Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                   
                                                       నవ్వు

    రామచంద్రరావు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనికి నవ్వడం ఒక స్వభావమైపోయినట్టూ, కష్టాలూ, చీకాకులూ అతనికి దూరంగా తొలగి వుంటాయన్నట్టు అనిపిస్తుంది. ఊళ్ళో అందరినీ అతను నవ్వుతూ పలకరిస్తాడు. అందరూ అతనికి స్నేహితులు.

    అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా ఉన్నాయి. కాని ఆ సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా ఉన్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.

    కాని, మూర్తికి ఎప్పుడూ ఆస్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగానీ, విసుగుగానీ కనిపించవు? ఓ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరుచుకున్నాడు?

    తీరా చూస్తే రామచంద్రరావు సామాన్యుడు. ఆస్తీ, హోదా ఉన్నవాడు కాదు; ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు.'నా' అన్న వాళ్ళెవరూ ఉన్నట్టు కనబడరు. అతను ఒంటరివాడు. ఏలూరు నుండి వచ్చే బస్సు ప్రమాదానికి లోనయిందనీ ప్రయాణీకులకి చాలామందికి గాయాలు తగిలాయనీ విన్నాడు మూర్తి. వారిలో రామచంద్రరావు ఒకడని తెలిసినప్పుడు బాధపడ్డాడు. మూర్తి కంగారుపడ్డాడు. సరాసరి టిక్కెట్టు కొనుక్కుని ఏలూరు వెళ్ళి ఆస్పత్రికి వెళ్ళాడు . గాయపడిన వారిలో రామచంద్రరావును గుర్తించడం కష్టమయింది. అతని తలకీ చెంపలకీ కుట్లు ఉన్నాయి. అతనికి స్పృహలేదు. మూర్తి గాభరాపడ్డాడు. తక్కిన గాయపడిన వారందరి దగ్గరా వారి వారి భార్యలూ తలిదండ్రులూ ఉన్నారు. రామచంద్రరావు మాత్రం వొంటరిగా మృత్యువుకీ, బ్రతుకుకీ మధ్య ఉన్న మసకమసక అంచుమీద ఉన్నాడు. మూర్తికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఇంత ఉత్తముడికి ఎందుకిటువంటి గతి పట్టింది అనుకున్నాడు. అతని మంచం పక్కన ఒక కుర్చీ మీద కూర్చున్నాడు మూర్తి. స్పృహ రాగానే - తనని చూస్తాడనీ, కావలించుకుని ఏడుస్తాడనీ అనుకున్నాడు. తనకి ఏడుపు వచ్చేస్తుంది. ఎలాగ ఇతనికి ధైర్యంచెప్పి వోదార్చడం? ఎప్పటికోగాని రామచంద్రరావుకి స్పృహ రాలేదు. అతడు కదలడం మొదలుపెట్టాడు. మూర్తి గుండెలు కొట్టుకున్నాయి దుఃఖంతో ఆనందావేశంతో. రామచంద్రరావు కళ్ళు తెరిచాడు. ఓ నిముషం తదేకంగా మూర్తికేసి చూశాడు. 'బతికే ఉన్నానా' అంటూ నవ్వాడు. సన్నని చిన్నని నవ్వు హాయిగా మొగ్గవిడి తెల్లని పు్వు రేకులను విచ్చుకుంటూన్నట్టు.

    మూర్తి 'షాక్' తిన్నాడు. అలాంటి విపత్సమయంలో కూడా అతను నవ్వగలడని అనుకోలేకపోయాడు. తర్వాత రోజున మాటల సందర్భంలో అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మూర్తి అన్నాడు "రామం నువ్వు పెళ్ళిచేసుకోవాలి ఇటువంటి సమయంలో నీకు  భార్య ఉంటే ఎంత పరిచర్య చేసేది? ఇలా వొంటరిగా ఎన్నాళ్ళు ఉంటావు?"

    రామచంద్రరావు జవాబుగా  - నవ్వాడు.

    సరళ కనుక అంగీకరింఛివుంటే రామచంద్రారవుకి యీ వొంటరి తనం ఉండేదికాదు. సరళ రామచంద్రరావుకి దూరపు బంధువుల అమ్మాయి. సన్నగా నాజూకుగా ఉంటుంది. ఆమె కళ్ళల్లో తెలివైన వెలుతురు వుంది. సరళా రామచంద్రరావూ కలిసి చదువుకున్నారు. అప్పుడే వారిద్దరికీ స్నేహం కలిసింది. ఆ స్నేహం ప్రేమగా మారినట్టు కూడా మూర్తికి తెలుసును. రామచంద్రరావు మూర్తితో అన్ని సంగతులూ చెప్పేవాడు. ఆమె తనని తప్పకుండా పెళ్ళిచేసుకుంటుందన్న విశ్వాసాన్ని ప్రకటించేవాడు. సరళ తలిదండ్రులు కూడా ఏనాడూ వీరిరువురి స్నేహానికి అభ్యంతరం చెప్పలేదు. సరళ తల్లిదండ్రులు కలవారు. సరళ ఒక్కర్తే వారి సంతానం. రామచంద్రారవుకి సరళతో పెళ్ళి జరగాలనీ, దానితో అతని వొంటరితనమూ ఆర్ధిక సమస్యా రెండూ తీరి సుఖిస్తాడనీ నిజమైన నిర్మలమైన స్నేహితుడైన మూర్తి ఎంతో ఆశించేవాడు.

    "రామం నువ్వెప్పుడైనా ఆమె అభిప్రాయం తెలుసుకున్నావా?" అని అడిగాడు మూర్తి, రామచంద్రానికి ఉద్యోగం వచ్చిన రోజున.

    "సమయం రానీ" అన్నాడు రామచంద్రరావు.

    రెండుమూడు నెలల అనంతరం సరళా రామచంద్రరావులు పార్కులో కలుసుకున్నారు.

    విద్యుద్దీపాల కాంతి, సప్తమి వెన్నెలా కలసి మీరు కూర్చున్న బెంచీమీద విచిత్రంగా పడింది. రామచంద్రరావు, తన మనస్సులోని అభిప్రాయాన్ని విప్పి చెప్పాడు. కాని ఆ క్షణాన సరళ వివేకం ఆమె హృదయ దౌర్భల్యాన్ని జయించింది.

    "రామం, నీ ఆస్తి ఎంత?" అని అడిగింది.

    "ఒక పాత పెంకుటిల్లు. అదైనా మా వూళ్ళో ఉంది" అన్నాడు రామచంద్రరావు.

    "భూమి గట్రా ఏమైనా.... " అని ప్రశ్నించింది సరళ.

    "సెంటు భూమి కూడా లేదు." అని కులాసాగా జవాబు చెప్పాడు రామచంద్రరావు.

    "నీ జీతం ఎంత?" అని అడిగింది సరళ.

    "నూటయిరవై రూపాయలు" అన్నాడు రామం.

    సరళ నిట్టూర్చింది. ఆమె తన సాధక బాధకాలు, అవసరాలు అలవాట్లూ తన తల్లిదండ్రుల కనీసపు కోర్కెలు అన్నీ చెప్పింది. చివరికి ప్రేమా యిష్టమూ మొదలైన దౌర్భల్యానికి లోబడి తన సుఖాన్నీ భద్రతని బలి యిచ్చుకోలేనంది. "నువ్వంటే నాకెప్పుడూ యిష్టమే, కాని నా జాగ్రత్తలో నేనుండాలిగా" అంది.

    పార్కులోంచి రామచంద్రరావు యివతలకి రాగానే మూర్తి ఎదురై "ఏమైంది ఏమైంది" అని ఆతృతగా అడిగాడు.

    "నిరాకరించింది" అన్నాడు రామచంద్రరావు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.