Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    "ఆలశ్యమైపోయింది."

    "భయమా రాజీ" అన్నాడు శంకరం.

    "నువ్వంటేనే? నీ దగ్గరా నాకు భయం?" అంది రాజేశ్వరి నవ్వి.

    "అయితే ఓసారి వచ్చి వెళ్ళు."

    రాజేశ్వరి కారు దిగి అతని వెనకాలే వెళ్ళింది. రూంలో ఆమెని సోఫాలో కూర్చోబెట్టి "ఇప్పుడు నువ్వు నా అతిథివి. ఏదైనా తీసుకోవూ" అన్నాడు.

    "ఇప్పుడేమీ వద్దు. అరె! టేబులు మీద అది నా ఫోటోయే!"

    "అవును నిన్ను నిత్యం చూస్తూవుండాలి రాజీ" శంకరం నవ్వాడు. "నేపా యుద్దంలో బ్రతికి తిరిగివస్తానని అనుకోలేదు. అప్పుడు కూడా నీ ఫోటో నా జేబులోనే వుంది."

    రాజేశ్వరి ఆ ఫోటోని పరీక్షగా చూసి "ఎంత చిన్నదాన్నో అప్పుడు ఎనిమిదేళ్ళు జరిగిపోయాయి" అని నిట్టూర్చింది.

    అల్మారాలోంచి బ్రాందీ తీసి టేబులుమీద పెట్టి "ఎనిమిదేళ్లు నాకు ఎనిమిది యుగాలు. నీకు క్షణంలో జరిగిపోయినట్టు ఉంది. అయినా రాజీ నువ్వు మరింత అందంగా -మరింత పరువంగా వున్నావు. ఇప్పుడు నీ వయస్సెంత రాజీ?"
 
    రాజేశ్వరి నవ్వి "ఇరవై ఎనిమిది" అంది.

    "కొంచెం మందు వేసుకోనియ్యి రాజీ. అలవాటయిపోయింది. అయినా ఎప్పుడూ మోతాదుగానే వుంటాను" అంటూ కళ్ళు చిట్లించి ఆమెకేసి నవ్వుతూ చూసి బ్రాందీ గ్లాసులో పోసుకుని తాగాడు.

    "మిలటరీ దుస్తులలో ఉన్న నీ ఫోటో ఒకటి నాకివ్వు శంకరం" అందామె.

    "ఒకటేమిటి నీకు కావాల్సినవి తీసుకో" అని ఆల్బం ఆమె ముందు పడవేశాడు.

    ఆమె ఒక ఫోటో ఏరి తీసుకుని లేచి నుంచుని "ఇంక వెళ్ళివస్తాను శంకరం" అంది. అతను మాట్లాడలేదు. తదేకంగా ఆమెను చూస్తూన్నాడు. ఆమె కొంచెం యిబ్బందిగా కదిలింది.  "ఏమిటా చూడడం?" అంది విసుగ్గా.

    శంకరం ఆమె దగ్గరకువచ్చి రెండుచేతులూ చప్పున పట్టుకున్నాడు. "రాజీ, ఈ రాత్రికి యిక్కడ వుండిపో, ఒకసారి పూర్తిగా నువ్వు నాదానివి కావాలి. ఇంక జీవితంలో ఏమీ కోరను. ఇంక నీకు కనిపించను. ఈ ఒక్క కోరిక తీర్చు రాజీ. ఈ తృప్తితో, ఈ స్మృతితో యింక చనిపోయినా ఫరవాలేదు. అదేం రాజీ అలా చూస్తావు. ఇది తప్పుగా భావిస్తున్నావా? నా కోసం, గుండెలో యింత పెద్ద ఎడారిని దాచుకొన్న నాకోసం -ఒకసారి.....ఒకసారి.." ఉద్రేకంతో ఎరుపెక్కిన మొహంతో అతనింక మాట్లాడలేకపోయాడు.

    ఆమె మెల్లగా చేతులు విడిపించుకొని "శంకరం నాకిష్టంలేదు" అంది నిర్భయంగా.

    అతనింకా ప్రాధేయపడుతూ "రాజీ రాజీ ఒక్కసారి......" అన్నాడు.

    రాజేశ్వరి అతన్ని సోఫాలో కూర్చోపెట్టింది. మృదువుగా లాలనగా అంది "పిచ్చివాడవై పోతున్నావు శంకరం.
 నువ్వడిగేది ఎంత అసహజమో, ఎంత అసంభవమో నీకు తెలియడంలేదు. నువ్వు పెళ్ళిచేసుకోవాలి. తప్పదు శంకరం!  నామాట విను!"

    శంకరం తల వాల్చుకుని కూర్చున్నాడు. అతని కన్నులలో నీరు చిమ్మింది.

    రాజేశ్వరి "నేను వెళ్ళివస్తాను. శంకరం! నువ్వు స్థిమితంగా ఆలోచించుకో" అంటూ అతని జుట్టు నిమిరి గదిలోంచి వెళ్ళిపోయింది. శంకరం మరి కాస్త బ్రాందీ పోసుకొని ఒక గుక్కలో తాగి గిర్రున తిరిగే పంకా వైపు చూస్తూ కూర్చున్నాడు.

                           *        *        *

    సివిలియన్ డ్రస్సులో ఉత్సాహంగా వచ్చిన శంకరాన్ని నవ్వుతూ ఆహ్వానించింది రాజేశ్వరి. ఆమె చాలా అందంగా అలంకరించుకుంది. ఇటూ అటూ అందంగా పెరిగిన గార్డెన్ చూస్తూ ఈలవేస్తూ వచ్చాడు శంకరం. ఆమె వొంటిమీదనుండి సుతారపు అత్తరు సువాసన అతన్ని సోకి గిలిగింత పెట్టింది. వరండాలో విద్యుద్దీపకాంతిలో నిలిచి వున్న ఆమె లావణ్యాన్ని అందాన్నీ వింతగా వెర్రిగా చూస్తూ  "రాజీ" అని చేతులు చాపాడు.

    "హుష్ -నౌకర్లింకా వెళ్ళలేదు" అందామె సిగ్గుగా.

    ఇద్దరూ డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నారు. రాజేశ్వరి మౌనంగా తలవాల్చి కూర్చుంది. శంకరం మెల్లగా "రాజీ నువ్విలాగ అనుగ్రహిస్తావని అనుకోలేదు. నీ చీటీ చూసినప్పట్నుంచీ ఎప్పుడు చీకటి పడుతుందా అని చూస్తూ వున్నాను" అన్నాడు.

    రాజేశ్వరి జవాబుగా నవ్వింది.

    శంకరం నలువైపులా దృష్టి సారించి  "చాలా పెద్దయిల్లే! ఈ ఫర్నిచర్ చాలా బాగుంది" అన్నాడు.

    ఆమెలో గృహిణీత్వపు గర్వం కళ్ళలో మెదిలింది. "బొంబాయిలో కొన్నాం. ఆయనా నేనూ కలిసి ఎన్నిక చేశాం" అంది.

    "మీ గార్డెన్ కూడా మనోహరంగా ఉంది రాజీ. అంతా నీ కృషి ఫలితమే అనుకుంటాను" అన్నాడు శంకరం.

    "ఒక్క నాకే కాదు. ఆయనకీ గార్డెనింగంటే ప్రాణం. ఇద్దరం కలిసి ఏ మొక్క ఎక్కడ నాటాలో, ఎక్కడ ఎలా వుండాలో వివరంగా ఆలోచించి ప్రణాళిక వేశాం. ఆయన గోతులు తవ్వడం, నేను మొక్కలు నాటడం, నేను బోదెలు చెయ్యడమూ ఆయన నీరు తోడడమూ -తోటమాలికి ఊరికే జీతం యిస్తున్నాం."

    శంకరం సిగరెట్టు అంటించి గోడమీద ఫోటోలు చూస్తున్నాడు. రాజేశ్వరి పక్కనే నిలబడి చెబుతోంది.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.