Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఆమె వినలేదు. నారాయణరావు బాగా డబ్బున్నవాడు. పెద్దచదువు చదివాడు. పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వీటితోపాటు మంచి ఆరోగ్యమూ రూపమూ ఉన్నవాడు. అతనంటే ఇష్టపడింది. అతనికి మాట ఇచ్చింది. ఇంత గొప్ప అవకాశాన్ని జారవిడుచుకోడం - ఒక బాల్య చాపల్యాన్ని నమ్మి, ప్రేమ అనే పదం పన్నిన యింద్రజాలంలో చిక్కుకుని - వొఠి తెలివి తక్కువ. మానవుడికి బుద్ది, హేతువు ఉన్నందుకు ఉపయోగం ఏమిటీ? ఇదీ ఆమె వాదం.
తండ్రికి ఆమె పట్టుదల తెలుసు. "నీ యిష్టం తల్లీ నీ సుఖమే నాకు కావల్సినది" అన్నాడు. తాను ఆ సాయంత్రం తోటలో మునిమాపువేళ కలుసురున్నాడు. చీకటి తన మనసులోని దిగులులా వ్యాపిస్తూంటే గాలి చెట్ల ఆకులలో ఏడుస్తూంటే ఆమెతో అన్నాడు "నువ్వులేని బ్రతుకు ఊహించుకోలేను రాజీ! బతకలేను. నాగుండె పగిలిపోతుంది రాజీ."
"ఇది బలంలేనివాళ్ళ మాటలు. ధైర్యం స్థయిర్యం లేనివాడవు. నన్ను పెళ్ళిచేసుకొని ఏం నిర్వాకం చెయ్యగలవు శంకరం? జీవితాన్ని, జీవితంలో కలిగే సంఘటనలనీ ఎదుర్కోలేని పిరికితనం నా కసహ్యమని తెలుసుగా? నువ్వంటే నాకు ఉన్న అభిమానమూ యిష్టమూ కూడా ఇటువంటి మాటలతో తుడిచి వెయ్యకు" అంది రాజేశ్వరి.
ఆమె పెళ్ళికాకముందే తాను మిలిటరీలో జేరాడు. మళ్ళీ ఇన్నేళ్ళకి కలుసుకున్నాడు. శంకరానికి కారు దిగి రాజేశ్వరితో బీచ్ వొడ్డున కూర్చోవడం కూడా ఎరగడు యీ ఆలోచనలతో. అతను ఎంతో బలవంతాన తన హృదయంలోని ఉద్రేకాన్ని అణచుకుంటున్నాడు. అక్కడక్కడ జనం జంటలుగా గుంపులుగా బీచ్ వొడ్డంతా ఉన్నారు. దశమినాటి వెన్నెలపడి సముద్రం అలలతో నురుగులతో గంభీరంగా మనోహరంగా ఉంది.
"నువ్వు సుఖంగా ఉన్నావా రాజీ?" అన్నాడు శంకరం.
"ఆఁ! నన్ను చూస్తే తెలియడంలేదూ" అని నవ్వింది రాజేశ్వరి.
"మరి థియేటరులో నన్ను చూసి ఏడ్చావెందుకూ? నువ్వు ఏడ్చినట్లు నాకు తెలుసు"
"అవును నిన్ను చూడగానే ఏదో బాధ కలిగింది. నావల్ల నువ్విలాగ అయిపోయావు కదా అని బాధ" ఆమె గొంతు మృదువుగా జాలిగా ఉంది.
"అంతేనా రాజీ! ఒఠి బాధేనా?" అతను కంగారుగా అడిగాడు.
"కాదు శంకరం నువ్వంటే నాకు అభిమానమూ ఉంది. నిన్నెప్పుడూ మర్చిపోలేదు....."
శంకరం హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె చేయిపట్టుకుని "రాజీ నన్ను ప్రేమిస్తున్నావా! మరి నీ భర్త....." అంటూంటే ఆమె నవ్వి యిలా అంది. "ఇలా తొందరగా నిర్ణయాలకి వచ్చేస్తావు నువ్వు శంకరం! నా భర్తని కోరి పెళ్ళిచేసుకున్నాను. సుఖపడ్డాను అన్ని విధాలా!"
శంకరం తెల్లబోయేడు. తన నిర్ణయం తప్పనీ, తాను సుఖపడడం లేదనీ తన వొళ్ళో ఆమె తలదూర్చి ఏడవాలని అతని రొమాంటిక్ ఉద్దేశం. కాని నిశ్చలంగా అందంగా నిండుగావున్న ఈ రాజేశ్వరి తన మీద స్నేహభావాన్నీ జాలినీ మాత్రమే ప్రదర్శిస్తోంది.
ఇరువురూ కొంతసేపు మౌనంగా కూర్చున్నారు. రాజేశ్వరి, దీనంగా వున్న శంకరాన్ని చూచి మళ్ళీ జాలిగా అంది. "నువ్వు పెళ్ళిచేసుకోలేదు కదూ?"
"లేదు"
"చేసుకోవా శంకరం?"
"ఉహుఁ"
వెన్నెల వెలుగులో శంకరం కళ్ళు తడితడిగా వుండడం ఆమె చూసింది. "ఎవరిమీద నీ కోపం శంకరం! వెర్రివాడివిగానీ, నువ్వు పెళ్ళిచేసుకుంటే నీ జీవితం మారిపోతుంది. నీకు ఒక గమ్యం ఏర్పడుతుంది. నా మాట వినవా?" అంది బతిమాలుతూన్న గొంతుతో.
"నీ బొమ్మ ఈ మనసులోంచి చెరగిపోదు రాజీ. అంతవరకు పెళ్లాడలేను." అన్నాడతను బరువుగా గాద్గదికంగా.
రాజేశ్వరి తల తిప్పుకుంది. ఇసుకలో చూపుడువేలుతో వలయాలు గీస్తోంది. ఆమె కన్నులలో క్రమ్మిన నీరు శంకరం చూడకూడదని ఆమె ప్రయత్నం. కొంతసేపటికి తేరుకొని వెన్నెలలాగ నవ్వి "సరే , నీ మిలిటరీ కబుర్లు చెప్పు, ఇప్పుడు నువ్వు బ్రిగేడియర్ వా? జనరల్ వా?" అంది.
"మేజర్ని"
శంకరం తన అనుభవాలు చెప్పసాగాడు. ఆమె శ్రద్దగా వింది.
బీచ్ లో జనం బాగా పల్చబడ్డారు. సముద్రపు అలలు యిందాకటికన్న కోపంగా బలంగా వొడ్డుకు తగిలి విరుగుతున్నాయి. ఆమె లేచి "ఇక పోదామా?" అంది.
శంకరం ఆమెను అనుసరించాడు.
కారు నడుపుతున్న రాజేశ్వరి రేగిన ముంగురుల్నీ అవయవాల వయ్యారాన్నీ ఎర్రని పెదవుల్లో తియ్యని పట్టుదలనీ చూస్తూ కూర్చున్నాడు శంకరం. అతనిలో ఏదో కోరిక బలవత్తరమైన నరనరాలలోనూ వెచ్చగా పదునుగా వ్యాపించింది.
"ఇదే నా హోటలు. ఇక్కడాపు రాజీ" అన్నాడు శంకరం. రాజేశ్వరి కారు ఆపింది.
"ఒక్కసారి నా రూమ్ కి రారాదూ. ఓ నిమిషం కూర్చుని వెళుదువుగాని" అన్నాడు శంకరం.



