Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"ఆగక్కడ" గద్దించాడు పోలీసు. లక్ష్మి జబ్బ పట్టుకున్నాడు.
"ఓసి దొంగముండా ఇక్కడ తగులడ్డావా, ఇదేం బుద్దే నీకు? ఏం పోయ్యేకాలం వచ్చింది" అన్నాడు సుబ్బయ్య.
లక్ష్మి వణుకుతూంది.
"ఏదీ ఉంగరం?" వగరుస్తూన్న సుబ్బయ్యగారు గట్టిగా గొంతుచించుకుని అడిగాడు.
"ఉంగరమేంటీ?" - తన్ని తను కాపాడుకుంటానికి ఒకటే మార్గం అయిన అబద్దాన్ని ఆశ్రయించింది లక్ష్మి.
"రెండు తన్నండి ముండని" సుబ్బయ్య సలహా యిచ్చాడు.
పోలీసు లాఠీతో వీపుమీద పొడిచాడు. "అమ్మో" అంది లక్ష్మి
"చెప్పు ఉంగరం ఏం చేశావు?"
"నాకు తెల్దు" మొరాయించింది లక్ష్మి.
పోలీసు మోకాళ్ళమీద లాఠీతో కొట్టాడు. "బాబోయ్" అని అరచింది లక్ష్మి ఆమె కళ్ళమ్మట నీళ్ళు ప్రవాహం కట్టాయి. చుట్టూ జనం మూగారు. కొందరు వెకిలిగా నవ్వారు. కొందరసహ్యించుకున్నారు.
"స్టేషనుకి నడు" అన్నాడు పోలీసు.
మునివేళ్ళమీద నిలబడి చుట్టూ మూగిన జనంలోకీ, జనం అవతల వున్న రోడ్డువైపూ పరకాయించి ఆశగా చూసింది లక్ష్మి నారాయణ వస్తున్నాడేమో అని. కాని ఎక్కడా జాడలేదు. తల్లి జ్ఞాపకం వచ్చింది. ఒక్కసారిగా పెద్దపెట్టున ఏడ్చింది అక్కడ రోజ్జుమీద చతికిలబడి. పోలీసు ఒక పక్కా, సుబ్బయ్య ఒకపక్కా నడుస్తోంటే దారిపొడుగునా నారాయణ వస్తాడనీ, తనని విడిపిస్తాడనీ ఆశతో కన్నీళ్ళతో చూస్తూనే ఉంది.
రెండు నెలలు జైలులో ఉండేటప్పటికి నారాయణ ఇంకా రాడని లక్ష్మికి దృఢమైంది. ఇసుకలాంటి అన్నమూ, చీకటికొట్టులాంటి జైలుగదీ, మనోవ్యధా లక్ష్మిని నీరసంగా అసహ్యంగా చేసివేశాయి . 'ఉంగరమూ పోయింది. పెళ్ళీ పోయింది' అని గొణుగుకునేది ఒక్కతే, కటకటాల్ని పట్టుకుని. మగవాడి నెవడినీ నమ్మకూడదనుకుంది. అయినా సుబ్బయ్యగారి కొడుకు ఉంగరం తాను తీస్తే పోలీసులకెందుకూ బాధ అనిపించింది లక్ష్మికి. వాళ్ళ సొమ్ము ఏమైనా తానపహరించిందా? లక్ష్మి హేతువుకి ఈ చుట్టాలూ మనుష్యులూ అర్ధం లేకుండా కనిపించాయి.
రోజూ తెలియకుండా ఏడ్చేది, జ్వరం వచ్చేది. కదలకపోయినా కాళ్ళు లాగేవి. ముసలితల్లి చచ్చిపోయిందేమో అన్న దిగులు, రాత్రుళ్ళు నిద్రలో తనూ నారాయణా 'బొమ్మాయి' వెళుతూన్నట్టూ, దారిలో రైలులోంచి తన్ని నారాయణ కిందికి తోసేసినట్టూ, తన తల చితికి రక్తం ప్రవహించినట్టూ కలవచ్చి 'బాబోయ్' అని అరుస్తూ లేచి కూర్చునేది.
ఒకరోజున 'లక్ష్మీ' అన్న పిలుపు వినబడింది. ఎక్కడా అని తెల్లబోయి గది నలువైపులా చూసింది. ఎవరూ కనబడలేదు. మళ్ళీ 'లక్ష్మీ ఇక్కడ..... నేను' అన్నమాటలు వినిపించాయి. ధ్వని వచ్చినవైపే చూసింది. తనగది నానుకున్న గదిగోడ పగులులోంచి నారాయణ చూసి నవ్వుతున్నాడు.
"నేనూ -నారాయణని లక్ష్మి."
"నువ్వెలాగొచ్చావు?" ఆశ్చర్యంతో అడిగింది లక్ష్మి.
"నిన్న రాత్రి తీసుకొచ్చారు."
"ఏం?"
"సైకిల్ షాపులో పనికి కుదిరాను. డబ్బు అవసరం వచ్చి సైకిల్ చక్రం అమ్మేశాను అంతే. పోలీసులు వచ్చి ఇక్కడ నన్ను వుండమని బతిమాలుకొన్నారు" నవ్వుతూ చెప్పాడు నారాయణ.
"బలేగా అయింది సచ్చినోడా - బాగా అయింది" కసితో మెటికలు విరిచింది లక్ష్మి.
"నాకిదేమీ కొత్తకాదు పిల్లా. ఇది అయిదోసారి మనం రావడం" అన్నాడు నారాయణ తన ఆధిక్యతను నిరూపిస్తూ.
"మంచిదానివి లక్ష్మీ నీ ఉంగరం అమ్మితే ఇరవై రూపాయలొచ్చినై. వారంరోజులు దర్జాగా వెలిగింది మన బతుకు. సినీమాలూ, కాఫీ హోటళ్ళూ- హాయ్ హాయ్."
"దొంగనాయాల -" తిట్టింది లక్ష్మి.
"నీ తిట్లు నన్ను తగలవు" అన్నాడు నారాయణ.
"అన్నాయం. అన్నాయం చేశావు దొంగసచ్చినోడా. నా ఉసురు నీకు తగుల్తుంది" అంది ఉక్రోషంతో లక్ష్మి.
"ఓష్ ప్రపంచవేఁ అన్యాయం లక్ష్మీ ఎవడికి అవసరమైతే వాడే అన్యాయం చేస్తాడు. మరి నువ్వు దొంగతనం చెయ్యలేదూ? నీదగ్గర్నుంచి నేను కొట్టేశాను."
"ఫో -నీ జిమ్మడా"
"ఎక్కడికీ పోను. ఇక్కడే నీకు సావాసనంగా వుంటాను"
లక్ష్మి బాధతో మొహం మరోవైపు తిప్పికూర్చుంది. నారాయణ నవ్వుతూ అన్నాడు.
"జైలునుంచి విడిచాక వచ్చి నిన్ను తప్పకుండా పెళ్ళిచేసుకుంటానులే" అంటూ ఫక్కున నవ్వాడు నారాయణ.
లక్ష్మి ఉక్రోషంతో మాట్లాడలేదు.
"అప్పుడు బొంబాయి వెళ్ళిపోదాం. ఏది లక్ష్మీ ఇటు చూడు. ఒక ముద్దియ్యి" అంటూ 'ప్చ్' అని పెదవులతో చప్పుడు చేశాడు నారాయణ.
లక్ష్మి దగ్గరున్న నీళ్ళలోటా తీసి పగులువైపు విసిరింది. పెద్ద చప్పుడయింది. పోలీసు 'ఏమిటది' అని కేకవేశాడు. లక్ష్మి మోకాళ్ళమీద తల ఆన్చి ఏడుస్తోంది. నారాయణ వెకిలినవ్వు జైలుగదిలో కోలాహలంగా ప్రతిధ్వనించింది.
(1961)
*********



