Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                   
                                          నిర్మల మొగుడు


    ఖంగారు ఖంగారుగా భోజనంచేస్తున్న భర్త మానసిక పరిస్థితినీ, మొహంమీద పడుతున్న నల్లని వంకీలజుట్టునీ, అదోవిధమైన ఆనందాన్నీ అందాన్నీ సూచించే అతని రూపాన్ని చూసేటప్పటికి జాలివేసింది నిర్మలకు.

    "తాపీగా తినండి. మీకిష్టమని ఈ గోంగూరపచ్చడి కూడా వేశాను. మీరలాగ కంగారుగా తినివెళ్ళిపోతే నా మనసంతా ఎంతో బాధపడుతుంది."

    "ఒళ్ళమ్ముకున్నాక తప్పుతుందా మరి! ఆ రావణాబ్రహ్మ ఈవేళ ఎలాగైనా నన్ను వదలడులే!"

    ఈ రావణాబ్రహ్మ అన్న బిరుదు ఎవరికి చెందుతుందో నిర్మలకి తెలుసు. ఆ పేరు చెప్పితే తన భర్త హోరని వర్షములో తడిసి వచ్చికూడా గడగడా మరచెంబుడు నీళ్ళుతాగుతాడన్న విషయం కూడా తెలుసును. కాని ఎదురుగా తన భర్త అంత కంగారుగా భోజనం సరిగా చేయకుండా వెళ్ళిపోతుంటే ఆమె భరించలేకపోయింది. అందులోనూ జరిగిన రాత్రి అతనసలు భోజనమే చేయలేదు. దానికి కారణమైన కలహమూ, ఆ కలహములో మొండిపట్టుపట్టిన తనపాత్ర నిర్వహణా, ఆ కోపములోనే యిద్దరూ భోజనం మానేసి, ఒకే పెద్ద మంచంమీద ఒకరికొకరు తగలకుండా, ఒకరివైపొకరు తిరగకుండా పడుకొని జరిపిన అసిధారా వ్రత నిర్వహణమూ ఇవన్నీ నిర్మలని పశ్చాత్తాప్తూరాలినిగా భర్తయెడ మరీ సుముఖురాలిగా, ప్రేమచేత కరుణచేత ఆర్ద్రహృదయగా చేసివేశాయి. అందులోనూ అందమైనవాడు, జుట్టు ఆ విధంగా మొహంమీద పడేవాడు. అటువంటివాడు తనకి భర్త అయి, తన సర్వస్వమూ అయినప్పుడు.
 
    "మీరు ఆ కూర మరోసారి కలుపుకుంటేకాని వీలులేదు. నా మీద ఒట్టే! బోడి ఉద్యోగం పోతేపోతుంది - దీని తాతలాంటిది వస్తుంది. ఊ, మరి కలపండి" అంది.

    ఈసారి విసనకర్ర పుచ్చుకొని విసురుతూ అతని ప్రక్కన కూర్చుంది. నవ్వుతూ పట్టుదల పట్టుతూ లాలిస్తూ అతనిచేత తిరిగీ కూర కలిపించింది. "అయిన ఆలస్యం ఎల్లానూ అయిందిగా? ఇంకో పావుగంట లేటయితే పీకలు తీస్తారా ఏమిటి? సంసారాల్లో ఎవళ్ళకి మాత్రం ఏదో అవసరాలు రాకుండా వుంటాయా, ఆలస్యాలవకుండా వుంటాయా?" అంటూ నొక్కులు నొక్కుతూ సన్నగా దీర్ఘం తీసింది.

    ఈ ఆర్గ్యుమెంటుని ఏ కోర్టులోనూ ఒప్పుకోరని తెలుసు - కాని కలహానంతరం అందులోనూ ఒక రాత్రి మౌనంగా వుండి, తిరిగి సంధి కలుపుకొన్న తర్వాత భార్యా భర్త లనుభవించే ఆనందం సరిక్రొత్త ప్రేమలనూ ఉద్రేకాన్నీ స్వచ్ఛ పరిమళాన్ని కలిగి వుంటుంది. అటువంటి పునర్నవమైన ఆప్యాయతలో భోజనం పెడుతూంటే, భార్య సన్నవి గాజుల చప్పుడుతో విసరుతూ లాలిస్తూ ఉంటే వేరే కాంక్షించే స్వర్గమే లేకపోయింది గంగాధరానికి. ఆఫీసులూ, బాధలూ, సమస్యలూ అన్నీ చప్పున ఫేడౌట్ అయిపోయాయి. ఆ కాస్సేపట్లోను అతనికి నిత్యమూ, సత్యమూనైన బ్రహ్మానందం గోచరించింది.

    ఈసారి వాళ్ళ కబుర్లు, ఒకసారి మనస్సులోంచి సమస్యా సందేహాలు దూరమైపోయిన తరువాత - ఏ అడ్డంకీలేని నదీ ప్రవాహంలాగా సాగిపోయాయి. వచ్చే సంక్రాంతి పండుగకి మామగారు ఏం బహుమతి యిస్తారో అన్న ప్రశ్ననుండీ, సినిమాలో ఫలానా నటి తాలూకు నటన విశేషమూ, కో- ఆపరేటివ్ స్కీములో తాము కట్టించబోయే చిన్నసైజు యింటికి యెన్ని గదులు ఉండాలి అన్నంతవరకు అనవసర అవసర సమాలోచనలన్నీ సాగిపోయాయి. అతను చెయ్యి కడుక్కొని లేచేటప్పటికి దువ్వెనతోవచ్చి అతని పాపిడితీసింది. అతను అమెరికన్ జాకెట్ వేసుకొనేటప్పటికి జోళ్ళు రడీగా ఎదురుగా పెట్టింది. అతను ఆమెను ముద్దుపెట్టుకొని 'వస్తాను నిర్మలా' అని యధాలాపంగా అలవాటు చొప్పున గోడమీద టైము చూచేటప్పటికి అతనికి స్పృహవచ్చినట్టు -లేక తప్పినట్టు అయింది. కఠిన వాస్తవికత కొరడాతో కొట్టినట్లయింది. అతని నీడ అతని 'వెనకనే వచ్చి వెన్నుల్లో' పొడిచినట్లయింది. ఉన్నపళంగా కుప్పగా కుర్చీలో కూలి "పదకొండుంబావు" అన్నాడు. అతని మొహంలో కత్తిగాటుకు నెత్తురుచుక్కలేదు. తెల్లబడిన అతని మొహాన్ని, పిచ్చిగా చూస్తోన్న అతని కళ్ళను చూసి అర్ధాంగి కంగారుపడింది.

    "గంటంపావు లేటు! ఆఫీసుకు వెళ్ళేటప్పటికి యింకో పావుగంటైనా పడుతుంది. ఇంక ఉద్యోగానికి నీళ్ళు వదులుకోవలసిందే. అసలే కోపిష్టిమనిషి, అందులోనూ దొరల పంక్చుయాలిటీ అంటో ఛస్తోంటాడు. అసలు మొన్న మీవాళ్ళు వచ్చిన రోజున ఆలస్యమైనందుకే మండిపడ్డాడు. తుది హెచ్చరిక అని చెప్పాడు, మీసాలమీద చెయ్యివేసి. నా కొంప తవ్వేశావు. ఏ పావుగంటో, అరగంటో ఆలస్యం అయితే సర్దిచెప్పుకోవచ్చును. ఇప్పుడేమిటి చెయ్యటం?"

    నిర్మలకి ఏమీ తోచలేదు. ససంభ్రమ సవిషాద సశంకిత అయి అలాగ నించునిపోయింది. అతను కణతల్ని దయచేసి ఆ తప్పుని మళ్ళీమళ్ళీ చేసి ఉద్యోగం పోగొట్టుకొని, కొత్తది దొరక్క, మాసిన గడ్డంతో, లోతుకుపోయిన ఉద్యోగం పోగొట్టుకొని, కొత్తది దొరక్క, మాసిన గడ్డంతో, లోతుకుపోయిన కళ్ళతో రోడ్లుకాస్తూ మిత్రుల్ని అణా, బేడా అడిగి బతుకుతూన్న శంకరం స్మృతిపథంలో మెలిగేటప్పటికి అతనికి ఒక్కనిమిషం ఊపిరాడలేదు. అతనని లాలిస్తూ భోజనం పెడుతూ, అరగంటకన్న ఆలస్యం అవడంలోని వైప్లవ్యాన్నీ, విపత్తునీ చూడలేకపోయానే అని బాధపడుతోంది ఆమె!

    "ఛీ ఛీ మీ ఆడాళ్ళింతే! వెధవసొద వేసుక్కూర్చున్నావు. ఇప్పుడు చీవాట్లు తినాలి. డిస్మిస్ అంటే గొల్లుమని ఏడుస్తూ రావాలి. రేపటి నుండి మెతుకులు కూడా ఉండవు."

    "అయ్యో నాకేం తెలుసండీ" అంది నిర్మల.

    "ఏం తెలుసు మరీ? నీ మొగుడేమైనా కలెక్టరనుకున్నావా? మినిష్టరనుకున్నావా! గుమాస్తా అంటే. ఏమిటనుకున్నావు?  ఎన్నిసార్లు చెప్పాను నీకు తొమ్మిదింటికల్లా వంట అవ్వాలనీ" కోపంతో కేకలు వేస్తున్నాడు గంగాధరం.
 
    "మరి మీరు తొమ్మిదింటికిగా బియ్యం పట్టించుకొని వచ్చింది?" అంది నిర్మల భయంగా.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.