Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
మొదట తడితడిగా కనబడి తర్వాత బలం సంతరించుకొని బిందురూపం తాల్చికొని, కనుకొలకుల నుండి రెండశ్రువులు నిర్మల కపోలాల మీద మెల్లగా జారాయి. గంగాధరానికి గబుక్కున జాలి వేసింది. అతనికి ఏ వూహ తట్టినా, ఏ అనుభూతి కలిగినా గబుక్కున కలుగుతుంది. "ఏదో కోపంలో అన్నాను నిర్మలా, నీ తప్పేమీలేదు. కాతాకొట్టు తెరిచేటప్పటికీ యీవేళ తొమ్మిదయింది. అవునుకాని యిప్పుడేమిటి చేయడం?" అన్నాడు గంగాధరం.
నిర్మల తడికళ్ళు ఒకసారి మెరిశాయి. మంచుపడుతూన్న వేకువపొద్దు మీద చటుక్కున సూర్యకిరణాలు పడ్డట్టు బిక్కపోయిన ఆమె మొహం ఒక్కసారి వెలుగుతో ఉద్దీప్తమయింది. తన భర్తకి నెల నెలా వచ్చే జీతపురాళ్ళని రక్షించే ఒక ఉపాయం ఆమెకు తట్టివుండాలి.
గంగాధరం ఆశగా ఆమెకేసి చూశాడు. ఊపిరాడకుండా నదితో కొట్టుకుపోతున్న అతనికి ఆమెలో స్పురించిన ఊహ అనే పడవచెక్కని పట్టుకొని గట్టుకు చేరుకోవాలనుకున్నాడు.
"నాకో ఊహ తట్టిందంటీ" అంది నిర్మల. "నిజంగానా" ఆతృతగా అన్నాడు గంగాధరం.
"నిజమేనండీ. మా స్కూల్లో యిదివరకు ఓ మేస్టరు ఉండేవాడు. ఆయన చాలా కోపిష్టి. పెద్ద పెద్ద మీసాలతో గండుమమొహంతో అచ్చంగా పెద్దపులిలాగ ఉంటాడు. ఓనాడు నేను స్కూలుకి బాగా ఆలస్యంగా వెళ్లాను. ఆయన కళ్ళెర్రజేసి ఎందుకింత ఆలస్యమయిందని గర్జించాడు. ఒకవేళ ఆడపిల్లనని చేయిచేసుకోకపోయినా, అక్కడ ఎండలో ఇసుకలో నుంచోబెడతాడు. మగపిల్లలు ఏడిపిస్తారేమో అని నాభయం. నాకు భయంతో సిగ్గుతో ముచ్చెమటలు పోశాయంటే నమ్మండి. నాకు చటుక్కున జ్ఞాపకం వచ్చింది. ఆయనకి మాతృప్రేమ ఎక్కువనీ, మాతృపూజకన్నా జీవితంల పరమార్ధం మరొహటి లేదనీ -చూడండి మీరేదో కాంప్లెక్సూ గీంప్లెక్సూ అంటారు. అలాగ అన్నమాట. అంతే మా అమ్మ ఊరగాయలు కోసం అటక ఎక్కబోతూ నిచ్చెనమీదనుంచి పడిందనీ, ఆమె కాలికి మర్దనా, అదీ చేసి ఆవిడకి భోజనం పెట్టి. నే నన్నం తిని వచ్చేటప్పటికి ఆలస్యమయిందనీ మాంచి వొడుపుగా అబద్దం ఆడేశాను. దాంతో అంత పెద్దపులీ అహింసావాది అయిన మేక అయిపోయాడనుకోండి. నన్ను దగ్గరకు పిల్చి నా తల నిమిరి. విద్యార్ధులందరికీ నన్నొక ఆదర్శం కింద చూపించి గౌరవించాడు మా మేష్టారు"
ఆమె ఆగింది భర్తకేసి భావయుక్తంగా చూస్తూ. పాపం భయావస్థలో నున్న గంగాధరానికేమీ స్పురించలేదు.
"ఈ కథకీ నా ఏడుపుకీ సంబంధం ఏమిటి?" అన్నాడు విసుగ్గా.
భర్త తెలివితేటల్ని గురించి కొంచెం నిరసనగా, జాలిగా నవ్వి, విడమర్చి యిలా చెప్పింది నిర్మల. "చూడండి, మీ 'బాస్'లో ఎక్కడో వీక్ పాయింట్ ఒకటి ఉంటుంది. దానిమీద మీరు 'ప్లే' చెయ్యాలి. ఎంత కోపంలో ఉన్నవాడైనా, అతనికి యిష్టమైన, ఆప్యాయమైన ప్రసక్తి తీసుకువస్తే చటుక్కున మెత్తబడిపోతాడు, మా మేష్టారులాగా, ధైర్యం తెచ్చుకోండి, ఆలోచించండి"
గంగాధరానికి ఆమధ్య తోటి గుమస్తా ఒకడు చెప్పిన విషయం సమయానికి జ్ఞాపకం వచ్చింది. ఒక్క ఉదుటున లేచి ఆమెని కావలించుకొని "మై ప్రెషస్! నువ్వు నిజంగా నన్ను రక్షించడానికి వచ్చిన దేవతవు. అందుకే కార్యేషు మంత్రీ, కరణేషు దాసీ (పాపం తిరిగేశాడు కంగార్లో) అన్నారు పెద్దలు. మా అధికారికి ఓ పెద్ద వీక్ నెస్ ఒకటి వుంది. అదేమిటంటే ఆయనకి చాలాకాలం పిల్లలు లేరు. ఈమధ్యే మూడు నాలుగేళ్ళక్రితం ఒక పిల్లాడు కలిగాడు. ఆయనకు పిల్లలు అంటే ఎంతో పిచ్చట. ఆ రోజుల్లో మిఠాయీ బొమ్మలు కొని చుట్టుప్రక్కల ఉన్న పిల్లలకు వారం వారం పంచి పెట్టేవాడుట. ఇప్పటికీ ఈయన ఉన్న వీధిలో ఏ పిల్లవాడికి జ్బబుచేసినా స్వయంగా వెళ్ళి కష్టసుఖాలు విచారించి అవసరమైతే స్వయంగా డాక్టర్ని కూడా తీసుకువెళతాడట. ఎవరికీ కానీ రాల్చనివాడు నిరుటేడు అనాథ శిశుశరణాలయానికి రెండువందలు - టూ హండ్రెడ్ అడగ్గానే యిచ్చి పారేశాడుట. ఏదీ, నా అమెరికన్ షర్టు ఇలా పడెయ్యి, ఓహో బ్యూటిఫుల్ అయిడియా"అంటూ అతనోవిధమైన నాట్యం చేశాడు.
"మీరు షర్టు తొడుక్కునే ఉన్నారండీ" అంది నవ్వుతూ నిర్మల. గోధుమరంగు పాంటుమీద షార్కుస్కిన్ బ్లౌజు వేసుకొని, జుట్టు అందంగా మొహంమీద పడుతుంటే సైకిలెక్కి సంతోషంగా వెళ్ళే భర్తను చూసి నిర్మల ఒకసారి సరికొత్తగా ప్రేమించినంత ఆనందమును, గర్వమూ పొందింది.
గంగాధరం వచ్చినట్లు తెలిసిన మేనేజరు తన గదిలోంచి గంగాధరాన్ని పిలిచాడు. మాంచి ధీమాగా, ఏ సంకోచమూ లేకుండా వెళ్ళే గంగాధరాన్ని చూసి సోదర గుమాస్తాలంతా తమ కళ్ళను తామే నమ్మలేక ఒకసారి కళ్ళు నులుముకు చూశారు. వినయంగా మేనేజర్ ముందు నిలబడ్డాడు గంగాధరం.
"నీ ప్రవర్తన నాకర్ధంకావటంలేదు. నీకు బొత్తిగా భయమూ, భక్తి లేకుండా పోయాయి. ఇది ఆఫీసని, ఇక్కడ నీవు జీతగాడివనే స్పృహ కూడా నీకు లేనట్లుంది. ఇదివరకు నీకు మూడుసార్లు వార్నింగు యిచ్చాను. నా మాట నీకు లక్ష్యం ఉంటేగా, ఇంక నీ విషయంలో కన్సిడరేషన్ ఏమీ చూపలేను. ఇంక నువ్వు ఫలితం అనుభవించక తప్పదు." అని కోపంగా నిక్కచ్చిగా ఆరోహణావరోహణలు పాటిస్తూన్న గొంతుతో, మీసం కొనల్ని మెలివేస్తూ కళ్ళెర్రచేస్తూ మాట్లాడే మేనేజరును చూస్తూంటే ఠీవిగా వెనకాలే నడిచివెళ్ళి 'జింకని, అమ్మని' నోట కరచుకునే పులిలోని ఒడుపూ, నిశ్చయమూ గంగాధరానికి స్ఫురించేటప్పటికి అతని గుండె కొన్ని సెకనులు పనిచెయ్యలేదు. భయం భయంగా వణికే గొంతుని సరిచేసుకుంటూ ఇలా అన్నాడు.
"చిత్తం..... ఏక్సిడెంటు జరిగిందండీ... తమరు క్షమించాలి."
"ఏక్సిడెంటా?" ఎగాదిగా చూశాడు మేనేజరు. "నువ్వు బాగానే వున్నావే" అన్నాడు.
"ఆఫీసుకి ఆలస్య మవుతుందేమోనని తొందరగా వస్తున్నానండి. చటుక్కున్న దారికడ్డంగా ఒక చిన్నపిల్లవాడు వచ్చాడండీ. సైకిలు ఆ కుర్రవాణ్ణి ఢీకొన్నదండి."



