Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
ఆతురతతో ఆశతో అలసటతో చివరి గుడిసెని సమీపించింది. అక్కడ దుర్వాసన భరించరానిదిగా వుంది. తిరిగి పారేసిన మాంసం ముక్కలు కాలికి జిడ్డుగా తగిలాయి. కొలదిదూరంలో చెట్టుకింద యానాది వాళ్ళు తప్పతాగి తందనా లాడుతున్నారు.
క్షీణస్వరంతో "యీరయ్యబావా" అని పిలిచింది. లోపల్నుంచి కేకలు వినవస్తున్నాయి. "నాకు లేదేం కూడియ్యాల! నువ్వు తినేసి పడుకున్నావా దొంగముండా" ఆడది ఏదో తిట్టింది. కొట్టిన చప్పుడు. "అమ్మో!" అని ఆడదానికేక. "రత్తంకూడా కారుతుందిరోయ్ సచ్చినాడా" మళ్ళీ ఘోరమైన నిశ్శబ్దం.
ఈసారి చంద్రి గట్టిగా పిలిచింది. "యీరయ్యబావా" అని తలుపుకొట్టింది. తలుపు తెరుచుకొని వీరయ్య యివతలికి వచ్చాడు. గడ్డం అసహ్యంగా పెరిగింది. చిరుగుల ఎర్రపంచె ఒకటి కట్టుకున్నాడు. వెన్నెలపడిన మొహంమీద నల్లని మచ్చలు ఉన్నాయి. గుడ్లు లోతుకుపోయాయి.
"యారదీ?" అన్నాడు బొంగురుగా. కంఠధ్వని మారిపోయింది. రంపంతో బండరాయిమీద గీరుతూన్నట్టుంది.
"నాను సెంద్రిని నన్ను మరిసావా నా యీరయ్యబావా?"
వీరా మాటాడకుండా లోపలికి వెళ్ళి గుడ్డిదీపం ఒకటి తీసుకువచ్చి పరీక్షగా చూశాడు. పిచ్చిగా చూశాడు "ఖైదులోంచి ఇడిశారా?" అన్నాడు కాస్సేపాగి.
"ఎలా అయిపోనావ్ నా యీరా. ఎలా అయిపోయినావ్." చంద్రి ఏడ్చింది.
వీరయ్య పెద్దగా దగ్గి యింకో వైపు చూస్తూ నిలబడ్డాడు.
"లోపల అదెవత్తె?" అంది చంద్రి.
"నరసమ్మ. గంజి కాచి పోత్తంది."
చంద్రి ఒక్కసారి కూలబడింది. కొంతసేపటికి మాట కూడదీసుకుని "నే నెల్లిపోతాను" అంది.
వీరా మాట్లాడలేదు.
చంద్రికి దుఃఖం వచ్చింది. "నా కాకలేత్తంది. నిన్నటినుంచీ కూడులేదు."
వీరా గొణిగాడు. "నాకే కూడు లేదియ్యాల."
లోపల్నుంచి నరసమ్మ వచ్చి చూసింది. తలకి కట్టు వుంది. "సెంద్రమ్మ వచ్చిందీ, ఇంకేం ఇద్దరూ కొంపమీద పడండి. దాన్ని తగిలెయ్యి, లేందే గుమ్మంలో అడుగెట్టనివ్వను" అంటూ భళ్ళున తలుపులు వేసేసింది.
వీరా లేచి చంద్రిని రమ్మన్నాడు. చంద్రి వెనకాలే వెళ్ళింది. ఊరవతల పాకదగ్గర కెళ్ళారు. అక్కడున్న లావుపాటివాడితో "ఇద్దరికీ సుక్కపొయ్యి. తరవాత యిత్తాను డబ్బులు" అన్నాడు. లావుపాటివాడు. సందేహించాడు. ఏమనుకున్నాడేమో రెండు ముంతలతో కల్లునీ, మాంసాన్నీ ఇచ్చాడు.
చంద్రి తాగనంది "ఛీ! ఛీ!" అంది.
"తాగు సెంద్రీ, లేందే సచ్చిపోతావు" అన్నాడు వీరయ్య. చంద్రి నోట్లో బలవంతంగా పోశాడు.
ఇద్దరూ తూలుతూ పొలం గట్టుమీదికి వచ్చి కూర్చున్నారు సప్తమి నాటి వెన్నెల బూడిదలాగా వుంది.
"నీకోసం పల్లెకి యెల్లాను" అంది సెంద్రి.
వీరా దగ్గాడు.
"ఏమైపొయ్యావో అని అడిలిపోయాను."
"సముద్రంలో పడి సచ్చిపోదామనుకున్నాను. కాని.....సావనేదు" తూలుతూ మళ్ళీ అన్నాడు "సచ్చిపోనేదు"
"మరి మన ఇల్లుమాట ఏంటీ యీరయ్య బావా?" అంది చంద్రి గొంతులో వికారాన్ని అణచుకుంటూ.
"ఉత్తది. అంతా ఉత్తది. మనం యింతే ఇలాగే వుంటాం. యెదవ ఆశ..... అంతే"
"అంతేనా........" వెర్రిగా నవ్వింది చంద్రి. "మరి నేనేంటి సేసేదీ. ఎక్కడికి పోయేదీ"
"ఈడనే వుండు. కల్లోయిత్తాను రోజూ."
చంద్రికి మత్తు వచ్చింది. యెక్కిళ్ళు మధ్య ఇలాగే అంది. "పోలీసు సుబ్బారావు బలేగున్నాడు.
గట్టుమీద చంద్రి పడుకుంది. పమిట జారిపోయింది. నురుగుకారే నోటితో అస్పష్టంగా యిలా పాడింది.
"పోలీసు సుబ్బారావు నా జబ్బ పట్టుకుని మాలీసు సేసాడు. మరేంటో సేసాడు"
"హహహ...." వీరా బొంగురుగా నవ్వాడు దగ్గాడు.
చంద్రికి పూర్తిగా మైకం కమ్మింది. నిద్ర పట్టింది. అంతా నిశ్శబ్దంగా వుంది. వెన్నెల్లో చంద్రి దేహం అర్ధనగ్నంగా మెరుస్తోంది. వీరా కొంచెం వంగి ఆమెని చూశాడు. నిదానించి చూశాడు. తన వణికే చేతులతో ఆమె చిక్కిన బుగ్గలు మెల్లగా రాశాడు. కళ్ళు మూసుకుని బాదగా బొంగురుగా అన్నాడు "నా సెందిరీ! నా సెందిరీ!"
అక్కడికి సముద్రపు కెరటాల హోరు వినపడటంలేదు. అది అంతటా పరచుకున్న నల్లని పచ్చని భూమి. కోట్లకొలది జనానికి తల్లిలాగా ఆధారంగా వున్న భూమి. చంద్రి నిద్రలో కలవరిస్తోంది "నాను గొలుసు తియ్యనేదు....."
(1964)
*****************



