Home » Devarakonda Balagangadhara Tilak » తిలక్ కథలు
"కాకపోతే ఉరి!"
"ఎలాగ అప్పీ. నా దగ్గర డబ్బు కూడా పోయింది. దొంగెదవలెవరో కాజేశారు."
"ఆఁ -పొలంకాడ ఎక్కడో పడిపోయివుంటది. ఏ చచ్చినాడో తీసేసి ఉంటాడు"
"మరి ఏం సేసేది అప్పీ. నీ కాళ్ళట్టుకుంటాను. దారిసూపించు." వీరయ్య కళ్ళమ్మట నీరు ఏకధారగా ప్రవహిస్తోంది.
"సెంద్రి దగ్గర నిలవ వుంటుంది. పోయి తెచ్చుకురా."
"సెంద్రినా?"
"నువ్వు మనువు సేసుగోవా యేంటీ. నీకోసమంటే అది పడిచస్తది"
8
చంద్రి ఆడుతూ పాడుతూ యింటికి వచ్చింది. గుడిసెముందు మేనమామ రత్తయ్య చుట్ట కాల్చుకుంటూ కూర్చున్నాడు. చంద్రి గుమ్మంలో అడుగు పెడుతూనే తన్నెవరో పిలుస్తూన్నట్టు విని నలు దిక్కులా చూసింది. రేగిన జుట్టుతో మాసిన బట్టలతో పీక్కుపోయిన మొహంతో పొలంగట్టమ్మటే వస్తూన్న వీరయ్యని చూసింది. పరుగెత్తుక వెళ్లింది. చంద్రిని చూడగానే వీరయ్యకి ఓపిక లేనట్టయింది. గట్టుమీద చతికిలబడి మొహం కప్పుకున్నాడు.
"ఇదేంటి యీరయ్యబావా" అంది చంద్రి. వీరయ్య మాట్లాడలేదు. చంద్రి కంగారుపడింది. తల నిమురుతూ అడిగింది.
"ఏంటి జరిగింది బావా?"
వీరయ్య తల పైకెత్తాడు. గద్గదికంగా అన్నాడు. "నన్ను రచ్చించాలి సెందిరీ"
ఇలా బేలగా, జాలిగా తనదగ్గరికి ఎప్పుడూ రాలేదు వీరయ్య. అతనిలోవున్న పౌరుషమూ మగతనమూ ఏమయ్యాయో తెలియదు. ఏదో కీడు శంకించింది. అయినా చిక్కబట్టి "సొప్పు నాతో, అసలేంజరిగింది?" అంది.
"నన్ను ఖైదులో పడేత్తారు. ఉరితీత్తారు. ఉరితీత్తే సచ్చిపోతాను" వీరయ్య విహ్వలంగా ఉరిని తలచుకుంటూ చెప్పాడు. చంద్రి ఆశ్చర్యంగా చూసింది. "ఆణ్ని - ఆ సౌదరిని నెత్తి పగలకొట్టాను. పన్ను లియ్యలేదని మూడురోజుల సేవల్ని తీసుకుపోయినాడు దొంగనాయాల....."
"పోవల్సిందే ఆ సచ్చినోడు"
"నా మొలని కట్టి బద్రం సేసుకున్న సొమ్ముకూడ పోయింది. ఎంత కట్టపడ్డాను." వీరా దుఃఖం ఆపుకోలేకపోయాడు. ఏడ్చాడు చంద్రి వొళ్ళోకి తలపెట్టుకుని.
"ఏడవమోకు బగమంతుడే ఉన్నాడు" చంద్రికికూడా కళ్ళమ్మట నీళ్ళు తిరిగాయి. "ఎలా అయిపోయినావ్ బావా. రెండు రోజులకే సిక్కిపోయినావు. కూడు తిన్నావా."
"నాను పడిన కట్టమంతా బూడిదైపోయింది. ఎప్పుడో సముద్రంలో పడిసచ్చిపోతాను."
చంద్రికి భయం వేసింది. "ఆడదానిలా ఇదై పోతవేంటి? ఎదవ డబ్బు పోతే మళ్ళీ వత్తది. మనరెక్కలున్నాయిగా"
"ఇప్పుడొందరూపాయలు కావాలి. పోలీసులొచ్చి లాక్కుపోతారు"
"ఒంద రూపాయలే!"...చంద్రి దిగులు పడింది. శూన్యంలోకి చూస్తూ కూర్చుంది.
పచ్చని చేలు గాలికి పూగుతున్నాయి. సందె చీకటిలో పచ్చరంగు కలిసిపోతోంది. కాస్తదూరంలో వున్న చింతచెట్టుమీద కోతులు కిచకిచ మంటున్నాయి. చీకటి పడబోతూంటే వారి గుండెల్లోని భయం బరువైపోయింది. పొలాల్లో క్టటివేసిన దూడల మెడలలో మువ్వలు మాత్రం మధ్య మధ్య ఘల్లుమంటున్నాయి.
వీరా లేచాడు, చంద్రి సహాయం చెయ్యలేదని వీరయ్యకి తెలుసును. అతనిలో ఏదో తెగువా ధైర్యమూ వచ్చాయి "నేనెల్తాను" అన్నాడు. రెండడుగులు వెశాడు. చంద్రి చటుక్కునలేచి వీరయ్యను పట్టుకుంది. "ఆగు బావా రా. కూడు తిందుగానీ!"
"ఒద్దు సెంద్రీ. నే పోతాను"
"నన్ను సంపుకు తిన్నట్టే. రా బావా ఏదో ఉపాయం ఆలోచిత్తానుగా" చంద్రి గట్టిగా వీరయ్యని కౌగిలించుకుంది. ఆమె తడి కళ్ళు వీరయ్య గుండెలకి చల్లగా తగిలాయి. వీరయ్య మారుచెప్పలేదు. ఆమె వెనకాలే వెళ్ళాడు.
చంద్రి మేనమామ తత్వాలుపాడే ఒక చిన్నసైజు ఆధ్యాత్మికవాది. పెళ్ళాంపోయాక ముండలతోనూ, ఒళ్ళు
పాడైపోయాక మందులతోనూ, ఓపికపోయాక బైరాగులతోనూ మైత్రి సంపాదించిన విఖ్యాతజీవి. ఎన్ని తత్వాలుపాడినా ఎక్కడెక్కడ తిరిగినా వేళకిమాత్రం వచ్చి కూడు తినాలనే ప్రాథమిక వివేకం కోల్పోని జ్ఞాని. వీరా దిగుల్నీ బాధల్నీ చూసి ఇలా అన్నాడు.
"ఆ సౌదర్ని తిట్టకు బాబూ. ఈ దేహ మశాశ్వతం. మన ఖర్మ ఎట్టాగుందో అట్టాగే జరుగుద్ది, ఈశరేచ్చ"
"ఈడెవుడూ యెర్రినాకొడుకు యేదాంతం సొపుతాడు" అన్నాడు అసలే మండిపడుతున్న వీరయ్య.
"నీ తిట్లు నన్ను తగలవురా కుర్రోడా. ఈ ద్రేహానికే తిట్లయినా కొట్లయినా, లోపలి అతమ కేమీ తగలవ్."
చంద్రి గబగబా కూడువండి పెట్టంది. నిశ్శబ్దంగా తిన్నాడు వీరయ్య. చుట్టూరా గాలీ గోడలూ బరువెక్కి గుండెమీద నొక్కుతోన్నట్టుంది వీరయ్యకి.



