Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"పడుకో బావా ఏదో ఒకటి సూత్తాను" అంది పక్కపరిచి.
"నాకు నిదరరాదు"
"ఊరికేనే పడుకో"
కాని వీరయ్య పడుకున్న కాస్సేపట్లోనే నిద్రపోయాడు. రెండు రోజుల్నుండి తిండిలేక అలసిపోయాడు. మనస్సు తనకి తెలియకుండానే నిద్రనాశ్రయించి బాధనుంచి విముక్తి చెందింది. చంద్రి దొడ్డి తలుపులువేసి మేనమామ వినకుండా మెల్లగా అడుగులువేస్తూ రొడ్డుమీదకి వెళ్ళి క్రమంగా వ్యాపిస్తోన్న చిరుచీకట్లోకి మాయమయింది.
తెల్లవారగానే వీరయ్యకి ఎవరో తట్టి లేపుతున్నట్లయింది. చంద్రి వీరాచేతిలో బంగారపు గొలుసు ఒకటి పెట్టింది. "మరి తొరగా యెల్లిపో యీరయ్య బావా"
"ఎక్కడి దిదీ!" ఆశ్చర్యంగా అడిగాడు వీరయ్య.
"సిన్నప్పట్నుంచీ నాకుంది ఈ గొలుసు. అమ్మితే ఎనభై రూపాయలొత్తయ్. ఎల్లు ఎల్లిపో"
ఆమె తొందరనీ ఆందోళననీ గ్రహించాడు వీరయ్య.
"నిజంగా సెందిరీ?"
చంద్రి ముఖం పక్కకి తిప్పింది. పళ్ళు బిగబట్టి "లేందే యాడిత్తాడు నాకు బంగారపు గొలుసు?" అంది.
సందేహంతో, సందేహాన్ని మించిన అవసరం యొక్క బలంతో, గుప్పిటితో గట్టిగా పట్టుకొని వెళ్ళిపోయాడు వీరయ్య. చంద్రి గుడిసెలో కూర్చుని చాలాసేపు ఏడ్చింది.
"ఎందుకేడుత్తవు పిల్లా?" అన్నాడు మేనమామ.
"కడుపునొప్పి" అంది చంద్రి.
తెల్లని కిరణాలు తూర్పున తోచి గుడిసె గుమ్మాన్ని తాకాయి. చంద్రి కళ్లు మూసుకుని రెండు చేతులూ జోడించి. "ఓ నూకాలమ్మ తల్లీ, నా ఈరయ్యను రచ్చించు. నీకు కోడిపెట్టని బలిత్తాను" అని మొక్కుకుంది.
9
రెండేళ్ళు గడచిపోయాయి. అయినా సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు. ఋతువులు వరుసక్రమంతోనే జరుగుతున్నాయి. రాత్రివేళ చీకటీ, పగటివేళ వెల్తురూ ఉంటున్నాయి. ఏ ఒక్కసారి మారకూడదూ అనుకుంది చంద్రి. కాని ప్రకృతియొక్క చర్యలో మార్పులేదు. నిద్ర లేచేముందు అదే -ఆ బూట్ల చప్పుడే వినబడుతుంది. కాకీ దుస్తులతో టోపీలతో బాధగా పోలీసులు ఇటూ అటూ తిరుగుతూంటారు. ముసలికాకి ఎప్పుడూ ఆ గొడమీదనే నుంచుని 'కావుకావు' మని అసహ్యంగా అరుస్తూంటుంది. పక్క కొట్లోంచి కొత్తగా శిక్షపడిన కుర్రాడు అస్తమాను 'ఇది నా ఇల్లాలని' అంటూ పాడుతూంటాడు. ఎర్రని రాళ్ళతో పెద్ద పెద్ద గోడలు తనచుట్టూ నిలబడి ఉంటాయి. ఆ గోడలు కదలవు, కరగవు , కబుర్లు చెప్పవు.
జైలులో ఉన్నప్పుడు మొదట ఏడ్చేది. గుండెపోటు వచ్చేటట్టు ఏడ్చేది. నిద్రపట్టేది కాదు. అన్నం సయించేది కాదు. తనవాళ్ళందరూ తన్ని హేళనచేస్తారు. గ్రామస్థులందరూ అసహ్యించుకుంటారు. ఈ రోజున ఇంత కష్టంలో తనకి బాబులేడు. అమ్మలేదు. వీరా ఏమైపోతాడో మనోవ్యధ ఎక్కువైపోయి, ఓ రోజున జైలు గోడలకి తలపెట్టి కొట్టుకుంది. గాయమైంది. రక్తం కారింది. పోలీసు సుబ్బారావు తిట్టాడు.
"సచ్చిపోతావ్"
"సావడానికే"
జైలులో ఉన్నన్నాళ్ళూ చాలా విషయాలు తెలుసుకుంది. పోలీసులంటే మనుషులనీ, వాళ్ళలోనూ మంచివాళ్ళున్నారనీ తెలుసుకుంది. వార్డెన్ సుబ్బారావు ఎప్పుడేనా ఇంటిదగ్గర చేసుకున్న మినపరొట్టె, జంతికలు లాంటివి తీసుకొచ్చి తనకి పెట్టేవాడు. తను ఏడుస్తూ వుంటే కబుర్లుచెప్పి ధైర్యం చెప్పేవాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని తెలుసుకుంది. తెల్లవారగానే లేచి పరీక్షగా చూసేది. చాలాసార్లు పడమట ఉదయించకూడదా అని కసురుకుంది. తన అసంతృప్తిని వార్డెన్ సుబ్బారావుకు తెలియజేసింది. 'సూర్యుడికి బుద్దిలే'దన్నాడు సుబ్బారావు.
రోజూ మూడుపూటలా కటకటాల్ని లెక్క పెట్టేది. పాత సంగతులన్నీ తలచుకునేది. కామందుల విధవకూతురు సుబ్బమ్మ కూడా జైల్లో పడితే బాగుండును. గచ్చకాయలాడుకోవచ్చునుగదా అనుకుంది. చివరికి తన్ని వీరా ఎప్పటిలాగే గౌరవిస్తాడనీ, మనువు చేసుకుంటాడనీ, భూమ్మీద యిటుకలతో ఇల్లుకడతాడని - ఆశ. ఆ ఆశనే ఆహారం కింద, బలంకింద, ప్రాణంకింద మార్చుకుని బ్రతికింది.
కాని ఆమె మారిపోయింది. రెండేళ్ళలో క్రమంగా ఆమె నవ్వడం మరిచిపోయింది. ఆమెబుగ్గల్లో కళ్ళల్లో వుండే నిండైన ఆరోగ్యపు నిగనిగ పోయింది. చాతకాని నలిగిపోయిన వడలిపోయిన ఉదయపు కల్వపువ్వులాగ నీరసంగా అయిపోయింది.
జైలునుంచి యివతలకి రాగానే ముందుకు నడవలేకపోయింది. అక్కడే కూర్చుని ఏడ్చింది. చిన్నమూట చేత్తోపట్టుకుని సముద్రం వొడ్డున ఉన్న వీరయ్యపల్లెకి బయల్దేరింది. వార్డెన్ సుబ్బారావు చేతికొక పావలా యిచ్చి ఏదైనా కొనుక్కుతినమన్నాడు.
ఎర్రని కంకరరోడ్డుమీద దుమ్ములేచి ముక్కులోకి కళ్ళల్లోకి పడుతోంది. రోడ్డు ఎండకి కాలి కాలికి చుర్రుమని తగులుతోంది. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి.



