Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    గవరయ్య తండ్రి చాలా దుర్మార్గుడట. జూదమూ, తాగుడూ రెండింటినీ సమపాళంగా అభ్యసించి ప్రాక్టీసు చేశాడుట. తల్లి రోగిష్టిదై మంచాన పడి ఉండేది. అందువలన గవరయ్య తండ్రి పొరుగూళ్ళో ఒకావిడని వుంచుకొన్నాట్ట. గవరయ్య చిన్నతనంలో తల్లి సంరక్షణ ఏమీ ఎరగనివాడు. తండ్రికున్న చెడ్డపేరువలన గవరయ్యతో ఎవరూ కలిసేవారుకాదు. ఆఖరికి ఆ వూరి బళ్లో కూడా చేరనివ్వలేదు. ఆ స్కూలు స్థాపించినాయన అక్కడ పేరొందిన భూస్వామి. ఆ భూస్వామితో గవరయ్య తండ్రికి ఎడతెగని వైరం. భూస్వామి పలుకుబడీ దైవభక్తీ వున్నవాడు. ప్రతి ఏటా సుబ్బరాయుడిషష్టి ఉత్సవాలూ అన్నసంతర్పణా చేయించేవాడు. గవరయ్య తండ్రి రౌడీ ముఠాతో చేరి ఆ ఉత్సవాలలో గలభా చేయించేవాడు. ఒకానొక ప్రాణావసర సమయంలో గవరయ్య తండ్రిచేత యిచ్చినదానికన్న రెండు రెట్లుకి తనఖా వ్రాయించుకుని ఉన్న భూమికాస్తా అన్యాయంగా కాజేశాడని గవరయ్య తండ్రి ఆరోపణ. కాని వూళ్లో పెద్దలు ఒక రౌడీ మాటల్ని నమ్మేటంత అవివేకులు కారు. అదేకాక వాళ్ళు చాటు మాటుగా వడ్డీ వ్యాపారం ఆ భూస్వామి పద్దతిమీదే చేస్తున్నారు కాబట్టి పెద్దమనిషి పరమ భక్తుడూ అయిన భూస్వామి యిలాంటి అక్రమం చేస్తాడని కలలో కూడా ప్రజాస్వామ్యం నమ్మదలుచుకోలేదు.

    గవరయ్య ఒంటరితనాన్ని చూసి బాధపడి తండ్రి ఒక కుక్కపిల్లనీ, రెండు పిల్లిపిల్లల్నీ తెచ్చి ఇచ్చి వాటితో ఆడుకోమనేవాడు.  "మనుషుల కంటె యివే నయం" అనేవాడు రోగిష్టి అయిన భార్యతో గవరయ్య బాల్యమంతా కుక్కలతో, చెట్లతో, గోడలతో ఆడుకుంటూ గడిపాడు. కొన్నాళ్ళకి రోగిష్టి తల్లి చచ్చిపోయింది. ఆమె చనిపోవడంతో గవరయ్య తండ్రి దుండగా లెక్కువయిపోయాయి. గవరయ్య తండ్రికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమె జబ్బుకోసం చాలా ఖర్చుపెట్టాడు. ఇప్పుడీమెకు చివరి రోజుల్లో వైద్యసహాయం చేయించలేకపోవడం భూస్వామి అక్రమం వల్లనేనని ఆలోచించిన గవరయ్య తండ్రి మరీ పేట్రేగిపోయాడు. భూస్వామి పాలేరు పొలంలోంచి వస్తుండగా ఎవరో వాడి తల రెండు చెక్కలయ్యేట్టు యినుపకడ్డీతో కొట్టారు. భూస్వామి తన అనుమానమంతా గవరయ్య తండ్రిమీద ఉందన్నాడు. గవరయ్య తండ్రిని అరెస్టు చేశారు. కేసుమోపారు. ఊళ్ళో అందరూ బలమైన సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు స్వయంగా చూసినా, చూడకపోయినా , భక్తిపరుడైన భూస్వామి ఆజ్ఞల్ని దైవాజ్ఞగా శిరసావహించారు. గవరయ్య తండ్రికి యావజ్జీవ శిక్షపడింది. తండ్రి ఆఖరి మాటగా కొడుకుతో 'ఎవర్నీ నమ్మకు, నీ కాళ్ళమీద నువ్వు నుంచో, ఈ మనుషులందరూ దొంగవెధవలు, విషసర్పాలు అని చెప్పి మరీ పోలీసులతో వెళ్లాడు.'

    తల్లిలేని , తండ్రిలేని గవరయ్య ఆ ఇంట్లో బెంబేలెత్తిపోయాడు. బెంగతో రెండురోజులు తిండీ తిప్పలు లేక ఇంట్లో మూలగా కూర్చుని పధ్నాలుగేళ్ళ గవరయ్య హోరుమని ఏడ్చాడు. ఎవరూ ఆ ఛాయలకి రాలేదు. పలకరించలేదు. రౌడీ, హంతకుడూ అయిన తండ్రి దుర్గుణాలు వీడికి సంక్రమించి ఉంటాయనీ, వీడికెంత దూరంలో ఉంటే అంత మంచిదని ఆ ఊళ్ళో మంచివాళ్ళందరూ అనుకున్నారు కాబోలు. గవరయ్యకి జ్వరం వచ్చింది. మందులేదు. మాకులేదు. జ్వరం స్పోటకంలోకి మారింది. ఆ ఇంట్లోంచి రాత్రుళ్ళు "అమ్మా చ్చచిపోతున్నానేవ్" అనే కేకలు వినవచ్చేవి భయంకరంగా దీనంగా.

    మశూచి అని తెలియగానే ఆ పొలిమేరలలోకూడా జనం నడవటం మానివేశారు. "ఈ కొడుకు కూడా పోతే ఊరికి పీడా వదిలిపోతుం" దన్నారు కొందరు. ఇలా వుండగా ఒకరోజు సాయంత్రం ఒక గుర్రబ్బండి గవరయ్య ఇంటిముందాగింది. దానిలోనుంచి నలభై ఏళ్ళ స్త్రీ దిగింది. ఒంటినిండా నగలున్నాయి. మనిషి బలంగా పొడుగ్గా ఉంది. చెంపలదగ్గరైనా జుట్టు నెరవలేదు. ఆ వీధి వీధంతా వింతగా ఆమెకేసి చూస్తూ నించున్నారు. కాని ఆమె పక్కకి కూడా చూడకుండా సరాసరి లోపలికి వెళ్ళిపోయింది . నౌకరు పెట్టెలన్నిటినీ లోపల పెట్టి తలుపులు దభాల్న వేసేశాడు.

    నౌకరు ద్వారా ఆమె గవరయ్య తండ్రికి యిలాకా వున్న ఆవిడనీ ఆరునెలలు పుణ్యక్షేత్రాలు సేవించి రెండురోజులక్రితమే తిరిగి వచ్చిందనీ, గవరయ్య తండ్రికి యావజ్జీవశిక్ష పడడమూ కొడుకు దిక్కులేనివాడై ఉండడమూ తెలిసి యెకాయెకిని సామాన్లు పట్టించుకుని ఆ ఊరు వచ్చేసిందనీ తెలిసింది. అంతే, నాటినుండీ గవరయ్య ఆమె సంరక్షణలో పెరిగాడు. జబ్బునుంచి కోలుకున్న గవరయ్య మరీ వికృతంగా వున్నా ఆమె లక్ష్యం చెయ్యలేదు. తండ్రితో సంబంధమున్నంత మాత్రాన ఈ చాతకాని వికారపు కొడుకు బాధ్యత తీసుకోవడంలోని అవివేకాన్ని ఒకరిద్దరు చొరవగల స్త్రీలు ఆమెకి చెప్పిచూశారు. కానీ ఎవర్నీ లక్షచేయని గుణం ఆమెలో ఉంది. కొన్నాళ్ళకి ఒక పిల్లని వెతికి తెచ్చి గవరయ్యకి పెళ్ళి చేసింది. గవరయ్య ఇరవయ్యోయేట ఆమె మరణించే ముందు గవరయ్యకి తన నగలూ, పదివేలు రూపాయల నగదూ యిచ్చివేసింది.

    తర్వాత అతనీ ఊరిలో మేనత్త ఇంటికి రావడం. తోళ్ళ వ్యాపారం చేయడమూ ఏడెనిమిదేళ్ళకు మొదటి భార్య పోవడమూ ఊళ్ళో అందరికీ తెలిసినదే. ఈ చరిత్ర అంతా ఆ గాజుల వర్తకుడి ముఖతః విన్న తర్వాత గవరయ్య అంటే ఉన్న వాళ్ళ అసహ్యభావం ఈసారి తార్కికమైన ఆధారంతో మరింత గట్టిపడింది. తండ్రి దుర్మార్గుడు, హంతకుడు, వీడు చిన్నతనంనుండి పిల్లులతో, కుక్కలతో కలిసి జంతు లక్షణాలు అలవరచుకున్నాడు. పైగా వీడి పెంపకం ఒక చెడిన స్త్రీచేత. ఇంతటి అమానుషుడు వచ్చీ వచ్చి తమ ఊళ్ళో పడ్డాడనే బాధ ఒకవైపున పీడించింది నలుగుర్నీ.

    అయినా అవదాని మొదలైన పెద్దలు మొదట నిరాశ చెందలేదు. గవరయ్య దుర్మార్గుడు -నిజమే. వికృత రూపుడు -అదీ నిజమే. పిసినిగొట్టు. ఎవరికీ కానీ రాల్చడు  -ఒప్పుకున్నాం. ఒంటెత్తు మనిషి, సభ్యత లేనివాడు అందరికీ తెలుసును. అయితేనేం ధనవంతుడు. ఆ ధనాన్ని సత్కార్యాలకు ఉపయోగించేటట్టు చూస్తే అతనికీ, పెద్దలకీ ముక్తి వుంది. ఇంత ఉదారాశయంతో ఎన్నోవిధాల ఎన్నోసార్లు గవరయ్యని కదిపిచూశారు. వేణుగోపాలస్వామి ఉత్సవాలన్నారు, మండపం కట్టించాలన్నారు, ఒకవైపు ఒరిగిన ప్రాకారం బాగుచేయించాలన్నారు. దేనికీ గవరయ్య లొంగిరాలేదు. చివరికి గుళ్ళోకివచ్చి దైవదర్శనం చేసుకుని ప్రసాదం తీసుకోమన్నారు. అది ఖర్చులేనిపని ఎప్పటికయినా గవరయ్య రాతిగుండెలలో భక్తి విత్తనం నాటుకుంటుందని వాళ్ళ ఆశ. కాని ఏనాడు గవరయ్య గుడి చాయలకి కూడా రాలేదు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.