Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
                                      8

    ఎనిమిది నెలలు గడిచాయి. ప్రభుత్వం వెంకట్రావుని ఫారెస్టు రేంజికి బదిలీ చేశారు. ఒకరోజున కన్నయ్యతో , సామానుతో బయల్దేరాడు రావు.

    ఆ వూళ్ళో మూడువందల గడపకన్న ఎక్కువ జనాభా లేదు. రెండు మైళ్ళ దూరంలో అరణ్యం కన్పడుతుంది. ఆ వూళ్ళో ఒక పెంకుటిల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు రావు. కాని అక్కడ అతనికి భోజన సదుపాయం లేదు. ఒకనెల జరిగాక శంకరానికి ఉత్తరం రాశాడు. వంటలక్కనిగాని, బ్రహ్మడినిగాని పంపమని. పదిహేనురోజుల్లో కేశాలున్న విధవ సుందరమ్మ వచ్చి పొయ్యి రాజేసింది.

    ఆ వూళ్ళో వాళ్ళకీ, ప్రక్క గ్రామాల వారికీ ఇంజనీరుగారు ప్రత్యక్షదైవం, పులితోళ్ళూ, దుప్పి చర్మం, కొమ్ములూ, అల్లోనేరేడిపళ్ళూ, యింకా వివిధములైన ఫలసముదాయాలూ ప్రతివారం వెంకట్రావుకి భక్తిశ్రద్దలతో అర్పించేవారు వాళ్ళ ఆచార వ్యవహారాలు చిత్రంగా ఉన్నై. వాళ్ళు మాట్లాడే తెలుగు ఒక్కొక్కసారి అర్ధమయ్యేదికాదు. పట్టణాల్లో ఉండే కృత్రిమత్వం, అతితెలివీ అక్కడలేవు. కష్టపడి పనిచేసుకుంటారు అనుభవిస్తారు. పార్టీ ప్రభుత్వాలూ, యుద్దాలూ, ప్రజావాదమూ, సామ్యవాదమూ, ఆత్మహత్యలూ, రోడ్డుదుమ్మూ, సినిమాలూ, ప్రేమలూ, విరహాలూ వారిని బాధించవు. కడుపునిండా తింటారు. సెలవివార నవ్వుతారు! సలహాలకి వెంకట్రావు దగ్గరకే వస్తారు.

    నాలుగునెలల్లో అతనిలో మార్పు కలిగింది. అతని కళ్ళల్లో జాలి గోచరించేది. అతని జీవితం కరగి కళ్ళల్లోకి వచ్చిందా అనిపిస్తుంది. తిరిగి ఇదివరకటి రొటీను జడత్వమూ!

    ఆ వూరి నీరు పడక అతనికి పెద్ద జబ్బు చేసింది. దగ్గర్లో డాక్టరు ఎవడూలేడు. ఊళ్ళో వున్న భిషగ్వరుడు చెంచయ్య మందిచ్చేవాడు. రెండు రోజులు స్మృతిలేకుండా పడిపోయాడు. రాత్రింబవళ్ళు సుందరమ్మ ఏమరక అతనికి ఉపచారం చేసింది. ఆమె ఓర్మికి ఆశ్చర్యపడ్డాడు. ఆమెతో "మీ రుణం ఎలా తీర్చుకోను" అన్నాడు. నెల్లాళ్ళకి జబ్బు తగ్గింది. చెంచయ్యకి యాభై రూపాయలిచ్చాడు. అంతడబ్బు అతనెప్పుడూ కళ్ళతో చూడలేదు. జీవితాంతం వరకూ, తన వైద్యశక్తిని గురించీ, వెంకట్రావు దాతృత్వాన్నీ గురించీ చెప్పుకునేవాడు. రెండు నెలల్లో పూర్వపు జవసత్తువలు సంపాదించాడు వెంకట్రావు.

    శంకరానికి ఉత్తరం రాశాడు. కొన్ని చీరలూ, సామానులూ పంపమని. సుందరమ్మ ఆ విలువగల చీరలన్నీ చూసి "నాకెందుకండీ ఇవన్నీ" అంది. "కట్టుకోండి తప్పేముంది" అన్నాడు రావు. సుందరమ్మ అవి ధరించటానికి భయపడేది.
 
    ఆరోజున వెంకట్రావు అర్ధరాత్రి ఉలిక్కిపడి లేచాడు. వెన్నెల విరగకాస్తోంది. 'శవంమీద కప్పిన తెల్లబట్ట' లా ఉందనుకొన్నాడు. ఇంతలో ప్రక్కగదిలోంచి సన్నగా ఏడ్పు వినబడింది. నిర్మల జ్ఞప్తికి వచ్చింది. ఆ గదిలోకి వెల్ళాడు. కిటికీలో కూర్చుని బయట చూస్తోంది సుందరమ్మ. ఆమె నల్లని పొడుగాటి జుట్టు ఆమె యెడల్ని కప్పింది. వెన్నెల వెలుగులో ఆమె వదనం మీద నీటిబొట్టు చూశాడు రావు.

    "ఏడుస్తున్నారా?"అన్నాడు.

    "లేదు" అంటూ ఆమె సిగ్గుతో తడబడుతూ లేచింది.

    "ఎందుకేడవటం?- గతాన్ని మరచిపోండి" అన్నాడు దయతో.

    "నాకు గతమనేది లేదు, నాకు జీవితమే లేదు. నన్ను ఆదరించేవారు లేరు. 'నా' అన్నవారు లేరు. నేను బాల్యంలోనే విధవనయ్యాను" ఆమె ఏడుస్తోంది చిన్నపిల్లలా.

    'ఏం' అన్నాడు వెంకట్రావు. చీకట్లో నడిచేవాడికి దీపంకన్న మరొక సాంథుడు ఎక్కువ సహాయంగా ఉంటాడు. అందుకే వెంకట్రావుకి క్యూరియాసిటీ ఎక్కువయింది.

    "నేను ఒక విధవకి జన్మించాను. నా తల్లి నన్ను అమ్మేసింది హోటలు పెట్టుకున్న వెంకమ్మకి. కాని దాని ప్రియుడు ఒప్పుకోలేదు. ఆ వెంకమ్మ నన్ను పిల్లలులేని తండ్రికి అమ్మింది. అతను ఎనిమిదేళ్ళదాకా విద్యాబుద్దులు చెప్పించి ఒహడికిచ్చి పెళ్ళిచేశాడు. ఆ తర్వాత చచ్చిపోయారు పెంపుడు తండ్రీ, మొగుడూన్నూ -ఒకే ఏడాదిలో, ఆ తర్వాత ఒకరింట్లో పిల్లల నెత్తుకొనేదాన్ని. అక్కడ నాలుగేళ్ళు పనిచేసి మానేశాను. తిండిలేక ఒకరోజున వొకడికి మానాన్ని అమ్మాను. అప్పణ్నుంచీ ఆ వూరువిడిచి నేటిదాకా వంట చేస్తున్నాను. మూడుసార్లు అమ్ముడుపోయాను"
 
    వెంకట్రావు హృదయం కరిగింది. జాలితో ఆమె బుజంమీద చెయ్యి వేశాడు. ఆమె ఆశతో, కాంక్షతో చూసింది. వెంకట్రావు తెలియని కాంక్షచేత ప్రోత్సహింపబడి ఆమెని కవుగలించుకొన్నాడు.

    నాటినుండీ సుందరమ్మ అతనికి వంటలక్క, భార్య, ఆదరించే తల్లీన్నూ. ఆమెను 'మీరు' అనే పిలిచేవాడు.

    ఒక ఏడాది గడిచాక వెంకట్రావు, ఆమె కోరికమీద ఆమెని కాశీ పంపించాడు. రెండునెలల్లో ఆమె తిరిగివచ్చి కాశీ విశేషాలు చెపుతూ ఇలా అంది. "పాపం నర్సాపురంనుంచి లక్ష్మమ్మ అనే ఆవిడ నాలుగేళ్ళ నుంచి అక్కడ ఉంటోంది. పోయింది. వారంక్రితం."

    "అరెరె!" అన్నాడు వెంకట్రావు.

    మూడేళ్ళు గడిచాయి. ఒకనాడు రావుకి ప్రభుత్వపు ఆర్డరు వచ్చింది. విప్పి చూశాడు. తనకు డిస్ట్రిక్టు యింజనీరు పదవి ఇచ్చింది ప్రభుత్వం. ఆనందంతో  సుందరమ్మతో ఇలా చెప్పాడు. "రెండు నెలల్లో మనం మన జిల్లా వెళ్ళిపోవచ్చు. అక్కడ సుఖంగా ఉంటుంది. "




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.