Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


                       
                                                           జీవితం
    చేత్తో లెదర్ సూట్ కేసు పట్టుకొని ప్లాట్ ఫారంమీద అటూ ఇటూ తిరుగుతున్నాడు వెంకట్రావు. అతనికి వెనుకనుంచి యెవరో పిలిచినట్లయింది. తిరిగి చూశాడు - కుటుంబయ్యగారు.

    "ఏమండోయ్ కుటుంబయ్యగారూ ఇలా..." వాక్యం పూర్తిచేయకుండా ఆపేశాడు. కుటుంబయ్య పక్కన మెరుస్తో నించొనివున్న పద్దెన్మిదేళ్ళ అమ్మాయిని చూసి, "తిరిగి కుటుంబయ్య పెళ్ళిచేసుకోలేదుకదా"

    రావు ఆశ్చర్యం గమనించి కుటుంబయ్య ఇలా అన్నాడు. "దీన్ని మరిచిపోయావుటోయ్! అవునులే, మనం ఆరేళ్ళయింది కల్సుకుని. చిన్నతనంలో ఇద్దరూ ఆడుకునేవారుకూడాను." ఇంతకీ ఎవరో చెప్పలేదు రావుకి. ఆ అమ్మాయి నవ్వుతో "మీరు గుర్తించలేనంతగా మారిపోయానా రావుగారూ" అంది. ఏమనాలో తెలియక డెలికేట్ గా ఫీలయ్యాడు వెంకట్రావు.
 
    "అమ్మాయి చదువుకుంటోంది. ఈ ఏడాది బి.ఏ. జూనియర్ అయింది. సంగీతంలోనూ, పెయింటింగ్ లోనూ అభిరుచి ఉంది. అయితే, ఇంజనీరు పరీక్ష ప్యాసై అప్పుడే ఉద్యోగంలో కూడా ప్రవేశించావుట కదూ? ఇలా ఎక్కడికి వెళుతున్నావు, కాకినాడేనా? సగంవరకూ మేమూ వస్తాంలే! చాలా ఆనందంగా ఉంది నాయనా నిన్ను చూడటం. తెలివి తేటలయినవాడవూ, ఇంతకీ..... అన్నట్టు, అమ్మాయీ, వాళ్ళమ్మా మనింట్లోనే వుంటున్నారు. ఓహో, నీకు తెలియదు కాబోలు, అమ్మాయి ఫాదరు పోయాడని. నాకూ జవసత్వాలు తగ్గినై, ప్రాక్టీసూ లేదూ మరొహటీ లేదు..." పొడిదగ్గు వచ్చి కుటుంబయ్యగారి వాక్ర్సవాహానికి అడ్డువేసింది. ప్రక్కనే, ఆ అమ్మాయి చిరునవ్వుతో నించొంది.

    ఇంతకీ ఆమె ఎవరో తెలియక తికమక పడుతున్నాడు రావు. తప్పనిసరిగా చిరునవ్వు తెప్పించుకొని "అలాగాండి" అన్నాడు. దూరంగా పొగలు చిమ్ముకుంటూ వస్తున్న రైలుని చూస్తోన్న ఆమె విలాస సంపదని చూసి విభ్రమం చెందాడు.

    రైలు వేగంగా వెళ్ళుతోంది. గాలికి ఎగిరే ముంగురుల్ని పైకి తోసుకుంటూ, ఆకర్షించే అందమైన నవ్వుతో ఆమె రావుతో మాట్లాడుతోంది.  "నాకు సంగీతమన్నా పెయింటింగు అన్నా చాలా యిష్టమండీ. నేను చిత్రించిన సంధ్యాసుందరి క్రితం నెల '...' పత్రికలో పడింది. చూశారా! జీవితాన్ని ఏదో కొంత ఉపయోగకరం చేద్దామని నా కోరిక. సంగీతం అన్నారా, అబ్బ వీణలో అనుకున్నంత ప్రవీణత సంపాదించలేదండీ. మంచిగాలి వేస్తోంది. హాయిగా వుంది కదండీ."

    ఆమె వుత్సాహమూ, అమాయకత్వమూ వెంకట్రావును బాగా టచ్ చేసినై. ఆమె నవ్వుతూన్నంతసేపూ తెలీకుండా తనూ నవ్వాడు. కుటుంబయ్య కునుకుపాట్లు పడుతూ ఉలిక్కిపడిలేచి "అమ్మాయి , స్టేషను వచ్చిందా" అన్నాడు. "అప్పుడే ఏం స్టేషనూ!" అంది ఆమె. కుటుంబయ్య దగ్గు దగ్గి (ఉపన్యాసానికి సూచన) మొదలెట్టాడు.

    "ఎప్పుడేనా వస్తోండవోయ్ మా ఊరు. మా వంతెన రిపేరు చేయిస్తామంటున్నారు. మా వూరు నీ జ్యూరిస్ డిక్షను క్రిందకే వస్తుందా? వెధవ వూరు, దోమలెక్కువ..... అన్నట్టు మీ వూళ్ళో దోమలున్నాయా..... మున్సిపాలిటీ ఏం శ్రద్ద తీసుకోదు కదా! నా కిప్పిస్తే చేర్మెను పని.. రావూ! యీ నాటికీ నేను కోర్టుకి వెళ్ళితే, ఒక్క లాయరూ ఎదురుగ నిల్చొని వాదించలేడనుకో. మేం యిప్పటి వాళ్ళమా! మేం ఓల్డు బియ్యేలం. అమ్మాయి చదువులా. ఫ్యాషనులా?... అమ్మాయి వీణ మహచక్కగా వాయిస్తుంది. భోజనం అవగానే అమ్మాయి పాట వింటేనేగాని నిద్రపట్టదు కదా! అసలు ఆరోగ్యం పోయిందిలే. డాక్టరుని మంచి టానిక్ యిమ్మనాలి......"

    ఒక విషయంలోంచి మరొక దాంట్లోకి దూకుతున్న ఈ ముసలి ప్లీడరు ఉపన్యాసాన్ని "ఓహో, అలాగా" అంటూ కడదాకా విన్నాడు వెంకట్రావు. చివరికి స్టేషను వచ్చింది. కుటుంబయ్యా, ఆమే లేచారు.

    "నేను వెళ్ళివస్తానండీ, మీరింకా నన్ను గుర్తుపట్టలేదు" అంటూ ఫక్కున నవ్వింది. అక్వర్డుగా ఫీలయ్యాడు వెంకట్రావు. "గుడ్ యీవెనింగ్, నేను నిర్మలని" అంటూ ఆమె కుటుంబయ్యతో రైలుదిగి మాయమైపోయింది.

    స్టన్ (stun) అయిపోయాడు రావు. నిర్మల -కుటుంబయ్య మేనకోడలు నిర్మల! ఎంత మనిషి అయిందీ, ఎంత అందమైనదీ, ఆరేళ్ళలో ఎంతగా ఎదిగిందీ, గుబురుగా పెరిగిన మొగిలివనంలాగ. ఆ నవ్వు కళ్ళల్లో ఆ తెలివితేటలు.... తను మరిచిపోగలడా? ఇలా ఆలోచించుకుంటూ తలెత్తాడు. ఎదురుగా ఒక కోమటీ, విధవా కూర్చున్నారు.......

                                  2

    "హలో, బ్రహ్మచారి" అని పలకరించాడు శంకరం, వెంకట్రావుని. 'బ్రహ్మచారి' అనే పదం గాలిలో మెలికలు తిరిగి ములుకులా గుచ్చుకొంది రావు హృదయంలో. పార్కునుంచి వస్తోంటే పైపెచ్చు శంకరం ఇలా అన్నాడు."ప్రేమ ప్రేమలేందీ బ్రతుకేమిటిరా? ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళగానే, నవ్వుతో ఎదురై, ఆదరించే ఆడది లేకపోతే ఆ జీవితం నరకం. ప్రేమలో ఎంత హాయి, ఆనందం, చైతన్యం వుందిరా...."

    "నిజమే! తను ఎవరినేనా ప్రేమించాడా? తనకి వివాహమాడే వయస్సు దాటిపోయిందేమోకూడా! ఆ ప్రేమానుభవం యెలా యెలా ఉంటుందీ? హల్ కెయిన్, మొపాసా, సింక్లార్ మొదలైన వాళ్ళ నవలలు చదివాడు అంతే! ఒక స్త్రీకి పురుషుడికీ మధ్య యింత ఆకర్షణ, యింత రొమాన్స్ దేవుడెందుకు పెట్టాడు. హత్య, త్యాగం, ఆనందం..... చివరికి జీవితం ప్రేమకోసమా! అంత మఖ్యమా ప్రేమ...

    "తన జీవితం చాలా విచిత్రమైనది. కాలేజీలో చేరిన రెండేళ్ళల్లో తల్లీ తండ్రీ చనిపోయారు. అప్పుమాత్రం మిగిలి, చదువు  మానేసి, ఏ నౌకరీనో చేద్దామంటే, మేనత్త -ఆ మేనత్త ఇంటికి తనెప్పుడూ వెళ్ళలేదు. ఆవిడే ఒకటి రెండుసార్లు తన ఇంటికి వచ్చింది - చచ్చిపోతూ పాతిక ఎకరాలు తనకి రాసి యిచ్చింది. అదృష్టం. అదృష్టం కాకపోతే పరీక్ష ప్యాసవగానే వందరూపాయల ఉద్యోగం రావడమేమిటి? పై ఏధికారులచే మెప్పుపొందటమేమిటి. అన్నిటికన్నా రైలులో ఆమెని- నిర్మలని కల్సుకోవటమేమిటి. నెల్లాళ్ళయింది ఆ అమ్మాయిని చూసి. అప్పట్నుంచీ మనస్సు అదే విధంగా అయిపోయింది."




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.