల మీద నిశ్చలంగా నిలిచిన చిరునవ్వుని చూసి. ఏ ప్రేమ వైఫల్యానికి మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటారో, ఏకాంతంలో పడి ఏడ్చి ఏడ్చి కృశించిపోతారో ఇటువంటి దానికి హాయిగా నవ్వగలిగే యీ రామచంద్రరావులోని విశేషం ఏమిటి? ఇంత కులాసా, యింత ధీమా ఎక్కడవి అని విస్తుబోయాడు మూర్తి.

    సరళకి వివాహమైంది. పెళ్ళికి రామచంద్రరావు వెళ్ళాడు. వెళ్ళి నాలుగురోజులూ యిటు ఆడపెళ్ళివారితో, అటు మగపెళ్ళివారితో కలుపుగోలుతనంగా తిరిగాడు. అత్తింటికి వెళుతూన్న సరళతో  "నీ భర్త రూపసి, ఉత్తముడూ కూడా, నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. వచ్చే ఏడాదికి నువ్వు పాపాయి నెత్తుకొని రావాలి సుమా" అన్నాడు. అతని స్నేహ స్నిగ్ధ కంఠస్వరానికి సరళ హృదయం ఆర్ద్రమయింది. కృతజ్ఞతతో సిగ్గుతో "థాంక్స్" అంది.

    కాని రామచంద్రరావు మనసారా కోరిన అదృష్టం ఆమెను వరించలేదు. ఏడాదికే ఆమె విధవరాలై తిరిగివచ్చింది. రామచంద్రరావు చూడటానికి వెళ్ళాడు. ధైర్యం చెప్పాడు. అలాగే ప్రతిరోజూ వెళ్ళి ఎన్నో కబుర్లు కథలు చెప్పేవాడు. ఆమె దుఃఖంనుంచి కోలుకుంది. ఇంక ఇతని అవసరం తీరిందనుకున్న సరళ తండ్రి రామచంద్రరావుని చాటుగా పిలిచి 'నువ్వు రోజూ యిలా రావడం బావుండదు. లోకం ఏదైనా అనుకుంటుంది' అన్నాడు. రామచంద్రరావు నవ్వుతూ, 'మీరు చెప్పింది నిజమే ఇంక నేను రాను' అని వెళ్ళిపోయాడు. మళ్ళీ సరళ దగ్గరకు ఎప్పుడూ వెళ్ళలేదు. రామచంద్రరావు ఒక మూడు గదులవాటా తీసుకుని అద్దెకు ఉంటున్నాడు. ఒక గది వంటగదిగా ఉపయోగించుకుని స్వయంగా వండుకు తింటాడు. తొమ్మిదింటికల్లా స్నానంచేసి భోజనం చేసి తెల్లని దుస్తులు వేసుకుని ఆఫీసుకు బయలుదేరతాడు. దారిలో కిల్లీకొట్టు పోలయ్యనీ. ప్లీడరు రాఘవరావుగారినీ, వెంకయ్య మాష్టారినీ , పెరుగమ్ముకుని బతికే గోవిందమ్మనీ అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఆఫీసుకు వెళతాడు. ఆఫీసులో అందరూ అతని మిత్రులు. ఆఫీసరు కూడా రామచంద్రరావంటే దయగా అభిమానంగా ఉంటాడు.

    కాని రామచంద్రరావుని దురదృష్టమే వరించింది. ఆఫీసుకు రిట్రెంచిమెంటులో పైవాళ్ళు అతన్ని ఉద్యోగంనుండి తొలగించివేశారు. మూర్తి చాలా ఆందోళన చెందాడు. ఇకమీద రామచంద్రరావుకి గడిచే విధానంలేదు.  అయినా రామచంద్రరావు ఏమీ బెదిరిపోలేదు. పైగా మూర్తికి అతడు నవ్వుతూ ధైర్యం చెప్పాడు.

    ఉద్యోగం పోయిన రెండు రోజులకే రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళాడు. ఓ నెల్లాళ్ళపాటు అక్కడే ఉండి, అతని పాత పెంకుటి లోగిలి అమ్మివేసి, మూడువేల రూపాయలు చేత్తో పట్టుకొని తిరిగి వచ్చాడు. ఈసారి పాత మూడు గదుల పోర్షన్ వదిలేసి ఒక గది అద్దెకు తీసుకున్నాడు. ఒక టైపు మిషన్ కొని, 'ఇచ్చుట టైపు చేయబడును' అని బోర్డు కట్టాడు. ఈ మూడువేలూ ఎన్నాళ్ళు వస్తుంది? ఈ టైపువల్ల వచ్చే ఆదాయం ఏం సరిపోతుంది? నీ భవిష్యత్తు ఎలాగ? అని ఆతృత కనపరిచాడు మూర్తి.

    రామచంద్రరావు నవ్వాడు. "ఎవరి భవిష్యత్తు మాత్రం ఎవరు చెప్పగలరు మూర్తీ. మనం చేసుకున్న కట్టుదిట్టాలు నిజంగా రక్షిస్తాయా?" అన్నాడు.

    రామచంద్రరావు తన స్వగ్రామం వెళ్ళిన రోజులలో సరళ తండ్రి చనిపోయినట్టూ, ఇంటి యాజమాన్యమంతా సుకుమారమైన సరళమీద పడినట్టూ తెలుసుకున్నాడు. ఒకసారి సరళను చూసి వచ్చాడు.
 
    ఆరు నెలలు గడిచాయి. రామచంద్రరావుకి తీవ్రమైన జబ్బు చేసింది. పదిహేను రోజులైనా జ్వరం తగ్గుముఖం పట్టలేదు. మూర్తి భయపడ్డాడు. తిన్నగా సరళ యింటికి వెళ్ళాడు. రామచంద్రరావు పరిస్థితి వివరించి చెప్పాడు.

    "మీరు అతని బాధ్యత వహించాలి. ఒకనాడు మీరు అతన్ని మోసగించారు. కాని అతను ఏనాడూ మిమ్మల్ని నిందించలేదు. డబ్బుతో ఏమైనా కొనవచ్చుగాని అటువంటి అమృత హృదయాన్ని పొందలేము. మృత్యుముఖంలో ఉన్న అతన్ని కనికరించండి. లోకం ఏమనుకుంటుందో అనుకొని సంశయించకండి. ఒక్కడూ ఆ చిన్నగదిలో చీకటిలో బాధతో, వ్యాధితో చితికిపోతున్నాడు. వివేకంకన్న, హేతువుకన్న హృదయధర్మం గొప్పది. ఈ సత్యాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోరా" అని మూర్తి ప్రాధేయపడ్డాడు. అతను తలపైకెత్తి చూసేసరికి సరళ చెక్కిళ్ళు కన్నీళ్ళతో తడిసి ఉన్నాయ్.  "పదండి నేనూ మీతో వస్తున్నాను" అంటూ సరళ ఎలా ఉన్నది అలా బయలుదేరింది.

    రామచంద్రరావుని జాగ్రత్తగా సరళ ఇంటికి మార్చారు. పక్కగదిలో డాక్టరు 'ఇతను బతుకుతాడనే నమ్మకం లేద'ని చెప్పడం అప్పుడే మెలకువ వచ్చిన రామచంద్రరావుకి వినిపించింది. భయాందోళనతో కన్నీటితో సరళా, మూర్తీ రామచంద్రరావు దగ్గరకు వచ్చి నిలబడ్డారు.

     "నేను డాక్టరు చెప్పింది విన్నాను. దానికింత భయమెందుకు" అన్నాడు రామచంద్రరావు. అతని పెదవులమీద చిరునవ్వు నిలిచి వుంది. కష్టాల్నీ బాధల్నీ చివరకు మృత్యువును కూడా లక్ష్యం చెయ్యని చిరునవ్వు. అంత ఆందోళనలోనూ ఆశ్చర్యచకితుడయ్యాడు మూర్తి. కాని రామచంద్రరావు సరళ సపరిచర్యలలో మూర్తి నిరంతర సాన్నిధ్యంలో , పట్నంనుండి పిలిచిన పెద్ద డాక్టర్ల సహాయంతో వ్యాధినుండి విముక్తుడయ్యాడు. సరళ అతన్ని తన యింట్లో ఉండిపొమ్మని కోరింది, పూర్తిగా ఆరోగ్యం కోలుకునేవరకూ.

    మూడు నెలల అనంతరం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన రామచంద్రరావు తన కృతజ్ఞతను తెలియజేసి వెళ్ళిపోతానన్నాడు. "నా గదికి వెళ్ళిపోతాను మళ్ళీ టైపు మొదలు పెట్టాలి. సెలవిప్పించు" అన్నాడు.
 
    "అయితే నేనూ వస్తాను. ఆ ఒక్కగదిలో మనమిద్దరమూ ఎలా ఉండడం?" అంది సరళ.

    "నువ్వు రావడమేమిటి? నాతో ఉండడమేమిటి?" అన్నాడు రామచంద్రరావు తెల్లబోయి. "మరి భార్య భర్తను వదిలి వుంటుందా?" అంది సరళ తలవాల్చి వోరగా చూస్తూ. ఈసారి నిజంగా రామచంద్రరావు సిగ్గుపడిపోయాడు. అతను తెప్పరిల్లి చటుక్కున ఆమెను కౌగిలిలోకి తీసుకున్నాడు.

    సరళా రామచంద్రరావుల వివాహం నిరాడంబరంగా జరిగింది. మూర్తి ఉత్సాహానికి పట్టపగ్గాల్లేవు.

    మొదటిరాత్రి రామచంద్రరావు జుట్టులోనికి వేళ్ళు పోనిస్తూ మృదువుగా అడిగింది సరళ "మీరు ఎప్పుడూ నవ్వుతూనే వుంటారు. కారణం ఏమిటి నాకు చెప్పరూ?" రామచంద్రరావు కళ్ళలో గతస్మృతుల నీడలు బరువుగా నల్లగా కదిలాయి. కిటికీలోంచి చీకట్లోకి అలాగ కొంతసేపు చూస్తూ నిలుచున్నాడు. అతని కంఠస్వరం గంభీరంగా మారిపోయింది.

    "నా పదహారవయేట నేను, మా అమ్మా నాన్నా, మా చెల్లెలూ, తమ్ముడూ, భద్రాచలం వెడుతున్నాము. నేను అనారోగ్యంతో సన్నగా నీరసంగా ఉండేవాణ్ణి. ఎప్పుడేమయిపోతానో అని అమ్మా నాన్నా భయపడుతుండేవారు. భద్రాచలరాముని దర్శనంతో నేను ఆరోగ్యవంతుణ్ణి అవుతానని వారి నమ్మకం. అందుకే భద్రాచలం వెడుతున్నాము. పాపికొండల దగ్గర హఠాత్తుగా మా పడవ బోల్తా కొట్టింది. కారణం ఏమిటో యిప్పటికీ నాకు తెలియదు. నేను స్పృహలేకుండా ఒక ఒడ్డుకు కొట్టుకుపోయాను. తెలివి వచ్చేసరికి నాచుట్టూ జనం మూగి ఉన్నారు. మరి కాస్త దూరంలో మా తల్లి దండ్రుల సోదర సోదరీ శవాలు పడివున్నాయి. వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక్కసారిగా నేను దిక్కులేనివాడినయాను. ఒక్కసారిగా అపారదుఃఖం నన్ను నిశ్చేష్టితుడ్ని చేసి వేసింది. గుండెలు పగిలి పోయినాయ్. మళ్ళీ అదే నదిలో దూకి చచ్చిపోదామనుకున్నాను. కాని ఒక మెరుపులాగ నా మనస్సులో ఏదో మెరిసింది. ఈ సృష్టి ఈ జీవితము అంతా ఒక హాస్యం. దీనికి ఒక నియమమూ నిర్ణీత పద్దతీ అంటూ లేవు. ఉన్నా మనకి తెలియదు. మనం తెలుసుకోలేము ఎవరో తెరవెనుకనుండి మనల్ని యిలా ఆడిస్తున్నారు. ఇది పెద్ద జోక్ - నవ్వులాట. లేనిదే అనారోగ్యంతో ఎప్పుడేమవుతానో అన్న నేను బతకడమేఁవిటి? నిండు ఆరోగ్యంతో ఆశలతో ఉన్నవాళ్ళు పోవడమేమిటీ? ఈ అద్బుతమైన హాస్య నాటకములో నేనూ ఒక పాత్రని, కష్టాలకీ భయాలకీ రేపటి బాధలకీ ఆందోళన చెందడం ఎంత తెలివితక్కువ సరళా? ఈ కాస్సేపటి బతుకునీ సంకుచితత్వంతో సందేహంతో ద్వేష విషంతో నింపుకోవడం ఎంత మూర్ఖత్వం సరళా"

    ఈ మాటలకి సరళ చలించిపోయింది. విద్యుద్దీపాల కాంతిలో అతని కళ్ళు చమ్మగిల్లినట్లు అనిపించిందామెకు. అతన్ని గుండెలకు హత్తుకుని, "నేను నిన్ను వదలను రామం" అని అర్ధంలేకుండా ఆవేశంగా అంది.

    రామచంద్రరావు చల్లగా నవ్వాడు తెల్లని మల్లెపూవు విరిసినట్లు, స్వచ్ఛమైన హిమకరణం సూర్యరశ్మిలో మిలమిల మెరిసినట్టు.......

    సరళకి అర్ధమయింది -అతని నవ్వు వట్టి నవ్వు కాదనీ, అతని నవ్వు వెనకాల భయంకర విషాదముంది. వేదాంతం వుంది.

    కాని యీనాటి వరకూ మూర్తికి మాత్రం అతని నవ్వుకి కారణం తెలియదు పాపం.

                                                         (1964)
                                **********




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.