Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
దేవుణ్ణి చూసినవాడు
గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్దం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది ఇంత తెలుగు దేశంలోనూ!
రోడ్ల కూడలిలో, కాఫీ హోటలు లో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయతీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ, పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను. అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీద మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా ఇంత అప్రదిష్ఠ ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువతులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.
"వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా" అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.
"పోనీ నువ్వే వాడితో లేచిపోకపోయావూ నీకు తెలిసొచ్చును" అంది అత్తగారు విసుగుతో, కోపంతో.
"గవరయ్యకి బాగా శాస్తి అయింది" అని ఏకగ్రీవంగా ఆబాలగోపాలమూ తీర్మానించారు. గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.
గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్పోటకం మచ్చలు., పెదాలు లావుగా మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళిపురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య ఉంటాడు.
"నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని" అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్లో ధర్మకర్త.
మునసబు చలపతీ, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.
"వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్య చేశాడా? ఒక్క మంచిమాట చెవినిపెట్టాడా?"
మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు "ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గవరయ్య. ఎంత అహం ఎంత పొగరు...."
"పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికేపోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్లి భజన చందాకి ఒక్క రూపాయి - ఒఖ్ఖ రూపాయి ఇమ్మంటే తరిమి కొట్టాడుట......" అన్నాడు కరణం.
గవరయ్య ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడుగా ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రీ లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను ఉంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ "హరీ హరీ" అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో ఇది చాలా పాపమనీ బెడిసికొడుతుందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిదికాదని చెప్పారు. "జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికిరాదు కాని" అని సమాధానమిచ్చాడట గవరయ్య. గవరయ్య ఒంటెత్తు మనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి "పాపం" "పుణ్యం" అని బేధాలు వున్నట్టు కూడా తెలియదు.
ఈ ఇరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు -ఉదారులూ, ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా ఇమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పారు. గవరయ్య గుండ్రంగా లోతుగావున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కిపెట్టి, విసుగ్గా విసురుగా "నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి" అనేవాడు. మంచి లేదు, మర్యాదలేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్షరూపాయలుండడం వల్ల అతని ఎదురుగా అలా అనలేదు, వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.
గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే మొదటి భార్యను తీసుకొచ్చాడు. ఆ భార్యనెక్కడికీ పంపేవాడుకాడు. పొరుగిళ్ళకు కూడా వెళ్ళేదికాదు. మేనత్తా , భార్యా, గవరయ్యా - ముగ్గురూ మూడు దెయ్యాలలా వుండేవారు. ఒక పుకారు కూడా వూళ్ళో వుండేది. గవరయ్య పెళ్ళాన్ని ఏదో భూతం ఆవహిస్తూంటుందనీ, ఊళ్లో ఎవరికి తెలియుకండా అందరూ నిద్రపోయే అర్ధరాత్రివేళ భూతవైద్యుడెవడో వచ్చి ప్రయోగాలు చేస్తాడనీ ధూపాలు వేస్తాడనీ చెప్పుకుంటూంటారు. ఇంత వంటరిగా సంఘజీవితంలో కలవకుండా వీళ్ళెలా వుంటున్నారో ఎవరికీ అర్ధంకాలేదు. కొంతకాలానికి గవరయ్య పుట్టిన వూరునుండి వచ్చానని చెప్పుకుంటూ కొన్నాళ్ళు ఆ వూరిలో ఒక గాజుల వర్తకుడు తిరుగుతుండేవాడు. అతను గవరయ్యను గురించి భోగట్టా అందజేశాడు.



