Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"లచ్చిమి"
"ఈ వూరేనా?"
"ఉహుఁ పక్క ఊరు...."
"ఏం చేస్తుంటావ్?"
సందేహంగా కనురెప్ప పైకెత్తి నారాయణను చూసింది. దాసీ దాన్నని చెప్పాలా చెప్పకూడదా అని తటపటాయిస్తోంది.
నారాయణ మీద చెయ్యివేశాడు. జాలిగా అన్నాడు. "పాపం దాసీ పిల్లవా?"
లక్ష్మి తలూపింది ఔనని.
నారాయణ ఈసారి ఆమె బుగ్గలమీద చేత్తోరాశాడు. "మాంచి దానివి."
ఆశగా చూసింది లక్ష్మి!
"అలాగరా -ఆ పక్కకి" అని అర్ధవంతంగా నవ్వాడు నారాయణ.
"ఎందుకూ?"
"ఇక్కడ అందరూ చూస్తారు."
తెల్లబోయి చూస్తోంది లక్ష్మి.
"డబ్బులిస్తాను సరేనా, రా"
ఛీ, తననింత లోకువగా చూస్తున్నాడేమిటి? తనని ప్రేమించాననీ పెళ్ళి చేసుకుంటాననీ అనడేం అనుకుంది లక్ష్మి. "నాను సెడిపోయినదాన్ని కాదు, నానల్లారాను" అంది లక్ష్మి.
"ఇక్కడి కెందుకొచ్చావు మరి?" కోపంగా అడిగాడు నారాయణ.
"పెళ్ళి చేసుకుందుకు" అమాయకంగా అంది లక్ష్మి.
"ఎవర్నీ?" అన్నాడు నారాయణ. ఈసారి నారాయణ తెల్లబోయాడు. పెళ్ళిచేసుకునేందుకు మామిడితోపులలోకి రావడమెందుకో రకరకాల అనుభవంగల నారాయణకే అర్ధమవలేదు.
"నాకు నచ్చినవాణ్ణి. డబ్బున్నవాణ్ణి" అంది లక్ష్మి.
నారాయణకి లక్ష్మి ఒక్కసారిగా అర్ధమైపోయింది. మెల్లగా కబుర్లలోకి దింపాడు. ఆమె ఊహలు పయనించే త్రోవలేమిటో తెలుసుకున్నాడు. తర్వాత జాలిగా ప్రేమగా అన్నాడు "నన్ను పెళ్ళి చేసుకుంటావా లక్ష్మీ?"
"మిమ్మల్నా?"
"అవును"
"నిజంగానే?"
"ఆఁ"
"ఒట్టు?"
"ఒట్టు"
"మరి సింగడిలాగ...."
"సింగడెవడూ?"
"దొంగనా.." లెఖ్ఖ రెండు మాటలలో సింగడెవడో చెప్పింది లక్ష్మి.
"ఛఛ. నేనలాంటివాణ్ణికాను. నీలాంటి పిల్లకోసమే చూస్తున్నాను. నిన్ను ప్రేమించాను. పెళ్ళిచేసుకుంటాను. పువ్వుల్లో పెట్టి పూజిస్తాను" అన్నాడు నారాయణ.
"నిజం?" పెద్దకళ్ళలో వెలుగు నిండగా అడిగింది లక్ష్మి.
"ఇంకా నీకు చదువు చెప్పిస్తాను."
"ఓహ్!"
"డ్యాన్సు నేర్పిస్తాను."
"అబ్బో"
"మరి ఎప్పుడు పెళ్ళిచేసుకుందాం?" అన్నాడు నారాయణ.
"పట్నంలో కాదా పెళ్ళి?" -సీతాలుని జ్ఞాపకం చేసుకుంటూ అడిగింది లక్ష్మి.
నారాయణ ఓ సెకను ఆలోచించి "అవును పట్నంలోనే -నేనక్కడేగా వుండేది" అన్నాడు.
"మీరు పట్నంలో ఏం చేస్తుంటారు?"
నారాయణ చిక్కులో పడ్డాడు. ఈ పల్లెటూరిపిల్ల , అమాయకురాలూ, రొమాంటిక్ ఊహలు ఉన్న లక్ష్మికి ఏం చెపితే పని జరుగుతుందో గబుక్కున ఊహించడం నారాయణవంటి చురుకైనవాడికేనా కష్టమే. హోటలులో సర్వర్ గా, కారు క్లీనరుగా, పిక్ పోకెటర్ గా, రైలులో మందులమ్మేవాడిగా బహుపాత్రాభినయంచేసిన నటకావతంసుడు ఆలోచించి అన్నాడు "మోటారు డ్రైవర్ని"
"అంటే"
"పెద్ద పెద్ద మోటారులూ, లారీలు నడుపుతాను. నే నెలాగ నడుపితే అలాగ వెడతాయి."



