Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఈసారి అధికారి మొహం మారిపోయింది. ఆ తరువాత ఆవేదన మొహంలో కనబడింది. "ఏమైంది... ఏమైంది" అన్నాడు.
"తలకి, కాలికి గాయాలు తగిలాయండి. ఒకటే రక్తమండి. తక్షణం నా జేబురుమాలు తలకికట్టి ఆ కుర్రవాణ్ణి ఎత్తుకొని హాస్పిటల్ కి వెళ్ళానండి. అక్కడ చికిత్స చేయించి కట్టుకట్టించి , డాక్టరుగారు ఫరవాలేదన్న తరువాత ఆ కుర్రవాడింటికి ఫోనుచేయించి మరీ వచ్చానండి. ఇంటికెళ్ళి బట్టలు మార్చుకొని...."
"ఏం డేంజరు లేదుగదా. డాక్టరు గట్టిగా చెప్పాడా" ఫైర్ అలారంలా మోగింది అతని గొంతు. "
"మరేం ఫర్వాలేదండి. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యం చేయించాకదండీ. సెప్టిక్ అవకుండా పెన్సిలిన్ ఇవీ అవీ ఇంజెక్షన్లు ఇచ్చాడండి డాక్టరు."
" ఆ కుర్రాడు కళ్లు తెరిచి మాట్లాడుతున్నాడా?"
"చిత్తం..... మొదట్లో కొంతసేపు తెలివిలేదండి, ఇప్పుడు మా అమ్మ కావాలి అని అంటున్నాడండి. ఈపాటికి తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళే ఉంటారండీ!"
మేనేజరు మొహంలోని బాధ క్రమేణా తగ్గింది. "మీరంతా వట్టి బ్రూట్స్. సైకిలెక్కితే ఏదో పెద్ద నిషా వచ్చేస్తుంది కాబోలు మీ అందరికీ. రోడ్డుమీద పిల్లలు- అమాయకులైన పిల్లలు - ఉంటారని ప్రాధమిక జ్ఞానంకూడా పోతుంది కాబోలు. ఇకనైనా జాగర్తగా మసులుకో. నిన్ను క్షమించాను. నువ్వు వెళ్ళి నీపని చూసుకో. నా మనసంతా అదోలా అయిపోయింది" అన్నాడు మేనేజరు.
శాల్యుట్ చేసి వెనక్కి తిరిగి తోటి గుమాస్తాల మధ్యకి వచ్చిపడ్డాడు. గంగాధరం సగర్వంగా సహనంగా. "ఏం జరిగింది? ఏం జరిగింది?" అంటూ చుట్టూ చేరి అడిగారు అందరూ. "భాయ్ వీడు గంగాధరం ఏమిటనుకున్నారో" అంటూ నవ్వుతూ ఫైల్సితీసే గంగాధరాన్ని ఏదో మహిమాన్వితుడిలాగా, హఠాత్తుగా అణిమాదిసిద్దులు లభించిన యోగీశ్వరుడిలాగా, వెఱ్ఱిగా చూశారు. మనసులోనే నిర్మలని తలచుకొని ధన్యవాదాలర్పించాడు గంగాదరం.
ఈ ప్రమాదవార్త విని సగం డీలా అయిన మేనేజరు కాస్సేపట్లో తిరిగి కోలుకోని, ఒక్కసారి నిట్టూర్చి, తన పనిలో నిమగ్నుడయ్యాడో లేదో, గణగణమని టెలిఫోను మోగింది. తాపీగా చెవిదగ్గర పెట్టుకొని "హలో" అన్నాడు. అవతల రకొననుండి కంగారుగా భార్య గొంతు "ఏమండీ మీరేనా,. అయ్యో అర్జంటుగా రండీ. ప్రమాదం అండి అబ్బాయికి ప్రమాదం జరిగిందండీ. ఎవడో సైకిలు మీదనుంచి పోనిచ్చాడండీ. తలంతా రక్తమండీ త్వరగా రండీ."
మేనేజరు గుండె ఆగి, తిరిగి ఎగిరి గొంతుకలోకి అడ్డంగా వచ్చేసింది.
అతని మొహం తెల్లబడిపోయింది. మాట వణికింది. "ఎవడా వెధవ ఆ సైకిలు తొక్కినవాడు?" అన్నాడు.
"ఆ దుర్మార్గపు వెధవ సైకిలు ఆపకుండా దిగకుండా రయ్యిమని కొట్టుకొని పారిపోయాడండీ, వాడికాళ్లు విరగ- త్వరగా రండి"
"అవేంమాటలండీ మీరు మరీన్నూ తలమీద గాయంపడింది అంతే. గాయంకడిగి గుడ్డతో కట్టాను. మన డాక్టరుకు ఫోను చేస్తే లేడు. ఇంకొక డాక్టరిని ఎవరినైనా వచ్చేటప్పుడు తీసుకురండి. నెత్తురింకా కొంచెంగా వస్తూనే వుంది. ఆలస్యం చెయ్యకండి." అంది.
మేనేజరు కిప్పుడు శ్వాస ఆడింది. కాని క్షణంలోనే అతని మొహం కోపంతో కందగడ్డలా అయిపోయింది. కోటు చేత్తో తీసుకుని. ఆఫీసుగదిలోంచి ఇవతలికి వచ్చి గంగాధరంకేసి విషం కక్కుతూ చూశాడు.
"ఏయ్ -యిలారా."
ఆ పిలుపుకీ చూపుకీ గతుక్కుమన్నాడు గంగాధరం. "సార్" అన్నాడు దగ్గరగా వచ్చి.
"నువ్వెవరిమీదనుంచి పోనిచ్చావో తెలుసునా సైకిల్ని...?"
గంగాధరం ఏమిటన్నట్లు వెర్రిగా చూశాడు.
"మా అబ్బాయి మీదనుంచి, లేకలేక కలిగిన ఒక్క కొడుకుమీద నుంచి. మా ఆవిడ ఇప్పుడే పోను చేసింది. పైగా ఆగకుండా పారిపోయావుట. నీ అంత నీచుడూ, దుష్టుడూ, అల్పుడూ, అధముడూ ప్రపంచంలో ఉండడు. నామీద నీకున్న గ్రడ్డి మూలాన్ని చెయ్యాలని చేసినట్టు కనబడుతోంది. నిన్ను అరెస్టు చేయించాలి న్యాయానికి. కాని నీ పాపం నిన్నే కొడుతుంది. నిన్ను డిస్మిస్ చేశాను పో -ఆఫీసులోంచి పో-" అంటూ మేనేజరు ఊగిపోయాడు కోపంతో.
గంగాధరం ఏమీ అర్ధంకాక గుటక మింగాడు. 'సార్' అనబోయాడు.
"నువ్వేం చెప్పనక్కరలేదు. ఇంకొక నిముషం ఎదురుగా ఉంటే నిన్నేం చేస్తానో నాకే తెలియదు. ఏమయ్యా హెడ్ గుమాస్తా, ఇతనికి ఏదైనా ఇవ్వవలసింది ఉంటే తక్షణం ఇచ్చి పంపెయ్యి. మళ్ళీ నా కళ్ళకి కనబడ్డావంటే అరెస్టు చేయిస్తాను. జాగ్రత్త" అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అధికారి వెళ్ళిపోయాడు.
కాసేపటికి వెర్రివాడులాగా, సర్వం పోగొట్టుకున్న వాడిలాగా మూర్తీభవించిన శోకంలాగ వచ్చిన గంగాధరాన్ని చూసి కలవరపడింది నిర్మల. అతని నోటినుండి జరిగిన కథ విని నిశ్చేష్టురాలైంది. జాలిగా తల రెండు చేతుల్తో పట్టుకుని కుర్చీలో కూర్చున్న గంగాధరాన్నీ, అతని అందమైన మొహంమీదపడే నల్లని వంకీలజుట్టునీ చూసేటప్పటికి ఆమె కనుకొలకుల్లో తెల్లని నీటిబిందువు తళతళలాడింది.
(ఆంధ్రపత్రిక వారపత్రిక 19 నవంబరు, 1958)
*******



