Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    ఆ వారం, రోజులూ కుటుంబయ్యగారి కుటుంబంతో చాలాసరదాగా గడిపాడు. లక్ష్మమ్మ అతనికి రోజుకన్న రోజు ఎక్కువ ఆదరం చూపింది. ఇంక, చలాకీ నిర్మల! రోజూ పాటలు పాడేది. కబుర్లు అనేకం చెప్పేది. విద్యావతీ, ఉత్సాహవంతురాలు. తన కన్ని విధాలా సిరపోయిన యువతి - ఆమెని తప్పక వివాహం చేసుకోదలిచాడు. కాని, లక్ష్మమ్మ, బి.యే అయితేకాని నిర్మలకి పెళ్ళి చెయ్యదలుచుకోలేదు. కాబట్టి ఆ ఏడాది ఎలాగో అలాగ ఓపిక పట్టదలచుకున్నాడు. ఆ ప్రసంగం నిర్మల దగ్గర తీసుకువద్దామనుకున్నాడు కానీ, ఆమె యేమి చెపుతోందోనని భయమూ సిగ్గు అతన్ని అడగనివ్వలేదు. అయినా ఒక సంవత్సరంగా, తను వేచివుండేది.

    ఉదయం లేచి స్నానాదికృత్యాలు తీర్చుకుని, ఒక్కడూ యీజీచైర్ లో కూర్చున్నాడు. ఆ సమయానికే నిర్మల చేతిలో అట్టా, పెన్సిలూ పట్టుకుని వచ్చింది.

    'నిర్మల!' -అలా వస్తుందనుకోలేదు రావు.

    "ఇవాళ మీరు వెళ్ళిపోతున్నారుగా! ఈ పదిరోజులూ అలవాటు అవటం మూలాన్ని మీరు వెళ్ళుతున్నారంటే యేదో కొత్తగా ఉంది. ఒక్కరూ గదిలో కూర్చొని ఏం చేస్తారు రండీ. అలా తోటలోకి వెళ్ళి లాండ్ స్కేప్ ని పెయింటు చేస్తాను చూద్దురుగాని" రావు మాట్లాడకుండా ఆమెతో బయలుదేరాడు. ఆర్టిస్టుకి కలిగే ఆవేసం కళ్ళలో జ్వలిస్తూ ఉండగా, నిర్మల పెయింటింగు ఆరంభించింది. ప్రక్కనే నిల్చుని ఆనందిస్తున్నాడు రావు -ఆమె అంగుళులు దిద్దిన రేఖలకి కాదు ఆమె భుజం వంపుకీ,వ్రేళ్ళ కదలికకీ, కళ్ళలో వెలుగుకీ. మధ్యలో యేమేమో చెప్పాడు కాని ఆమె వినిపంచుకోలేదు. పూర్తిచేసి విజయచిహ్నం చూపుల్లో దాచి "ఎలావుంది" అంది.

    "చాలా బావుంది. నీ అంత బావుంది" అనాలనే అన్నాడు రావు. చిరుకోపంతో చూసి వూరుకొంది. రావు ఆమె చెక్కిళ్ళపై సిగ్గు గులాబీలు పూయటం గమనించాడు.

    సాయంత్రం, కుటుంబయ్యా, నిర్మలా స్టేషనుకు వచ్చారు వెంకట్రావుని సాగనంపటానికి. రైలు తప్పిపోయినా బావుండునే, రైలుపట్టాలు కదలిపోతే - యిలా ఉన్నాయి రావు ఆలోచనలు.

    "నేను ఇరవైరోజుల్లో మద్రాసు వెళ్ళిపోతున్నాను. మీరు ఉత్తరం రాస్తారా? మీరెక్కడ? యింజనీరు! మీకు మూర్ మార్కెట్లోంచి చక్కని ప్రెజంటుకొని పంపిస్తాను. మీరు ఏం యిస్తారు?" అంది నిర్మల.

    చెమ్మగిల్లే కళ్ళతో, రావు రైలులోంచి చేరుమాలు  వూపాడు. నవ్వుతో నిర్మల, కుటుంబయ్యతో వెనక్కి తిరిగింది.

                                     5

    "సంవత్సరానికి అరవైరెండునెలలు కాబోలు, వెధవ సంవత్సరాలూ, మాసాలూ" అని విసుక్కుంటున్నాడు రావు. కన్నయ్య తన తెలివినంతా ఉపయోగించి, వేళ్ళు లెక్క పెట్టి 'పన్నెండు' అన్నాడు.

    రెండు నెలలయింది తను నర్సాపురంనుంచి వచ్చి. కాని, నిర్మల దగ్గర్నుంచి ఒక్క ఉత్తరమేనా రాలేదు. తన ఫోటో పంపి, ఆమె ఫోటో కూడా పంపమని ఉత్తరం రాశాడు కాని జవాబు రాలేదు.

    రోజూ ఉదయం లేవటం, ఆఫీసుపని చూసుకోవటం, సాయంత్రం క్లబ్బు కెళ్లటం శంకరంతో కష్టసుఖాలు మాట్లాడుకోవటం... ఇదీ రొటీన్. డిస్ట్రిక్టు ఇంజనీరు రాఘవరావు గుండె ఆగి, హఠాత్తుగా చచ్చిపోయాడుట. శంకరానికి ఆడపిల్ల కలిగింది. క్లబ్బు వర్ధంతిలో నాటకం వేస్తూ 'ఆ' మూర్చపోయాడు. థియేటర్ లో మంచిపిక్చరే ఆడటంలేదు. రోడ్డులు పాడయినవి రిపెయిర్ చేయించాలి. బాగున్నవి పాడుచెయ్యాలి. యుద్దంలో అనేకమంది ప్రజలు చచ్చిపోతున్నారు. కన్నయ్యకి కాలిమీద కురుపులేచి మానింది. బంగాళాదుంపలు సుబ్బయ్య కొట్టులో అయిపోయాయిట -ఇవీ విశేషాలు. వెధవ సంవత్సరాలూ, వెధవ వేషాలున్న! వెంకట్రావుకి ఇరిటేషన్ యెక్కువయింది.

    ఒకరోజున సాయంత్రం శంకరానికి రహస్యము చెప్పేశాడు.  "వొరేయ్ నేను ప్రేమించానురా!"

    "ఏడిశావ్"

    "నిజం!"

    "ఋజువు!"

    "వినయితే కథ!" అని తన ప్రేమగాధని ఆవేశంతో చెప్పాడు.

    "నువ్వు ఉత్తరం రాశావు కదా! ఫోటో కూడా పంపావు కదా! అయినా ఈ రెండు నెలలకీ నీకు జవాబు రాలేదు. కంక్లూజన్ యేమిటీ-  ఆమె నిన్ను ప్రేమించలేదన్నమాట" అన్నాడు శంకరం.

    బిక్క మొహంతో ఇంటికి వెళ్ళిపోయాడు వెంకట్రావు. వీధిలో జట్కాబండి, దీపస్తంభం అన్నీ తన్ని చూసి పరిహసిస్తున్నాయనుకొన్నాడు. తను నిర్మలతో గడిపినరోజులు జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. "వెధవ శంకరం, వాడికి ఈర్ష్య. లేకపోతే, నిర్మల నన్ను ప్రేమించకపోవటమేమిటీ" అనుకున్నాడు. "ఈ వారం ఇంకొక ఉత్తరం రాస్తా. జవాబు రాకపోతే విషంమింగి పగ సాధించుకుంటా" అనుకున్నాడు. తర్వాత రోజున చిన్న ఉత్తరం రాసి పంపాడు. "నీ ఉత్తరానికి అయిదు వేస్టుపేపరు బేస్కెట్స్ సరిపోలేదు. నీ ఫోటోలకి గోడలు సరిపోలేదు" అని రాశాడు. తన తెలివికి తనే సంతోషించాడు. లైబ్రరీలోంచి ప్రేమను గురించిన నవలలు తెచ్చుకొని చదవటం మొదలెట్టాడు. వారం అయింది జవాబు రాలేదు. 'రేపు' అంటే 'రేపు' అనుకొన్నాడు. పదిహేను రోజులయింది. జవాబు రాలేదు.

        "విషం మింగి ఎప్పుడూ చావను. ఛ! ఇంతకంటె ఇందమైనదానినీ, విద్యావతినీ పెళ్ళాడి ఏడిపిస్తా" అనుకున్నాడు.

    ఒకవేళ ఆమె సిగ్గుపడిందేమో, సిగ్గయితే తనతో నర్సాపురంలో అలా అంత సరదాగా తిరుగుతుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు.




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.