Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఉంగరం
అమ్హయ్య! ఆ రోజుతో తన కష్టాలన్నీ ఫలిస్తాయి. దేనికైనా ధైర్యం ఉండాలి. ఎటువంటి అద్భుతమైన ఆలోచన తట్టింది తనకి! ఎలాగ మెరుస్తోంది తన అందమైన వేలికి? - ఇంక దీనితో తాను బతుకుని కొత్తగా తీర్చుకోవాలి. సుఖంగా దర్జాగా జీవితం గడపాలి. ఇంతవరకూ తానెంత నీచంగా బతికింది తలుచుకుంటేనే అసహ్యంవేస్తోంది. అంట్లుతోమడం, గదులూడ్చడం, వాళ్ళిచ్చే పాసిపోయిన అన్నంతోపాటు తిట్లనీ శాపనార్ధాల్నీ మూటకట్టుకుని నిస్సహాయతతో ఉడుకుమోతుతనంతో యింటికి వెళ్ళడమూ - అక్కడ తల్లి రోగంతో మంచం మీద బల్లిలాగా అంటుకుపోయి, తాను ఆలస్యంగా వచ్చినందుకు ఇంకా తిట్టడమూ - తన గుడిసెలో దుమ్మూ, పొగా, చీకటి, గుడిసె బయట పందులూ, రొంపీ, వాసనా, తన వొళ్ళంతా చాకిరితో నొప్పులూ - ఏడుపొచ్చేది తనకి. చ్చచిపోవాలనిపించేది. అందరిలాగా తాను హాయిగా కులాసాగా ఎందుకు బతకకూడదు? పంతులమ్మ కూతురులా సిల్కు వోణీలు తన కెందుకుండవూ? రవణమ్మ బుగ్గలూ వొళ్ళూ ఎలా నిగనిగ లాడుతుంటాయో -రెండు పుటలా మీగడ పెరుగూ వెన్నపూసా వేసుకుని తింటుందికదూ! తన యీడుదే వరహాలు మరి. రోజు తల్లో పువ్వులు పెట్టుకుని కాటుక పెట్టుకుని సినిమాకు వెళుతూంటుంది మొగుడితో. మరి తనకి పువ్వులూ సినిమాకి డబ్బులూ ఎప్పుడూ వుండవు. మరి మొగుడూ లేడు!
తనలో ఎన్ని కోరికలు! ఎన్ని కలలు! చిన్నప్పట్నుండీ తన కెందుకో ఎగిరిపోవాలనీ, పాటలు పాడాలనీ, నాట్యం చెయ్యాలనీ ఎన్నో - ఎన్నో పొలంగట్టుకాడ కూర్చుని సినిమా పాటలు పాడుతుంటే తనకేసి అందరూ చూసి నవ్వేవారు. తనని వెర్రిదనేవారు. ఏమిటో తన వెర్రి! మంచిబట్టలు కట్టుకోవాలనీ, షోగ్గా సింగారించుకోవాలనీ హాయిగా బతకాలనీ ఎవరనుకోరు? వాళ్ళకి డబ్బూ యిల్లూ ఉన్నా ఎంత అసహ్యంగా బతుకుతారు. ఎంత లేకిగా వుంటారు? వడ్డాణమూ కాసులపేరూ పెట్టుకుని తిరుగుతుంది అమ్మగారు. 'అమ్మా, ఈవాళ తిరణాల. ఓ బే డబ్బు లివ్వండి' అని అడిగితే దండకం చదువుతుంది ఆవిడ. 'నా దగ్గర ఏం ఒలకడంలేదు. ముష్టిముండాపీనుగని ఒక్క అణా డబ్బులుకూడా నాకివ్వరు. తాళి కట్టాడు కాబట్టి యిలా బతుకుతున్నాను కుక్కిన పేనులాగ. ఈయన్నీ ఈయన డబ్బునీచూచి పీక కోశాడు మానాన్న' -అబ్బబ్బ వినలేక వచ్చేస్తాను. ఇవ్వకపోతే మానె, ఇంత అఘాయిత్యంగా మాట్లాడుతుందేఁవిటీ. అయ్యగారు ఊళ్ళో లేనప్పుడు ధాన్యం చాటుగా అమ్మించి డబ్బు దాచేసుకుంటుంది. నాకు తెలీదని ఆవిడ ఉద్దేశం! పోనీ అయ్యగారిని అడిగితే ఆయన ఒకటే తిట్లు "ఈ గది సరీగా ఊడవలేదేం! వెధవ పనితనం నువ్వూ. పైగా డబ్బులు కావాలిట! మీ అమ్మ నిరుడు వైద్యానికి మూడు రూపాయలు తీసుకువెళ్ళింది. ఇంక తీర్చడం మాట ఉత్తిదే. అయినా తిరణాల కెందుకే నీకు? వెధవ చిరుతిండి తింటానికా? రెండు పూటలా తింటున్నావు చాలదూ?"
ఉక్రోషం వచ్చింది తనకి! తనదగ్గరే డబ్బులుంటే 'ఏడవకయ్యా! ఈ రూపాయి తీసుకుని తిరణాలకెళ్ళి నువ్వే కొనుక్కో' అని యిచ్చేసును. ఇవ్వనంటే పోయేది యింతంత మాట లెందుకో!
తనకి అందంలేదా! తెలివితేటలు లేవా! సుబ్బయ్యగారి గదిలో ఎవరూలేనప్పుడు అద్దంలో తన మొహాన్ని చూచుకొనేది. ఎంత అందంగా వుంది తన మొహం -నిగనిగలాడే వొళ్లూ, మెరిసే కళ్ళూ, బుగ్గమీద సొట్టా- వాళ్ళ అచ్చెమ్మకన్న వెయ్యిరెట్లు నయం. కొంచెం సబ్బు పెట్టీ మొహం తోముకుని పువ్వులరైక తొడుక్కుంటే అచ్చెమ్మ డీలా అయిపోదూ! చిన్న కళ్లూ, లావాటి పెదవులు - దాన్నెవడు మనువు చేసుకుంటాడూ! డబ్బుని చూశా? వెర్రిముండాకొడుకులు. పిల్ల యేపుగా ఊతంగా వుంటే సరదాకాని డబ్బుతో ఏం మనసు తీరుతుందీ? తిని బలిసిన అచ్చెమ్మకి ఎప్పుడూ సొగసులూ సొలపులూ. లేవలేదు, కూర్చోలేదు. తనకున్న విలవ వాళ్ళకుందా. తన అందాన్ని ఊరకే తక్కువకి కొనెయ్యవచ్చునని అనుకుంటారు రౌడీ వెధవలు, రోడ్లమ్మట పోతుంటే కోరగా జోరుగా చూస్తారు. సుబ్బయ్యగారి కొడుకు - అదేఁవిటి అలా చూస్తాడు? జేబులోంచి వెండి రూపాయితీసి మోగిస్తాడు. చెయ్యి వూపుతాడు! మళ్ళీ భయం. వీధి గుమ్మంలో జోడుచప్పుడవగానే గబుక్కన గదిలోకి దూకి తలుపులు వేసుకుంటాడు, వాళ్ళ బాబు వస్తున్నాడని.
తన వాళ్ళందరిలాగా తనకెందుకో తృప్తివుండదు. రంగురంగుల ఊహలు తనగుండెల్లో కలవర పెడుతుంటాయి. తనకెన్నో కథలువచ్చును. ఊరవతల గుడికాడ సాధుబాబా వుండేవాడు. చిన్నప్పుడు తనకి మాంచి కథలు చెప్పేవాడు. తెల్లని గడ్డం, ముడతలుపడిన కళ్ళూ, వళ్ళూ చిరిగిన బనీనూ వేసుకుని తన్నెంతో ఆప్యాయంగా చూసేవాడు. తాను గొప్పదాని నౌతానని రాజకుమారి నవుతానని చెప్పేవాడు. రాజకుమారులు తెల్లని గుర్రాలమీద ఎక్కి, తనలాంటి అందమైన దానిని చూసి ఓహో అని గుర్రంమీద ఎక్కించేసుకుని తీసుకెళ్ళిపోయి పెళ్ళిచేసుకుంటారట. వాళ్ళకి పెద్ద పెద్ద మేడలు, నౌకర్లు, మాంచి పిండివంటలు, జిగేల్మనే నగలు.....
మరి సీతాలుని ఓ అబ్బాయి అలాగే లేవతీసుకుపోయాడు. ఏడాది పోయాక మళ్ళీ వచ్చింది సీతాలు. ఎంత ఎంచక్కా వుంది. సిల్కుచీర కట్టుకుంది. బంగారపు గాజులు వేసుకుంది. ఆ అబ్బాయి పట్నం తీసుకెళ్లి అక్కడ పెళ్ళిచేసుకున్నాడట. వర్తకం చేస్తాడట. ఎంతో డబ్బు లాభం వస్తుందిట!
"నన్ను కూడా తీసుకుపోయేందుకు ఎవడినేనా చూసి పెట్టు సీతాలూ" అని అడిగింది ఆ రోజున. ఎంతో బతిమాలుకుంది.
సీతాలు విరగబడి నవ్వింది. "నేను చూసిపెట్టనా. ఓయమ్మ యిదేం సోద్దెమే" అంది.
"నాకేం తక్కువ?" అంది తను ఉక్రోషంగా.
"ఇలాంటి బట్టలు వేసుకుంటే ఎలాగ? మాంచి పరికిణీ వోణీ కుట్టించుకో. ఆ మొగుడెవరో వాడే వస్తాడులే" అంది సీతాలు.



