Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "ఎలా వుంది శంకరం" అంది రాజేశ్వరి.

    "వండ్రఫుల్" అన్నాడు శంకరం తేరుకుని. రాజేశ్వరి నవ్వింది. ఆ నవ్వులో ఏదో తృప్తి గర్వమూ ధ్వనించాయి.
 
    ఇరువురూ టేబులు మీద ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తున్నారు. శంకరం పరధ్యానంగా తింటున్నాడు. "ఏం శంకరం అదోలా ఉన్నావు" అంది రాజేశ్వరి.

    "ఎలా వున్నాను" అన్నాడు నవ్వుతూ శంకరం.

    "గ్లూమీగా"

    "నిన్నూ నీ యింటిని చూడటం ఒక అనుభవం సుమీ. అవును కాని రాజీ....." సందేహం ధ్వనించింది అతని గొంతులో.

    "ఏం" కుతూహలంగా చూసింది రాజేశ్వరి.

    "నన్ను పిలవడంలో నువ్వు తొందరపడి..."

    "నేను తొందరపడి నిర్ణయానికి రాననీ, వచ్చాక ఆ నిర్ణయం మారదనీ తెలుసుగా శంకరం."

    శంకరం నవ్వేశాడు. ఆమె. తన క్లబ్బుని గురించీ, అతను తన మిలిటరీ అనుభవాలు చెప్పుకుంటూ భోజనం పూర్తిచేశారు. భోజనానంతరం రాజేశ్వరి శంకరాన్ని డ్రాయింగ్ రూమ్ లో కూర్చోపెట్టి యిన్ని పత్రికలు అతనిముందు ఉంచి "బాబుని పడుకోపెట్టి వస్తాను. నౌకర్లని పంపివేస్తాను. ఈ పత్రికలు చూస్తూవుండు. ఇంతవరకూ గృహిణి అయిన రాజేశ్వరిని చూసి విసుగెత్తింది కదూ" అని ఆగి సిగ్గుతో ఓరగా చూసి "ఈసారి నీ రాజేశ్వరిగా వస్తాను" అని వెళ్ళిపోయింది. శంకరం మందహాసం చేశాడు.

    ఒక గంట అనంతరం తెల్లని చీరతో సిగ్గూ కోరికా కలవరపడే కళ్ళతో అప్సరసలా మెట్లుదిగి వచ్చింది రాజేశ్వరి. కాని డ్రాయంగ్ రూంలో శంకరం లేడు. వరండాలోకి వెళ్ళి చూసింది. అక్కడా లేడు. గేటు కాపలావాడు తనవైపే రావడం చూసింది. "దొరగారు వెళ్ళిపోయానని చెప్పమన్నారు. ఈ కవరు మీ కిమ్మన్నారు" అని లేత నీలపు రంగు కవరు ఆశ్చర్యంతో తెల్లబోయిన రాజేశ్వరికి యిచ్చి వెళ్ళిపోయాడు. ఆ కవరు తనదే. డ్రాయింగ్ రూమ్ బల్లమీద తన కవర్లూ రైటింగ్ ఫ్యాడ్డూ ఉన్నాయి.

    సంభ్రమంతో ఆశ్చర్యంతో కోపంతో ఆత్రుతగా కవరు విప్పి యిలా చదివింది రాజేశ్వరి.

    రాజీ,

    నన్ను క్షమించు. నేను వెళ్ళిపోతున్నాను, నేను నిన్ను కోరిన కోరిక ఎంత అసమంజసమో, అవివేకమో తెలుసుకున్నాను. నా మీద జాలివల్ల నువ్వు అంగీకరించావు. అయినా నేను చూసి చూసి ఒక పవిత్ర దేవాలయాన్నీ, లోనిదేవతనీ అపవిత్రం చేయలేను. పదేళ్ళ క్రితం రాజేశ్వరివి కాదు నువ్వు.  నువ్వూ, నీ భర్త, నీ కొడుకు, నీ యిల్లూ యివన్నీ పెనవేసుకుపోయిన స్త్రీమూర్తివి. నీ అణువణువూ నీ భర్తకి అంకితమయింది. మీ ఇద్దర్నీ విడదీసి చూడడం తెలివితక్కువ. నిన్ను విడిగా ప్రత్యేకంగా నేను పొందడానికి నీదగ్గర ఏమీ నీదనేదిలేదు రాజీ. నిర్మలమైన ఒక మనస్సును కెలికివేసేటంతటి కుసంస్కారినికాదు నేను. దాంపత్య జీవితం ఇంతగా ఒక వ్యక్తిని మారుస్తుందని ఉదాత్తం చేస్తుందని నే నెప్పుడూ ఊహించలేదు. ఈ చర్య జరిగివుంటే ఎంతో మానసిక సంక్షోభానికి కారణమై వుండేది. నిన్ను మరిచిపోయేందుకు ప్రయత్నిస్తాను. నీ కోరిక ప్రకారం పెళ్ళి చేసుకుని సతీమణితోనే నీకు మళ్ళీ కనిపిస్తాను.


                                                                 - శంకరం
                                                             (1967)


                                                           **********




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.