Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఉలిక్కిపడి లేచాడు గవరయ్య. అతని నుదురంతా చమటతో తడిసిపోయింది. కిటికీ తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి. హోరుమని గాలివాన, ఉరుములూ అంతా భయంకరంగా ఉంది. గవరయ్య మొహం తుడుచుకున్నాడు. పక్కనున్న కూజాలోని ఒక గ్లాసుడు మంచినీళ్ళు గడగడా తాగాడు. చీకటిలోంచి బయటకు చూశాడు. వానతో కలిసిన చీకటి, నల్లని విషంలాగా ఆకాశం మీంచి కారుతోన్నట్లు నల్లని పాపం సముద్రంలా పొంగుతూన్నట్టూ ఉంది. ఆ భయంకరమైన చీకటిలో ఈ మనుషులు, ఇళ్ళూ వాకిళ్ళూ, భయాలూ, కోర్కెలూ, అన్ని అబద్దంలా కనిపించాయి. ప్రకృతియొక్క ప్రచండ తాండవంలో ఏదో సత్యం కొరడాతో చెళ్ళున కొట్టినట్టు అర్ధమయినట్లు అనిపించింది. ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో వేణుగోపాలస్వామి గోపురాగ్రం మెరిసింది. గవరయ్య మనసు లోతులలో ఏదో మెరిసింది. గవరయ్య దగ్గాడు. లాంతరు పట్టుకొని పెరట్లోకెళ్ళాడు.పెరడు చాలా పెద్దది. వర్షంలో తడుస్తూ గాలివూపుకి తట్టుకుంటూ పాక దగ్గరకు వెళ్ళాడు. పాకలోంచి కీచుగా గట్టిగా మూలుగులు వినబడుతున్నాయి. లోపలకు వెళ్ళాడు. బాధతో వలయం తిరిగిపోతోంది చిట్టి. చూడలేక దీపం అక్కడ పెట్టి బయటకు వచ్చి నిలుచున్నాడు అలా వర్షంలో చలిగాలిలో ఎంతసేపు నుంచున్నాడో తెలీనే తెలీదు. ఇంతలో ఒక మెరుపు మెరిసింది. దగ్గర్లోనే ఎక్కడో పిడుగుపడిన భయంకరమైన చప్పుడు. "బాబోయ్" అని అరిచింది చిట్టి. గవరయ్య ఒక్క నిముషం సేపు నిశ్చేష్టుడయ్యాడు. ఇంతలో "కేర్ కేర్"మని ఏడుపు వినిపించింది. కఠినమైన అసహ్యమైన గవరయ్య మొహం మీద లావాటి పెదవుల సంగులనుంచి వచ్చిన చిరునవ్వు తాలూకు వెలుగు అలుముకొంది. గవరయ్య అంత వర్షంలోనూ అంత చీకటిలోనూ మెరుపుల సహాయంతో వూళ్ళో మంత్రసాని కోసం పరుగెత్తుకెళ్ళాడు.
ఉదయం ఎనిమిది గంటలయింది. గవరయ్య ఇంటి వరండాలో అవధాని, కరణం, శేషగిరి, మున్సబూ అందరూ కూర్చుని వున్నారు. వర్షంతగ్గి లేత ఎండకాస్తోంది. ఆ ఎండల్లో రాత్రంతా తడిసిన చెట్ల ఆకులూ, పచ్చిగా గవరయ్య యింటిమీద వాలిన కాకి నల్లని రెక్కలూ మెరుస్తున్నాయి. అవధానీ, మున్సబూ, వాళ్ళ మొహాలు మాత్రం మెరవటం లేదు. నిరాశాహతమైన వారి కళ్ళలో కోపం సుళ్లు తిరుగుతోంది. గుమ్మం అవతల వాళ్ళ వెనకాలే వచ్చిన వెట్టివాడూ, ఒకరిద్దరు నౌకర్లూ తమరేం చెప్పినా చెప్పేస్తా మన్నట్టుగా విధేయతా, పట్టుదల మూర్తీభవించినట్లు చేతులు కట్టుకు నుంచున్నారు.
కాసేపటికి ఇంట్లోంచి గవరయ్య వచ్చాడు. నడుస్తున్న ఇనుప గర్డరులా ఉన్నాడు. చిన్న కళ్ళు కుంచించి సూటిగా, నిర్లక్ష్యంగా వాళ్ళకేసి చూశాడు. అవధాని భీకరంగా కంఠం మార్చి "ఇలా చేస్తావనుకోలేదు గవరయ్యా! ఇంకా పెద్దమనిషి అనుకున్నాను. చెడిపోయిన దాన్ని ఇంట్లోకి తీసుకువచ్చి పెట్టుకుంటావా? ఎవడివల్లో పుట్టిన కొడుకుని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటావా? నీకు సిగ్గూ, అభిమానమూ రెండూ లేకపోవడమే కాదు. పాపం, మహాపాపం, ఘోరపాపం చేశావు. దేముడింక నిన్ను క్షమించి సహించి వూరుకుంటాడా?" అన్నాడు గుక్క తిప్పుకోకుండా. గవరయ్య తాపీగా గోడ కానుకుని కూర్చున్నాడు. బొడ్లోంచి పొగాకుకాడ తీసి చుట్టబెడుతూ "నాకు దేవుడే చెప్పాడు" అన్నాడు. "ఏం చెప్పాడు" అవధాని.
"ఆ పిల్లాణ్ణి నేను పెంచుకుంటాను. ఆ పిల్ల ఇంట్లో పడివుంటుంది" అన్నాడు గవరయ్య.
"లేచిపోయిందాన్ని ఏలుకుంటావా?" అన్నాడు శేషగిరి తన చెవుల్ని తాను నమ్మలేక!
"ఏలుకోడం సిగతరగ -నాకంటే సగం చిన్నదాన్ని పెళ్ళిచేసుకుంటే లేచిపోక ఏం చేస్తది. ఇపుడు పొమ్మంటే ఎక్కడికి పోతది. తిండీ బట్టా ఇస్తే కుర్రాణ్ని సాకుతూ యిక్కడే పడివుంటుంది" అన్నాడు గవరయ్య. అవధాని వికటాట్టహాసం చేశాడు.
"దేముడు చెప్పాడా నీకు? ఏ దేవుడయ్యా! రంకు దేవుడా? మహా తపస్సు చేసిన వాళ్ళకి దిక్కులేదు కాని...."
"నాకు దేవుడు కనిపించాడు. నేను దేవుణ్ణి చూశాను" అన్నాడు మొండిగా గవరయ్య. అపుడతని కళ్ళు మెరిశాయి.
"ఇప్పుడైనా దాన్నీ, ఆ పిల్లాణ్ణి ఎక్కడికేనా పంపించేసెయ్. ఇంతటి అన్యాయాన్ని మేము ఒప్పుకోం" అన్నాడు కరణం. "నిన్ను గుడిఛాయలకు కూడా రానివ్వం" అన్నాడు అవధాని. "ఊరు వూరంతా ఏకమవుతుంది గవరయ్యా! మంచిగా చెబితే వినడంలేదు నువ్వు. మేమంతా చేతులు కట్టుక్కూర్కోలేదు జాగ్రత్త" అన్నాడు మున్సబు.
ఒక్కసారి గవరయ్య లేచాడు. గోడవారనేవున్న గునపం తీశాడు. "ఎవడ్రా! నాయాల నామీద కొచ్చే వాడెవడా. నేనొకరి సొమ్ము తిన్నానా. అసలు మిమ్మల్నిక్కడకు రమ్మన్నానా? నువ్వెవడివయ్యా నాకు నీతులు చెప్పడానికి? నా యవ్వారంలో జోక్యం చేసుకుంటే ఒక్క ఏటుకి తెగేస్తాను రమ్మను ఎవడొస్తాడో" అని అరిచాడు గవరయ్య. అతని వొళ్ళు ఆవేశంతో వూగిపోయింది. అతను పేలుతున్న అగ్ని పర్వతంలా ఉన్నాడు. అతని ఆకారం, అతని రౌద్రం చూసేసరికి వెట్టివాడు భయపడిపోయి నోరావలించాడు . అవధాని లేచాడు. తక్కిన వాళ్ళందరూ కూడా లేచారు "అయితే దాన్ని వదలవన్నమాట" అన్నాడు అవధాని.
"వదల్ను" అన్నాడు గవరయ్య.
"అయితే నిన్ను వెలేస్తున్నాం. చాకలి, మంగలి రానేరారు సరికదా నీ పొలంపనులకి, పాలేరుతనానికి ఎవరొస్తారో చూస్తాను" అన్నాడు అవధాని.
మున్సబు వెట్టివాడు కేసి చూసి "ఈవేళ వూళ్ళో టముకు వెయ్యరా" అన్నాడు.
గవరయ్య ఉగ్రంగా వురిమిచూసి "పొండయ్యా పెద్దమనుషులూ ఇలాంటి యెదవుళ్ళో వుండమన్నా ఉండను. నా పిల్లాణ్ణి ఈ యెదవల మధ్య తిరగనివ్వను. థూ!" అని కాండ్రించి వుమ్మేశాడు వెళ్ళిపోయే అవధాన్నీ బృందాన్నీ చూస్తూ.
వారంరోజులు తిరిగేసరికి గవరయ్య ఇల్లు తాళంవేసి వుంది. గవరయ్య టౌనులో ఇల్లు కొన్నాడనీ, ఇక్కడ ఊళ్ళో ఇల్లూ, పొలమూ అమ్మకం పెట్టేడనీ తెలిసింది.
(జ్యోతి, 1964)
*************



