Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    మరుసటి రోజున లక్ష్మమ్మ దగ్గర బిడియపడుతూ వివాహప్రసంగం తెచ్చాడు. లక్ష్మమ్మ యిలా అంది. "నాయనా, నిన్నే అడుగుదామనుకొంటున్నాను. కావాల్సినవాడవూ, ఉద్యోగస్థుడవూ యింతకన్నా నాకు కావాల్సిందేమిటి? అమ్మాయి కూడా ఇష్టపడుతుందనే నా ఉద్దేశ్యం. ఎప్పుడా ప్రసంగం తెచ్చినా, 'నీ కెందుకు నీ గొడవకాదంటుంది. అయినా ఈ వేళ అడిగిచూస్తాను. చదువుకొన్నవాడవు. దొరలలా మీరే ఆలోచించుకోండి."

    లక్ష్మమ్మ అడిగిచెప్పేవరకూ రావు ఓర్పు పట్టలేకపోయాడు. మధ్యాహ్నం నాలుగు గంటలకి నిర్మల గదిలోకి వెళ్ళాడు. నిర్మల వీణవాయిస్తోంది.

    "నిర్మలా!"

    "ఊఁ!"

    "నీతో ఒక విషయం మాట్లాడాలి"

    "చెప్పండి"

    "ఇక్కడకాదు తోటలో"

    ఆమె విశాలమైన కళ్ళనెత్తి రావు కళ్ళలోకి చూసింది. ఆమె బుగ్గ లెర్రపడ్డాయి. కాని ఏమీ తెలియనట్టు 'అలాగే' అంది.

    తోటలో మామిడిచెట్టు క్రింద నిల్చుని ఆమె నడిగాడు ఆమె చేతిని తన చేత్తో పట్టుకుని. ప్రకృతి పవిత్రమైన గంభీరత దాల్చింది. పచ్చని చేలు ఎండలో మెరుస్తున్నాయి. ఆవేశం రావు గొంతులో 'జలజలించింది.'

    "నిర్మలా! నేను చెప్పబోయే విషయం నీకు తెలిసే వుంటుంది. నేను తలిదండ్రులు లేనివాణ్ని. స్వశక్తిచేత ఈ స్థితిలోకి వచ్చాను. నాకు నూటపాతిక రూపాయల జీతము. మేనత్త రాసియిచ్చిన పాతిక ఎకరాల నా ఆస్తి - నాకు జీవితం ('జీవితం' అని ఉచ్చరించినప్పుడు అతని గొంతు వణికింది. అతని బ్రతుకు తన యెదురుగా నిల్చొనీ నవ్వినట్టని పించింది) ఏ కోర్కేలేదు, ఒహటితప్ప. నా కష్టసుఖాల్ని పంచుకొనేందుకు నా ప్రేమకు తిరిగి ప్రేమ యివ్వటానికి నా యింట్లో ఒక దేవత -ఒక చిరునవ్వు- ఒక స్త్రీ. (అతని గొంతు తిరిగీ ఒణికింది) నిన్ను ప్రేమిస్తున్నాను నిర్మలా! నీ ప్రేమ అమూల్యం నిన్ను పెళ్ళి చేసుకోవాలని నా కోరిక. నీ తల్లి ఇష్టపడింది. నువ్వు. నువ్వు...... ఒప్పుకోవాలి అంతే."

    నిర్మల ఒకమారు రావుకేసి చూసి రెప్పలు కిందికి వాల్చింది. రావు ఆమె చేతిని నొక్కుతూ, "చెప్పు నిర్మలా!" అన్నాడు. ఆమె తిరిగి అతనికేసి చూసి రెప్పలు వాల్చింది. ఆ మౌనం చిరుమంటలా రావు గుండెలో సెగల్ని జల్లుతోంది. తిరిగీ అడిగాడు రావు. స్ఫుటంగా మృదువుగా నిర్మల ఇలా అంది.

    "మీరు వేరొక విధంగా తలిస్తే నేను చెప్పలేను. నాకు మీయెడ విముఖభావం లేదు. ఈ ఏడాదిలో నా ఉద్దేశ్యాలు మారిపోయినై. కళకీ సంఘానికీ సేవ చేయడానికి నేను కంకణం కట్టుకొన్నాను. నాకు పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం యేమీలేదు. మీకు కష్టం కలిగిస్తే క్షమించండి. కాని యిది నిశ్చయం"

    రావు ఆమె చేతిని వదిలేశాడు. కళ్ళమ్మట పొర్లివచ్చే నీళ్ళు, పగిలిపోయే గుండె కనబడకుండా, వెనక్కి తిరిగి, మొహం చేతుల్లో దాచుకు చరచర వెళ్లిపోయాడు  "రావు రావు" అని పిలుస్తున్న నిర్మలకేక అతను వినిపించుకోలేదు. నిర్మల యింటికి వెళ్ళింది. రావు కన్పడలేదు.  "అర్జంటు పని అంటూ వెంకట్రావు ఈ బండికి వెళ్ళిపోయాడమ్మాయి" అంది లక్ష్మమ్మ. నిర్మల జాలితో నిట్టూర్చింది.

                                 7

    వెంకట్రావు కొన్నాళ్ళు వీధిలోకి వెళ్ళలేదు. నిర్మల ఫోటో శంకరానికిచ్చేశాడు. ఒక్కడూ ఆకాశం కేసి చూస్తోండేవాడు. మబ్బులు, నక్షత్రాలు, చీకటి , పగలు, సంధ్య అన్నీ ఆ తెర మీద నాటకమాడు తూండేవి ఈ ఏకంత ప్రేక్షకుడికోసం.

    రోజులూ, వారాలూ, నెలలూ నడిచినై. వెంకట్రావు వీధిలోకి వెళ్ళటం మొదలెట్టాడు. ఆ వూరి కంట్రాక్టరుతో రోజూ వొక గంట బాతాఖానీ, రెండు గంటలు పేక ఆడేవాడు. సాయంత్రం క్లబ్బుకివెళ్ళి నలుగురితోనూ కలిసి కూర్చొనేవాడు! కాని "చాలా మితభాషి అయాడురా రావు" అనేవారు స్నేహితులు. యుద్దాన్ని గురించీ, ఆరోగ్యశాఖని గురించీ, టెన్నీసును గురించీ అందరూ చెప్పుకొనే కబుర్లు విని, ఆలస్యంగా ఒక్కడూ చీకట్లో ఇంటికి వెల్ళేవాడు. "బాబుగారు అలసిపోయారు" అంటూ కన్నయ్య యెదురుగా వచ్చేవాడు.

    ఏడాది గడచింది. అతనిలో ఒక విధమైన అసంతృప్తి. అశ్రద్ధా పాదుకొనిపోయినై. ఆ రోజున తిన్న భోజనపదార్ధాలు ఏవోకూడా చెప్పలేడు. శంకరంతో యిలా అనేవాడు. "ఆ రోజులు వేరోయ్! కాని ఆమె నా జీవితాన్ని భస్మం చేసింది." ఎవరేనా తన వివాహ ప్రస్తావన తెస్తే చిరునవ్వుతో ఇలా అనేవాడు. "ఇరవై ఆరేళ్ళు కదాండి -అదే, ఇరవై ఏడు వచ్చింది, అంటే సగం జీవితం అయింది. ఆ సగమూ సుఖంగా యిలా పోనివ్వండి! అతను ఉద్యోగం విషయంలో అదివరకటికన్నా పట్టుదల యెక్కువ చూపాడు. జీతంలో ఇంక్రిమెంటు వచ్చింది.

    సాయంత్రం పొలాలగట్లనుంచి వస్తో వివిధ వృక్షాల్నీ పరికించేవాడు. కన్నయ్య ఆ ఏడాది వర్షాల్ని గురించీ, రైతుల కష్టాల్ని గురించీ చెప్పేవాడు. రోడ్డుమీదకు రాగానే "ఓహో! ఇంజనీరుగారా! నమస్కారం" అని పలకరిస్తారు వొకరు.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.