Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


    
    వెంకట్రావుకి దెయ్యాలున్నవనే నమ్మకం లేకపోయినా, భయం ఎక్కువ. ఆ ప్రసంగాన్ని మరొక దాంట్లోకి మార్చేశాడు. విద్యాధికులకి అంతే - దెయ్యాలని నమ్మరు కాని, పిరికితనం!

    బంగళాకి వెళ్ళగానే "బాబుగా రలసిపోయారు" అంటూ కన్నయ్య ఎదురయ్యాడు. రావు అతన్ని పరిశీలించకుండా, గదిలోకి వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. తల దిమ్ముగావుంది. ఆనందమో, ఏడుపో -ఏదో గుండెలో గుసగుసలాడుతోంది. తను అళవాటుపడి ఆనందించిన ఆ గది ఒంటరితనమూ నిశ్శబ్దతా చాలా అసహ్యంగా చికాకు కలిగిస్తున్నాయి. ఒక లేతపాదం ఈ చివరి నుంచి ఆ చివరికి నడిచి వెళ్ళినట్లనిపించింది. తనలో తెలియరాని ఒక గొప్ప మార్పు వస్తోందనుకున్నాడు రావు. లేచి ఒక పుస్తకం తీసి పేజీలు తిరగవేస్తూ అలాగే నిద్రపోయాడు.

    ఉదయం లేచేటప్పటికి మాంచి ఉత్సాహంగా ఫీలయ్యాడు. డ్రెస్సు వేసుకొని తిన్నగా వంతెన దగ్గరకు వెళ్ళి మధ్యాహ్నం వచ్చాడు. ఒక కునుకు తీసి లేవగానే., నిర్మల నవ్వు మొహం జ్ఞప్తికి వచ్చింది. తక్షణం టాయిలెట్ చేసుకొని. గుమ్మం దాటగానే కారులో కుటుంబయ్య లక్ష్మమ్మ నిర్మల!

    "రావోయి, అలా తోటలోకి వెళ్ళివద్దాం" అన్నాడు కుటుంబయ్య. రావు బెట్టుసరికి "కొద్దిగా పనుంది, కంట్రాక్టర్ని...." అంటూ నసిగాడు. "అఫీష్యల్సు పనులు పనులంటారేమిటండీ యెప్పుడూ. ఆనందించలేకటండీ యిటువంటి యీవినింగ్సు? మీరు తప్పక రావాలి" అంది నిర్మల చిరుకోపంతో దరస్మితాలను మిళితం చేసి.

    ఆ పలుకుల కోసమే వేచి వున్నాడు. ఒక్కమారుగా కారులోకి గంతేసి ఆమెను ముద్దెట్టుకుందామనుకున్నాడు. లక్ష్మమ్మ కూడా రమ్మంది. ఒక్క నిమిషంలో వాళ్ళందరూ తోటలో వున్నారు. "నారింజ, బత్తాయి, మామిడి.... చక్కని తోట. ఎకరం పదిహేను వందలెట్టి మూడు ఎకరాలు కొన్నా" నన్నాడు కుటుంబయ్య సంతృప్తితో. గర్వంతో తోటచుట్టూ తిరిగి లక్ష్మమ్మతో ఒకచోట కూలబడి తన కోర్టు అనుభవాలు చెబుతున్నాడు. రావూ, నిర్మలా ముందుకు సాగిపోయారు.

    "నాకు తోటల్లో తిరగాలని సరదా" అంది నిర్మల.

    "నాకున్నూ!"

    "నా పెయింటింగులలో సహం యిక్కడ కూర్చొని వేసినవే" నంటూ ఆమె తన స్వవిషయాన్ని గురించి ధారాళంగా ముచ్చటించింది. రావు తన క్లబ్బు విషయాలు చెప్పుతూ  యిలా అన్నాడు. "నాకు టెన్నిస్ అంటే ప్రాణం. ఒక కప్పు కూడా సంపాదించాను."

    "నాకు టెన్నిస్ ఆడేవాళ్ళంటే యిష్టం. టెన్నీస్ అంటే కోపం" అంది నిర్మల కొంటెగా. రావు ఉబ్బిపోయాడు. ఆ పలుకుల అర్ధం ఎనలైజు చేసి!

    దూరంగా త్రాచుపాము, హంతకుడి ఆలోచనలా, మెలికలు తిరుగుతూ వెళ్ళింది. నిర్మల "అమ్మో" అంటూ రావు వొళ్ళోకి ఒక్క గెంతేసింది. రావు భయంలేదని హెచ్చరించాడు. ఆమె అతని చేతుల్లోంచి తప్పించుకుని ఏమీ ఎరగనట్టుగా "నాకు పాములంటే భయం" అంది. ఆమె స్పర్శ వెంకట్రావులో జడంగా పడివున్న శక్తుల్నిచైతన్యవంతంగా చేసింది. ఒక థ్రిల్ తన అణువణువులోనూ పొందాడు.

    పచ్చని చేలూ, పైరుగాలీ వారి తెచ్చికోలు మర్యాదలని ఒక మూలకిత్రోసి, ప్రకృతి స్వాతంత్ర్యంలోనికి లాక్కున్నాయి. తాను ఒక యింజనీరుననీ, ఆమె ఒక స్త్రీ అనీ మరిచిపోయారు. నవ్వుకుంటూ శైశవ చేష్టలతో ఆడటం మొదలెట్టారు.

    "ఆ పండు యెవరు ముందు అందుకుంటే వాళ్ళది" అంటూ నిర్మల పరుగెత్తింది. రావు ఆమె ననుసరించాడు. పండు రావుకే దొరికింది. "ఓడిపోయావు నిర్మలా!" అన్నాడు రావు. "మీవలె పరిగెత్తగలమా?" అంది వగరుస్తూ నిర్మల.

    "మీ రబలలు -అబలలు" అంటూ రావు ఆమెతో కల్సి తిరిగివచ్చాడు. మధ్యలో సంభాషణని  'పెళ్ళి -దాని చరిత్ర' లోకి మార్చాడు ఆమె ఉద్దేశ్యం తెలుసుకుందామని. ఆమె ఇలా అంది. "కొన్ని శక్తుల్ని అభివృద్ది పరచుకుందామన్న వాళ్ళకి పెళ్ళి అవసరం. కాని, ప్రతీ సామాన్యుడూ పెళ్ళి చేసుకోవల్సిందే!"

    "నువ్వు?"

    "నేనా.. నేనా......మేరేం చేస్తారు" అంటూ నవ్వుతూ సంభాషణ మార్చేసింది నిర్మల. పెళ్ళి విషయం ఆడవాళ్ళ నడగకూడదనీ, వాళ్ళు సిగ్గుపడతారనీ తెల్సుకున్నాడు రావు.

    కారు ఎక్కినట్లూ, యింటికి వెళ్ళినట్లూ జ్ఞప్తిలేదు రావుకి, గదిలో సామాను యిక్కడి దక్కడా, అక్కడి దిక్కడా వేసి చిందరవందర చేశాడు, పావలాతీసి "ఏదేనా కొనుక్కొని తినరా" అని కనకయ్యకిచ్చాడు. అతని తల వేడెక్కిపోయింది. అద్దంలో చూచుకొని నవ్వుకున్నాడు. ఆమె ముంగురుల్నీ -ఎర్రని పెదవుల్నీ, నవ్వే కళ్ళనీ తల్చుకున్నాడు. కిటికీలోంచి ఆకాశంకేసి చూశాడు. మేఘాలు దట్టంగా క్రమ్మినై. హోరున వర్షం వచ్చింది. సముద్రపుగాలి అతని మొహానికి కొట్టుతోంది. ఆ వర్షంలో తనూ, నిర్మలా తడిసి చలిలో 'ఉహు ఉహు!' అంటూ ఇంటికి వస్తే ఎంత బావుంటుంది అనుకొన్నాడు.

    ఎవరూ యిన్వెంటు చేయలేని విషయం తను కనుక్కొన్నాడు. అది ప్రేమ -ప్రేమ! ఇన్నాళ్ళకి ఆ తియ్యని అనుభవం పొందగలిగాడు. భావిజీవితం నిర్మలతో ఎలాగడపాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు.

                                      4
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.