Home » VASUNDHARA » Vasundhara Kadhalu - 12
నేను తెల్లబోయాను. గిరిజ నాకిచ్చిన ప్యాకెట్ లో స్మగ్లింగ్ గూడ్సే ఉన్నాయట. అందుకు బదులుగా నేను డబ్బున్న బ్రీఫ్ కేసు వాళ్ళకు అందించాను. అది స్మగ్లింగ్ వ్యవహారమనేసరికి నేను దెబ్బ తిన్నప్పటికీ గతంలో నన్ను వేధిస్తున్న చిక్కు ప్రశ్నల కిప్పుడు జవాబులు దొరికాయి.
"నువ్వు స్మగ్లర్లు ముఠా మనిషివయుంటావని ఊహలో కూడానుకోలేక పోయాను...." అన్నాను.
"నువ్వు ఊహలో కూడా అనుకోలేని విషయం నాకు వాస్తవంలో యెంత భయంకరంగా వుంటుందో ఊహించుకో. అయితే గోపీచంద్ తెలివైనవాడు అయన తను పోగొట్టుకున్న ముప్పై వేల పేరూ చెప్పి మా వద్ద నుంచి అంతకు వందరెట్లు ప్రతిఫలం పొందాడు. ,మా సాయం ఆయనకు బాగా వీలుగా వుంది. అయితే నాకిది యిష్టం లేదని తెలుసాయనకు. అందుకని ఇది తాత్కాలికమేనని నాతొ చెబుతూ వచ్చాడు.
అందులోనూ ఈ వ్యవహారంలోకి దిగాక నా ఆరోగ్యం పాడైంది. అందుక్కారణం మానసికాందోళన అని డాక్టర్ శ్రీనివాసమూర్తి గారంటారు. అందుకే ఇటీవల నేను స్వయంగా యే పనీ చేయకుండా నీలాంటి వాళ్ళను మాయ చేసి మచ్చిక చేసుకొని వ్యవహారం గడుపుతున్నారు. కానీ యెందుకో నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను మోసం చేస్తుంటే నాలో ఆవేదన పుడుతోంది. స్మగ్లింగ్ వ్యవహారం స్వయంగా చేయడానికి మించి నేనూళ్లో లేనని నిన్ను మోసం చేసినపుడు నాకెక్కువ బాధ కలిగింది ---" అంది పద్మావతి.
పద్మావతి యెటు వంటిదైనా ఆమె నన్నభీమానిస్తోంది. ప్రేమిస్తోంది అమెది నా మనసుకు వచ్చిన అందం, ఆమెను నేను వల్లో నేనుకోవాలనుకున్నాను. ఆమె తన అందాన్ని ఎరగా చూపి నాచేత తన పనులు చేయించుకోవాలనుకుంది. కానీ మొహంలో పడింది.
"ఇప్పుడెం చేయాలి ?' అన్నాను.
"ఈరోజు గోపీచంద్ ను కోరాను-- నన్ను విముక్తురాలీని చేయమని! అయన నవ్వి నేను బ్రతీకుండగా నీకు విముక్తి లేదన్నాడు. అందుకే నిన్నాయన్ను చంపెయామని కోరాను ...." అంది పద్మావతి.
"మరి దయానిధి వజ్రాలు...."
"అదీ గోపీచందే చెప్పాడు. ఒకవేళ నేను బ్రతికుండగా నీకు విముక్తి కావాలనుకుంటే దయానిధి దగ్గరుండే అపురూపమైన రెండు వజ్రాలు తెచ్చి నాకివ్వాలి. వాటి విలువ ఒకోటి పాతిక లక్షలు చేస్తుంది. ఇది నీకు బ్రతికుండగా సాధ్యపడుతుందని నేననుకోను-- అన్నాడు" అంది పద్మావతి.
ఇప్పుడు నాకు మొత్తం వ్యవహారమంతా అర్ధమై పోయింది. పద్మావతి అంతా నిజం చెబుతోందని నేను అనుకోను. ప్రేమ పేరుతొ ఆమె నన్ను లొంగతీసుకొని గోపీచంద్ హత్య కానీ, దయానిధి నుంచి వజ్రాలు దొంగతనం కాని చేయించాలనుకుంటోంది. ఇందువల్ల ఆమెకు గానీ, ఆమెను శాసిస్తున్న వారికి ప్రత్యేకమైన ప్రయోజనాలేవో ఉండి వుండాలి.
నేను రాని కోపాన్ని తెచ్చి పెట్టుకుని -- "నీ విలాంటి దానివని నేననుకోలేదు. ఎవరో నిన్ను శాసిస్తుంటే ఆ నేరాలు నా చేత చేయించడానికో కట్టు కధ చెప్పావు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను హంతకుణ్ణి , దొంగనూ కాలేను. ఇప్పటికే నీకు స్మగ్లింగ్ వ్యవహారంలో సాయపడినందు కెంతో బాధపడుతున్నాను--" అన్నాను.
పద్మావతి దీనంగా నావంక చూసి -- "నువ్వు నమ్మినా నామ్మకపోయినా నేను దీనావస్థలో వున్నాను. నన్నీ విష వలయం నుంచి నువ్వు రక్షించకపోతే నేనిందులో ఆహుతి అయిపోతాను" అంది.
'అలాంటప్పుడు నువ్వు నీవలను నాలాంటి వాళ్ళ పై కాకుండా ఏ గూండాల మీదకో విసరాల్సింది...." అన్నాను కాస్త కసిగా. హత్యలు, దొంగతనాలు పద్మావతీ నాచేత చేయించాలను కున్నందుకు నాకు కసి రాలేదు. అది చేస్తే తప్ప పద్మావతి నాకు దక్కదు. ఆ పనులు నావల్ల కాదు. నా అసహాయత నాలో కసిని రేపుతోంది.
పద్మావతి చీర చెంగుతో కన్నీళ్ళు తుడుచుకొని - "నేను నటిని కాను. నాకు హృదయముంది. నా జీవన సహచారిని వెతుక్కునేటప్పుడు నా మనసుకు నచ్చిన మనిషిని తప్ప వేరొకరి నేన్నుకోలేకపోయాను. అదీ నా బలహీనత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను --" అంది.
"నన్నెందుకు ప్రేమించావు పద్మా! నీ బలహీనతతో ఓ బలహీనుణ్ణి ఎందుకు ఎన్నిక చేసుకున్నావు?" అన్నాను.
"ప్రేమించడానిక్కారణం బలహీనతే కావచ్చు కానీ ప్రేమ చీమకు కూడా మదపుటేనుగు బలాన్నివ్వగలదని పుస్తకాల్లో చదివాను --" అంది పద్మావతి.
"కానీ నా శక్తికి మించిన పని నేను చేయలేను..."
పద్మావతీ నిట్టుర్చీ -- "నీ శక్తికి మించనిదైనా చేయగలవని నమ్మక మేమిటి" అంది.
అప్పుడు నేను పద్మావతికి వాగ్దానం చేశాను -- నా శక్తికి మించని పని ఏదైనా నేను చేయగలనని! ఆమె నా వాగ్దానాన్నంత సులభంగా నమ్మలేదు. చివరికి నేను "నీ నుంచి యే ప్రతిఫలమూ లేకుండా నీకోసం యేమైనా చేయగలనన్నాను. అయినా నువ్వు నమ్మాడం లేదు -" అన్నాను.
"ప్రతిఫలం లేదంటావేం? నేను నీకు ప్రతిఫలం కానా?"
పద్మావతి అడిగిన ఈ ప్రశ్న నన్ను రోమాంచితుడిని చేసింది --"పద్మా! నువ్వు నాకు ప్రతిఫలానివెలా గౌతావు? నా జీవితానికే ఓ అపురూపవరానివి---" అన్నాను.
అప్పుడామె నిట్టూర్చి --"సరే -- నీ మాటలు నమ్ముతాను. మున్ముందు మనం జంటగా సుఖ జీవితం చేయగలమని నాకు నమ్మకం కల్గుతోంది. వ్యవహారాన్ని మనకు సానుకూలం చేయడానికి, నీ శక్తికి మించని సాయం నువ్వు నాకు చేయడానికి, నేను నా శక్తి కి మించి ప్రయత్నిస్తాను-" అంది.
7
ఆ రోజలా ఇద్దరం విడిపోయేక మళ్ళీ యిద్దరం కలుసుకోలేదు. పద్మావతిని కలుసుకోవాలంటే నాకు భయం వేసింది. నటనలో ఆమె నన్ను మించినదన్న అనుమానం నాక్కలిగింది. నాకు తెలియకుండా నాచేత ఆమె స్మగ్లింగు వ్యవహారం కూడా నడిపించింది. ఆరోజు డాక్టర్ శ్రీనివాసమూర్తి వచ్చి వుండకపోతే ఆమె నాచేత ఇంకా చాలా పనులు చేయించుకొని వుండేది.
తర్వాత నుంచి నేను గోపీచంద్ , దయానిదుల గురించి యెక్కువ వివరాలు తెలుసుకుందుకు ప్రయత్నించాను . తెలుసుకున్న కొద్దీ నాకు వాళ్ళంటే భయం పెరిగిపోయింది. వాళ్ళ జోలికి వెళ్లడమంటే మృత్యువు తో చెలగాటమే!
అయితే పద్మావతి నన్ను ప్రేమిస్తోందన్న అనుమానం కూడా నాలో కలిగింది. ఆ ప్రేమను నేను సొమ్ము చేసుకోవాలి. అదంత సులభ సాధ్యమా?
సరిగ్గా వారం రోజులు తర్వాత పద్మావతి నాకు ఫోన్ చేసింది. ఆమె కోరిన ప్రకారం ఆరోజే పార్కుకు వెళ్ళి ఆమెను కలుసుకున్నాను.
పద్మావతీ చాలా ఉత్సాహంగా వుంది -"మొత్తం మీద అనుకున్నది సాధించాను ...." అంది.
"ఏమిటది?" అన్నాను.
"ఇన్నాళ్ళుగా మనం ప్రేమించుకొంటున్నాం కాని అసలు విషయం నేను కనిపెట్టలేకపోయాను. గోపీచంద్ కి హేట్సాఫ్ !" అంది పద్మావతి.
"ఏమిటో చెప్పు!" అన్నాను ఆత్రుతగా.
"నీ శక్తికి మించనిదైతే తప్పకుండా చేస్తానని మాతిచ్చావు , నీ శక్తి యెంత గొప్పదో గోపీచంద్ చెప్పాడు...." అంది పద్మావతి.
"ఏమిటది?"
"నీ సీటు...."
ఉలిక్కిపడ్డాను .
చాలా కీలకమైన సీటు నాది, పెద్ద పెద్ద వాళ్ళ టెండర్స్ నా దగ్గర కొస్తాయి. వాటిలో లోయేస్ట్ కొటేషను ఎంతకుందో తెలుసుకునెందుకు చాలామంది ప్రయత్నిస్తారు. నేను కాన్ఫిడెన్ షియల్ సెక్షన్లో వున్నాను.
మాకు కన్ స్ట్రక్షన్ వర్కు చాలా వుంది. యేటా పది పన్నెండు బిల్డింగ్ కాంట్రాక్స్ వుంటాయి. మా కాంట్రాక్టులేవీ పది లక్షలకు తక్కువ వుండవు. తెలివైన కాంట్రాక్టరు అందులో యెంతైనా మిగుల్చుకోవచ్చు.
మా వర్కు కోసం మేము పేపర్లో టెండరు నోటీసులిస్తాం. ఫలానా పని ఎంతలో చేయగలరని కాంట్రాక్టర్ల నడుగుతాం. మాకు అప్లికేషన్స్ వస్తాయి. అందరిలోకి యెవరు తక్కువ మొత్తం అడుగుతారో కాంట్రాక్టు వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఉదాహరణకు ఒకడు పదిలక్షల యాభై వెల్లో ఆ పని చేస్తాననవచ్చు. మరొకడు పది లక్షల నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది -- అన్నాడంటే కాంట్రాక్టు అతడికే వెళ్ళిపోతుంది.
లక్షల్లో కాంట్రాక్టు వున్నప్పుడు పదివేలు అటూ యిటూ లో లాభాల్లో తేడా వుండదు. అందుకే అందరూ లోయేస్టూ కొటేషన్ తెలుసుకొందుకు ప్రయత్నిస్తారు. అందుకేంతైనా లంచంగా యిస్తారు. మా ఆఫీసులో నేనాపని చూస్తున్నాను. అయితే ఆ విషయం రహస్యం. ఈ లోయేస్టూ కొటేషన్ల వ్యవహారం ఎవరు చూస్తున్నారో పై అఫీసరుకి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు.
నా గురించి పద్మావతికి తెలిసిపోయిందంటే అది చాలా గొప్ప విశేషమే! గోపీచంద్ ప్రభావం చాలా దూరముందన్నమాట!
పద్మావతి చెప్పుకు పోతోంది. వచ్చే సంవత్సరం మా ఊళ్ళో ఓ అయిదు చుక్కల హోటలు రాబోతోంది. అందుకు యెనభై లక్షలు అంచనా. ఆ కాంట్రాక్టు గోపీచంద్ క్కావాలి.





