Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    ఇలా ఆలోచించుకుంటూ, తన బంగళాలోకి వెళ్లి కూర్చున్నాడు. నౌకరు వచ్చి అతని బూటు విప్పి, రోజూ అనే మాట ఈవాళా అన్నాడు. "బాబుగారు అలసిపోయారు" రాత్రి పడుకోబోయేముందు కన్నయ్యనిలా అడిగాడు. "బాబుగారు అలసిపోయారు" రాత్రి పడుకోబోయేముందు కన్నయ్యనిలా అడిగాడు.  "ఒరేయ్ ప్రేమంటే ఏమిటో తెల్సునురా?" చాలా అనుభవం వున్నవాడిలా, చిరునవ్వు నల్లని పెదవులమీదకు రప్పించి "ఆడదానిమీద మనసు అవటం" అన్నాడు వాడు. మరి శబ్దరత్నాకరంలో ఏమి రాశారో!

    ఉదయం లేచి డ్రస్సు చేసుకొని కూర్చున్నాడు వెంకట్రావు. కారు ఆగిన చప్పుడైంది.  వెంకట్రావు వీధిలోకి ఒక్క గెంతేశాడు. కారులోంచి , డిస్ట్రిక్టు ఇంజనీరు రాఘవరావు దిగాడు. వినయంగా ఆయన్ని ఆహ్వానించాడు రావు.

    "నీ శ్రద్దా, తెలివితేటలూ మెచ్చుకోదగిన వోయ్. నేను నీ విషయంలో ప్రత్యేకంగా ఆదరం చూపిస్తాను" అని కాంప్లిమెంటు ఇచ్చాడు రాఘవరావు మీసాల చాటున చిరునవ్వు దాచుకొని, "నర్సాపురం వంతెన రిపెయిర్ చేయించాలి. నీకే ఆ పని ిద్దామనుకుంటున్నాను. నువ్వు అనుభవం సంపాదించాలి. కంట్రాక్టర్లకు లొంగిపోగూడదు సుమీ. అన్నట్టు మీ పేటలో సీతమ్మ మాంచి నెయ్యి పోయిస్తుందిటకదూ, రెండు వీసెలు మనకి పంపించు" అని పర్సు తీయబోయాడు. వెంకట్రావు అతన్ని వారించి "ఎంతమాట, తర్వాత ఇద్దరుగాని లెండి, సాయంత్రానికి పంపిస్తాను నెయ్యి" అన్నాడు.

    ఆయన్ని సాగనంపి, మహానందంతో కుర్చీలో ఒక్క గెంతేసి కూర్చున్నాడు. 'ఎక బంగళ బనే న్యారా' అనే పాటని వెయ్యి వరసల్లో పాడుతూ, గది చుట్టూ తిరిగాడు. చాలా శాంతంగా, నెమ్మదిగా ఉండే యజమానికీ వెర్రి ఆవేశం ఎందుకో తెలియక  "బాబుగారు చాలా అలసిపోయారు" అన్నాడు కన్నయ్య.

    వారం రోజుల్లో ఆర్డరు వచ్చింది. హోల్డాల్, పెట్టె, కన్నయ్యా తోడురాగా నర్సాపురం బయల్దేరాడు రావు.
   
                                    3

    నర్సాపురం వచ్చి  రెండురోజులైనా కుటుంబయ్యగారి యింటికి వెళ్ళేందుకు తీరిక లేకపోయింది రావుకి. అందుకని కుటుంబయ్యగారే వచ్చి రావుని ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. కుటుంబయ్య చెల్లెలు చాలా ఆదరించి రావుని. కన్నయ్య నిర్మలకేసీ, రావుకేసీ ఎగాదిగా చూసి, "చిలకా గోరింకల్లా వున్నారు" అనుకున్నాడు. నిర్మల తనవైపు తిరిగి మాట్లాడినప్పుడల్లా చొక్కా నలిగిపోయిందేమోననీ, జుట్టు చెదిరిపోయిందేమోననీ అనుమానంతో బాధపడి ఒంటరిగా అద్దంలో చూసుకొనే సంతృప్తిపడేవాడు రావు.
 
    భోజనాలయాక కుటుంబయ్య నిర్మలని పాడమన్నాడు.  "ఇంజనీరుగారు వింటారు పాడవే" అంది లక్ష్మమ్మ. లక్ష్మమ్మ కుటుంబయ్య చెల్లెలు. అందమైనదీ, చదువుకొన్నదీ. భర్త పోయినప్పట్నుంచీ అన్నగారి వద్దనే ఉంటోంది.  "అచ్చంగా తల్లి పోలిక నిర్మల" అనుకున్నాడు రావు.

    నిర్మల వీణను సున్నితంగా సుకుమారంగా మీటుతూ, కోకిల గొంతుతో పాడుతూంటే మరో ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు రావు. ఆమె కళ్ళ కదలికా, పెదవుల వంపూ, నాజూకైన దేహమూ అతనికి ఒక సౌందర్య రేఖగా, అలేఖ్యంగా కనబడింది.

    "అమ్మాయిని రేడియోకు రమ్మన్నారు బహుశా ముందు నెలలో ప్రోగ్రాం వుంటుంది" అంది లక్ష్మమ్మ.

    "ఎలా వుంది పాట" అంది వీణ క్రిందబెట్టుతూ నిర్మల. అంతవరకూ ఆమెవైపే చూస్తోన్న కళ్ళని మరల్చి, ఉలిక్కిపడినట్లుగా,  "బావుంది, బావుంది" అన్నాడు. లక్ష్మమ్మ అతని రహస్యాన్ని గ్రహించింది.

    ఎలా బయలుదేరిందో తెలియదుగాని, శరచ్చంద్రుని నవలలగురించి వాదనలోకి దిగారు రావూ, నిర్మలా "ఆ ట్రాజెడీలు నాకు నచ్చవు - ఉహు! అంత నిర్దయగా చంపేస్తాడు" అంది నిర్మల. "లేకపోతే పర్ పస్ ఎలా నెరవేరుతుందీ, నిర్మలమయిన ప్రేమ వున్నప్పుడు" అన్నాడు రావు. "ప్రేమ వుంటే మాత్రం - దేవదాసులాంటి ఆవేశపరులూ, ఉన్మాదులూ దేశానికెందుకండీ. ఆడదే జీవితంటండీ. కళ వుంది. సంఘం వుంది. ఏదో ఒక పనిలో నిమగ్నులవాలి. లేకపోతే తిని కూర్చోవాలి" అంది ఆవిడ. "మరి అది ప్రేమట. ప్రేమించి విఫలులైనవాళ్ళు అలా అవుతారేమో మరి! నాకేం తెల్సును" అన్నాడు రావు ఆలోచిస్తూ. "మీరెవర్నీ ప్రేమించలేదూ? అదేమిటండీ" అంటూ కిలకిల నవ్వుతూ వీణతో లోపలికి పారిపోయింది నిర్మల.

    తను ప్రేమించాడా! పాతికేళ్ళు వచ్చినా ఆ ప్రేమ తనకొక స్వప్నభావమే కాని వాస్తవికంగా అనుభవించాడా - అందరూ ప్రేమిస్తారు -తనొక్కడే యిలా అయిపోయాడు. ఈ సందేహాలు రావులో ఆలోచన రేపినై. కుటుంబయ్య యీజీఛైరులోనే కునికిపాట్లు పడుతున్నాడు. లక్ష్మమ్మ తన పూర్ణయాత్ర అనుభవాలు చెపుతూ యిలా అంది. "ఇంగ్లీషు రాకపోయినా, తెలుగు పత్రికలూ, పుస్తకాలూ నేనూ చదువుతోంటాను నాయనా. స్త్రీకి స్వతంత్రమూ, విద్యా వుండాలని నా ఉద్దేశ్యం. మా నిర్మలని చూశావా. అన్నీ చదువుతుంది, వాదిస్తుంది, తెల్సుకొంటుంది. కాలేజీలో కూడా మాట్లాడిందంట... ఏదో దానిమీద ఆశపెట్టుకుని వున్నాను. ఈ ససెలవులయాక మద్రాసు వెళ్ళుతుంది. ఈ ఏడాదితో బి.ఏ. పూర్తి అవుతుంది. అంతవరకూ దాని పెళ్ళిమాట తలపెట్టదలచుకోలేదు. కట్నాలూ, గిట్నాలూ ఏం ఇవ్వలేంసుమీ. దాన్నిచూసి చేసుకోవలసిందే.... ఇంతకీ ఆ ఈశ్వరుడున్నాడు."

    ఆవిడ దగ్గర్నుంచి సెలవు తీసుకొని, అర్ధమవని భావాలు మనస్సులో కలవరపరుస్తూండగా, తిన్నగా లాడ్జికి వెళ్ళాడు రావు. ఇంతలోకి కాంట్రాక్టరు చౌదరి వచ్చి వంతెన దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఆలోచించేందుకు తీరిక ఇవ్వకుండా,చీకటిపడ్డాక తిరిగి వస్తూంటే. చౌదరి ఆ వూరినిగురించి విసుగెత్తేట్టు పొగిడాడు. ఒక పాడు కొంపను చూపించి దాని చరిత్ర పరమార్ధము చెప్పి యిలా అన్నాడు.  "రాత్రిళ్ళు దెయ్యాలు కొరకంచులు చేతులతో ప్టటుకొని యీ కొంపలో తిరుగుతుంటాయి. ఆ మధ్య ఒక పిల్లాడు పొరుగూరినుంచి వస్తోంటే, దెయ్యాలు దారితప్పించి చంపేశాయి. ఉదయానికి ఎముకలు మాత్రం మిగిల్చాయి."




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.