Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    తనకి మంచి బట్టలు ఎలా వస్తాయి? పోనీ సుబ్బయ్యగారు, వెర్రిపిల్ల చాలా కాలం నుంచి చాకిరీ చేస్తోందని కొనిపెట్టకూడదూ? ఆయన కూతురు అచ్చెమ్మ ఓ చీర యివ్వకూడదూ? ఇలాగ అనుకునేది తను. కాని యింత సులువైన ఊహ తట్టనేలేదు ఎప్పుడూ తనకి. సుబ్బయ్య చిన్న కొడుకు ఒళ్ళోనుంచి వస్తున్నాడు. వాడి వేలిని ఉంగరం మెరిసింది. వెధవ చిడుం వేలికి. ఉంగరం కూడా ఎందుకూ? వాణ్ణి పిలిచింది. ఈ కబురూ ఆ కబురూ చెప్పి మిఠాయి కొనిపెట్టి ఉంగరం తీసేసుకుంది. కుర్రనాగమ్మ యింటిదగ్గర చెప్పగలడా? సుబ్బయ్యగారూ, పెళ్ళామూ ఉంగరం ఎక్కడో పోయిందనుకుంటారు.  ఈ ఉంగరం అమ్మితే  ఇరవై రూపాయలేనా వస్తాయి. ఆ డబ్బుతో అందమైన బట్టలు కొనుక్కుని కట్టుకుని వెళుతూవుంటే మాంచి రాజకుమారుడులాంటి కుర్రాడు తన్ను చూసి 'ఏయ్ అమ్మాయ్' అని నవ్వుతాడు అదోలా. పెళ్ళికొడుకులు నవ్వినట్టు నవ్వుతాడు. అప్పుడు......

    అయినా తను అందర్నీ నమ్మకూడదు. మంచివాణ్ణి. డబ్బున్న వాడినీ ఏరుకోవాలి. దొరలాగ వుండాలి వాడు.  'నిన్నే నమ్ముకుంటాను. నిన్ను పెళ్ళిచేసికొంటాను. నువ్వులేందే బతకలేను లచ్చీ' అనాలి. అప్పుడెంచక్కా వాడిని పెళ్లిచేసుకుంటుంది. సీతాలులాగా పట్నం వెళ్ళిపోతుంది. ఎప్పుడేనా సుబ్బయ్యగారు యిటువస్తే తననుచూసి 'అబ్బో' అని ముక్కుమీద వేలేసుకుంటారు! పెళ్ళి చేసుకోలేకపోతే నలుగురిలో గౌరవం ఉండదు. అందరూ దొంగముండ అని, గుడిసేటిదనీ తిడతారు. ఛీ అంటారు. పెళ్ళయితేకాని -మగవాడికి అలుసివ్వకూడదు. దొంగవెధవలు సరదాతీరాక పురుగును దులిపినట్టు దులిపి పారేస్తారు. సింగడు మరి యిదివరకూ ఏం చేశాడు? ఎన్నికబుర్లు చెప్పాడు? రంగం వెళ్ళిపోదామన్నాడు. సరసాలాడీనన్నాళ్ళూ ఆడి తీరా ఓ రోజున మరెవత్తెనో పెళ్ళి చేసుకున్నాడు. తనింకా అప్పుడు చిన్నపిల్ల. ఎంతో ఏడ్చింది. "ఏంటి యిలా అన్యాయం చేశావ్ సింగా?" అంటే 'నిన్నెవడు పెళ్ళాడుతాడు నీతిలేనిదానివి'  అన్నాడు.

    నల్లని ఉంగరాల జుట్టు ఉండాలి. తెల్లగా పొడుగ్గా ఉండాలి. మంచియిల్లు తోటా వుండాలి. అప్పుడు అబ్బాయి వచ్చి పెల్ళి చేసుకోవాలి. పెళ్ళి చేసుకుంటేగాని వొంటిమీద చెయ్యి వెయ్యనివ్వకూడదు. తలలో పువ్వులు పెట్టుకొని పెరట్లో పాటలు పాడుతూంటుంది తను. వెనకాలే వచ్చి కళ్లు మూస్తాడు. చేతులు తీయకుండానే బుగ్గమీద ముద్దు పెట్టుకుంటాడు. తను మళ్ళీ ఆయన మొహాన్ని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుంటుంది. తను రోజూ నీళ్ళు పోసుకుంటుంది. ఘుమఘుమలాడే సబ్బుతో వొళ్ళంతా రుద్దుకుంటుంది. బలే వాసన. ఓసారి సుబ్బయ్యగారి అల్లుడు వదిలేసిన సబ్బు ముక్క తెచ్చుకుని నీళ్ళు పోసుకుంది. తన వొంటిని తనకే ముద్దు పెట్టుకోవాలనిపించింది. తన వొళ్ళు కొత్తగా మెత్తగా పట్టుచీరలా మెరిసిపోయింది........

    ఒకానొక వేసవిలో ఊరికి దూరంగా ఉన్న ఒక మామిడితోపులో కూర్చుని పగటి కలలు కంటోంది. పదిహేడేళ్ళ దాసీపిల్ల లక్ష్మీ, చిరిగిన మాసిన బట్టలూ, సంస్కారంలేని చిక్కబడిన జుట్టూ, ఆమె కళ్ళల్లో ఊహల నిచ్చెనలమీద ఎగబ్రాకే కోర్కెల్ని ఆపలేకపోతున్నాయి. చల్లని పైరుగాలీ, ప్రశాంతమైన మామిడితోటా, యౌవనం కొత్తగా వింతగా అలుముకుంటూన్న ఆమె వయస్సూ ఆమనె కలల్ని మరింత రెచ్చగొడుతున్నాయి. తాను దిక్కులేని దాసీపిల్లననీ, తన భవిష్యత్తు ఎప్పుడూ యింతేననీ వాస్తవికంగా ఆమె ఆలోచించగలిగితే అప్పుడీ స్వప్నాలవల్ల కలిగే క్షణికమైన మధురానుభూతి కూడా జీవితంలో లేకుండా చేసుకోవడమే అవుతుందేమో! బతుకు అడు్కిపోయినకొలదీ బతకడానికి చేయూత స్వప్నం మాత్రమే కాబోలు. అందరూ అభాగిని అయిన లక్ష్మిలాగ కలలు కంటారు. కాని ఆ కలలు నిజాలౌతాయని నమ్మరు. అక్కడ వాళ్ళు తెలివిగా జాగ్రత్తపడతారు. కాని లక్ష్మిలాంటి అమాయకులూ ఆవేశ హృదయులూ కలల్ని తరుముకుంటూనే పరుగెత్తుతారు. దారిలో గొప్పితగిలేదీ గొయ్యివచ్చేదీ చూచుకోరు. రోగిష్టి ఆరోగ్యాన్ని గురించీ, ఆకలితో ఉన్నవాడు రుచికరమైన పిండివంటల్ని గురించీ, దరిద్రుడు ధనం యిచ్చే సౌఖ్యాన్ని గురించీ ఆలోచించకుండా ఏ చట్టమూ శాసించలేదు. నిజమే. అఁదుకే భయంకర దరిద్ర పీడితులూ, అంగవికలులూ, దుర్భర వ్యాధిగ్రస్తులూ ఆత్మహత్య చేసుకుని కడతేరకుండా బతుకుతూనే వుంటారు, రేపటి సుఖంకోసం.

    కల్ళెలేని భావనా ప్రపంచంలో విహారంచేస్తూన్న లక్ష్మి తనని ఓ గంట నుండి నారాయణ అదేపనిగా పరికిస్తున్నాడని గమనించలేకపోయింది. కొంతసేపయాక నారాయణ మెల్లగా ఆమె దగ్గరకు నడచివచ్చాడు. చామనచాయగా వున్నాడు. పైజమా తొడిగి తెల్లని గ్లాస్కో చొక్కా వేసుకున్నాడు. కాళ్ళకి నల్లని స్లిప్పర్సు, జుట్టు వెనక్కు దువ్వాడు. పెదవులు ఎర్రగా ఉన్నాయి తాంబూలం సేవనంవలన, సుబ్బయ్యగారి కొడుకుకన్న, సింగడుకన్న ఎంతో బాగున్నాడు. ఇంకా ఎంతో బాగున్నాడు. చదువుకున్నవాడిలా ఉన్నాడు. లక్ష్మికి ఎదురుగా వచ్చి నులుచున్నాడు. లక్ష్మి తల పైకెత్తి చూసింది. ఫక్కున నవ్వింది. ఆమెకి కథలో రాజకుమారుడు నిజంగా వచ్చేసినట్లనిపించింది.

    "ఎవరు నువ్వు?" అన్నాడు నారాయణ గంభీరంగా.

    "ఏం?" అంది ఓరగా చూస్తూ లక్ష్మి. ఇంకా ఆమెకు పూర్తిగా మెలుకువ రాలేదు. వేలినున్న ఉంగరాన్ని ఆప్యాయంగా చూచుకుంటోంది.    

    "నీ పేరేఁవిటి?" అడిగాడు నారాయణ.

    సన్నగా నవ్వి తియ్యగా చూసింది లక్ష్మి జవాబుగా.

    "ఈ తోట ఎవరిదో తెలుసునా?" ఈసారి కోపంగా అధికారంగా అన్నాడు నారాయణ.

    ఉలిక్కిపడింది లక్ష్మి."మీదేంటి బాబూ. ఊరికనే కూర్చున్నాను..... భయపడుతూ లేచి నుంచుంది లక్ష్మి.

    వీడు తనని పెళ్ళి చేసుకోడానికి రాలేదా?

    నారాయణ గీరగా చూశాడు. అదోవిధంగా దగ్గాడు. లక్ష్మి కూడా గమ్మత్తుగా చసింది నవ్వింది.     "నీ పేరేమిటీ?" ప్రశ్నించాడు మృదువుగా నారాయణ.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.