Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"నిర్మల -నువ్వేనా?" అన్నాడు రావు.
"ఏం బావులేదూ" అంది నిర్మల. వెంకట్రావు మాట్లాడలేదు. నిర్మలకి కష్టమనిపించింది.
"కోపమా మీకు, స్వతంత్రం తీసుకున్నానని?"
"కాదు నిర్మలా! చాలా సంతోషం. కాని నా మనస్సుకి పూర్వపు గది శాంతీ, సంతోషమూ యిస్తుంది."
నిర్మల వులిక్కిపడింది. అతనిలో యెంత భేదం కలిగిందో మానసికంగా! రావు దగ్గరగా కుర్చీలో కూర్చుని తన్ని గురించి ఇలా చెప్పింది. "నేను ఇతర యాక్టివిటీస్ మైనేశాను. నాకు విసుగెత్తింది. అవన్నీ భ్రమలు..... అందరూ విమర్శించేవారే! నాకున్న ఉత్సాహం ఇతరులకి లేదు. నాకోసమా అనిపించింది. అవన్నీభ్రమలు....రావు .లేకపోతే స్త్రీలకు పబ్లిక్ జీవితం ఏమిటి?"
"నిజం" అన్నాడు రావు.
"నిజం -ఈ మూడేళ్ళ జీవితమూ - యెంత వృధా చేశానో?"
రావు ఆమెకేసి చూశాడు. ఆమెలో పశ్చాత్తాపమో, బాధో వ్యక్తమవుతోంది.
ఇద్దరూ కలిసి షికారు వెళ్లారు పొలంగట్లకి. రావు తన ఆఫీసు పనుల్ని గురించి ముక్తసరిగా చెప్పాడు. ఒకరి హృదయంలో తళుకొత్తే ఆశా, నిరాశా, మరొకరి హృదయంలో మ్రోడుపోయిన చైతన్యమూ, నీడలులా, దెయ్యాలులా కదుల్తున్నాయి. ఎక్కువసేపు ఇద్దరూ మౌనంగానే వున్నారు.
ఇద్దరూ క్యారేజి భోజనం చేశారు. మధ్య గదిలో రావూ, ప్రక్కగదిలో నిర్మలా పడుకొన్నారు. వరండాలో కన్నయ్య గుర్రుపట్టుతున్నాడు.
పండ్రెండు గంటలయింది. రావు పడుకొన్నదీ లేందీ చూద్దామని నిర్మల రావుగదిలోకి వచ్చింది. రావు రెండు చేతులతో తలని పట్టుకుని కుర్చీలో కూర్చొన్నాడు. "మీరు నిద్రపోలేదా?" అంది నిర్మల.
"....."
"జబ్బు చేస్తుంది"
"నాకు అలవాటే!"
"తల అట్లా పట్టుకున్నారేం?" నిర్మల అతన్ని సమీపించి అతని కణతల్ని తాకింది. అవి కొట్టుకుంటున్నాయి.
"తలనొప్పి ఎక్కువగా వుందా?"
"అంత ఎక్కువగా లేదు"
నిర్మల తన గదిలోకివెళ్ళి అమృతాంజనంతో తిరిగివచ్చింది. "చేతులు తియ్యండి. రాస్తాను. నాకు చెప్పలేదేం? ఎందుకు ఒక్కరూ అలా బాదపడతారు?" అని అతని కణతల్ని తాకబోయింది. వెంకట్రావు ఆమెని వారించి, ఆమె చేతిలోని డబ్బా తీసి బల్లమీద పెట్టాడు. ఆమె అక్కడ కొంతసేపు నుంచొంది. ఆ మౌనం ఆమెకి దుర్బరమైంది. తడబడుతూ పక్కగదిలోకి వెళ్ళి కూలబడింది. ఒక నిముషానికి వెంకట్రావుకు వెక్కి వెక్కి యేడుపు వినబడింది. ఆమె గదిలోకివెళ్ళి "ఛ! నిర్మలా ఏడుస్తున్నావా!" అన్నాడు.
"నేను రావటం మీకింత కష్టంగా వుందని నాకు తెలియదు. నేను మీకు అవసర సమయంలో సేవ చేయకూడదూ? మన పూర్వ స్నేహం మరచిపోయారా!" ఆమె యింకా తలగడలో మొహం కప్పుకొని ఏడుస్తోవుంది.
"లేదు నిర్మలా......" అతని గొంతుక బరువెక్కింది. "నేనేం చేస్తున్నదీ నా కొక్కక్కసారి తెలియదు. నీ రాక నాకు కష్టం కలిగించలేదు. నీకు కష్టం కలిగిస్తే క్షమించు. నా ఇంటికి వచ్చిన స్నేహితురాలివి, అతిథివి. నీ సౌఖ్యం చూడవలసిన విధి నాకుంది" నిర్మల తల పైకెత్తింది.
"మీకు నేను అంతేనా? అతిథినేనా మీ జీవితానికి ఇంకా ఎందుకూ ఉపయోగపడలేనూ?" ఆమె గొంతు గద్గదికమయింది.
"నాకు జీవితమనేది ఉంటే అది జరిగిపోయింది. నాకు కోరికలు లేవు. అందుమూలాన్ని ఒకరి సాహాయ్యం అవసరమని అనుకోను. నాకు రొటీన్ అలవాటయింది. జీతమిస్తారు పనిచేస్తాను -అన్నింట్లోనూ అంతే"
"ఇంక ఎందుకూ ఉపయోగపడలేనూ మీ జీవితానికి? చెప్పండి. చెప్పండి." ఆమె విహ్వలతతో అడిగింది.
"నిర్మలా! ఒకరికొకరు పనికివస్తా రనుకోవడం పిచ్చి ఊహ పడుకో నిర్మలా! తలిదండ్రులు లేరు నీకు. ఈ గృహంలో ఎవరికేనా నీడ నిస్తాను, నాకు సంపాదనశక్తి ఉన్నంతవరకూ, అలా ఇచ్చేందుకు భగవంతుణ్ణి శక్తి ఇమ్మని ప్రార్ధిస్తాను."
"ఎంత మారిపోయారు మీరు!" అంది నిర్మల, కళ్ళు ఒత్తుకుంటూ. ఆమె తల ఎత్తేటప్పటికి రావు అక్కడ లేడు. చలిగాలి తలుపు సందుల్లోంచి కీచుమంటూ వీచింది.
ఉదయం రావు లేవగానే కన్నయ్య వచ్చి "అమ్మాయిగారు వెళ్ళిపోయారు బాబూ! మీతో చెప్పమన్నారు" అన్నాడు.
"ఎంతసేపయింది?"
"ఇప్పుడే -వీధిలో ఉంటారు."
వెంకట్రావు గుమ్మంలోకి వెళ్ళాడు. ఫర్లాంగు దూరంలో కారుదుమ్ములో నిర్మల నడిచివెళ్ళిపోతోంది. స్టేషనుకి!



