Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    మళ్ళీ ఇప్పుడా సంగతి జ్ఞాపకంవచ్చి పాకవైపువెళ్లి చూశాడు. ఎవరోకాదు ఆ ఆడమనిషి - గవరయ్య పెళ్ళామే? కడుపు చాలా ఎత్తుగా వుంది. నెలలు నిండినట్టున్నాయి. గడ్డిమీద పడుకుని మూలుగుతూవుంది.

    "ఈ సంగతి గవరయ్యకు తెలుసునంటావా-" అన్నాడు మున్సబు.

    "తెల్దుబాబూ! తెల్లరగట్లనే లేచి టౌనుకెళ్ళిపోతాడుగా గవరయ్య" అన్నాడు పానకాలు.

    మున్సబు తొందరగా లేచాడు. చెప్పులు వేసుకుని బయల్దేరాడు అవధాని ఇంటికి. దారి పొడుగునా అందరూ పలకరిస్తున్నారు. "ఏం మున్సబూ, గవరయ్య పెళ్లాం తిరిగొట్టిందటగా. ఈ వూరు, ఈ మడుసులు, ఏమైపోతున్నారు బాబూ. మంచీ. చెడ్డా, పున్నెం" పాపం అన్నీ మట్టికొట్టుకుపోతున్నయా! లేచిపోయి కడుపులు సేసుకొన్నోళ్ళని మళ్ళీ ఏలుకుంటావుంటే ఊళ్ళో పిల్లలు రెచ్చిపోరటయ్యా! ఏమొచ్చింది బాబూ, ఈ వూరికీ, పెద్దలకీ!" అంది అరవై ఏళ్ళు దాటిన ఒకావిడ అరుగుమీద నుంచుని. అవధాని ఇంటికి వెళ్ళేలోగానే మున్సబుకి తెలిసిపోయింది. ఊరంతా గవరయ్య పెళ్ళాం గురించి మాట్లాడుకుంటున్నారని అవధాని చాలా చిరాగ్గా కోపంలో వున్నాడు.

    "మీకు తెలుసా" అన్నాడు మున్సబు మెట్లెక్కుతూ.

    "ఆబాల గోపాలానికీ తెలుసును! మునసబుగిరీ చేస్తున్న నీకే తెలవదు. ఎంతధైర్యంవుండి ఆ పాపిష్టిది యీ వూరొచ్చిందట! ధర్మభయం, దైవభయం ఎక్కడైనా ఉన్నాయా అని!"

    కాస్సేపట్లో కరణమూ, వూరిపెద్దలూ అందరూ అక్కడ సమావేశమయ్యారు. గవరయ్య తక్షణం ఆ చెడిపోయినదాన్ని తరిమేస్తాడో లేక తనే వూరినుంచి వెల్ళిపోతాడో తేల్చుకోవాలన్నారు. ఆ రోజు ఉదయమే మాలగూడెంలో ఎవడికో కలరా తగిలిందని దానికి కారణం ఈ పాపిష్టిది వూళ్ళో అడుగు పెట్టడమే అని ఒకరన్నారు. అవధాని పెద్దక్కగారు తలుపురెక్క ఓరగా తీసి ఇలా అంది.  "మేమందరం సిగ్గుతో చచ్చిపోతున్నాం. ఇలా బరితెగించినవాళ్ళు వూళ్ళోవుంటే సంసారులగతి ఏమవుతుంది ఆలోచించండి అన్నయ్యా. మమ్మల్ని వూళ్ళో వుండమంటారో లేక గంగలో దూకమంటారో చెప్పండి"

    "ఇంతకీ గవరయ్య ఇంట్లోలేడుగా. రాగానే పెద్దలు మీరు వెళ్ళి చెప్పండి! మీ మాట వినకుండా వుంటాడాయ ఏమైనా చెప్పండి అవధానిగారూ! గవరయ్య ఇదివరకటివాడు కాదు. పాపం పుణ్యం అంటే ఏమిటో తెలుసుకున్నాడు. దైవభక్తి, అంతకన్నా మీరంటే భక్తి కలిగున్నాడిప్పుడు" అన్నాడు వూళ్ళోకి పెద్ద కామందైన శేషగిరి.

    "గవరయ్యమీద ఇంకా ఎన్ని ఆశలు పెట్టుకున్నాం!" అన్నాడు మున్సబు నిట్టూరుస్తూ గుడి ప్రాకారాన్ని పాతికవేలనీ తలచుకొని.
 
    "గవరయ్య మేనత్త వుందికదా! ఆవిడేం చేస్తోంది. వూరుకుందా?" అన్నాడు కరణం.

    "ఏం మేనత్తలే బాబూ. కాయిలాపడి మంచాన అంటుకుపోయివుంది పాపం. బాగా ముసిల్దయిపోయింది" అన్నాడొకడు.

    కనుచీకటి. పడేవేళకి గవరయ్య యింటిముందు సైకిలు దిగాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే అవధానీ, కరణం, మునసబునీ చూశాడు. కనుబొమలు పైకెత్తి ప్రశ్నార్ధకంగా తల ఆడించాడు. అవధాని అంతా చెప్పాడు. గవరయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. అతని లావాటి పెదవులు వణికాయి. గబగబ వెళ్ళి మూలనున్న గునపం చేత్తో పైకి యెత్తాడు. "చంపేస్తాను తప్పుడుముండని" అని అరిచాడు. అవఘాని కంగారుగా "వొద్దు వొద్దు అంతపని అక్కర్లేదు. గవరయ్య బాబూ, నీ ధర్మనిష్ట తెలియదా ఇప్పుడు మళ్ళీ ఖూనీకేసు ఒకటా! నీ పీకేకాక మాపీకల మీదికికూడా వస్తుంది. దాన్ని యింట్లోంచి తోలేసెయ్యి చాలు" అన్నాడు. గవరయ్య అతని మాటలు వినిపించుకోలేదు. పెద్ద పెద్ద అంగలువేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ సమయంలో అక్కడ వుండటం తమకే ముప్పని గ్రహించిన ఆ పెద్దలు ముగ్గురూ అక్కడనుంచి జారుకున్నారు. గవరయ్య పాకలోకి వెళ్ళాడు. అక్కడ జీబురుగా, చీకటి చీకటిగా ఉంది. పాత సామానులతో, దుమ్ముతో నిండివుంది. గవరయ్య పరకాయించి చూశాడు. ఒక పక్కగా నేలమీద వెల్లికలా పడుకున్న పెళ్ళాన్ని చూశాడు. దగ్గరగా వెళ్ళి గునపం పైకెత్తాడు. ఇంతలో ఏదో సంశయం కలిగింది "ఇది చచ్చిందా? బతికేవుందా" అనుకున్నాడు. మోకాళ్ళమీద వంగి మొహంలోకి చూశాడు. పీక్కుపోయి పాలిపోయింది మొహం. ఎండి అట్టలు కట్టిన జుట్టు అసహ్యంగా నేలమీద భుజాలచుట్టూ పరుచుకొనివుంది. దీనంగా మృత్యు విహ్వలగా, భయంకరంగా , అసహ్యంగా వుంది ఆమె మొహం.  "చిట్టీ" అని పిలిచాడు గట్టిగా. భుజాలు పట్టుకుని కుదిపాడు. చిట్టి కళ్ళు తెరిచింది. గవరయ్యను ఆనమాలు కట్టింది. ఆమె కన్నులమ్మట నీళ్ళు కారుతున్నాయి వణుకుతున్న తన రెండు చేతులనీ పైకెత్తి నమస్కరించింది. "నన్నేం చేయకు నేను వెళ్ళిపోతాను" అంది నీరసంగా. తన తల్లి చచ్చిపోయేముందు యిలాగే తన తండ్రికి చేతులెత్తి దణ్ణం పెడుతూ దీనంగా చూడటం జ్ఞాపకమొచ్చింది గవరయ్యకు. మళ్ళీ చిట్టి చేతులు రెండూ కిందకు వేలాడిపోయాయి. కాసేపు అలాగే కూచుని ఏమనుకున్నాడో లేచి లోపలికి వెళ్ళి ఒక చెంబుతో నీళ్ళూ, ఓ గిన్నెనిండా అన్నమూ తీసుకువచ్చాడు. "చిట్టీ" అన్నాడు. చిట్టి కళ్ళు తెరిచింది. "లే, ఈ అన్నం తిను. తెల్లారగానే వెళ్ళిపో. నీ మొహం నాకు చూపించకు తెలిసిందా" అన్నాడు. చిట్టి తల వూపింది. గవరయ్య లేచినుంచుని "తెల్లవారేక ఈ పాకలో కనిపించేవా నీకు చావు తప్పదు" అని యింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గవరయ్యకి అన్నం సహించలేదు అతనికి కాళ్ళకింద మంటలు పెట్టినట్లుంది. అవతల ఆకాశంమీద మబ్బులు దట్టంగా పట్టాయి. గాలి రివ్వుమని చెట్ల ఆకుల్లోంచి చప్పుడు చేసుకుంటూ ఇంటి చూరుని తాకి వెర్రిగా అరుస్తూ వెనక్కి తిరిగి పోతోంది. పక్కమీద దొర్లుతూన్న గవరయ్యకి కునుకుపట్టింది. గవరయ్యకి భయంకరమైన కల వచ్చింది. తన తండ్రిని, తల్లిని ఒక స్తంభానికి కట్టి చుట్టూ మంటలు పెట్టారు. ఆ మంట పెట్టినవాళ్ళు అవధానిలాగ, కరణంలాగ, మునసబులాగ కనిపించారు. తల్లీ తండ్రీ  "బాబోయ్,  బాబోయ్" అని అరుస్తున్నారు. త్లలీ తండ్రీ ఎర్రగా నల్లగా బూడిదలా కాలిపోయారు. ఆ బూడిదలోంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. ఆ వ్యక్తి గబగబా అడుగులేసుకుంటూ తన పెరట్లో పాకవైపు వెళ్ళాడు. ఆ వ్యక్తికి ఒక చేతిలో శంఖం, మరొక చేతిలో చక్రం, నుదుట నామాలూ వున్నాయి. గుళ్ళో తను చూసిన వెణుగోపాలస్వామి విగ్రహంలా ఉన్నాడు. వేణుగోపాలస్వామి కళ్ళమ్మట నీళ్ళు  కారుతున్నాయి. దేవుడేడుస్తున్నాడు. చిట్టి పక్కలో వున్న పిల్లవాణ్ణి చేతులతో తీసుకొని "నీకేం భయం లేదు, నేనున్నానుగా" అని చిట్టిని ఓదారుస్తున్నాడు. ఇంతలో మండుతున్న కాగడాలు పట్టుకొని ఊళ్ళో జనం కేకలు వేసుకుంటూవచ్చి పాకను అంటించేస్తున్నారు. పాక నలువైపులా భగ్గుమని అంటుకుంది. జ్వాలలు మిన్ను ముడుతున్నాయి. దేవుడు మంటల్లో కాలిపోతున్నాడు. చిట్టి కాలిపోతోంది. నోరెరుగని చిట్టి పిల్లాడు కాలిపోతున్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.