Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    "ఇది మా పెళ్ళినాటి ఫోటో. ఇది హనీమూన్ కి కాశ్మీరు వెళ్ళినప్పుడు. ఈ బొమ్మలన్నీ అవే! కాశ్మీరు ఎంత లవ్లీగా వుంటుందని..... ఇంకా ఆల్బమ్ లో చాలా బొమ్మలున్నాయి. ఇది ఆయనకి జనరల్ మానేజరుగా ప్రమోషన్ వచ్చినప్పుడు తీసిన ఫోటో - నాకూ ఓ పూలదండ వేశారులే"

    శంకరం మరొక ఫోటోని చూసి "ఇది -ఈ ఎన్ లార్జిమెంటు ఎవరిది?" అన్నాడు.

    "మా బాబుది. ఏడాది పిల్లవాడిది. ఎన్ లార్జి చేయించాం."

    శంకరం ఆశ్చర్యంగా "రాజీ నీకు పిల్లలున్నారా?" అన్నాడు.

    "భలే వాడివి. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టరేం?" అంది రాజేశ్వరి.

    "ఎంతమంది?"

    "ఒక్కడే"

    "అందుకే యింకా నీ వొళ్ళు...." ఆమెకేసి చూస్తూ ఆగిపోయాడు శంకరం. ఆమె ఫక్కున నవ్వి "సరే యింక భోజనం చేద్దామా?" అంది.

    "భోజనానికి తొందరేమిటి. ఏదీ నీ యిల్లంతా చూపించు రాజీ." అన్నాడు శంకరం కుతూహలంగా.
 
    ఆమె ఒక్కొక్క గదీ చూపించింది. భర్త లైబ్రరీ గది, ఆమె గదీ, వంటగదీ అన్ని చూసి అథన్ని మేడమీదకు తీసుకెళ్ళింది. "ఈ  బాల్కనీ అంటే వారికెంతో ఇష్టం. అలసిపోయి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుని ఆకాశాన్ని నక్షత్రాల్నీ చూస్తూ విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు నేను వీణమీద రెండు మూడు పాటలయినా వినిపించి తీరాలి" అంది రాజేశ్వరి.

    సగం అల్లిన ఊలు స్వెట్టర్ని చూపించి శంకరం "నీకు అల్లిక పని బాగా వచ్చునా రాజీ?" అన్నాడు.

    "ఏదో కొంచెం, కాలక్షేపం ఎలాగ చెప్పు. ఆయనకి స్వెట్టరూ మఫ్లర్లూ, అబ్బాయికి మేజోళ్ళు అల్లుతుంటాను."

    "నీ భర్త ఎప్పుడు వస్తాడు రాజీ?"

    "నాలుగైదు రోజుల్లో..." ఆమె ఆలోచనగా నిలబడిపోయింది.

    "ఏమి టాలోచిస్తున్నావు?" అన్నాడు శంకరం.

    "ఈవేళ ఆయన దగ్గర్నుండి ఉత్తరం రావాలి. రాలేదేమా అని!"

    "అందుకు పెద్దకారణం ఏముంటుంది రాజీ. పని తొందరలో రాయకపోవచ్చును" అన్నాడు శంకరం.

    "అది కాదు శంకరం. రోజువిడిచి రోజు వారు ఉత్తరం రాయకపోతే నాకు తోచదని వారికి తెలుసును" అంటూ సన్నగా నవ్వింది రాజేశ్వరి.

    శంకరం మరో సిగరెట్టు వెలిగించాడు.

    "ఈ రాధాకృష్ణుల దంతపుబొమ్మ ఎంత బాగుంది రాజీ. ఎక్కడ ఖరీదు చేశావు" అన్నాడు.

    "నా పుట్టిన రోజుకి ఆయన బహుమతిగా ఇచ్చారు"

    "ప్రతి పుట్టినరోజుకీ మీ ఆయన ప్రెజెంట్ యిస్తాడా?"

    "ఆఁ..... ఏం మరిచిపోయినా నా పుట్టినరోజూ, పెళ్ళిరోజూ ఆయన మరచిపోరు. ఇప్పుడు నేను కట్టిన చీర ఒక పుట్టినరోజు బహుమతే"

    శంకరం కిటికీలోంచి వెన్నెల పరుచుకున్న పట్టణాన్ని చూస్తున్నాడు.

    "ఏఁవిటి చూస్తున్నావు శంకరం" అంది రాజేశ్వరి.

    "ఇక్కణ్నుంచి వ్యూ బాగుంది" అన్నాడు శంకరం. అతని గొంతులో జీర వుంది.

    రాజేశ్వరి శంకరాన్ని మరో గదిలోకి తీసుకెళ్ళింది. గదిలో చిన్న టేబిలూ, చిన్న చిన్న కుర్చీలూ, చిన్న రైలుబండీ, మోటారు కారూ, రకరకాల ఆట వస్తువులూ - ముచ్చటగా వుంది. ఆరేళ్ళ కుర్రవాడు కాలుమీద కాలు వేసుకు పడుకున్నాడు. ఆయా మంచం వారనే కూర్చొని కథలు చెబుతోంది.

    "వీడే మా అబ్బాయి. సుందరరావు తాతగారిపేరు" అంది రాజేశ్వరి సుందరరావు లేచి కూర్చుని "ఈయనెవరమ్మా డాడీవచ్చాడేమో అనుకొన్నాను. డాడీ ఎప్పుడొస్తాడమ్మా" అన్నాడు ముద్దుగా!

    రాజేశ్వరి వాణ్ని ముద్దుపెట్టుకుని "వచ్చేస్తారు బాబూ, ఇంకా పడుకోలేదేం -నిద్ర రావడం లేదా" అంది.

    "నువ్వు రావాలమ్మా, నువ్వొచ్చి కథ చెబితేగాని నిద్రపోనమ్మా" అన్నాడు సుందరరావు బుంగమూతి పెట్టి.

    "అలాగే సుందర్. బువ్వతినివచ్చి నీకు కథ చెపుతాను. ఏం?"

    తల ఊపాడు సుందరరావు.

    "ఎవరి పోలిక రాజీ. మీ అబ్బాయిలో నీ పోలికలు కనిపించవేం" అన్నాడు శంకరం.

    "ఆయన పోలికే -ఆ నుదురూ ఆ పెదాలూ......" అంది రాజేశ్వరి గదిలోంచి వస్తూ.

    రాజేశ్వరి శంకరాన్ని పడకగదిలోకి తీసుకు వెళ్ళింది. లేత నీలపురంగు గోడలూ, రెండు పెద్ద స్టీల్ అల్మైరాలూ, తెరచివున్న వాటిలోంచి కనపడే ఖరీదైన చీరలూ, పాంట్లూ ముఖమల్ దుప్పటి పరచిన మంచాలూ, మొజెయిక్ ఫ్లోరింగూ, గోడలలో అమర్చబడిన విద్యుద్దీపాల మెత్తని వెలుతురూ, నిలువుటద్దాలూ -లవెండరు వాసన, విశాలంగా ఉన్న ఆ గది ఎంతో మనోహరంగా వుంది. దగ్గరగావున్న ఆ మంచాల మీద నారాయణరావూ రాజేశ్వరి దగ్గరగా కౌగిలించుకుని పడుకున్నట్టు కనపడ్డారు శంకరానికి . అతని గొంతులో డెక్కు పుట్టినట్టయింది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.