Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"కనపడటం మానేశారేం" అంటాడు రావు.
"మా చిన్నవెధవకి వంట్లో బాగాలేదు. అదీగాక మా అమ్మాయి పురుడు కొచ్చింది"
"అలాగా?"
"మా రోడ్డు విషయం మీరు కొద్దిగా దయవుంచాలి"
"ఏం రోడ్లండీ! గవర్నమెంటు కాదాయం తగ్గిపోతోంది. ఈ డిస్ట్రిక్టుబోర్డు వచ్చాక మరీ అద్వాన్నం అయిపోయింది" అంటూ చిన్నగా దగ్గుతాడు రావు.
"మరేనండీ! ఈ మున్సిపాలిటీలు - 'అమ్మిరాజు' చైర్మన్ అయాక దరిద్రమే పట్టుకుంది. 'ఓ' అంటే 'న' రాదు, డబ్బు గుప్పేసి పదవి సంపాదించాడు"
"కలికాలం!"
"చూడండి ఈ మురికి కాల్వలూ -అబ్బ, వెధవ దోమలూ, వెధవ యిదీన్ని" అంటాడు ఆ పెద్దమనిషి.
అక్కణ్ణుంచి తిన్నగా ఇంటికి వెళ్తాడు రావు. కొత్త మిత్రుడు యాజులు. ఎం.ఎస్.సి. వస్తాడు, తెలివైనవాడూ, మంచివాడూ కాని, అహంభావపు పాలు ఎక్కువ. నోబుల్ ప్రయిజు తనకి ఎప్పుడో వస్తుందనే నమ్మకం - తనుముందు చేయబోయే రిసెర్చికి. తర్వాత భోజనం. ఆఫీసు కాగితాలూ చూసుకోవటమూ, కిటికీలోంచి విశాలమైన బయలు చూడటమూ. కన్నయ్య "పెళ్ళాంమీద బెంగపుట్టింది , సెలవిప్పించండి" అంటాడు. ఆ నక్షత్రాలు ఒక్కొక్కటే రాలిపోతే ఇంజనీర్లు ఆకాశానికి రోడ్డువేస్తే, దెయ్యాలు తన్ని లవ్ చేస్తే - ఇలా ఆలోచించుకుంటూ భయంతో నిద్రపోతాడు. ఉదయం తను పక్కమీద నుంచి లేవకుండానే దాసీది రావటం, అంట్లు చప్పుడు చెయ్యటం, కన్నయ్య దానితో సరసాలాడటం వింటాడు. లేచి స్నానంచేసి డ్రెస్సు వేసుకుంటాడు. తిరిగి ఆఫీసు పని, సాల్యూట్ చేసేవాళ్ళకి సాల్యూట్ చేస్తూ, ఠీవిగా చిరునవ్వు మిళితంచేస్తూ మాట్లాడాలి. అందరూ 'ఇంజనీరుగారు' అంటూ గౌరవిస్తారు. అంతేగాని ఒక పద్దెన్మిదేళ్ళ పిల్లచేతిలో ఓడిపోయాడనీ, ఆమె వెనకాల ఉన్మాదుడులా తిరిగాడనీ ఎవరికి తెలుసు? సాయంత్రం క్లబ్బుకి! తిరిగీ యుద్దాన్ని గురించీ రేడియోని గురించి కబుర్లు. వసంతరావు తన రసికత్వాన్ని గురించి గర్వంగా విశదపరుస్తాడు. ప్లీడరు రామచంద్రరావు పార్కులో మొక్కల్ని గురించీ లెక్చర్లిస్తారు. అమ్మిరాజు తను సన్నంగా వుండేందుకు మార్గాలు చెప్పమంటాడు. చివరికి అందరూ పేకాడుతారు. తనకి ఎప్పుడూ నష్టం వస్తుంది. రాత్రి ఒక్కడూ ఇంటికి వెళ్తాడు. కన్నయ్య "బాబుగారు అలసిపోయారు" అంటూ చీకటి నవ్వుతో ఎదురౌతాడు.
వెధవ కలలు వచ్చిన పెద్దనిద్రలాగ, మూడేళ్ళు గడిచిపోయాయి. వెంకట్రావుకి జీతం రెండువందలదాకా పెరిగింది. అతనికి ప్రపంచంలో ఆనందించవల్సిన వస్తువూ, విచారింవలసిన విషయమూ ఏమీలేవు. నిజానికి అతని దృష్టిలో అన్నీ వొకటే! ఏడుపూ, నవ్వూ లేనివాడు తనొక్కడే అనుకొన్నాడు.
ఆ రోజున ఒక్కడూ సిగరెట్ కాలుస్తూ ఈజీచైర్ లో పడుకొని ఆలోచిస్తున్నాడు. దేవుడు గూడా లేడా అని. తను చాలా పెద్దవాడైపోయినట్టూ , వృద్దాప్యాన్ని సమీపిస్తున్నట్టూ తల్చుకొని వులిక్కిపడ్డాడు, కన్నయ్య వొక్కగంతేసి "అమ్మాయిగారు వచ్చేరండి" అన్నాడు.
"ఎవరురా?"
"అమ్మాయిగారు -నర్సాపురం అమ్మాయిగారు."
దీనంగా, దైర్యంగా చూస్తో, నిర్మల గుమ్మంముందు నుంచుంది. రావు ఆమె అకస్మాత్ ఆగమనానికి తెల్లబోయాడు. ఏమనాలో తెలియక కంగారుపడ్డాడు.
"నేను రావటం మీకు చాలా ఆశ్చర్యంగానే వుంటుంది" అంది నిర్మల, పేలవంగా నవ్వుతో. వెంకట్రావు తేరుకొని లేచి ఆమెని ఆహ్వానించాడు. అతను చాలా నెమ్మదిగా మాట్లాడాడు.
"కుటుంబయ్యగారు క్షేమమా?"
"పోయారు -ఏడాది అయ్యింది"
"పాపం!" అన్నాడు రావు. నిర్మలలో పూర్వపు చలాకీతనమూ, అయస్కాంతంలా ఆకర్షించే పెర్సనాలిటీ అంత లేదు. ఆమెలో వెలిగే సహజమైన నవ్వూలేదు. ఆ నవ్వుయొక్క మాసిపోయిన ఛాయలు మాత్రం కన్పడుతున్నాయి.
"మీ అమ్మగారేం చేస్తున్నారు"
"కాశీ వెళ్ళిపోయింది కోపం వచ్చి"
"ఏం -నిర్మలా!"
"నేను పెళ్ళిచేసుకోనన్నానని."
తర్వాత మౌనం. గత సంగతులు జ్ఞప్తికివచ్చి ఇద్దర్నీ కలచివేశాయి. వెంకట్రావు కిటికీలోంచి ఆకాశంకేసి చూస్తున్నాడు. పిల్లమబ్బులు గంతులేస్తున్నాయి లేగదూడలలాగ. ఇంతకి ఆమె ఎందుకొచ్చింది.
"ఈగది అంతా ఇంత చిందరవందరగా వుందేం? ఆడదిక్కులేందే మగవాళ్ళు ఇలాగేవుంటారు" అంది నిర్మల. ఆ పలుకుల్లో ఆశా, ఆతృతా, పరితాపమూ గుడిగంటల్లా శబ్దించాయి. తొమ్మిదిగంటలకు రావు ఆఫీసుకు వెళ్ళిపోయాడు. నిర్మల రావు ఇంట్లోనే ఆగిపోయింది. సిగరెట్టు పీకలూ, పుస్తకాలూ, ఖాళీ అగ్గిపెట్టెలూ, పాతబట్టలూ - గది అంతా అసహ్యంగా వుంది. తిరిగి రావు సాయంత్రం ఇంటికి వచ్చాడు. గుమ్మానికెదురుగా నిర్మల నవ్వుతో నుంచొంది. ఇదివరకటికన్నా ఆమె పెద్దదయింది. ఆ సమయంలో తిరిగీ నిర్మలలో పూర్వపు నవ్వూ కళ్ళల్లో వెలుగూ కలిగినై. రావు ఇల్లంతా చూశాడు. అన్నీ చక్కగా అమర్చబడి వున్నాయి.



