Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"నిజమే?"
"తెగేసి"
చక్రం దగ్గర కూర్చుని మోటార్లు నడిపేవాళ్ళని చూడకపోలేదు లక్ష్మి. కాని నారాయణ చెప్పడంలో, ఈ డ్రైవరు పని అసాధారణమైనదిగా తోచింది ఆమెకి.
"బాగా డబ్బొస్తుందా?"
"ఓ, కావల్సినంత. మనం హాయిగా బతకొచ్చును."
లక్ష్మి హాయిగా బతకటాన్ని ఆలోచిస్తోంది.
"నిన్నెప్పుడూ కారుమీద తిప్పుతాను. పట్నంలో కార్లమీద పెద్ద పెద్ద వీధుల్లో ఝామ్మని పోతూంటే" అన్నాడు నారాయణ.
కిలకిల నవ్వింది లక్ష్మి. నారాయణ మాటల్లో, సమర్ధతలో నమ్మకం చిక్కింది.
సంజ యెరుపులు కళ్ళల్లో కలలకి మరింత విభ్రమాన్ని చేకూర్చాయి.
"మరి ఎప్పుడు పట్నం వెళ్ళటం?" అంది.
"ఆ ఉంగరం ఎక్కడిది నీకు?" అన్నాడు నారాయణ లక్ష్మిపై గల శ్రద్దను విశదపరుస్తూ.
"నాదే....ఏం?" బెదురుగా అంది లక్ష్మి.
"అబద్దం. నా దగ్గర డబాయించకు."
"నాదే నాదే...మరి......"
"నిడం చెప్పు. లేకపోతే పోలీసులొచ్చి జైల్లో పడేస్తారు నిన్ను. నీ కోసమే చెపుతున్నాను. నమ్మవా నన్ను?"
లక్ష్మి సంగతంతా చెప్పింది.
"ఈ ఉంగరం నీ దగ్గరుంటే అపాయం వెర్రిదానా. రేపీపాటికి ఖైదులో వుంటావు. ఈ ఉంగరం నా చేతికిచ్చేయి. రాత్రికి రాత్రి కరిగించేసి రూపాయలు తీసుకొస్తాను" అన్నాడు నారాయణ ఆత్రంగా.
"నేను మంచి వోణీ పరికిణీ కొనుక్కుందామనుకున్నాను" దీనంగా అంది లక్ష్మి.
"పిచ్చిదానా, నేను కొని తీసుకొస్తాను. ఈ చిరిగిన బట్టలతో పట్నం వెళ్ళితే నవ్వుతారు."
లక్ష్మి సందేహంగా బెదురుగా బాధగా ఉంగరాన్ని వేలినుంచి మెల్లగా తీసి ఇచ్చింది. "మరి పెళ్ళిచేసుకుంటావా!" అంది.
"ఒట్టు వెయ్యలేదూ?"
ఒట్టుయొక్క మహత్యాన్ని కిమ్మనకుండా అంగీకరిస్తుంది లక్ష్మి.
"మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు!"
"ఈ రాత్రికి ఎక్కడో పడుకో. తెల్లారగానే గుడిదగ్గర వచ్చి ఉండు. అక్కడికి నేను వస్తాను. రాత్రి కరిగించేసి అమ్మేసి డబ్బులు తీసుకొస్తాను. ఇద్దరం కలసి రైలెక్కి బొంబాయి వెళ్ళిపోదాం ఏం?"
"అదేం వూరు? ఛ, నేను రాను."
"బొంబాయి చాలా పే....ద్ద పట్నం లక్ష్మీ"
"సీతాలు మరి చెన్నపట్నం వెళ్ళిందేం?"
"వెధవ చెన్నాపట్నం. బొంబాయి ఇంకా గొ...ప్పవూరు. అక్కడ డబ్బు బోలెడు దొరుకుతుంది."
లక్ష్మి ఆలోచించింది. "గుడి కాడనే వుంటాను వస్తారా?"
"తప్పకుండా వెళ్ళొస్తాను ఏం?"
లక్ష్మి తలూపింది బెదురుగా. బుగ్గమీద చిటికవేసి గబగబా పొలాలలోంచి నడచి వెళ్ళిపోయాడు నారాయణ. చీకటి పడుతూంటే భయం కలసిన ఆనందంతో కలల మత్తుతో గుడివైపు నడచింది లక్ష్మి. ఆమెకు ఆకలి వేస్తున్నట్టే అనిపించలేదు.
ఆరు, ఏడు, ఎనిమిది , తొమ్మిదికూడా అయింది. ఎండ ఎక్కువైన కొలదీ లక్ష్మికి ఆకలి ఎక్కువౌతోంది. ఎండ చుర్రుమనగానే గుడి దగ్గర రావిచెట్టు నీడకి వెళ్లి కూర్చుంది. గుడిగోపురం అంత ఎత్తుగా ఎవరు కట్టారా అని చాలాసేపు ఆలోచించింది. గోపురంమీద ఏదో పక్షి వాలింది. లక్ష్మికి సరదావేసింది. తనకీ అంత పైన నుంచి భూమి అన్ని వైపులా చూడాలనిపించింది. కొంతసేపు ముసలి రోగిష్టి తల్లి జ్ఞాపకం వచ్చింది. బొడ్డులో తాళాలు దోపుకున్న సుబ్బయ్యగారు కేకలు వేస్తోన్నట్టు అనిపించింది. మధ్య మధ్య అకారణంగా ఉలిక్కిపడింది. గాలిలోంచి యేదో కమ్మని వాసన వస్తోంటే, లాలాజలాన్ని గుక్కిళ్ళు మింగింది.
పూజారి గవరయ్య ఎవరు నువ్వని అడిగాడు. 'బొమ్మాయి' వెళ్తున్నానని చెప్పింది. నారాయణ ఎటువైపునుండీ రావడంలేదు. తన్ని దగాచేశాడా? గుండె కొట్టుకుంది భయంతో ఆశాభంగంతో కాదు. తప్పకుండా వస్తాడు. తన్ని పెళ్ళిచేసుకుంటాడు. ఆ కళ్ళతోఎంత ఇష్టంగా చూశాడు. పల్చని తెల్లని చొక్కా నుండి కండలు తిరిగిన వొళ్ళు ఎంత బావుంది. ముట్టుకోవాలనీ ముద్దెట్టుకోవాలనీ అనిపించింది.
కాలవ వేపునుంచి తడిసిన బట్టలతో బిందెలు బుజాన పెట్టుకుని ఆడవాళ్ళు వెళుతున్నారు. గుళ్ళోంచి మంత్రాలు వినపడుతున్నాయి. దేవుణ్ణి తలచుకుని నమస్కరించింది. కళ్ళెత్తి చూసింది. ఎదురుగా సుబ్బయ్యగారు పోలీసులతో లక్ష్మి కంగారుపడిపోయింది. పారిపోదామనుకుంది.



