Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"మారకేం చేస్తాడు? సంఘాన్నీ, ధర్మాన్నీ కాదని ఎక్కడికి పోతాడోయ్ వీడు" అనేవాడు అవధాని.
వేణుగోపాలస్వామి గుడి ప్రాకారం పూర్తిగా పడిపోయేటట్టు వుంది. ఇంక జాగుచేస్తే లాభం లేదనుకున్నారు వూళ్ళో పెద్దలు. పాతికవేలైనా ఉంటేగాని ఈ పని జరగదు. అంత మొత్తాన్ని ఒక్క గవరయ్య తప్ప ఇవ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ యేడాదిలోనూ గవరయ్య తప్ప ఇవ్వగలిగినవాడు మరొకడు లేడన్నారు. ఈ యేడాదిలోనూ గవరయ్య చాలా లాభాలు సంపాదించాడు. తోళ్ళ వ్యాపారం అలా ఉండగా, పట్టణంలో నూనెమిల్లులో ముప్పాతికవాటా కొన్నాడు. ఒక్క వేరుశనగ నూనెలోనే ఒక లకారం వచ్చిందని వూరంతా వింతగా చెప్పుకుంటున్నారు. ఈ అభివృద్దికి కారణం అతనిలో పొడచూపిన దైవభక్తి అని వాళ్ళనుకోవడమే కాకుండా అతను ఏమరిపోతాడేమోనని అతనివద్ద మరీమరీ పనికట్టుకు చెప్పేవారు. ఒక మంచిరోజున మున్సబూ, కరణమూ, ధర్మకర్తా యింకా వూళ్ళో మోతుబరులూ, అందరూ కలిసి గవరయ్య ఇంటికివెళ్ళి ప్రాకారోద్ధరణను గురించి చెప్పారు. అతనే పూనుకోవాలన్నారు. "నీ పేరు చిరస్థాయి అయిపోతుంది గవరయ్యా. నీ పేరుమీదుగా రోజూ పూజాపునస్కారాలు జరిపిస్తాం" అనీ చెప్పారు.
"దేవుడికి అసలు గుడెందుకు? ఆ గుడి చుట్టూ గోడెందుకు?" అన్నాడు గవరయ్య చుట్ట చివరని నోట్లో నములుతూ.
నిశ్చేష్టులయారందరూ "అపచారం! అపచారం!" అని లెంపలు వాయించుకున్నాడు కరణం.
ధర్మకర్త కరణానికి కన్ను గీటాడు. "గవరయ్య వేసిన ప్రశ్న సామాన్యమైనదికాదు. తత్త్వవేత్తల్నీ, మహర్షుల్నీ కూడా ముప్ుతిప్పలు పెట్టిన జటిల ప్రశ్న అది. అయితే గవరయ్యలో మనకి తెలీకుండానే గొప్ప సాధన జరుగుతోంది. నాలుగురోజులు మనం ఓపిక పడితే గవరయ్య వంటి పెద్దమనిషి తన ప్రశ్నకి తనే జవాబు పొందుతాడు. భగవదనుగ్రహం నేరుగా ఒక్కసారి రాదోయ్. అంచెలంచలుగా వస్తుంది. అలాగ వచ్చిన రోజున గవరయ్య ఏది -మన గవరయ్యే వచ్చి "ఇదిగో అవధానిగారూ, ఈ పదివేలు దగ్గిరుంచండి -ప్రాకారం కట్టించెయ్యండి" అని అనడూ?"
గవరయ్య ఎప్పుడూ చెయ్యనివాడు అవధానికి నమస్కారం చేశాడు. "సెలవు తీసుకోండి నాకు పనుండి టౌనుకెళ్ళాలి" అని అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. అవధాని ఆశ్చర్యపడ్డాడు. అందరూ మొహామొహాలు చూసుకున్నారు.
"అవధానీ జయించావోయ్, తల వంచి నీకు నమస్కరించాడు కూడా! వీణ్ణి తగలెయ్యా -మారుతున్నాడు. మారిపోతున్నాడు" అన్నాడు కరణం హుషారుగా.
"ఈ వర్షాకాలం వెళ్ళేసరికి -నే చెబుతున్నాగా -పాతికవేలూ మనముందు పడేస్తాడు. ఆ ప్రాకారంతోపాటు మన యిళ్ళకి ప్రహరిగోడలు లేస్తాయి!" అన్నాడు మీసాల్లో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మున్సబు.
3
వర్షాకాలం రానేవచ్చింది. రావడంలో మంచి వూతంగా, కోపంగా, బలంగా వచ్చింది. కంభవృష్టిగా వర్షం, దట్టమైన మేఘాలతో నల్లబడిన ఆకాశం మెరుపులూ,ఉరుములూ ప్రకృతి పెళ్లిపందిరిలా హడావిడిగా వుంది. రోడ్లు బురదైనా కుచ్చెళ్ళ నెత్తిపట్టుకొని ఆడవాళ్లు, అందులో కొత్తగా పెళ్లయిన వధువులు సరదాగా పేరంటాలకి వెడుతూ వస్తున్నారు. రైతాంగం అంతా పొలంపనుల్లో పడిపోయారు. మున్సబు పెళ్ళానికి కీళ్ళునొప్పులూ, అవధాని కూతురికి వేవిళ్ళూ అయినా గ్రామం వుమ్మడి సౌఖ్యానికి అవేమీ ఆటంకంగా లేవు. కరణం విధవచెల్లెలు కిటికీలోంచి ఎదురింటికి చుట్టపుచూపుగా వచ్చిన బస్తీ అబ్బాయికేసి అదేపనిగా చూస్తూ చెయ్యి వూపుతున్నా షార్టుసైటూ మబ్బునీడలూ మూలాన అతనికి ఆ సిగ్నల్స్ కనబడటంలేదు. ఎండైనా వానైనా గ్రామం శివార్లల్లో వున్న కూలీ, నాలీ జనం, మురికి గుంటలూ, పందులూ, జబ్బులూ అన్నీ సక్రమంగానే ఉన్నాయి. పంచాయితీవాళ్ళు కట్టించిన లైబ్రరీ బిల్డింగులో పేకాట నిరంతరం సాగుతోంది.
ఇలాంటి చల్లని సుఖమైన వాతావరణంలో పిడుగువంటి వార్త చటుక్కున ఊరంతటినీ దద్దిరిల్లచేసింది మున్సబూ, ఒకరిద్దరు పెద్దలూ మున్సబు యింటి అరుగుమీద కూర్చుని శాలువ కప్పుకొని వెచ్చగా చుట్టలు కాలుస్తూ ఆద్యాత్మిక గోష్టి సలుపుకుంటున్నారు. ఆ సమయంలో పానకాలు అక్కడికి పరిగెత్తుకుని వచ్చాడు. వాడి కళ్ళల్లో విపరీతమైన కంగారువుంది. వాడి వాలకం చూస్తే వాడి వెనకాలే భూకంపమో, వరదో గ్రామానికి వచ్చినట్టుంది.
"ఏంరా! ఏం జరిగిందిరా?" అన్నాడు మున్సబు.
"అదొచ్చిందండీ తిరిగి వచ్చిందండీ" అన్నాడు పానకాలు.
రెణ్ణెల్ల క్రితం మున్సబుగారి గిత్తదూడ కట్టుతప్పించుకొని పారిపోయింది. మున్సబు చిరునవ్వుతో " అయితే యింకేం నేవచ్చి చూస్తాలే కొట్టాంలో కట్టెయ్" అన్నాడు.
"గిత్తకాదు బాబూ! గవరయ్య పెళ్ళాం!" అన్నాడు పానకాలు మెల్లగా అందరూ చటుక్కున నిటారుగా కూర్చుని "ఆఁ ఆఁ ఏమన్నావ్!" అన్నారు ఏకకంఠంతో.
పానకాలు చెప్పిన వివరణ యిది. రాత్రి చాలా పొద్దుపోయాక పట్నంలో రెండో ఆట సినిమా చూసివస్తూన్న బట్టలకొట్టు నరిసంహం వూరు సమీపించే వేళకి రోడ్డుకి పక్కగా చెట్లనీడలో ఎవరో కదులుతూండడం చూశారు. అతనికి దెయ్యమేమో అని అనుమానం భయమూ కలిగి గుండెలు దడదడలాడాయి. అక్కడికి కాస్తదూరంలో పాకలో పడుకున్న పానకాలుని కంగారుగా లేపాడు. ఇద్దరూ వచ్చి చూశారు. రేగినజుట్టూ, నల్లని మాసినబట్టలూ, నడవలేక ఒక్కొక్క అడుగు వేసే ఆడకూతుర్ని చూసారు. ఆమె చేతిలో చిన్నమూట వుంది. ఎవరా అని దగ్గర్నుంచి చూశారు. పోల్చలేకపోయారు. పలకరించారు . ఆమె మాట్లాడలేదు, ఆమె నడక వేగం హెచ్చించింది. వీళ్ళిద్దరూ అంతదూరంనుంచే ఆమెను అనుసరించారు. ఆమె పొలాలమ్మటే వెళ్ళి గవరయ్య ఇంటి పెరటి నానుకున్న పాకలోకి వెళ్ళింది. ఆ పాక గవరయ్య ఇంటి పెరటికీ, పొలాలకీ మధ్యగా వుంది. పాకలో కర్రపేళ్ళూ, పాత సీనారేకుడబ్బాలూ లాంటి చెత్తాచెదారం అంతా వుంది. గవరయ్యను లేపి చెపుదామంటే ఇంత రాత్రివేళ లేపితే తంతాడని భయం వేసింది.



