Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    సుందరమ్మ కడుపుతో ఉంది. ఆమె గర్భవిచ్ఛిత్తి చేసుకొంటానంది. కాని రావు ఒప్పుకోలేదు. "నా ప్రతిరూపాన్ని చంపుకోలేను. నాకు మూడువందల రూపాయల జీతం వస్తోంది. నా జీవితం, నా పేరు నాతో అంతమవకుండా ఒక కొడుకు కావాలి నాకు" అన్నాడు. ఈ మూడేళ్ళనుంచీ, వారిమధ్య జీవితం చాలా గౌరవంగా నడిచింది. ఒకరితో ఒకరు అట్టే మాట్లాడుకోరు. సుందరమ్మను 'మీరు' అనే పిలిచేవాడు. కాని ఆ రోజు సుందరమ్మ కొత్తమార్గం తొక్కింది. "నన్ను మీరు మన్నిస్తే నేనిక్కడ ఉండలేను. మీలో వొక భాగంగా వెలుగుదా మనుకుంటున్న నాకు, మీరే సర్వం ఐన నాకు" ఆమె కళ్ళమ్మట నీటి బిందువులు పొర్లినై. వెంకట్రావు తెల్లబోయాడు. ఆమెమీద అతనికి జాలీ, దయా ఉన్నై. 'ప్రేమ' అనేది అతను మరిచిపోయాడు, పాతి పెట్టేశాడు. ఒక్కొక్కసారి 'ప్రేమ' కల్ల అనీ, భక్తులకి పూనే ఆవేశంలా యువకులకు పూనుతుందనీ అనుకునేవాడు. కుటుంబ సౌఖ్యానికి స్త్రీ పురుషుల మద్య పరస్పరావగాహనా, అనురాగమూ కావాలనీ, ప్రేమ కవులకీ, రచయితలకీ వదలివెయ్యాలనీ అతని ఉద్దేశ్యం. అయినా అతను ఏ విషయంలోనూ ఎక్కువ ఉత్సాహం తీసుకోలేడు. అతనిలోని శక్తులు మ్రోడుచెందాయి. తనకి 'సింపతీ' వుంది. అయినా, నవ్వుతూ సుందరమ్మతో ఇలా అన్నాడు "నిన్ను మన్నించటంలేదు సుందరమ్మా! అలవాటు చొప్పున అనుకుంటున్నాను. నీ సౌఖ్యం నా సౌఖ్యం" ఆరోజు నుంచీ 'నువ్వు' అనేవాడు. సుందరమ్మ ఆనందంతో పొంగిపోయింది. "ఆయన ఇంటికి వచ్చేటప్పటికి అబ్బాయి ఎదురుగా వెళ్ళి 'నాన్నా' అని పిలుస్తాడు. ఆయన అబ్బాయిని ముద్దెట్టుకుంటా"రని ఆలోచిస్తుండేది.

    విధి నల్లని పెదవులు వారి జీవితాన్ని ముద్దెట్టుకున్నాయి. ననెల్లాళ్ళకి పురిటిగండం వచ్చి తల్లీ, పిల్లా చనిపోయారు. ఆ రోజున భోరున ఏడ్చాడు వెంకట్రావు. కాని తర్వాత రోజున మామూలు మనిషి అయాడు. నాటినుంచీ నువ్వు అంటే అతనికి రోతపుట్టింది. కొన్నాళ్ళకు ,కన్నయ్యతో గోదావరి జిల్లాకు ప్రయాణం కట్టాడు.

                                                                                9

    తిరిగి మూడేళ్ళవరకూ వెంకట్రావు జీవితం సాపీగా సాగిపోయింది. మోటుతనమూ, నిరాశా అతనిలో పాతుకుపోయినై, చూపు సరీగ్గా అనటంలేదు. ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. ఆఫీసులో దవాల్ బంట్రోతుమీదా, ఇంట్లో కన్నయ్యమీదా విసుక్కోవటం గొణుక్కోవటం ప్రారంభించాడు. ఆఫీసునుంచి వస్తో ఏదో చూసి అలాగే నిలబడిపోయేవాడు.

    ఒక కంట్రాక్టులో ప్రభుత్వానికి యాభై వేలు నష్టమొచ్చింది. కంట్రాక్టర్లు రావు కళ్ళల్లో దుమ్ముపోసి, సొమ్ము అంతా గుంజుకొని, తిరిగీ రావుమీద కేసుపెట్టారు. రావు ప్లీడరునేనా పెట్టుకోలేదు. ప్రభుత్వం రావుని డిస్మిస్ చేసింది. వదివేల రూపాయలు కాజేశాడనీ, అందుకని అతనికున్న ఇరవై ఎకరాల భూమిలో పది ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం పరుచుకొంది. వెంకట్రావు ఏమీ బాధపడలేదు. కన్నయ్య మాత్రం మానేశాడు జీతం తగ్గించారనే నెపంమీద.

    వెంకట్రావు పది ఎకరాలూ అమ్మేశాడు ఎనిమిదివేల రూపాయలకి. రెండువేలు పెట్టి ఒక పెంకుటిల్లు కొన్నాడు ఒక గ్రామంలో, ఒక కొత్త నౌకరుని పెట్టుకున్నాడు. 'ఇంత ఇల్లెందుకు' అనుకునేవాడు. నౌకరుతో 'నా ఇల్లు కదరా' అనేవాడు. ఒక బక్కపిల్లని చేరదీసి దాన్ని పెంచమని నౌకరుకు ఆర్డరిచ్చాడు. కాగితాలు చిరిగిపోయిన భాగవత పుస్తకం తీసి ఆనందబైరవి రాగంలో చదివేవాడు.

    వెంకట్రావుకి గుండెజబ్బు చేసింది. డాక్టర్లు మద్రాసు వెళ్ళమన్నారు. పదిహేను వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్రాసులో ఒక ఏడాది వుండి జబ్బు నయం చేసుకున్నాడు. మద్రాసు నుంచి వస్తోంటే వొక దిక్కులేని పన్నెండేళ్ళ పిల్లను తనతో తీసుకువచ్చాడు. ఆమెకి 'సుందరమ్మ' అని నామకరణం చేశాడు. ఒక గురువుని నియోగించి సంగీతం చెప్పించేవాడు. ఆమె 'తాతయ్య' అని పిలుస్తుండేది రావుని.

    రోజూ సాయంత్రం మాలగూడెం వెళ్ళేవాడు. ఆ పూటకు తిండిలేనివాళ్ళకి పావలా అర్ధా ఇచ్చేవాడు. పొరుగింటి లచ్చన్నగారితో తన ఇంజనీరు గొడవలు చెప్తూండేవాడు. ఇలా రెండేళ్ళు గడిచాయి. అతనికి బ్యాంకులో రెండువేలు మాత్రం మిగిలినై.

    ఒక పట్టభద్రుణ్ణి వెదకి తీసుకువచ్చి సుందరమ్మకి పెళ్ళిచేశాడు. వెయ్యి రూపాయలు కట్నం, అయిదువందలు
ఖర్చుచేశాడు. కన్నీళ్ళతో సుందరమ్మని అత్తవారింటికి పంపించాడు. "మాతో వచ్చివెయ్యి తాతయ్యా" అని ఏడ్చింది. "ఇప్పుడు కాదు, ముందు వస్తానమ్మా" అన్నాడు. జీవితంలో ఒక అనాధ బాలిక మద్దరించానుగదా అని సంతృప్తిపడ్డాడు.

    క్రమంగా అతని నిల్వ సొమ్ము కర్చు అయిపోయింది. "చేతుల్లో శక్తి ఉన్నంతవరకూ సుందరమ్మ ఇంటికి వెళ్ళి వాళ్ళను బాధించను" అనుకొన్నాడు. ఒక బియ్యపుకొట్టులో గుమాస్తాగా కుదిరాడు ఇరవైరూపాయల జతానికి.

    వెంకట్రావు శక్తిహీనవుడైపోయాడు. గడ్డం పెరిగింది. దగ్గు తిరిగివస్తోంది. మనిషి వంగిపోయాడు. మాలపల్లెలో పిల్లలు హాస్యం చేసేవారు. కాని నవ్వలేకపోయేవాడు రావు.

    మిట్టమధ్యాహ్నం అందులో వేసవికాలం. యజమాని ఆజ్ఞ ప్రకారం, వెంకట్రావు ఆయాసంతో మూడుమైళ్ళు దూరంలో ఉన్న పొరుగూరు వెళ్ళుతున్నాడు. అతని పాదాలూ, తలా మాడిపోతున్నై. తన పూర్వ జీవితాన్ని తల్చుకున్నాడు. ఎండిపోయిన గుండెలో ఏమూల వొక నీటి చుక్క ఉందో, అది కళ్ళలోంచి పెగల్చుకు వచ్చింది.

    తిన్నగా పొరుగుగ్రామానికి వెళ్ళి, ఒక కొలనులో నీళ్ళు తాగి వొక ఇంటి అరుగుమీద కూర్చొన్నాడు విశ్రాంతికోసం. నాలుగయిదేళ్ళ పిల్లాడు 'బూచాడు' అంటూ ఇంట్లోకి వెళ్ళి ఏడవటం మొదలెట్టాడు. ఒక ముప్పై ఆరేళ్ళ స్త్రీ గుమ్మం నుంచి తొంగిచూసి  "ఎవరు తాతా, ఏ వూరు మీది" అంది. వెంకట్రావు కునుకుపాట్లు పడుతూ పక్కవూరే అన్నాడు.     "ఏమైనా పిల్లలూ, మనుమలూనూ తాతగారూ" అంది ఆవిడ గుమ్మం దగ్గర అరచాటుగా నించొని. ఇంతలోకి ఆ అయిదేళ్ల పిల్లాడు వచ్చి'తాతయ్య' అంటూ వొళ్ళో కూర్చున్నాడు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.