Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఒక తోటివాడు నాస్తికుడై పాపియై పోతూంటే ఊరుకోలేని మంచితనంవలన, కార్యదీక్షవలన ఊరిపెద్ద అతనిమీద బహిష్కరణాస్త్రం ప్రయోగించారు. కాని అదేమి పనిచేయలేదు. ఎందుకంటే గవరయ్య ఊరినే బహిష్కరించాడు మొదటినుండీ, చాకలీ, కోమటీ, మంగలీ అతనికి చాటుమాటుగా వాళ్ళ వాళ్ళ సేవలందించడం మానలేదు కూడా. నిక్కచ్చిగా వాళ్ళందరికీ జీతాలిస్తాడేమో గవరయ్య బేరాన్ని పోగొట్టుకోవడానికి వాళ్లెవరూ ఇష్టపడలేదు.
మొదటి భార్య కాలుజారి నూతిలోపడి మరణించినప్పుడు అవధానీ తదితరులూ గవరయ్యని పరామర్శించారు. ఇదంతా కర్మపలితమనీ, ఇప్పటికేనా మేలుకోమనీ హెచ్చరించారు. కాని గవరయ్య ఖాతరు చేయలేదు. పైగా ఏడాదిలో తనకన్న పదిహేనేళ్ళు చిన్నదైన ఒక పిల్లను పెళ్ళి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఆ పిల్ల అందంమాట ఎటున్నా ఫ్యాషన్ గా అలంకరించుకునేది ఆమెని ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసేవాడని గవరయ్యని గురించి అనుకునేవారు. అయితే ఆమె అయినా ఇల్లుదాటి ఈవలికి వచ్చేదికాదు. ఎవరేనా కుతూహలంకొలదీ వెళ్ళి పలకరిస్తే కబుర్లు సరదాగా చెప్పేది. ఎవరేనా గవరయ్య రూపాన్ని గురించిగాని వయస్సు గురించిగాని వ్యంగ్యంగా హేళనచేస్తే "ఆయన చాలా మంచివారు" అనేదిట. నాలుగు రోజులు కొకసారి ప్రక్క టౌన్ కి బండిమీద వెళ్ళి సినిమా చూసి వచ్చేదిట. గవరయ్య తన నిబంధనల్ని ఈ భార్య విషయంలో సడలించాడని ఆశ్చర్యపోయారు కానీ ఆ సడలింపు కూడా కొంతవరకే. ఆ ఇంటిలో వున్న వాళ్ళు అలాగ మనుషులకీ, వూళ్ళో జరిగే సంఘటనలకీ దూరంగా వుండవలసిందే.
ఎదురింటి అరుగుమీద వున్న మిషన్ కుట్టువాడితో ఈమెకి లేచిపోవడందాకా యింత చనువు ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. కాని ఈ దుస్సంఘటనతో మున్సబూ, కరణమూ, తదితరులూ మహదానందం పొందారు. కటిక చీకట్లో వాళ్ళకి మళ్లీ ఆశాకిరణం గోచరించింది. ఇనుం వేడెక్కినప్పుడే సాగగొట్టాలన్నారు. నలుగురూ కలసి ఒక రోజున గవరయ్య యింటికి వెళ్ళారు. ఇల్లు చాలా పెద్దది. మండువాలోగిలి. ఇంటిచుట్టూ పెద్దదొడ్డి, వెనకాల గడ్డివామూ, దూడల పాకా, చెట్లూ, చేమలూ వున్నాయి. ఆపైన ఇంకేమీ ఇళ్ళులేవు, అన్నీ పొలాలే. మేనత్త వున్న చిన్న లోగిలిని క్రమ క్రమంగా పెంచే యింత యింటిని చేశాడు గవరయ్య.
ఆ ఇల్లు అన్ని యిళ్ళలా వుండదు. కలకల లాడుతూన్నట్టుగా వుండదు. ఏదో భయంకరమైన ఏకాంతం ఆ ఇంట్లో పేరుకున్నట్లు వుంటుంది. రాత్రిళ్ళు దెయ్యాలు గదిలోంచి గదిలోకి వంకర కాళ్లతో తిరిగి తిరిగి పగటివేళ అటకమీదా, చూరు మూలల్లోను దాక్కున్నట్టు వుంటుంది. పలుకుబడీ, స్తోమతూ, సహజంగా ధైర్యమూ వున్న ఆ నలుగురికి ఆ ఇంట్లో అడుగు పెడుతూంటే కొంచెం బెదురుగా ఉందన్న మాట నిజం.
గోడకు చేరబడి కళ్ళు మూసుకుని వున్నాడు గవరయ్య. బనీనులోంచి అతని బలిష్టమైన రొమ్మూ, కండలూ మశూచికపు గుంటలతో గాట్లు తిన్న తుమ్మబాదుల్లా ఉన్నాయి. అడుగులు చప్పుడు విని కళ్ళు తెరచి చూశాడు. కళ్ళు ఎర్రజీరలతో తాగినవాడి కళ్ళలా ఉన్నాయి. అవధానీ, మున్సబూ, కరణమూ మరొక పెద్దమనిషీ తేరి చూస్తున్న గవరయ్యకి దగ్గరగావున్న బల్లమీద కూర్చున్నారు. గవరయ్య యేమన్నట్టుగా ప్రస్నార్ధకంగా చూశాడు.
"నీకు రావాల్సిన కష్టంకాదోయ్ గవరయ్యా. నిమ్మకు నీరోసినట్టు వుండే స్వభావం నీది. ఒకరిజోలీ శొంఠి అక్కర్లేదు. విషయం తెలియగానే 'అరే! పాపం' అని మనస్సు కొట్టుకులాడి పోయిందంటే నమ్ము" అన్నాడు కరణం.
గవరయ్య మాట్లాడలేదు అలాగే చూస్తున్నాడు.
పన్నులు కట్టడంలో కానీ, పాలేళ్ళకి జీతాలివ్వడంలో కానీ -తన ధర్మం తాను టైముకి నెరవేర్చుకునేవాడు. ఒకరి సొమ్ము ఎప్పుడూ తన దగ్గర ఉంచుకోలేదు. సుబ్బయ్యగాడికి సాలు తిరక్కముందే ధాన్యం కొలిచి యిచ్చేశాట్ట గవరయ్య. "వాడు తెగ చెప్పుకోవడమే -మా కామందు మహదొడ్డమనిషీ అని......" అన్నాడు మున్సబు. గవరయ్య అలాగే చూస్తున్నాడు. అతను వీరి మాటలు వింటున్నాడో లేదో తెలియదు.
"కాని ఒక్కమాట గవరయ్య బాబూ!" మందంగా, గంభీరంగా అందులోనే ఒక విశేషమైన దయా, మృదుత్వాన్నీ కలిపి వాచా చమత్కారియైన అవధాని ధర్మకర్తృపు హోదాతో పలికాడు. "భగవంతుడి ఆసరాలేకుండా ఎటువంటివాడూ ఈ సంసారసాగరాన్ని సుఖంగా దాటలేడనుకో. నువ్వా ఉత్తముడివి. ముక్కుకి సూటిగా పోయేవాడివి. అయితేనేం. నీ వ్యాపారం వుంది చూడు! అదికేవలం ధర్మవిరుద్దమని శాస్త్రాలు నొక్కిచెపుతున్నాయి. అయితే కలియుగంలో కొన్ని మినహాయింపులు చేశారు మనుషులు. అందుకని ఫరవాలేదు. కాని ఒక్కటి చెప్పారు -ఏమైనా ఆ భగవంతుని స్మరించడం మానకుండావుంటే అన్ని కష్టాలూ మంచులా విడిపోతాయి. ఫలం, పుష్పం, పత్రం, తోయం - అన్నారు భగవానుడు అల్పసంతోషి....."
క్రమంగా అందరి మొహాలలోను విజయాన్ని సూచించే నవ్వు అలముకొంది. ఎప్పుడూ కసురుకొని విసుక్కునే గవరయ్య యీ వేళ మౌనంగా వున్నాడు. అభేద్య మనుకున్న కోటగోడకు పగులు ఏర్పడింది. ఇంక మెల్లమెల్లగా గవరయ్యని మార్చివేయవచ్చుననే భావం వారిలో ఏర్పడింది. అందరూ లేచారు. వెళ్ళివస్తామన్నారు. కాని గవరయ్య అలాగే శిలప్రతిమలా కళ్ళప్పచెప్పి చూస్తూ కూర్చున్నాడు.
2
ఒక ఏడాది గడిచింది. అప్పుడప్పుడు కరణము, మున్సబూ వగైరాలు గవరయ్య ఇంటికి వచ్చి పోతున్నారు. గవరయ్యని దైవ దర్శనానీకనీ, హరికథనీ మరొకటనీ చెప్పి పిలుచుకు వెళుతున్నారు. ఊళ్ళోవాళ్ళు కూడా గవరయ్య వీధిలో వెళుతూంటే నమస్కారాలు పెడుతున్నారు. గవరయ్య మాత్రం ఏమీ మాట్లాడడు. మంత్రించిన వాడిలా ఆ దేవాలయంలో కానీ, హరికథలో కానీ కూచుంటాడు. సగంలో ఒక్కొక్కసారి చటుక్కున లేచి వెళ్ళిపోతాడు. పెద్దలు తలపంకించి రాక్షసముండా కొడుకు, ఒక్కరోజులో మారతాడా అనేవారు.



