Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు


   
    తన పక్కనుంచి కార్లూ, జట్కాబళ్ళూ దూసుకుపోతున్నాయి. రకరకాల జనం యిటూ అటూ పోతున్నారు. వాళ్ళందరూ తన్నిచూసి 'దొంగ దొంగ' అని అరుస్తారేమో అని భయపడింది. ఓ చెట్టుకింద కాసేపు కూర్చుని విశ్రాంతి తీసుకుంది. రోడ్డువారనే ఉన్న కొట్లో ఏవో కొనుక్కుతిని యిన్ని మంచినీళ్లు తాగింది.

    సాయంత్రానికి పల్లె చేరుకుంది. పల్లె బహిఃప్రకృతిలో మార్పులేదు. గుడిసెలు, నల్లని చిక్కిన పల్లెజనమూ, అప్పలమ్మ యిల్లూ, రావిచెట్టూ అన్నీ అలాగే వున్నాయి.

    "ఓస్ -యారదీ సెంద్రమ్మ ఏంటీ?"

    చంద్రి పక్కకి చూసింది. మీసాల వెంకన్న ఒంటికాలితో నుంచున్నాడు. చంకలకింద ఆసరాగా రెండు గుడ్డలు చుట్టిన కర్రలున్నాయి

    "ఈరయ్య ఉన్నాడా?" భయంగా అడిగింది చంద్రి.

    బొందురుగా నవ్వాడు వెంకన్న. కన్నుగీటి "రాయే పిల్లా?" అన్నాడు. కాలు విరిగినా కామం విరగలేదు వెంకన్నకి.

    తొందరగా వీరయ్య గుడిసె దగ్గరికి వెళ్ళింది. ఈలోపుగా ఎందరు పిలిచినా పలకలేదు.  'నీ యీరా లేడు' అన్న గంగడి మాటని లక్ష్యం చెయ్యలేదు. గుడిసె అంతా శిధిలమై ఉంది. లోపల నారయ్యా, చౌదరి కొడుకు సూరయ్యా చుట్టలు కాలుస్తున్నారు. చంద్రిని చూసి నారయ్య "ఇదిగో -ఇదే  యీరయ్య ముండ. ఉత్తి దొంగముండ" అన్నాడు. సూరయ్య పన్నెండేళ్ళ కుర్రాడు లేచి ముందుకువచ్చి  "ఎవరు నువ్వు" అన్నాడు.

    "నాను సెంద్రిని ఇక్కడ యీరయ్య ఉండటంలేదూ?"

    "నీ యీరయ్య సచ్చిపోయాడు" అన్నాడు సూరయ్య, "పోపో" అని కసిరాడు.

    "అన్యాయం ఉత్తిదే సావలేదు" అన్నాడు నారయ్య.

    "చంద్రి నిట్టూర్చి వెనక్కి తిరిగింది. కాని సూరయ్య ఆమెని పిల్చాడు.

    "నీకు కూడుందా?" అన్నాడు.

    "లేదు" అంది చంద్రి.

    "నేను సుట్టలు కాలుత్తున్నానని బాబుతో సెప్పకేం"

    "సెప్పనులే -"

    "నువ్వు నిజంగా యీరయ్య ముండవేనా?"

    చంద్రికి అంత బాధలోనూ నవ్వొచ్చింది.

    "రెండురూపాయలిత్తాను కావాలా" అన్నాడు చౌదరి కొడుకు. చంద్రి ఆశ్చర్యంగా చూస్తోంది. రెండురూపాయలు తీసి మోగించి,  "ఇవిగో. మరి నాతో వత్తావా?" అన్నాడు చౌదరికొడుకు. ఈ పసి కుర్రాడి మాటలకి జాలి అసహ్యమూ రెండూ కలిగాయి చంద్రికి. వాడిమాట లక్ష్యం చెయ్యక  "మీ బాబు ఏం చేత్తున్నాడు?" అని అడిగింది.

    "యెదవబాబు. పచ్చవాతమొచ్చి పడుకున్నాడు. సస్తే కానీ యియ్యడు. నేను దొంగతనంగా ఎత్తుకొస్తా"

    "ఇప్పుడు కొంచెం నయమేలే, నడుత్తున్నాడు" అన్నాడు నారయ్య.

    "అప్పలమ్మ వుందా?"

    "ఆఁ! ఇంచక్కగా వుంది" అన్నాడు సూరయ్య.

    "యీరయ్య ఏమయ్యాడో నిజం సెప్పు"

    సూరయ్య సముద్రంవైపు చూపించి "అందులోపడి సచ్చాడు" అన్నాడు.

    "ఉత్తిదుత్తిది, ఆ మద్దె నిక్కడికొచ్చాడు. నాను చూసాను" అన్నాడు నారయ్య.

    చంద్రి సముద్రంవైపు చూసి భయంతో కళ్ళు మూసుకుంది. వడివడిగా అప్పలమ్మ యింటికి వెళ్ళింది . అప్పలమ్మ యిల్లు చాలా మారిపోయింది. గోడలకి సున్నమూ, పైన కొత్త పెంకూ, టేకుతో చేసిన గుమ్మాలు, కిటికీలూ కలకలలాడుతూంది. ఇంకో రెండుమూడు గదులు కూడా కట్టించింది. అప్పలమ్మకి కొంచెం వొళ్ళు వచ్చింది. గ్లాస్కో చీర కట్టింది. చంద్రిని చూసి ఏడ్చినంత పనిచేసింది.

    "యీరా ఎక్కడున్నా డప్పీ?"

    "అబ్బో శానాదూరం, రెండుకోసులు నడవాలి" -ఏదో వూరు పేరు చెప్పింది. గుడి వెనక సందులో ఉన్నాడని చెప్పింది. అప్పలమ్మ ఆగమన్నా ఆగకుండా చంద్రి వీరా వున్న గ్రామానికి బయలుదేరింది. "తిరిగొత్తే తిన్నగా యిక్కడికిరా సెంద్రీ. నా యాపారం సూసిపెడుదువుగాని" అంది అప్పలమ్మ ప్రేమతో.

    రాత్రి పదిగంటలయింది. ఊరి పొలిమేర సమీపించింది. కుక్కల మొరుగులూ, నక్కల కూతలూ చీకట్లో భయంకరంగా ఉన్నాయి. గుండెలు దడదడలాడుతున్నాయి. గొంతు ఎండిపోతోంది. రోజంతా తిండిలేదు. పైగా నడక -విరామంలేని నడక. కాని యింత శ్రమా వీరా ఒక్కసారి తియ్యగా పిలిస్తే కౌగిలించుకుంటే పోతాయనుకుంది. పొలాల్లో పడుకున్న రైతుల్ని గుడికి దారి అడిగింది. వీరయ్యయిల్లు సందు చివర వుందని చెప్పారు.
 




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.