Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                       
                                                    పరివర్తన

    థియేటర్ అంతా జనంతో నిండి ఉంది. పావుగంట ఆలస్యంగా మిలటరీ దుస్తులలో  వచ్చిన శంకరానికి బ్యాటరీలైటు వేసి చూపిస్తున్నా సరే, సీటు వెతుక్కోవటం కష్టమయింది. తడబడుతూ కాళ్లు తొక్కుకుంటూ చివరికి సీటులో చతికిలబడ్డాడు. ప్రేక్షకులందరూ ఏకాగ్రతతో తెరమీద కథలో నిమగ్నులై ఉన్నారు. బరువుగా విడుస్తున్న వాల్ళ ఊపిరి చప్పుడు శంకరానికి వింతగా తోచింది. తెరమీద మంచుదట్టంగా కప్పిన పట్టణఁలో ఒక భాగం, ఓవరాల్స్ వేసుకున్న వ్యక్తులు రోడ్డుమీద మంచులో స్పష్టాస్పష్టంగా గోచరిస్తూ నడుస్తున్నారు. ఒక చర్చి కిటికీలోంచి ముసలివాడు నిర్లిప్తంగా మంచుని మనుష్యుల్ని పరికిస్తున్నాడు. హఠాత్తుగా పిస్తోలు పేలిన చప్పుడు. రోడ్డుమీద ఓ వ్యక్తి "అబ్బా" అంటూ ఒరిగాడు. బూట్ కాళ్ళు కలదొక్కుకుంటూన్న చప్పుడు........ శంకరంచేతిమీద ఎవరిదో మెత్తని చేయిపడింది. శంకరం పక్కకి చూశాడు. ఒక యువతి చప్పున చేయి తీసేసుకుని "సారీ" అని తెరవైపు చూస్తూ వుంది. హిచ్ కాక్ పిక్చర్ యొక్క ప్రభావం అనుకున్నాడు శంకరం ఆమె కలవరపాటు చూసి,. అతనికి కథ అర్ధందావటం లేదు, ఆలస్యంగా రావటంమూలాన, ఆమె శ్రద్దగా తెరమీదకి చూస్తున్నట్టు అనిపించింది. అయినా నిశితంగా వెచ్చగా తనకి ఆ చూపులు తగులుతూన్నట్టు ఉంది శంకరానికి. ఆమె వైపు చూడాలనుకుని కూడా అతను కుతూహలాన్ని అణుచుకున్నాడు. ఇంతలో ఆ యువతి ఏడుపుని నొక్కిపట్టిన సన్నని ధ్వని ఆగి ఆగి అతనికి వినబడింది. వింతగా ఆమెవైపు చూశాడు. పరీక్షగా, నిదానంగా చూశాడు. రాజేశ్వరీ! శంకరం వొళ్ళూ మనస్సూ ఒక్కసారిగా వేడిగా కంగారుగా అస్తిమితంగా అయిపోయింది. కొంతసేపటికి తమాయించుకొన్నాడు. ఆమె చేతిమీద చెయ్యివేసి "రాజీ" అన్నాడు.

    "బాగున్నావా?" అంది రాజేశ్వరి నిట్టూర్పుని, మాటల్నీ నొక్కిపట్టి శంకరం చేతినుండి ఆమె తనచేతిని మెల్లగా తీసేసుకుంది. ఇద్దరూ ఓ ఐదు నిముషాలపాటు నిశ్శబ్దంగా ఉన్నారు. వాళ్ళు తెరవైపు చూస్తున్నారుగాని వారి దృష్టి అటులేదు. థియేటర్ లో వెచ్చబడిన చీకటికన్న దళసరైన ఉద్రేకం వారిరువురినీ చుట్టుకుంది.

    "నీతో మాట్లాడాలి" అన్నాడు శంకరం గొంతును బాగా తగ్గించి! ఆమె వెడల్పయిన తెల్లని కళ్ళతో అతనికేసి చూసింది.

    "బీచికి పోదాం వచ్చెయ్యి" అన్నాడు శంకరం. ఆమె తల ఊపింది! అరువురూ లేచి అడుగులో అడుగు వేసుకుంటూ
థియేటరు బయటికి వచ్చేశారు. విద్యుద్దీపకాంతిలో ప్రౌఢంగా అందంగా ఆకర్షణీయంగా ఉన్న ఆమె ముఖాన్ని, అవయువాల్నీ చకితుడై చూస్తూ నిలుచునిపోయాడు శంకరం. రాజేశ్వరి కొంచెం కలవరపడి నవ్వి - "ఏవిఁటా వాలకం. రా పోదాం!" అంది. శంకరం అనుసరించాడు.

    ఆమె కారువద్దకు వచ్చింది. లోపల స్టీరింగు దగ్గర కూర్చుంటూ  "ఎక్కడికి పోదాం!" అంది అతను ఎక్కి కూర్చోగానే.

    "డ్రైవర్ లేడా?"

    "రమ్మన్నాను. సినిమా వదలే సమయానికి వస్తాడు.

    "మరి-"

    "ఇక్కడ లేకపోవడం చూసి ఇంటికి వస్తాడు."

    "మీ ఆయన?"

    నవ్వింది రాజేశ్వరి. "ఊళ్ళో లేరు - క్యాంపుకి వెళ్ళారు" ఓ సెకను ఆగి మళ్ళా యిలా అంది. "ఉంటే మాత్రం? వారికి నామీద నమ్మకమే...."

    శంకరం నిట్టూర్చాడు. అదే పట్టుదల , అదే వ్యక్తిత్వం, అదే స్వతంత్రం ఈ రాజేశ్వరిలో అనుకున్నాడు. అతనికి జరిగిపోయిన రోజులన్నీ జ్ఞాపకం వచ్చాయి. రాజేశ్వరీ, తనూ గాఢంగా ప్రేమించుకున్నారు బాల్యం నుండీ, కొనదేరిన ముక్కుతో పెద్ద ఎఱ్ఱని వంపుతో ఒక పట్టుదలా వెడల్పాటి కళ్ళల్లో తెలివైన వెలుతురూ, వెన్నెల పాలరాతి శిల్పంమీదపడి జారిపోతున్నట్టుగా అనిపించే అవయవ లావణయ్యమూ-  రాజేశ్వరి అతన్ని స్వప్నంలో స్వగతంలో ఆక్రమించుకుంది. అతని బతుక్కి ఒక అర్ధాన్ని స్వప్నంలో స్వగతంలో ఆక్రమించుకుంది. అతని బతుక్కి ఒక అర్దాన్ని ఆవేశాన్ని యిచ్చింది.  ఇరువురి స్నేహాన్ని చనువునీ ఎవరూ అడ్డపెట్టలేదు. తప్పుగా తీసుకోలేదు. వారి కుటుంబాల మధ్య ఉన్న సాన్నిహిత్యమే. అటువంటిది.... అదే కాదు, వారిరువురూ భార్యా భర్తలౌతారనే అనుకున్నారందరూ, ఆమె ఆనర్సు చదవడానికి దూరం వెళ్ళింది. తాను ఉద్యోగంకోసం  ప్రయత్నస్తున్నాడు.  ఆమె సెలవులకి వచ్చినప్పుడల్లా కలసికొనేవాడు. గంటలకి గంటలు కబుర్లు చెప్పుకునేవారు. సినిమాలకి వెళ్ళేవారు.  రాజకీయాల్ని గురించి సాంఘిక వ్యవస్థల్ని గురించీ విశ్వాసాల గురించీ - చర్చించుకొనేవారు. ఆమె తెలివైనది. ఎటువంటి సమస్యనీ ప్రాక్టికల్ గా ఆలోచించి తూచి నిర్ణయం చేయగల శక్తి ఉంది ఆమెకు. ఆమె ఉద్రేకానికి లోనుకాదు. దాన్ని శాసించగలదు. బుద్దియొక్క అదుపులో ఆచరణలో ఆమె ఉద్రేకాలు నిలిచి  ఉంటాయి. అందుకే ఆమె తనని, తన జీావితాన్ని, తన భవిష్యత్ కుటుంబాన్నీ అందంగా ప్రయోజనకరంగా సుఖవంతంగా తీర్చిదిద్దగలదని అతను నమ్మాడు.

    ఫైనలియరు పరీక్షలు వ్రాసి చదువుతో, వయస్సుతో, మరింత పొడుగ్గా అందంగా పెరిగిన రాజేశ్వరి తనని ఏకాంతంగా పిలిచి,  "శంకరం, నిన్ను నేను పెళ్లిచేసుకోను" అని చెప్పినప్పుడు తనను నమ్మలేకపోయాడు. ఆమె ఒక్కొక్కటే కారణాలు విశదీకరిస్తుంటే ఒక్కొక్క నిలువులోతు లోపలికంటా అదఃపాతాళానికి అందకార సముద్రంలోనికి అతను మునిగిపోయాడు. అతనికి తన జీవితాన్ని ఎవరో సగానికి నిర్దయగా చీల్చి రెండుముక్కల్నీ చెరోవైపుకీ విసిరేసినట్టు అనుభవం పొందాడు. చివరికి ఆమె తండ్రికూడ అన్నాడు. "మనం ఎరిగున్న శంకరాన్ని కాదని ఆ నారయణరావుని పెళ్లి చేసుకోవడం అన్యాయం అమ్మా" అని.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.