Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఆ రోజున మధ్యాహ్నం ఇంటికి వెళ్ళలేదు. స్నేహితుని ఇంట్లో భోంచేసి, సాయంత్రం క్లబ్బుకి వెళ్ళాడు. అతనికి చీకాకు, తలనొప్పి ఎక్కువయినై. ఒకానొక వాదనలో "ఆడవాళ్ళకి స్వతంత్రం ఇవ్వగూడదనీ, స్వార్ధత్వమూ, మోసమూ వాళ్ళలో హెచ్చు" అనీ వాదించాడు. తర్వాత దీపస్తంభాలు లెక్క పెట్టుతూ ఇంటికి చేరాడు.
గుమ్మం ముందు కన్నయ్య నుంచొని వున్నాడు. రోజూ అనేమాట ఇవాళ అనలేదు. "బాబుగారికేదో పెద్ద పళ్ళబుట్ట వచ్చింది. కమ్మని వాసన కొట్టుతోంది" అన్నాడు. ఒకవేళ కంట్రాక్టరేమైనా పంపాడేమో అనుకొని తిన్నగా వెళ్ళి వెంకట్రావు 'ఉస్సు' అంటూ కుర్చీలో కూలబడ్డాడు. కన్నయ్య ఒక పెద్ద బుట్ట ఎదురుగా పెట్టి చేతిలో ఒక కవరూ, పార్సెలూ పెట్టాడు. ఆతృతతో వెంకట్రావు కవరు తెరిచాడు. నిర్మల దగ్గర్నుంచి. ఆనందంతో స్పందించే హృదయంతో చదివాడు. అందులో ఉన్న సారాంశం ఇదీ -తను లాడ్జి మారటంవల్ల ఉత్తరాలు ఆలస్యంగా చేరినట్లూ అదీగాక, అతని ఆతృతని వృద్దిపొందించటం తనకొక సరదా అనీ వ్రాసింది. "రాజకీయాలంటే ఈ మధ్య నాకు సరదా కలిగింది .చాలా ఇంటరస్టుతో చదువుతున్నాను- క్రితం నెల రేడియోలో నా పాట విన్నారా? -నీకు చాలా కోపంవచ్చి ఉంటుంది కదూ ఉత్తరం రాయలేదని.... జీవితంలో నేను చేయవల్సిన పనులు చాలా ఉన్నాయనిపిస్తోంది! ఈ మధ్య ఆడవాళ్ళం (విద్యార్ధినులం) కలసి ఒక కల్చరల్ క్లబ్బు స్థాపించాము. కళలూ విజ్ఞానమూ, అభివృద్ది పొందించటానికి -ఇంజనీరుగారూ! ఎన్ని రోడ్లు రిపెయిర్ చేయించారు..." ఇలాగే ఏమేమో రాసింది. పార్శెలు విప్పాడు. ఒక చిన్న సెల్యులాయిడ్ బొమ్మ. బుడగలున్నూ -పోటో! అచ్చంగా నిర్మల -ఆ నవ్వుతోన్న మొహమూ, ఆ ముంగురులూ, ఆ మృదువైన చేతులూ...
ఆగలేని ఉద్రేకంతో ఆ ఫోటోని ముద్దెట్టుకొన్నాడు. గది తలుపులు వేసుకొని. ఉత్తరంలోని గుండ్రని అక్షరాల్లోని రహస్య హస్తవిన్యాసాన్ని తల్చుకొన్నాడు. ఈ శుభవార్త చెప్పినందుకు కన్నయ్యకి అయిదురూపాయలు బహుమానం ఇవ్వదల్చుకున్నాడు. ఆ గదీ, టేబిలూ, గోడకి సాలీడూ, పుస్తకాల షెల్ఫూ -
అన్నీ ఆనందంతో నవ్వుతున్నాయి.
తర్వాత రోజున ఆమెకి చాలా ఉత్సాహంతో ఉత్తరం రాశాడు. ఆమె 'కల్చరల్ క్లబ్బు'ని పొగిడాడు. "నువ్వు నాకు దేవతవు." అన్నాడు ఒకచోట
అప్పట్నుంచీ ప్రతీ పదహేను రోజులకీ ఆమెదగ్గర్నుంచి ఉత్తరం వస్తోంది. ఎప్పుడూ సంగీతం గొడవా, కల్చరల్ క్లబ్సు విశేషాలూ. "స్త్రీ ప్రపంచ కల్యాణం మాచేతుల్లోవుంది" అని రాసింది ఒకచోట. ఆ వుత్తరాలు, మంత్రాలు చదివి చదివి విసుగెత్తిన పురోహితుడి మొహంలాగ వున్నా, వాటిల్లోనే కొత్త సొంపులూ, కొత్త అర్ధాలూ కనిపెట్టుతున్నాడు వెంకట్రావు.
అయిదు నెలలు ఇలా గడిచినై. నిర్మల పోటో చక్కని ఫ్రేములో అమర్చబడి బల్లమీద నవ్వుతోంది. హేమంతాలూ, శ్రావణాలూ అన్నీ వొక వసంతం లాగున్నాయి రావుకి. రోజులు లెక్కిస్తున్నాడు. క్యాలెండర్లు తయారుచేసినవాళ్ళు బుద్దిహీనతని దూషిస్తున్నాడు. ఆ వూళ్ళో ఒక చిన్న మేడని అద్దెకి మాట్లాడి వుంచాడు, భావిజీవితం నిర్మలతో గడిపేందుకు. సంసారానికి కావల్సిన సామానులేమిటో రాత్రింబవళ్ళు ఆలోచించి ఒక పట్టీ తయారుచేశాడు. ఆ పట్టీలో, ముందు పుట్టబోయే వంశోద్ధారకుడికి పాలపీకలూ, తొక్కుడుబండీ, నిర్మలకు పియానో, కుంచెలూ, కాన్వాసూ కూడా వున్నాయి. ప్రొవిన్షియల్ ఇంజనీర్సు సభలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కార్యనిర్వాహకవర్గంలో సభ్యుడైనట్టు ఆంధ్రపత్రికలో పడింది. పేపరు కటింగు వొకటి నిర్మలకు పంపించాడు.
పెళ్ళి అయి, సంసారం సాగిస్తూవున్న మిత్రుల ఇంటికి తరచు వెళ్ళి, వాళ్ళ సౌఖ్యమూ, వాళ్ళసొంపూ, సొగసూ చూసి నేర్చుకునేవాడు. "రష్యా అంటే చక్కని దేశమే కాని, ఫేమిలీ -కుటుంబ -సౌఖ్యం ఉండదోయ్" అనేవాడు సోషలిస్టు కామ్రేడ్సుతో. తను నర్సాపురం వెళుతూన్నట్టు నిర్మల దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. కాని ఆమె తేది సరిగా వ్రాయక "మూడు నాలుగు రోజుల్లో" అని వ్రాసింది. రెండు రోజులు కాళ్ళు పడిపోయేట్టు స్టేషనుచుట్టూ తిరిగి ఆశాభంగం పొందాడు. "రాత్రి బండికెళ్ళిందేమో" అని సమాధానపరుచుకొన్నాడు.
నర్సాపురం వెళ్ళి లక్ష్మమ్మని కల్సుకుని, పెళ్ళి విషయం మాట్లాడుదామని నిశ్చయించాడు. కాని ఇంతలోకే అతనికి ప్రభుత్వం పని తగిలింది. వారం రోజులోపికపట్టి ఆశతో, ఆనందంతో, ఉత్సాహంతో, కన్నయ్యని ఇంటిదగ్గర వుంచేసి, 'సిరికింజెప్పడు' అన్నంత వేగంతో బయలుదేరాడు. మానవుడికి రెక్కలు వుండటం చాలా అవసరమని ఇంజనీర్సు సభలో తీర్మానించటానికి నిశ్చయించుకొన్నాడు.
6
ఏడాది క్రిందట నిర్మలకన్న ఈ నిర్మలలో సౌందర్యం ఇనుమడించింది. ఆమె కళ్ళల్లో వసంతాలు నవ్వుతున్నై. ఆమె శరీరపు కదలికలో, పెదవి వంపుల్లో జవ్వనపు జిగిబిగి గోచరిస్తుంది. గులాబీరంగు రిబ్బను కొసను కట్టిన వాల్జడ సౌఖ్యానికి సౌపానసరళిలా వుంది.
కుటుంబయ్యకి దగ్గు ఎక్కువయింది. లక్ష్మమ్మ చాలా సంతోషంతో ఆదరించింది. మొదటిరోజున నిర్మల అంతగా మాట్లాడలేదు రావుతో. ఏదో పుస్తకం తీసుకొని నేడమెట్లమీద కూర్చొని సాయంత్రం వరకూ చదువుతోంది. కొత్తగా నేర్చుకొన్న పాటలు పాడింది. తన యాక్టివిటీస్ ను గురించి చెప్పింది. ఆమె చలాకీతనానికి గాంభీర్యము తోడై కొత్త అందాన్ని కూర్చింది.



