Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"నీ పేరేమిటి" అన్నాడు వెంకట్రావు.
"వెంకట్రావు" అన్నాడు ఆ పిల్లాడు.
"నా పేరూ వెంకట్రావే" అన్నాడు రావు.
"అందుకే తాతయ్యవ్" అన్నాడు ఆ పిల్లాడు.
ఆ పిల్లాడు పేర్లు చెబుతున్నాడు. "ఆడిపేరు రామం, ఆడిపేరు లచ్మీనారాయణ.
"నీ స్నేహితుల పేర్లా?" అన్నాడు వెంకట్రావు.
"ఊఁ! అమ్మపేరు నిర్మల. అమ్మమ్మ పేరు లచ్చిమమ్మ....." అన్నాడు పిల్లవాడు.
వెంకట్రావు గుండెలో శతఘ్ని పేలినట్లయింది. తల పైకెత్తి చూశాడు గుమ్మందగ్గర స్త్రీని. చిక్కిపోయిన చెక్కిళ్ళూ, ఊడిపోయిన జుట్టూ, మాసిన బట్టలూ -యీమె నిర్మల, నిర్మలేనా? ఆమె ఏదో చెపుతోంది. "ఆయన పోయారు తాతగారూ, మా అమ్మ రాసిచ్చిన పది ఎకరాలమీద బ్రతుకుతున్నామండి. కష్టాలు వచ్చాక మనమేం చేస్తాం తాతగారూ!"
వెంకట్రావు వినిపించుకోలేదు. ఆతృతతో "కుటుంబయ్యగారు ఏమవుతారమ్మా" అని అడిగాడు.
"మామయ్య అవుతాడు. మీరెలా ఎరుగుదురు? అయితే ఇంజనీరు వెంకట్రావుని ఎరుగుదురా తాతయ్యగారూ!" అంది ఆవిడ. ఒకనాటి ప్రియురాలు తన్ని 'తాతగారు' అని పిల్చింది. భూమి గిర్రున తిరిగినట్టయింది. జారిపోయే గుండె ఒకచేత్తో పట్టుకొని, ఒక చోత్తో మొహం కప్పుకొని అక్కడనుంచి తిన్నగా ఇంటివైపు వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ ప్రవర్తనకి ఆశ్చర్యపడింది నిర్మల. "పిచ్చాడు తాతయ్య" అన్నాడు ఆ పిల్లవాడు.
వెంకట్రావు ఇంట్లో మంచంమీద కూలబడ్డాడు. ఇల్లు అంతా నిశ్శబ్దంగా వుంది. పిల్లి 'మ్యావ్' అంటోంది. సూర్యడూ, చంద్రుడూ, చుక్కలూ భూమిమీద వొక్కసారిగా రాలినై. నల్లని సముద్రపు చీకటి కెరటాలు జీవితపు గట్టుల్ని వొరసికొన్నాయి.
అతనిలో ఉత్సాహమూ, ఆనందమూ నాశనమయిపోయాయి. అతని కళ్ళు ఏదో పోగొట్టుకొన్నట్టు బీదగా చూస్తోంటాయి. వర్షాకాలంలో బోదర కప్పల బెకబెకలూ, వసంతంలో కోకిల కూజితాలూ అతనికి ఒకటే! రాత్రికా నక్షత్రాలు కనబడితే, ఉదయం దీపాలు అక్కర్లేకుండా వెల్తురు వస్తుంది. ఆకలికి అన్నం తింటారు. తినటం మూలాన్ని పెరుగుతారు. యవ్వనంలో కామిస్తారు. వృద్దాప్యంలో - చచ్చిపోయే రోజులు సమీపించినకొలదీ, చాలాకాలం బ్రతుకుతామనే ఆశతో జీవిస్తారు. శ్రావ్యంగా పాడేవాడికి, పాటరానివాడికీ వొకటే హృదయం ఉంది. "నీకంటే నేను గొప్పవాడ్ని" అనటానికి ఎవరికీ హక్కులేదు. ఒకరికి కవిత్వం రాయటంలో, ప్రకృతిని ఆనందించటంలో శక్తి ఉంటుంది. మరొకరికి హృదయాన్ని కరడు కట్టించుకొని చీకట్లని వెదజల్లే శక్తి వుంటుంది. తోచక దెబ్బలాడుతారు. తెలివితేటలు ఎక్కువై, ప్రభుత్వాలూ, యుద్దాలూ, విప్లవాలూ, కోర్టులూ కల్పించుకుంటారు. జీవితంలో నగ్నసత్యం తెలుసుకొని, నవలలూ, సినిమాలూ చూసి ఆనందిస్తారు. చివరికి ప్రతీ జీవితం ప్రత్యేక జీవితం. ఒకరికీ ఒకరికీ సంబంధంలేదు. ఆశకు అంతులేదు. అంతానికి ఆశ కారణం. ఇది ప్రపంచం. ఇది జీవితం.
(భారతి ఆగష్టు 1941)
********



